పదాల్లో ఇమ‌డ‌ని ప‌రివేద‌న‌

  • 278 Views
  • 0Likes
  • Like
  • Article Share

    మొదలి పద్మ

  • సికింద్రాబాదు
  • 9248259622
మొదలి పద్మ

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

కుశలమా..! 
      అసలు నిన్నెలా పిలవను? నేస్తమనా.. నా శ్వాసలోని మధురిమా అనా.. ఉద్వేగమా.. ఇష్టంగా చేసుకున్న గాయమా.. నిరంతర జ్ఞాపకమనా.. ఎలా పిలిచినా నా హృదయాన్ని వినిపించాలనుంది.
      వేకువ కాదు నా హృదిని మేలుకొలిపేది, నీ తలపుల అలలే. వెన్నెల కాదు నాలో అలజడికి జోల పాడేది నీ చరణాల చిరుసవ్వడేే. నాకు నేనుగా స్పందించేది నీ భావాల తెమ్మెరలోనే.
      నీకెలా తెలిపేది నా అక్షరాలకు స్ఫూర్తీ దీప్తీ నీ ఆలోచనలే అని! ఎందుకు నీకర్థం కాదు? ఎవరెవరో ఏవేవో అంటారు... అనుకుంటారు... అన్నీ ఆలోచించి నిన్ను నువ్వు ఏమార్చుకుంటావా? అనురాగాన్ని అంతరంగంలోనే దాచుకుంటావా..!
మౌనంగా ఉంటావా..! బంగారూ.. నీ మౌనాన్ని ఈ మూగ హృదయం భరించగలదనుకుంటున్నావా.. నీ సందేహాలతో నా హృది గాయాలనదిలో కొట్టుకుంటోంది. ఆశలదీపపు కనుదోయి వెలుగులో నా శ్వాస రెపరెపలాడుతోంది. నీ సంశయాలతో నన్ను దూరం చేస్తావా!
      నా కళ్లల్లో తడి చేరిందంటే నీమీద మమతానురాగాలతోనే. నీలోని వేదన నన్ను నన్నుగా నిలువనీయదు. అహరహం, అనవరతం నీ ఆలోచనలే. కళ్లు చూస్తుంటాయి. మనసు చరిస్తుంది. చెవులు ఆలకిస్తుంటాయి. కానీ అవేవీ హృదయాన్ని గాఢంగా చేసే క్రియలు కావు. అసంకల్పితాలు. ఒకటి నిజం. నువ్వున్న తావే విరివనం నాకు. నువ్వులేని ఏ ఒక్క ఆలోచనా నా మదిని మీటదు. నీ వేలికొసలాలోచనా స్పర్శ చాలు నా ఎదలో కోటి వీణల రాగాలు రవళించేందుకు.
      అయినా... ఒకనాటి బంధమా మనది. క్షణకాలపు పరిమళమా ఇది. కాదే! యుగాలుగా వేచి ఉన్న వేదన ఇది. తరాలుగా దాచుకున్న అనురాగం ఇది.
      ‘నిత్యం పూలేల వికసించు. భానుడేల ఉదయించు. ఏల ప్రేమించు నా హృదయంబు నిన్ను..’ అన్న కవి పలుకులా ఈ అనురాగానికి అర్థాలు, కారణాలు వెతకటం అవసరమా..? అంతెందుకు నువ్వు అనే వ్యక్తివే లేకుంటే నా హృదయపు ఉనికి శూన్యం. నేనప్పుడు నడిచే నిశ్శబ్దాన్నవుతానేమో! చలనం కోల్పోయిన తరంగిణిలా మారిపోతానేమో!
      ‘‘ప్రేమ ఏకం. ఐక్యం కావాలనే ఆర్తిలో రెండు రూపాలు ధరించి తనను తాను దర్శించుకుంటోంది’’ అన్నారో రచయిత. దైహిక భావనలు... వాంఛలకు అతీతమైన అనురాగమిది. అలౌకికం. కేవలమైన పదాల్లో ఇమడని పరివేదన ఇది.
      ఎవరికోసమో మనల్ని మనం మార్చుకోకూడదు అంటారు. కానీ నీకోసం నన్ను నేను మార్చుకోవడంలో నేనెంత ఆనందాన్ని పొందుతున్నానో వారికెలా తెలుస్తుంది! అసలు నేనే నువ్వయినప్పుడు ఈ మారేది, మారింది ఏముంది!? నేను నేనుగా సంపూర్ణమైన భావన తప్ప.. సంపూర్ణంగా మిగిలిన భావన తప్ప. 
      అందుకేనేమో బహుశా ఈ భౌతిక చింతనలను దాటి, సుదూర తీరాన ఎవరూ రాలేని, ఎవరికీ అందని ఏకాంతాన నిలుచుని, కంటికొసల కాటుక నీడల జారే క్షణాల్ని పట్టి ఉంచి వేచి ఉన్నది నీ కోసమే యుగాలుగా.. ఆర్తిగా.. 
      నీలోని సడి సంతకాన్ని...

పదాల్లో ఇమ‌డ‌ని ప‌రివేద‌న‌

వెనక్కి ...

మీ అభిప్రాయం