గొప్ప ఆస్తి!

  • 130 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కోటమర్తి రాధాహిమబిందు

  • హైదరాబాదు
  • 9440764378
కోటమర్తి రాధాహిమబిందు

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియమైన తమ్ముడికి... 
అక్కయ్య ఆశీర్వదిస్తూ రాస్తున్న  ఉత్తరం..
ఇది అందగానే నువ్వు చాలా ఆశ్చర్యపోతావని నాకు తెలుసు. పదిహేను సంవత్సరాల తర్వాత ఉత్తరం రాస్తుంటే నాకే విచిత్రంగా ఉంది. ఫోన్లు వచ్చాక... ఉత్తరాలు రాసుకోవడం ఎప్పుడో మర్చిపోయాం. కానీ గాలిలో కలిసిపోయే మాటల కంటే ఎదురుగా కనిపిస్తూ హృదయాన్ని తట్టిలేపే అక్షరాలే కదా శాశ్వతంగా ఉండేవి.
ఒరే తమ్ముడూ! 
రాత్రి డాబా మీద అటూఇటూ తిరుగుతుంటే మన బాల్యం గుర్తొచ్చింది. మనం కలసిమెలసి ఉన్న రోజులు... ఒకరికోసం ఒకరం అన్నట్లుగా సాగిన ఆనాటి రోజుల ఆ తీపి జ్ఞాపకాలు... మన నలుగురి మధ్య ఉన్న ఆ అభిమానాలు, అనుభూతులు, ప్రేమలు అన్నీ మననం చేసుకున్నాను. మన పెళ్లిళ్లు, పిల్లలు.. వాళ్లు పెరిగి పెద్దవడం... ఇవన్నీ కళ్లముందు నిలిచాయి.
ఒక విషయం గురించి ఆలోచిస్తే కాస్త భయంగా, ఇంకాస్త ఆవేదనగా అనిపించింది. దాని గురించే ఉత్తరం ద్వారా నీతో మాట్లాడాలనిపించింది. అన్నయ్యకు, నీకు, నాకు, చెల్లెలికి ఇద్దరేసి పిల్లలు. వాళ్ల చిన్నప్పుడు కాస్తోకూస్తో దగ్గరగా ఉన్నారు. అప్పుడప్పుడు కలుసుకోగలిగారు. కానీ, ఇప్పుడు చాలా దూరం పెరిగింది కదరా! ఎవరి స్నేహితులు వాళ్లకు ఉన్నా, ఈ బంధుత్వం... ఈ బంధం కూడా ఉండాలి. వాళ్లకు తీరిక లేదన్నది మాత్రం నిజం కాదు... ఏవో రోజులు గడిచిపోతున్నాయి అన్నట్లుగా మనం కూడా ఉంటున్నాం... మన తరంతోనే ఈ బంధాలు ఆగిపోతే ఎలా? ఈ విషయం మనం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏదో తప్పు చేస్తున్నామన్న భావన రాత్రి నాకు నిద్రకు దూరం చేసింది. మనం వేరే వేరే పట్టణాల్లో, నగరాల్లో దూరంగా ఉన్నా మన మనసుల మధ్య దూరం లేదు. నువ్వో ఇల్లు కొన్నా, కారు కొన్నా నేను కొన్నంతగా ఆనందపడిపోతాను. నువ్వూ అంతే. అన్నయ్య, చెల్లి కూడా ఇంతే కదా... ఒకరి విషయాలు ఒకరికి చెప్పుకుంటూ చాలా సంతోషపడి పోతాం... ఈ దగ్గరితనాలు, చనువులు, ప్రేమలు పిల్లలకు ఎందుకు చేర్చలేకపోయాం అనే బాధే మనసును తొలిచేస్తోందిరా.
మన పిల్లల తరానికి కూడా ఇవన్నీ కావాలి. ఏదో వరసకి బావ, అక్క, అన్న, వదిన అని ఎప్పుడో కలిసినప్పుడు పలుకరించుకున్నా... ఆ దగ్గరితనం లేదు కదా. ఎవరి సంపాదనలు వారికి ఉన్నాయి. ఒకరికి కాస్త ఎక్కువ కావచ్చు. ఇంకొకరికి కాస్త తక్కువ కావచ్చు. డబ్బే ప్రాధాన్యం కాదు గదరా. కానీ, వాళ్ల చిన్న మనసుల్లో ఎలాంటి భావాలు వికసించి, ఎలాంటి రూపాలను ధరిస్తున్నాయో మనకు తెలియదు. ఈ నెలలో అందరికీ మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. మన నాలుగు కుటుంబాలూ పిల్లలతో సహా కలుసుకుందాం. వాళ్ల మనసుకు దగ్గరగా మాట్లాడదాం. మాలాగా మీరూ ఉండాలని చెబుదాం. ఇలా మనం మరింత ఆలస్యం చేస్తే మున్ముందు వాళ్ల మధ్య దూరం ఇంకా పెరిగి పోతుందేమో! ఇప్పటికే పిల్లలు ఎవరూ పెద్దగా మాట్లాడుకోరు. వీళ్లే ఇలా ఉంటే తర్వాత వచ్చే వాళ్ల పిల్లల మాటేంటి?
అమ్మానాన్నలు మనకెన్నో మంచి మాటలు చెప్పారు. అవన్నీ విన్నాం, పాటించాం. అందుకే మనం ఇంతగా వృద్ధిలోకి వచ్చాం. ఒకరి బాగు కోరుతున్నాం. ఒకరికి సాయపడాలన్న బుద్ధి ఉంది. మనం సంపాదించిన ఆస్తి రేపటి రోజున మన పిల్లలకే చెందుతుంది, చేరుతుంది. కానీ అంతకంటే గొప్ప ఆస్తి ఉందని మనం తెలియజేయాలి. అర్థమైంది గదరా! అప్పుడే పైలోకంలో ఉన్న అమ్మానాన్నలూ సంతోషిస్తారు. మేం చెప్పింది వారసత్వంగా మా పిల్లలు తమ పిల్లలకు కూడా చెప్పుకున్నారని ఆశీర్వదిస్తారు... అది చాలు గదరా... ఉంటానిక..!       

ప్రేమతో అక్కయ్య

గొప్ప ఆస్తి!

వెనక్కి ...

మీ అభిప్రాయం