శ్రీమతికి ఒక శ్రీముఖం

  • 108 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పొత్తూరి విజయలక్ష్మి

  • హైదరాబాదు
  • 9949059007
పొత్తూరి విజయలక్ష్మి

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ఓయ్‌ సరస్వతీ,
మన పెళ్లయ్యి ఇన్నేళ్లయింది... నేనేనాడూ నీ మనసు నొప్పించి ఎరగను. నాకెలాంటి చెడలవాట్లూ లేవు. మరీ అంత అలుసు పనికిరాదు.... మీ ఆవిడ నిన్ను ఓ ఆట ఆడిస్తోందని శ్రేయోభిలాషులు హితవు చెప్పినా నేను పట్టించుకోలేదు. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాడని నమ్మి నీ ఆగడాలు భరిస్తూ ఉండటమే నా అపరాధం. నీకు నా మీద ప్రేమ లేదు సరికదా, ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నాడనే కనీస విశ్వాసమైతే ముందు నుంచే లేదు.
      నువ్వు చేస్తోంది ఏమైనా బాగుందా? నీ అంతరాత్మని నిలదీసి అడిగితే నీకే తెలుస్తుంది నువ్వు చేసేది తప్పని. ఇలా నన్ను వేధించుకుని తినడం భావ్యమా?  
      నీకేం చెప్పాను? నన్నొదిలి వెళ్లకు... నువ్వు లేకపోతే నా జీవితం అస్తవ్యస్తమై పోతుందన్నానా లేదా? దానికి నువ్వేమన్నావు? వారంలో వచ్చేస్తాను అన్నావా లేదా; అలాంటి వారాలు మూడు గడిచినా అయిపూ అజా లేదు.
      ఫోన్‌ చేస్తే తియ్యవు. తర్వాతైనా మిస్డ్‌కాల్‌ చూసి ఫోన్‌ చేస్తావా అంటే అదీలేదు. ల్యాండ్‌లైన్‌కి చేస్తే ‘ఈ నంబర్‌కి సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి’ అని సమాధానం. నేనెలా కనపడుతున్నాను? మీ అమ్మ గొంతు ఆమాత్రం గుర్తు పట్టలేనా? మీ అమ్మ కాకముందు ఆవిడ నా అక్కగారేగా! ‘ఏవిటే ఈ ఆగడం!’ అని మా బావగారైనా మందలిస్తారా అంటే, పాపం ఆయన నాకంటే వెర్రిమాలోకం. 
      ఇక్కడ నా పరిస్థితి దారుణంగా ఉంది. పనిమనిషి నాగమ్మ సార్థక నామధేయురాలు. నీ ఎదురుగా ‘మీరు వెళ్లిరండి. నేను అయ్యగారికి వంట కూడా చేసిపెడతాను’ అని చెప్పిందా! మూడు రోజులు వచ్చిందేమో, ఆ తర్వాత ఓ రోజు రావడం, రెండురోజులు నాగాలు. వారం తర్వాత పత్తాలేదు. ఎదురింటి పనివాణ్ని బతిమాలితే ఇల్లు చిమ్మి పోతున్నాడు. హోటల్లోనే తింటున్నాను.
      నువ్వు వెళ్లాక ఉన్నట్టుండి చలి పెరిగిపోయింది. తట్టుకోలేకపోతున్నాను. ఎంత వెతికినా ఒక రగ్గుగానీ రజాయి గానీ దొరికితే ఒట్టు. ఇంట్లో ఏవి ఎక్కడ పెడతావో నీకూ ఆ భగవంతుడికి తప్ప మూడోవాడికి అర్థం కాదు.. పోనీయని సామానంతా తీసి వెతికితే ఇల్లంతా పీకిపెట్టారు అని ఆరేళ్లు సాధిస్తావు!!
      అయినా తెలియక అడుగుతాను.. పుట్టింటికిపోయి అక్కడే ఉండిపోవడానికి నువ్వేమైనా కొత్త పెళ్లికూతురివా? గడప దాటగానే మొగుణ్ని మర్చిపోతే ఎట్లా? రోజుకోసారి ఫోన్‌ చేసే తీరిక కూడా లేదా? నేను చేస్తే ‘దానికి జ్వరంరా. మూసినకన్ను తెరవకుండా పడుంది’ అని మీ అమ్మ సన్నాయి నొక్కులు. ఇంతలోనే ‘నేనూ, మా అక్కా సినిమాకెళ్లి, అట్నుంచి హోటలుకెళ్లి ఉల్లిపాయట్టు తింటున్నాం’ అంటూ ఫేస్‌బుక్‌లో మీ తమ్ముడి వెధవ పోస్ట్‌లు!  
      మిమ్మల్ని అని ఏం లాభంలే? కూతుర్ని చూడాలని అక్కయ్యా, అమ్మని చూడాలనిపిస్తోందని నువ్వూ ఏడుస్తుంటే జాలిపడి పంపినందుకు నన్ను నేనే తిట్టుకోవాలి. ఉత్తరం అందగానే బయలుదేరు. వెంటనే ఫోన్‌ చేసి రగ్గులు ఎక్కడ పెట్టావో చెప్పి అఘోరించు... నీ దగ్గర నాగమ్మ ఫోన్‌నంబర్‌ ఉంటే ఫోన్‌ చేసి ఉందో పోయిందో కనుక్కో.
      ‘నీ ఉత్తరం అందలేదు చిట్టి మావయ్యా’ అని వెధవ్వేషాలు వెయ్యాలని చూడకు. ఇది కొరియర్‌. ‘దేవుడి ఉత్సవం చూసి వెళ్లమంటోంది అమ్మ. అమావాస్య ముందు ఆడపిల్లని ఎలా పంపిస్తామంటున్నారు నాన్నారు’ అని దాటేశావంటే నేనే వచ్చి లాక్కొస్తాను. జాగ్రత్త మరి.

    నీ చిట్టి మావయ్య... 
           ప్రసాదరావు

శ్రీమతికి ఒక శ్రీముఖం

వెనక్కి ...

మీ అభిప్రాయం