పల్లెకు పోదాం

  • 1045 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సతీష్‌ దేవరం

  • ప్రధానోపాధ్యాయుడు
  • కరీంనగర్‌
  • 9441758402
సతీష్‌ దేవరం

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

నేస్తమా, కుశలమా?
నా మీద కోపంగా ఉంది కదూ! అవును మరి ఉండదూ! ఎన్నాళ్లయింది నేను నీకు జవాబు రాయక? నీ నుంచి తరచూ లేఖలందుతున్నా, పని ఒత్తిడితో బదులివ్వలేకపోయాను. ఆ ఒత్తిళ్ల నుంచి కాసేపు బయటకు రావాలని, నీతో మనసు విప్పి మాట్లాడాలని ఇదిగో ఇలా రాస్తున్నా!
ప్రతి ప్రభాతమూ మాకో సుప్రభాతమే. ఎందుకంటే, మేం నిద్రలేవగానే కనిపించేది నీ ‘కళా’ రూపమే. మా పెళ్లికి కానుకగా నువ్వు అందంగా చిత్రించి ఇచ్చిన రాధామాధవుల రసరమ్యకేళీ చిత్రం... మా పడకగదిని అలంకరించిన ఏకైక చిత్రరాజం. దాన్ని చూసినప్పుడల్లా ‘ఎంత గొప్ప కళాకారుడండీ మన రమణ’ అని నీ చెల్లెలు అంటూంటే నా గుండె ఎంత ఉప్పొంగుతుందో తెలుసా? చెప్పలేనంత. నిజమే నువ్వు గొప్ప చిత్రకళాకారుడివి.
నీకు గుర్తుందో లేదో కానీ, మనం తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు మన తెలుగు మాస్టారు ఓ రోజు పొరపాటున అరటి తొక్కపై కాలేసి జారిపడ్డారు. ఆ దృశ్యాన్ని మర్నాడు తరగతిలో నల్లబల్ల మీద వేసి ఆయనతో మొట్టికాయలు తిన్నావు! అవి పైకి మొట్టికాయలే అయినా లోన మాత్రం తీయని కజ్జికాయలే. నువ్వు వ్యంగ్యంగా చిత్రించినా, ఆయన మాత్రం నీ ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించిన దృశ్యాలు ఇప్పటికీ చెదరని జ్ఞాపకాలే. అలరించే రూపకాలే.
అది సరే! వచ్చే నెలలో ఏవో సెలవులు ఉన్నట్టు రాశావు కదూ! మరి ఆ సెలవుల్లో ఓసారి ఇటు రాలేవూ? నాకేమో అటు కదల్లేని ఉద్యోగ బాధ్యతలు, ఇటు కొత్తకాపురపు బరువులు, బంధాలు. నువ్వే ఇక్కడికోసారి వస్తే మన ముగ్గురమూ కలిసి మన వూరెళ్లొద్దాం.
ఈ నగర జీవనంలోకి వచ్చాక, పల్లెను మరచిపోతున్నట్టు అనిపిస్తోంది. అందుకే ఓసారి వెళ్లొద్దాం. చిన్నప్పుడు మనం తిరిగిన వూరి చెరువుగట్టు, పొలాల గట్లు, పదే పదే ఎక్కి దిగిన గుట్టమీది కోదండ రామస్వామి గుడిమెట్లు అన్నీ చూసొద్దాం. ఎవరూ చూడని వేళల్లో చిన్నపిల్లలమైపోయి వూరిచివరి మర్రి వూడల ఉయ్యాలలూగి వద్దాం. ఓ మూడ్రోజులు అక్కడే ఉండి పచ్చని పొలాల విచ్చిన గుండెల్లో వెచ్చగా సేదదీరుదాం. మలయమారుతాలను మించిన మన పరిసరాల మందగమన వీచికల్లో మనసులు పరచుకుందాం, జ్ఞాపకాల పొత్తాలను తరచిచూసుకుందాం. మన సుమధుర వ్యాపకాలను మరోసారి కలుపుకుందాం. నాకేమో పాటలంటే ప్రాణం. నీకేమో బొమ్మలంటే ఇష్టం. అభిరుచులు వేరైనా మన మనసులెలాగో కలిశాయి. స్నేహసుమాలు విరిశాయి. వాటి సౌరభాలను ఇప్పటికీ మనం ఆస్వాదిస్తూనే ఉన్నాం.
ఆ మధ్య అనుకోకుండా మన వూరి రామాలయ పూజారిగారు కలిశారు. ఆయనకు నీ పేరు గుర్తు లేదుగానీ, నీ చిలిపిచేష్టలే గుర్తున్నాయి కాబోలు ‘కోతి’ ఎలా ఉన్నాడని అడిగారు. అంతేకాదు ఆ రోజుల్లో వాళ్ల అబ్బాయి పుస్తకాల మీద నువ్వేసిన బొమ్మలను జ్ఞప్తికి తెచ్చుకుని నిన్ను ఎంతగానో మెచ్చుకున్నారు తెలుసా! అదే మరి పల్లె తత్వం అంటే! మన నగరవాసులకు అంత జ్ఞాపకశక్తి, గురుత్వం, ఆప్యాయతలు ఎక్కడ ఉంటాయి? కాలాలు మారినా పల్లె జీవనాడి ఇంకా మారలేదని అనిపించింది.
ఆ... అన్నట్టు మాటల్లోనే నీ ‘పెళ్లి’ ప్రస్తావనా వచ్చింది. ఇంకా పెళ్లి కాలేదంటే ‘ఎందుకు’ అని ప్రశ్నించారు. ఏమని చెప్పేది!? నాకన్నా పెద్దవాడివి. ముప్ఫయ్యేళ్లు దాటాయి. అయినా పెళ్లిపీటలు మాత్రం ఎక్కలేదు. పెళ్లి చేసుకోరా అని అడిగిన ప్రతిసారీ ఇంకా ఏదో చదవాలని, పెద్ద ఉద్యోగాన్ని సాధించాలని అంటుంటావు.
సాధించు, కాని దానికి పెళ్లి అడ్డేమీ కాదు కదా! ఏ వయసుకు ఆ ముచ్చట తీరాల్సిందే! పైగా అమ్మాయిల కోసం అబ్బాయిలు వెతుకులాడే రోజులు వచ్చేశాయి. ఇంకో దశాబ్దమైతే ‘కన్యాశుల్కం’ మళ్లీ ప్రాణం పోసుకున్నా పోసుకోవచ్చు. ఆ పరిస్థితి రాకముందే ఓ ఇంటివాడివి అయిపోవడం మేలు మిత్రమా! నువ్వు ‘వూఁ..’ అను బోలెడు సంబంధాలు ఉన్నాయి. ఏదో ఒకటి కుదరకపోదు. సరేనా!
‘బ్రహ్మచారి ముదిరినా, బెండకాయ ముదిరినా పనికిరాద’నే సామెతను గుర్తుంచుకోవడం మంచిదని నా భావన. నీ పెళ్లి నీకోసమే కాదు, ‘వదిన’ రూపంలో తనకూ ఓ మంచి నేస్తం దొరుకుతుందని నీ చెల్లెలు కూడా ఆశపడుతోంది. మరి అన్నయ్యగా తన ముచ్చట తీర్చవా!?
సరేమరి... వీలైనంత త్వరగా మన వూరు వచ్చేసెయ్‌! వస్తావని ఆశిస్తూ...

నీ మిత్రుడు...
సతీష్ దేవరం

పల్లెకు పోదాం

వెనక్కి ...

మీ అభిప్రాయం