ఆ భావరహిత చూపుల్లో...

  • 109 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శిద్ధాబత్తుల సుభాషిణి

  • హైదరాబాదు.
  • 9701534430

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియమైన మీకు,
అప్పుడెప్పుడో కొన్ని దశాబ్దాల మునుపు, మొదటిసారి ఎడబాటు కలిగినప్పుడు నా ప్రేమనంతా భావుకతలో ముంచి మరీ మీకు లేఖ రాశాను. అది చదివి మీరెంత మురిసిపోయారో చెప్పినప్పుడు, ఆ వెన్నెల్లో నా ఆనందం వర్ణనాతీతమే అయ్యింది. అపురూపంగా మీ పెళ్లి పట్టుపంచె మడతల్లో దాచుకున్న ఆ తొలి ప్రేమలేఖ మొన్న పదేపదే చదువుతూంటే, గుండె చెమ్మగిల్లి, ఇదిగో, ఇలా మళ్లీ మనసు విప్పి చెప్పుకోవాలనిపించింది.
కాలం! ఓ ఇంద్రజాలం. ఎవరి మాటా వినదు సరికదా.. మౌనంగా, చిత్ర విచిత్రంగా జీవితాల్ని తనకిష్టమైన రీతిలో మార్చేస్తుంటుంది. అదోసారి వర్ణ, వర్ణాలతో అందంగా రూపుదిద్దుకుంటే, మరోసారి అర్థం కాని పిచ్చి గీతలనిపిస్తుంది. మన జీవితం రెండో కోవకి చెందడం అస్సలూహించని పరిణామం. నా పిచ్చిగాని, జీవితాన్ని ఎవరైనా ఊహించగలరా! అనుకోనివి జరగడమే కదా జీవితం! 
ఎన్నెన్ని మధుర ఘడియల్ని ఈ గుండెల్లో నిక్షిప్తం చేసుకున్నాను! మొదటిసారి కాపురం పెట్టినప్పుడు, పొదరిల్లులాంటి ఆ చిన్నిస్వర్గంలో నేను అడుగుపెడుతుంటే, మీ అరచేతులు సరదాగా నా పాదాలకింద పెట్టి ఆహ్వానించడం ఎంత అపురూప భావన!  
      ఆ తర్వాత, సంసారం విస్తరించడం, అదిపెట్టే ఆటుపోట్లు అన్నీ చెరిసగం మోశాం. మన కర్తవ్యాల్ని నిర్వర్తించాం. ఇక మిగిలింది మనమిద్దరమే, ఒకరికొకరం అనుకుంటూ కాస్త ఊపిరి పీల్చుకునే క్షణంలో... ఏం జరుగుతుందో తెలీని అయోమయంలో మీరు, ఏం జరగబోతుందో అనే భయంతో నేను!  అన్నిటికీ అతీతంగా మీరు! అన్నీ ఒంటరిగా భరిస్తూ నేను. నన్ను కంటికిరెప్పలా కాపు కాసిన మీరే చంటిపాపైపోతే, నేను తల్లినై లాలించాల్సి రావడం వరమా? శాపమా?  
      అలకలో మాత్రమే మౌనం పాటించే మీరు, ఇప్పుడు మాటలే మర్చిపోయారు. కడదాకా వీడనని ప్రమాణం చేసి, నడిమిలో కాడిని వదిలేసి నన్ను ఒంటెద్దుని చేసేశారు. ఏ విషయమెత్తినా అరగంట అనర్గళంగా మాట్లాడే సత్తా ఉన్న విజ్ఞానగనిలాంటి మీ మస్తిష్కంలోకి, ఈ మాయదారి రోగం చాపకింద నీరులా వచ్చి, జ్ఞాపకాలన్నీ మింగేసి, మన జీవితం మొత్తాన్నీ శూన్యం చేసేసింది. అల్జీమర్స్‌! చెరిపేసింది. అన్నీ చెరిపేసింది. ఖాళీ! వట్టి శూన్యం! పేర్చి, పేర్చి పెట్టుకొన్న జ్ఞాపకాలన్నింటినీ కాలరాసేసింది. పంచుకోవాల్సినవాడే మౌనమైపోతే, ఇంక నా బాధను ఏ నాథుడికి చెప్పుకోవాలి. చేసిందంతా చేసేసి చోద్యం చూస్తున్న పైవాడు నా మొర ఆలకిస్తాడా! నా మీరుగా తిరిగి రావాలనుకోవడం అత్యాశ అయినా అది అడియాస కాకూడదని ఆశ! మనసు కదా! ఆశ పడటం దాని నైజం! ఓ రాత్రంతా మీరు తప్పిపోయినప్పుడు ఎంత తల్లడిల్లానో! నా గుండె చెరువై పొంగి పొర్లుతున్న దుఃఖం మిమ్మల్ని కదిలించకపోవడం ఎంత వింత! ఎక్కణ్నుంచి వచ్చిందీ నిర్వికారం! ఇక మిమ్మల్ని కాపు కాసి కాపాడుకోవడమే నా జీవిత పరమార్థం. మూడుముళ్లు వేస్తూ మీరన్న మంత్రంలో ‘మమజీవన హేతునా’ ‘త్వంజీవ శరదాం శతం’ అనే మాటలు ఉన్నాయి. మీ జీవితం చల్లగా గడిచిపోవాలంటే మీరు ఆశీర్వదించినట్టుగా, అది వందేళ్లయినా నేను బతకాలి. నా పసుపుకుంకుమలు, మీ క్షేమం కన్నా విలువైనవి కావు. నా కోరిక లోకవిరుద్ధమే కావచ్చు. కానీ, అంతర్యామిని ప్రార్థిస్తున్నా, మిమ్మల్నెవరి చేతుల్లోనూ పెట్టకుండా, నా చేతుల మీదుగనే మీ శాశ్వత ప్రయాణం జరిగి, ఆయన దగ్గరికి పంపే వరమీయమని, మీ ఆయుష్షుని కూడా నాకు పోసి, మీ తర్వాతనే నన్ను తనదరికి చేర్చుకోమని వేడుకుంటున్నా! ఇలా కోరుకోవాల్సి రావడం... ఏనాటి శాపమో మరి!
      ఇదే నా ఆఖరి ప్రేమలేఖ! మీరు చదవలేని నా మనసు! సదా మీవెంటే ఉంటానని మాటిస్తూ...

మీరు మర్చిపోయిన మీ సహచరి

ఆ భావరహిత చూపుల్లో...

వెనక్కి ...

మీ అభిప్రాయం