అక్షరాల జల్లుల్లో విరిసిన హరివిల్లు

  • 139 Views
  • 0Likes
  • Like
  • Article Share

    జి.వంశీమహేశ్వరి

  • విజయవాడ.
  • 9440104752

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియమైన దివ్యా!
చాలా రోజులైంది కదూ నీకు ఉత్తరం రాసి? ఎందుకే అంతకోపం? అమ్మో! ఏంటే ఆ చూపు! ఆనాడు కౌశికుడు చూసినట్లు! పాపం! ఎలా ఒణికిపోతుందో చూడవే నా ఉత్తరం కొంగలా! ఉత్తరం అందింది కదా? ఇక శాంతించినట్లేనా? 
      నేను హైదరాబాదు నుంచి విజయవాడొచ్చి రెండు రోజులైంది. బయట సన్నగా జల్లులు. గాలికి ఊగుతూ వాటిలో తడుస్తున్న పూల మొక్కలు అల్లరి పిల్లల్ని తలపిస్తున్నాయి. అమ్మ ఇచ్చిన మంచి కాఫీ తాగి, డాబా మీద మన చదువుల గదిలో కూర్చున్నాను, నీకు ఉత్తరం రాద్దామని.
      చిత్రంగా ఉంది కదూ! అప్పుడే మన చదువులు పూర్తవడం, పొట్టచేత పట్టుకుని మనం నలుగురం తలో దిక్కూ పోవడం. అన్నట్లు నీకు గుర్తుందా? మా నాన్నగారు అప్పుడప్పుడూ మనతో ఓ మాట అంటుండేవారు ‘‘బాల్యమే లేని బాలఏసులు మీరు!’’ అని. ‘‘ఏసు శిలువను మోసినట్లుగా బాల్యంలోనే గంపెడు పుస్తకాల బరువును మోసే పిల్లల్ని చూస్తుంటే నాకు చాలా జాలి వేస్తుందమ్మా. కానీ ఏం చేయగలం? ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే ఈ తిప్పలు తప్పవనుకుంటాను’’ అంటూ నిట్టూర్చేవారు. నిజం చెప్పాలంటే, అలాంటి బాల్యం ఇప్పుడేది? ముచ్చటగా మూడేళ్లయినా నిండని పసికూనల్ని ఎల్‌కేజీ, యూకేజీలంటూ కేజెస్‌లో (పంజరాల్లో) పెడుతున్నారు. ఆటపాటలతో చదువుకోవాల్సిన చిన్నారుల్ని కాన్వెంట్‌ స్కూళ్లల్లో బాయిలర్‌ కోళ్ల మాదిరిగా చేస్తున్నారు. ఇక కళాశాల చదువులకు వెళ్లినవాళ్లని ర్యాంకుల కోసం వేటకుక్కల్లా పరుగులు తీయిస్తున్నారు. కనీసం వేసవి సెలవుల్లోనైనా పల్లెల్లో ఉండే ఏ అమ్మమ్మ, నానమ్మల ఇళ్లకో పంపుతున్నారా అంటే అదీ లేదు. అప్పుడు కూడా ‘ఇంగ్లీష్‌ స్పీకింగ్‌’ కోర్సులకు, కంప్యూటర్‌ కోర్సులకు వెళ్లాలట. ఈ విషయంలో మా నాన్న చాలా నయం. పట్టుబట్టి, అమ్మ వద్దంటున్నా మమ్మల్ని అమ్మమ్మ, నానమ్మల దగ్గరకు పంపించేవారు. అక్కడే తెలిసింది నాకు బాల్యం విలువేంటో, మనం ఏం కోల్పోయామో! కొంతలో కొంత మేలేంటంటే నువ్వూ, నేను, రమ్యా, సుధా మా డాబామీద రాత్రుళ్లు కలసి చదువుకోవడం. వెన్నెల తీగలల్లుకుని, చుక్కల పూలు పూసిన ఆకాశపందిరి కింద మనం చెప్పుకున్న ఊసులు, చలంగారి కథల మీద విశ్లేషణ, కృష్ణశాస్త్రి గారి పాటలు వినడం, ఇవి మాత్రమే మన జీవితంలో తీయని జ్ఞాపకాలుగా మిగిలాయి.
      అన్నట్లు చెప్పడం మరిచాను! సుధ విశాఖపట్టణం నుంచీ నిన్నే వచ్చిందట. పెళ్లి చూపులకని పిలిపించారట తనని. రాత్రి వచ్చింది నన్ను కలవడానికి డాబా మీదికి. ‘పెళ్లి చూపులెలా జరిగాయి?’ అన్నాను నవ్వుతూ. ‘పెళ్లికొడుకు నన్ను తినేసేట్టు చూడటంతో ఒళ్లంతా తేళ్లు, జెర్రులు పాకినట్లయింది. ఇప్పుడే చన్నీళ్ల స్నానం చేసి వస్తున్నాను’ అంది రుసరుసలాడుతూ. ‘ఉత్త చూపులకే చన్నీళ్ల స్నానాలైతే, రేపు పెళ్లయ్యాక, మీ ఆయనపెట్టే ఎంగిలి ముద్దులకెన్నిసార్లు చేయాలో వేడినీళ్ల స్నానాలు?’ అన్నాను ఆటపట్టిస్తూ. ‘చలంగారి కథలు కాస్తకాస్త ఒంటబడుతున్నాయే నీకు. రేపు నీకు మాత్రం జరగవా పెళ్లిచూపులు? అప్పుడు నిన్ను విడిచిపెడతానా!’ అంది రోషంగా. 
      పోతే, ఎలా ఉందే నీ అమెరికా జీవితం? ఈసారైనా వివరంగా రాయి. అదిగో! అమ్మ పిలుస్తోంది కిందినుంచి, దోసెలు తిని పొమ్మంటూ.
      బయట వానజల్లులు పడుతూనే ఉన్నాయి.
      లోపల గదిలో - అక్షరాల జల్లుల్లో తడిసిన నా ఉత్తరం!
      నువ్వందుకుని చదివేటప్పుడు, నీ చూపుల కాంతులు సోకి, విరిసేను చూడు! అందాల హరివిల్లై!
      ఉంటాను.

ప్రేమతో, నీ మహి

అక్షరాల జల్లుల్లో విరిసిన హరివిల్లు

వెనక్కి ...

మీ అభిప్రాయం