నా లోపలే ఉండిపోయిన నీకు...

  • 236 Views
  • 0Likes
  • Like
  • Article Share

    యశస్వి

  • హైదరాబాదు.
  • 8008001942
యశస్వి

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

రోజూ వెలగబెట్టే కొలువే అయిదు నిముషాల ముందు తెమలడం ఇప్పటికీ చేతకాలేదు. ఉదయాన్నే పరుగులూ - ఉరుకులూ ఇంట్లోనే పులిసిపోయి పడుకున్న ఒళ్లు ప్రభాత వాహ్యాళికి లేవదు. ఈదడానికి ఏరూ లేదు, మేసేచోటు లంకా కాదుగానీ లంగరేయని జీవితానికి ఆ పోలికతో పెద్దతేడా లేదు. జారే పాంట్లని రింగులట్టుకుని ఎగలాక్కుంటూ... ఎండెక్కే కొద్దీ కంగారెక్కి, బస్సు కోసం పరిగెడదామనుకుంటానా! అది కబ్జా చేసిన వీధిలో కనబడిన ఆగంతుకుడిగా ఖరారు చేసేసి గుర్రుగా దూసుకొస్తుంది ఎదురింటివారి కుక్క. ఆ ఇంటావిడ, నా ప్రాణదాయినిలా దాన్ని అదిలిస్తూ అంటుందీ... ‘మీకు కుక్కలంటే మక్కువని.. దీనికీ తెలిసిందిలెండి’! ఆ భయాన్ని వదిలించుకుని, ఓ నిజంతో నేను బయటపడతాను. 
      అదే! టామీ!! నువ్వింకా నా లోపలే ఉండిపోయావని.
      టామీ! మనదేమైనా చెప్పుకోవడం ఇంకా మిగిలుందా నేస్తం!! నిను కలిసిన ప్రతిపట్టూ వాస్తవంగా నన్ను నేను నిమురుకున్న కవిత్వ సందర్భాలే! నే మొదలు పెట్టకముందే తలాతోక ఊపేవాడివి నువ్వే!! ఓనాడు నువ్వెక్కడని అడిగితే చనిపోయావని చెప్పారు. ఎక్కడికి పోయుంటావు! కుక్కల స్వర్గమేమైనా ఉండుంటుందా! అట్లాంటిదేదైనా ఉండుంటే అది ఈ భూమ్మిదే. అయ్యో! అని ఒకరికొకరం అనుకున్నా ఏం ఉపయోగం లే! నా లోపలే ఉండిపోయిన నీకు ఈ నాలుగు మాటలూ! మరి తలూపుతూ తలపుల్లోనే వింటావా!!
నువ్వు లేని ఆ గుమ్మాన్ని తొక్కలేకపోతున్నా. నాలుగు పాదాల పసివాడిగా నువ్వు తారాడిన ఆ ఇల్లు... బయల్దారిగా చేసుకుని విహరించిన ఆ వీధి... నీ రాజసాన్ని కనలేక ఇప్పుడు బోసిపోయాయి. మూడేళ్ల కిందట స్నేహపు పొదరింటిలో పరిచయమైన నాలుగో ప్రాణివి... నా పంచేంద్రియాలతో పెనవేసుకున్న నీ స్మృతులన్నీ కల్లలై ఆరు నెలలు ఎట్లా గడిచిపోయాయి! 
      గాజునది గారాలపట్టీ! నదీమూలం లాంటి ఆ ఇంటిలో ధర్మంలా నడయాడే వాడివి. కాలభైరవుడి కౌగిలిలో అప్పుడే ఎలా ఒదిగిపోయావు! సక్తుప్రస్తుడి దాతృత్వం ఆ ‘ఘరానా’ అన్నట్టు ఏ పేలపిండిలో పొర్లాడి పెరిగావో బంగారు వర్ణంలో మెరిసిపోయేవాడివి. అక్షయపాత్రకు అంటిన ఆఖరి మెతుకుని కతికిన కృష్ణుడివేమో! నిండైన నిను చూడగానే... కళ్లూ- కడుపూ నిండినట్టుండేది. మనసు నిండే ముషాయిరా సదా నీతోడుండేది
      నిన్ను నిక్కించి చూసేందుకు... దూరంనించే ప్రేమించాలనే బెట్టుతో నీ జట్టుకొచ్చి.. పులిని చూసి భయంతో సగం చెట్టెక్కినట్టు నా వెనక నక్కే.. లక్కీ నాన్నకి ఎరుకే.. నువ్వెంత మంచివాడివో! అమ్మ నిన్ను అదిలించిందా.. ఎంత కుక్కవైనా కుక్కిన పేనువే! స్కాట్లాండ్‌ గోల్డెన్‌ రిట్రీవర్‌ జాతి శునకరాజానికి ఇంగ్లాండ్‌ దేశపు ఆంతరంగిక సిపాయిల వ్యవహారిక నామాన్ని ఎందుకు పెట్టారో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నువ్వు నాన్న లాలన కన్నా అమ్మ పాలనకే విలువనిస్తావు. 
      నీకు కవిత్వం వినడం తెలుసు. నేను నీకు కవిత్వమై కనిపించడం తెలుసు. నువ్వు మంచీ- చెడూ చూసే అవకాశం మాకిచ్చావో లేదో; నువ్వెప్పుడూ చెప్పలేదు, నాకడిగే హక్కు లేదు. అయినా నాకెక్కడో నిన్ను మేం సరిగా చూడలేదేమోనని గుర్రు. నోటినీరు కార్చొద్దంటే గుడ్డ కరచుకుని కూర్చునేవాడివి. ఓ కంటనీరు ఒలికితే నీ కాలితో తుడిచిన వాడివి. అర్థం కాని భాషలో ఎప్పుడన్నా మొరిగావేమో! నీ సంస్కారం ఉన్నతమైంది; అందుకే మేమెవరం నీ అవసరాలని గ్రహించలేదు. తిరగడానికి వెళ్లావేమో తిరిగి రాని తీరాలకి.. మమ్మల్ని మన్నించు. నీకోసం పుట్టినూరులో స్మారకం కట్టుకున్నాం తెలుసా!
      ఇప్పుడు టామీ అంటే.. రంజాన్‌కి పెద్దల సరసన పూలందుకునే సమాధి దిమ్మ మాత్రమే అనుకునేవు!! ఎరువుగా మారి... తోట మట్టి సారంలోంచి తొంగిచూసే కాగితపు పూలవనం కూడా!

టామీ!... యువర్స్‌ ట్రూలీ

నా లోపలే ఉండిపోయిన నీకు...

వెనక్కి ...

మీ అభిప్రాయం