నీకే అంకితం

  • 24 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఆరుట్ల శ్రీదేవి

  • నిజామాబాదు
  • 9550554866

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియమైన వేణూ... నేనిక్కడ కుశలం. నువ్వక్కడ క్షేమంగా ఉండాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా.
      నువ్వు లేకుండా నేనొక్క క్షణం కూడా ఉండలేకపోతున్నా. ఏ పనిచేసినా నువ్వే గుర్తొస్తున్నావు. నేను చేస్తున్న ప్రతి పనినీ నువ్వు బాగా మెచ్చుకుంటున్నట్లు ఊహించుకుంటూ ఉబ్బితబ్బిబ్బయి పోతున్నాను. అంట్లు తోముతున్నప్పుడు పక్కనుంచి నువ్వు కవ్వించినట్టుగా అనిపించింది. అలా నిశ్చేష్టురాలినై ఉండిపోయాను. లోపలి నుంచి అమ్మ చీవాట్లు పెట్టింది. అమ్మ తిడితే తిట్టుకోనీ, నువ్వు నాకున్నావని గుర్తొచ్చి రెట్టించిన ఉత్సాహంతో గిన్నెలన్నీ తళతళమెరిసేలా తోమేశాను. 
      నీకిష్టమైన చెంగావి రంగుచీర కొనడానికి వస్త్రదుకాణానికి వెళ్లాను. అక్కడ ఆలస్యమవడంతో నాన్న కోప్పడ్డారు. అయితేనేం నీకిష్టమైన చీర కొన్న ఆనందంలో నాన్నగారి తిట్లన్నీ గాల్లో ఎగిరిపోయాయి. ఈ ఏడాదితో చదువు పూర్తైపోతుంది. 
      అక్కడ నువ్వు కొత్త ఉద్యోగంలో చేరి ఒంటరిగా పనులన్నీ చేసుకుంటూ ఎన్ని తంటాలు పడుతున్నావో ఏమో! ఎండా కాలంలో మంచి ముహూర్తాలున్నాయట. అమ్మానాన్న మన పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. నేనేమో కళ్లల్లో వత్తులేసుకొని వచ్చే వసంతమాసం కోసం ఎదురుచూస్తున్నా. పువ్వులే తలంబ్రాలై మన ఇద్దరిమీద పడ్డట్టు రాత్రుళ్లు కలలొస్తున్నాయి. నా కలలో మేలుకొని నా కళలన్నీ ఏలుకుంటావని, చందమామ కోసం ఎదురుచూసే చీకటి గగనాన్నై ఉన్నా. బొట్టు, కాటుక పెట్టుకొని, తలలో పూలు పెట్టుకుని పొద్దున్నే గుడికెళ్తే, భక్తులు మోగించిన గంటల గణగణనాదాలు నా మదిలో సంబరాలను అంబరాన్నంటించాయి. ఎందుకో తెలుసా! స్వామివారి పక్కన అమ్మవారు నడిచొచ్చినట్టు నీ వెనక నేనొచ్చినట్టు పోల్చుకున్నానులే. పెళ్లికోసమని అమ్మ నీలమణుల హారాన్ని చేయించింది. అది చాలా విలువైందే కానీ నీ కన్నా కాదు. నేనో అందమైన మల్లె తీగనై నీ ఎద పందిరికి అల్లుకుపోవాలని ఉంది. నన్ను భద్రంగా చూసుకుంటావుకదూ..! అద్దమంటి మనసు, అందమైన వయసు కట్నంగా ఇస్తాను. నా హృదయపు కోవెల తలుపులు నీ కోసం తెరుచుకొని నువ్వెప్పుడొస్తావో అని ఎదురుచూస్తున్నాయి. నేను నోచిన నోములన్నీ పండి నా తోడుగా నువ్వొస్తున్నందుకు పదే పదే దేవుడికి నమస్కరిస్తున్నాను.
      నన్ను నీ చిన్నారిపాపలా చదివించి అందరు మెచ్చే మనిషిని చేస్తావని ఆశిస్తూ నా బతుకంతా అంకితమిస్తున్నా. నా వెలుగై నిలిచి ఆఖరి వరకూ ఏలుకుంటావని ఆశిస్తున్నాను. ఆ రఘురాముడివి నువ్వై, జానకిని నేనై నువ్వెంత దూరంగా ఉన్నా నా దగ్గరే ఉన్నావన్న తలపు ఎంత మధురమైంది! పట్నానికి ఒంటరిగా వెళ్లనిచ్చానేమో! ఎన్ని యుగాలైనా ఒకరికి ఒకరం తోడూ నీడగా ఉందాం. మన జంటకు దైవం అండగా ఉంటుంది. ఈ విషయాలన్నీ ఫోన్లో ఎలా మాట్లాడేది? ఎన్ని ఎస్సెమ్మెస్‌లని చేసేది. తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి చప్పున బదులిచ్చెయ్యేం!

ఇట్లు
నీ ప్రియ

నీకే అంకితం

వెనక్కి ...

మీ అభిప్రాయం