ప్రేమిస్తున్నానోచ్‌!

  • 1265 Views
  • 0Likes
  • Like
  • Article Share

    నర్మద జల్ది

  • కనిగిరి, ప్రకాశం జిల్లా
  • 7396556860

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియమైన శ్రీవారూ...
భిన్నధ్రువాలు ఆకర్షించబడతాయి అంటే ఏమో అనుకున్నాను నిన్ను చేసుకునే వరకు... భయపడొద్దు. భౌతిక శాస్త్ర పాఠమేమీ చెప్పట్లేదులే. తూరుపు తెలతెలవారుతుండగా పక్షుల కిలకిలా రావాలు వింటూ వేడివేడి కాఫీని నీతో కలిసి తాగుతూ ఆ క్షణాలను ఆస్వాదించాలనుకునే నేనెక్కడ. కాఫీ తాగాలంటే కాఫీపొడి, పాలు, పంచదార అన్నింటికంటే ముఖ్యంగా మనలో తాగాలనే కోరిక తప్ప ఇంకేం కావాలి అనుకునే నువ్వెక్కడ. ఉదయం లేచింది మొదలు నీతో గడిపే ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా మలచుకోవాలనుకునే నేను. ‘అలా ఆలోచించి బుర్ర పాడుచేసుకోకు’ అని నవ్వి వెళ్లిపోయే నువ్వు. నేను, నా కథలూ, కవితలు. నువ్వూ, నీ లెక్కలూ, గ్రాఫులు. రెండు భిన్న ప్రపంచాలు అయినా ఎలా కలిసి ఉంటున్నామోయ్‌?! ఏం చేస్తాం పెళ్లయ్యాక తప్పదుకదా అంటావా అదేం కాదు మొద్దూ, ఇద్దరికీ ఒకరి మీద మరొకరికి ఉండే ప్రేమే అది. అదే లేకపోతే కలిసే ఉన్నా ఇంత సంతోషంగా అయితే కచ్చితంగా ఉండలేం. పెళ్లయి కొన్నేళ్లు గడిచాక ప్రేమ తగ్గుతుందంటారు, అది నిజం కాదేమో! ఎందుకంటే తగ్గేది ప్రేమ కాదు, కలిసి ఏకాంతంగా గడిపే సమయం; పెరిగే బాధ్యతలు వెరసి ప్రేమ తగ్గిపోయిందేమో అనే భ్రమ కలిగిస్తాయి. అర్థం చేసుకోగలిగితే ప్రేమ ఇంకా రెట్టింపవుతుంది. గొప్ప సత్యం కనుక్కున్నావ్‌ అన్నట్లు నవ్వుతున్నావా? నాకు తెలుసోయ్‌ నీ సంగతి. ఎప్పుడైనా నాలోకి నేను తొంగి చూసుకుంటానా... నేనంటూ ప్రత్యేకంగా ఏం లేను, నాలో నువ్వున్నావని అనిపిస్తుంది! ఏంటో ఈ పైత్యం అన్నట్లు చూడకు.
పెళ్లానికి ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పడానికి కూడా మొహమాటపడే ముద్దపప్పుని ఎలా కట్టుకున్నానా? అని అనుమానం వస్తుంది. చెప్పడానికే మొహమాటం... ప్రేమించడానికి కాదు అనేదే నా సందేహానికి జవాబు. పెళ్లయ్యాక వచ్చిన మొదటి ప్రేమికుల రోజుకి కొన్నిరోజుల ముందు నాకో పువ్విచ్చి ‘నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పు’ అని నీకు చెప్పాను గుర్తుందా? ఇలా మొగుడికి చెప్పిన మొదటి పెళ్లాన్ని నేనేనేమో, చరిత్రలో నిలిచిపోతానోయ్‌. నువ్వు చెప్పినా చెప్పకపోయినా, చెప్పలేనంత ప్రేమ నా మీద నీకు ఉందని తెలిసినా, నువ్వు చెబితే అదో సంతోషం.
పెళ్లంటేనే అమ్మో నూరేళ్ల మంట అని భయపడిపోయే నన్ను నీ ప్రేమతో మార్చేశావు. నేనేం నిన్ను పొగడట్లేదు. కాలర్‌ ఎగరేయకు, మామూలుగా చెబుతున్నానంతే. చివరగా నీకొకటి చెప్పి ఆపేస్తాలే! ఇప్పటికే చాలుతల్లీ చాలు... అన్నట్లు చూస్తున్నావ్‌. నువ్వెలా చూసినా నీకు నా మీద బోలెడంత ప్రేముంది, ఎప్పటికీ ఉంటుంది. సర్లే ఇదంతా కాదు, చెప్పాలనుకున్నది సూటిగా చెబుతాను. నీతో చాలాసార్లు చెప్పిందే అయినా, ఎన్నిసార్లు చెప్పినా నీకు విసుగురాదు. వచ్చినా చెప్పకుండా మానవు కదా అంటావా? నువ్వు అనవులే! పైగా ఇది వినగానే నీ పెదవుల మీద చిరునవ్వు వస్తుంది. నాకు తెలుసు నువ్వేం బలవంతంగా చిరునవ్వుని ఆపుకోకు.
నిన్ను నేను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటానోయ్‌ ముద్దపప్పు...

- నీ నేను
నర్మద జల్ది

ప్రేమిస్తున్నానోచ్‌!

వెనక్కి ...

మీ అభిప్రాయం