నన్నర్థం చేసుకుంటావనీ...

  • 279 Views
  • 0Likes
  • Like
  • Article Share

    అంకిత్

  • దామావారిపాలెం, ప్రకాశం జిల్లా
  • 9885628692

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

మో.. నిన్నెలా సంబోధించాలో అర్థంకాక ఈ ఉత్తరాన్ని ఇలా ప్రారంభిస్తున్నాను. మరేమీ అనుకోకేం.
      ఒక్కోసారి నువ్వు నాకేమవుతావో అనిపిస్తోంది. ఇంకోసారేమో అన్నీ నువ్వే అనిపిస్తుంటుంది. ఆ అన్నీలో మా కుటుంబమంతా ఒక్కొక్కరుగా కనిపిస్తారు. ఇంకా చెప్పాలంటే ఓ స్నేహితుడు కనపడతాడు. ఆశ్చర్యపోతున్నావా?  అంతే! నా ప్రాణస్నేహితుడితో నా భావాలు, అభిప్రాయాలను ఎలా అయితే పంచుకుంటానో అలానే అన్నీ నీతో పంచుకోవాలని అనిపిస్తుంటుంది. నువ్వు చేసే చిలిపి అల్లరికి ఒక్కోసారి నిన్ను కొట్టాలనిపిస్తుంది కూడా. అందుకే నిన్ను అబ్బాయిగా భావిస్తాను. ఎవరికీ చెప్పలేని రహస్యాలు కూడా నీతోనే పంచుకోవాలనిపిస్తుంది.  
      నువ్వేమో నేను నిన్ను వేరే దృష్టితో చూస్తున్నానని, అలాగే మాట్లాడుతున్నాను అనుకుని ఒక్కసారిగా మాటలు తగ్గిస్తావు. అలా చాలాసార్లు మూర్తీభవించిన మౌనానివైపోయావు కూడా. మళ్లీ నేనేదో అనుకుంటానని కాసేపు మురిపెంగా మాట్లాడదామని ప్రయత్నిస్తావు. అప్పటికే నేను ఇరవై మాటలు మాట్లాడితే నువ్వు ఒక్కటంటే ఒక్కమాటే మాట్లాడతావు అదేదో మాటలే ముత్యాలైనట్లు.
      నేను నీలా ఉండాలనుకుంటా. అది సాధ్యం కాక, నేను చేయాలనుకునే అల్లరి పనులు ఎలానూ చేయలేక, ఆ పనులు నువ్వు చేయడం పదే పదే చూసి- అసలందుకే నేను నీపట్ల ఆకర్షితుణ్ని అయ్యానేమో.
      నేనెంతో హాయిగా, ఆహ్లాదంగా, సంతోషంగా, ఉల్లాసంగా ఉన్న సమయంలో నువ్వు నా పక్కన ఉంటే... ఏదో పరధ్యానంలో, చనువుతో నీ భుజమ్మీద చేయివేస్తా. దానికి నేనేదో మనసులో పెట్టుకుని అలా ప్రవర్తించానని అనుకుంటావు. ఆ విషయాన్ని నీ శరీరభాష, ముఖకవళికలు పట్టిస్తాయి. అలా ఆ క్షణంలో నిన్ను చూస్తే నాకు కూడా ‘ఏదన్నా తప్పుచేశానా?’ అన్న భావన కలుగుతుంది. అయినా ఎందుకు.. అసలివన్నీ నేనెందుకు చెప్పుకోవాలి? నువ్వు కూడా నన్నో పరిపూర్ణ స్నేహితుడిలా భావిస్తే... నేనేంటో, నా ఆలోచనా తీరేంటో నీకు తెలుసుండేది కాదా?
      నువ్వో అబ్బాయిని ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. మీ ప్రేమ విజయవంతం కావాలనీ, వీలైతే మీ ప్రేమకు నేనూ సాయం చేసి, మీ ప్రేమని బతికించి నాకు నీ మీద ఉన్న అభిమానాన్ని చాటుకోవాలని అనిపిస్తుందీ మధ్య. నీలో ప్రేమ అనే పుష్పం వికసించి అనుబంధమనే పరిమళం వెదజల్లడానికి కారణమైన అతనంటే నాకెంతో ఇష్టం.. నువ్వు నమ్మినా, నమ్మకున్నా ఇది నిజం. నిజంగా నమ్ము.
      మోహితా! నీ పేరుకి అర్థమేంటో తెలుసా? ‘ప్రేమించేది’ అని. అందుకేనేమో నిన్ను ఇష్టపడని వాళ్లుండరు. కానీ నీ నుంచి ప్రేమ ఒక్కటే కాదు. దాంతో పాటు ఇష్టం, గౌరవం, అభిమానం, ఆప్యాయత.. ఇలా ఎన్నో అందుతాయి అందరికీ. నువ్వు నిజంగా గొప్పదానివి. నీ గొప్పతనం నీకు తెలియదు. అసలు నీ పేరు ‘మహిత’ అని పెట్టి ఉండాల్సింది మీ అమ్మానాన్నలు.
      నేనెన్నో మార్గాల్లో నీకు దగ్గరవుదామని వస్తున్నా. కానీ. నువ్వు మాత్రం నా నుంచి దూరం కావడానికి వేరే మార్గాలు వెతుకుతుంటే నేనేం చేయగలను చెప్పు? అలా చేయడమే నీకు ఇష్టమైతే, అది మళ్లీ నాకూ ఇష్టమే అవుతుంది. కాబట్టి నేను కూడా నీకు  దూరంగానే ఉంటాను. నీ మార్గానికి వ్యతిరేకంగానే వెళ్తాను. ఈ విభిన్న మార్గాలు మళ్లీ ఎప్పుడో ఒకసారి కలుసుకోకపోతాయా అని ఒక దురూహ.
      పుస్తకాల పురుగునని  ఎప్పుడూ నన్ను ఈసడించుకునేదానివిగా... చూడు ఇప్పుడు ఆ పుస్తకాలే నీ వియోగాన్ని తట్టుకుని మామూలుగా ఉండగలిగే శక్తిని ప్రసాదించాయి. ఒకప్పుడైతే గడిచిన కాలాన్ని గురించి వైరాగ్యంతో ‘గతమా గతమా బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను..’ అని పాడుకునేవాణ్నేమో! కానీ అనుభవం ఇచ్చిన స్పృహ ఎప్పుడూ స్థాయి దిగజార్చుకుని ప్రవర్తించొద్దని మర్యాదగా హెచ్చరిస్తుంటుంది. అయినా ఏదో ఉండబట్టలేనితనం, మనసులో పేరుకున్న భావాల్ని... చెప్పలేని మాటల్ని ఏదో ఒక విధంగా వ్యక్తపరచడానికి, మళ్లీ నీతో ఇలా అక్షరాలతో సంభాషిస్తూ నా మీద నీకున్న అపార్థాన్ని పోగొట్టాలని ఓ చిన్న ప్రయత్నం. ఇది ప్రేమలేఖ కాదు. ప్రేమను (అ)వ్యక్తపరుస్తూ రాసిన ఓ మామూలు లేఖ.

నన్నర్థం చేసుకుంటావనీ...

వెనక్కి ...

మీ అభిప్రాయం