అమ్మా... ఇది నీ మ‌హిమే!

  • 699 Views
  • 0Likes
  • Like
  • Article Share

    అజయ్‌

  • కమర్షియల్‌ కంట్రోలర్‌ ఎస్‌.సి.రైల్వే, పటమట, విజయవాడ, 98665 35490
  • పటమట, విజయవాడ.
  • 9866535490
అజయ్‌

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

అమ్మా, 
ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తున్నావు. గుండెలవిసేలా ఏడవాలనిపించేంతగా గుర్తుకొస్తున్నావు. నువ్వు పోసిన శ్వాస గుండెను కుదిపి మరీ నిన్ను గుర్తు చేస్తుంది. అలసిపోయేంతగా పరుగులు పెట్టి చివరిదశలో సేద తీర్చుకుంటూ, వెనక్కి తిరిగి చూసుకుంటే... ఎందుకిలా పరిగెత్తామా అనిపించి నువ్వే గుర్తుకొచ్చావు. నిదానంగా పయనించినా, పరుగులెడుతూ ప్రయాణించినా జీవితంలో చేరుకునే గమ్యం ఒకటేనని గమ్యం చేరుకున్నాక గాని తెలిసిరాలేదు. నీ పయనంలో ఎంతో నిలకడ ఉండేది. నువ్వేసే ప్రతి అడుగులో ఓ నిశ్చయం ఉండేది. నిబ్బరంగా ఉండే నీ తీరుని చూసి చాలా నేర్చుకున్నా జీవితంలో పూర్తిగా ఆచరించలేకపోయాను. నిలుపు, నిదానంతో జీవితంలో చాలా సాధించవచ్చని నువ్వు చేసి చూపించినా, అనుకరించలేకపోయాను. మారుతున్న కాలంతో మనమూ మారాలని అనుకున్నాను. 
      మారుతుంది కాలం కాదు, మనుషులేనని ఇప్పుడు తెలిసింది. కాలం మారదు. మార్పు మనుషులలోనే - వాళ్ల మనసులలోనే. మంచితనం పంచుకొంటూ, మానవత్వం పెంచుకుంటూ పరిస్థితులను అర్థం చేసుకొంటూ జీవితంలో ప్రతిరోజును ఆస్వాదిస్తూ సాగించే పయనం ఆనందమయంగానే ఉంటుంది. అది తెలియక దేనికోసమో వెంపర్లాడుతూ, యాంత్రికంగా పరుగులెడుతూ గడిపే జీవితంలో చివర్లో కానీ తెలిసి రాదు మనం ఏమి కోల్పోయామోనని. అప్పుడు తెలిసినా ప్రయోజనమేమీ ఉండదు. జీవితంలో కాలం ఒక్కసారి తిరిగి వచ్చే (రీప్లే) అవకాశం ఉంటే ఎంత బాగుణ్నో అనిపిస్తుంది. ఎన్నో జీవితాల్లో ఎన్నెన్నో మార్పులు చోటుచేసుకొని సవ్యమైన జీవితాలతో సౌందర్య ప్రపంచం ఏర్పడుతుంది.
      లోకంలో ఎందరో అమ్మల్ని చూస్తూంటే నువ్వే గుర్తుకొస్తున్నావమ్మా! అమ్మని అమ్మగా కాక సాటి మనిషిగా చూస్తూ దూరం చేసుకుంటున్నారెందరో. భార్యతో మాట తేడా వచ్చిందనో, ఆస్తిలో సరిగా వాటా ఇవ్వలేదనో, అసలు ఆస్తే కూడబెట్టలేదనో తల్లిని దూరం చేసుకుంటున్న దౌర్భాగ్యులెందరో. జన్మనిచ్చిన తల్లిని అలక్ష్యం చేసి దేవుడికోసం ధనాన్ని, కాలాన్ని వెచ్చిస్తున్నారు.
      ఎంత స్వార్థం! అమ్మని చూసుకుంటే ఒరిగేదేమీ లేదు. అదే దేవుణ్ని చూసుకుంటే లాభం ఉంటుందనే స్వార్థ చింతన. వాళ్లందరిని చూస్తున్నప్పుడు కూడా నువ్వే గుర్తుకొస్తావు. ఎందుకంటే వాళ్లలాంటి ఆలోచన నాకు లేదు. నాకు దేవుడున్నాడని యోచన ఉండేది కాదు. జన్మనిచ్చిన తల్లే దైవం. అందుకే నాకు చేతనైనంత ప్రేమగా నిన్ను చూసుకున్నాను. తెలియక ఏదైనా లోపం జరిగిందేమో కాని, నాకు తెలిసి నీకెలాంటి లోపం రానివ్వలేదు. నీకు నలుగురు పిల్లలు కదా వాళ్లు నిన్ను చూసుకోరా అని నేనెప్పుడూ ఆలోచించలేదు. నాకున్న ఒక్కగానొక్క తల్లిని బాగా చూసుకోవాలనే ఆలోచించేవాడిని. అంతా నీ పెంపకం మహిమ!
      ఇంకా ఎన్నెన్నో విషయాలు నీకు చెప్పాలని, ఎంతోసేపు నీ ఎదురుగా కూర్చొని మనసు విప్పి మాట్లాడాలని ఉంది. కానీ కుదరదు. ఎందుకంటే అందర్నీ వదలివెళ్లి అనంతతీరాల్లో ఎక్కడో నువ్వు, అనుక్షణం నిన్నే తలచుకుంటూ ఇక్కడ నేను. కొండంత ప్రేమను పంచిన నిన్ను సదా తలచుకొంటూ....

ప్రేమతో... నీ కుమారుడు
 

అమ్మా... ఇది నీ మ‌హిమే!

వెనక్కి ...

మీ అభిప్రాయం