శ్రీవారికి లేఖ

  • 319 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పెండ్యాల సర్వశ్రీ

  • హైదరాబాదు
  • 9963968038

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియమైన శ్రీవారికి, లక్ష్మి 
నమస్కరిస్తూ రాసే లేఖ. మీరు వెళ్లి మొన్నటికి సరిగ్గా సంవత్సరం. అక్కడ మీరెలా ఉన్నారు? అన్నీ సౌకర్యంగా ఉన్నాయా? ఏంటో! ఉత్తరాలు రాసి చాలా ఏళ్లయ్యింది కదూ. 
ఇక్కడ నేనూ, పిల్లలు, కోడళ్లూ అంతా క్షేమం. మనిద్దరం సింగపూర్, మలేషియా వెళ్లడానికి మీరిక్కడ ఉన్నప్పుడే వీసా వచ్చింది కదా. మీరు లేకపోవడం వల్ల నన్నైనా తప్పకుండా రమ్మని పద్మ అత్తగారు సింగపూర్‌ నుంచి ఫోన్‌ చేశారు. పిల్లలూ సరే అనడంతో వెళ్లాను. మీరుంటేే బాగుండేదని రోజూ అనుకునేవాళ్లం.
      మనం భవిష్యత్తు గురించి ఎన్ని కలలు కన్నాం? మీ పదవీ విరమణ రోజున నాకు పాత జ్ఞాపకాలన్నీ ఓసారి గుర్తొచ్చాయి. రిటైరయ్యాక అమలు చెయ్యాల్సిన పనులన్నీ ఓ ప్రణాళిక వేసుకున్నారు కదూ. రోజూ ఉదయం తీరిగ్గా నిద్ర లేవాలనీ... కాఫీ తాగుతూ దినపత్రిక చదవాలనీ.. తోటలో కాసేపు పనిచేసి, స్నానం చేసి... సంధ్యావందనం చేసుకోవాలనీ... ఫోన్లు చేస్తూ, టీవీ చూస్తూ, కబుర్లు చెబుతూ పన్నెండవగానే అన్నం తిని నిద్రపోవాలని... లేచాక మొక్కలకు నీళ్లుపెట్టి సాయంత్రం నడకకి వెళ్లి అలా మిత్రులని కలిసి రావాలని... తర్వాత ఇంటికొచ్చి తిని, టీవీ చూస్తూ నిద్రపోవాలనీ ఎంతగా అనుకునేవారో.
    పిల్లల దగ్గరికి అప్పుడప్పుడు వెళ్లొద్దాం... మనం మాత్రం జహీరాబాద్‌లోనే ఉందామనేవారు. నాకూ అదే నచ్చేది. ప్రతి సంక్రాంతికీ పిల్లల్ని ఇక్కడికే పిలుద్దాం. మిగతా పండుగలు ఎక్కడైనా జరుపుకుందామనేవారు గుర్తుందా? ఇద్దరం ఉద్యోగస్థులమే కాబట్టి సెలవులు కుదరక పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళ్లలేకపోయేవాళ్లం. రిటైరయ్యాక పిలవని వాళ్లదే పాపం. అన్నింటికీ వెళ్దామనేవారు. మూడు నెలలకోసారి విహారయాత్రలకు వెళ్దామనేవారుకదా. మీరిప్పుడు అక్కడుంటే నన్నెవరు తీసుకెళ్తారు?
    మనం అనుకున్నట్లుగానే అన్నీ అమలు చేస్తున్నాను. రిటైరయ్యాక వచ్చే డబ్బులతో ఇద్దరం చెరో ఆవూ, దూడా దానమిద్దామనుకున్నాం కదా. ధారపాలెంలోని అన్నయ్య ద్వారా ఆవు, దూడ కొనిపించాం. పదిరోజులు వాళ్లింట్లోనే ఉంచారు. కొన్నానని ఫోన్‌ చెయ్యగానే ‘మేం పదిరోజుల్లో వస్తాం. ఇప్పుడు కార్తీకమాసం కూడాను. ఆ ఆవుపాలను ధర్మలింగేశ్వరుని అభిషేకానికి పంపించండి’ అంటే ఆయన అలాగే చేశారు. తర్వాత మేం వెళ్లి గోదానం జరిపించాం.
    మా నాన్న రిటైరయినప్పుడు వచ్చిన డబ్బులతో నాకు, చెల్లెలికి పదేసివేలు పెట్టి అప్పట్లో రెండేసి తులాల బంగారం కొన్నారు. అదిచూసి మనకిద్దరూ మగపిల్లలే. కోడళ్లైనా, కూతుళ్లైనా వాళ్లేకదా వాళ్లకి ఏమైనా చేద్దామనుకునేవాళ్లం కదా. అలాగే కొనిపెట్టాను. మీకు నచ్చిన రంగే మళ్లీ మన ఇంటికి వేయించాం. ఇల్లు సర్దేందుకు కిరణ్‌ వచ్చాడు. వాడంతా మీ పోలికే. ‘అమ్మా నాన్నకి ఇల్లు ఎలా సర్దితే ఇష్టమో అలాగే చేద్దాం. ఏమీ మార్చవద్దు’ అన్నాడు. అలాగే సర్దాం. కానీ హాల్లో ఓ చిన్న మార్పు చేశాం. అదేంటో ఆఖరున రాస్తాను.
    అన్నట్లు మీకో శుభవార్త. మన చిన్నకోడలికి ఇప్పుడు ఐదోనెల. మనకి ఏడోనెల సీమంతం అలవాటుకదా. అలాగే జరిపిస్తాను. 
    కృష్ణమూర్తిగారు మీ చేయిచూసి ‘మీ పిల్లలు మీరేదీ నోటితో అడక్కుండానే అన్నీ చేస్తారు’ అని చెప్పారంటూ మురిసిపోయే వారు కదా! అలాగే వాళ్లు అన్నీ చేశారు.
    నిన్న మనింట్లో సత్యనారాయణ వ్రతానికి బంధువులు, స్నేహితులు, మన వీధిలో ఉన్నవాళ్లంతా వచ్చారు. అందరూ మిమ్మల్నే గుర్తు చేసుకున్నారు. గణేష్‌గారంత మంచి మనిషినీ, పద్ధతిగల వ్యక్తినీ మేమెప్పుడూ చూడలేదని మిమ్మల్ని మెచ్చుకున్నారు. మీరు లేనందుకు అందరూ బాధపడ్డారు. 
    అన్నట్లు చెప్పడం మర్చిపోయా! మనింట్లో చేసిన మార్పేమిటంటే హాల్లో మీ ఫొటో తగిలించి దండ‌వేశాం. ఈ లేఖ ఏ చిరునామాకు పంపాలో నాకు తెలియట్లేదు. మీరు నా మనుమడిగా మళ్లీ నా ఒడిలోకి వస్తారని  ఎదురుచూస్తూ... 

మీ
లక్ష్మి

శ్రీవారికి లేఖ

వెనక్కి ...

మీ అభిప్రాయం