నాన్నమ్మకు ప్రేమతో...

  • 147 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కె.మధుబాబు

  • ఎస్‌బీఐ ఉద్యోగి
  • విశాఖపట్నం
  • 9550295985
కె.మధుబాబు

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ఏదో ఒక క్షణంలో ఒక చిన్న జ్ఞాపకం మదిని మీటి అలా వెళ్లిపోతుంది. పూర్వజన్మ స్మృతిలా... ఆ జ్ఞాపకాన్ని పొదివి పట్టుకోవాలని ఆలోచనా తరంగాలు వాటి వెంబడి అలా పరుగులిడుతూనే ఉంటాయి. అక్కడెక్కడో వేసవి వెన్నెల్లో నులకమంచం మీద నీ ఒడిలో ఊఁ కొడుతున్న కథల దగ్గర ఆగిపోతాయి. 
      ప్రేమగా వెన్ను నిమురుతూ, ఎన్నో కబుర్లు మరెన్నో కథలు చెప్పేదానివి. అదేంటో అన్ని కథల్లోనూ నేనే రాజుని. తాత గుర్తుకొచ్చో లేక పాతవి తలచుకునే పరధ్యానంలోనో ఆ కథల్లో నన్ను రాజుని చేయకపోతే నీ జుట్టు పట్టుకు లాగేసేవాణ్ని. వెంటనే నన్ను మహారాజుని చేసేదానివి. ఊఁకొట్టడం ఆపేశాక అమ్మ లోపలికి తీసుకెళ్లిపోయేది. తెలతెల్లవారుతుండగా నా పక్క దగ్గరికి వచ్చేసేదానివి. నువ్వొస్తే నాకు తెల్లారిపోయేది. నాకిప్పటికీ గుర్తే బడికెళ్లే నా మొదటి రోజు! నా అలకలు, ఏడుపులు ఎవరికీ పట్టడం లేదు. అందరూ దూరంగా అలా నిల్చుని ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారే తప్ప, ఎవరూ సముదాయించడం లేదు. అదేంటో నేను అలా ఏడుస్తుంటే... కళ్లు నువ్వు తుడుచుకుంటున్నావ్‌. ఏడుస్తూ అలా ఇల్లు కదిలానో లేదో కట్టుకున్న పాతచీర మార్చకుండానే పరుగెత్తుకుంటూ వచ్చేసి, చేతులతో చుట్టేసి ఒళ్లంతా తడిమేశావ్‌. అప్పుడు నాకన్నా చిన్నపిల్లవి అయిపోయావు నాన్నమ్మా! 
నాకు వీధిలో పిల్లలతో కోతికొమ్మచ్చి, దాగుడుమూతలు ఆడుకునే వయసొచ్చింది. నా ప్రాధాన్యం ఇంట్లో నీనుంచి, వెలుపల నా ఈడు పిల్లలవైపు మళ్లింది. అయినా నీ లోకం నేనే, అన్ని సాయంత్రాలూ నాతోనే. బయట ఆడి ఆడి అలసిపోయి వస్తే ముప్పావు తెల్ల వెంట్రుకలతో జుట్టు విరబోసుకుని కొబ్బరి నూనె రాసుకుంటూ నాకోసం ఎన్నో పాటలు పాడేదానివి. నాకు నచ్చిన ఆటలు ఆడే దానివి. చివరికి అన్నం తినిపించాలన్నా అమ్మ కన్నా బాగా ముద్దలు కలిపి పెట్టేదానివి. ఒకసారి వేసవి సెలవులకి నేను ఊరు వెళితే నా మీద బెంగతో మంచం పట్టేశావట. నాన్న నన్ను వెంటనే మన ఊరు తీసుకొచ్చేశాడు. నన్ను చూసిన వెంటనే ముఖమంతా ముద్దులతో తడిపేశావ్‌. వెంటనే నీకు జ్వరం కూడా పోయింది. సెలవులు అయిపోతున్నాయంటే బడికి వెళ్లాలనే బెంగ నాకుంటే, నేను ఇంటి దగ్గర ఉండనని ఇంకా బెంగ పెట్టుకునే దానివి. నువ్వెంత పిచ్చిదానివి నాన్నమ్మా! ఏదో పండగొచ్చి అందరూ ఇంటి పనులు, పూజలతో ఉంటే నీ ధ్యాస అంతా నా మీదే. తలంటు స్నానం చేయించి కొత్తబట్టలేసి నన్ను చూస్తూ గడిపేసే దానివి. అదే నీకు పెద్ద పండుగలా అనిపించేది. నువ్వు బజారుకెళ్తే నీతో పాటే నేనుకూడా. అటో, ఇటో వెళ్లిపోతాననే కంగారులో అన్నీ గబగబా కొనేసే దానివి. బజారు నుంచి ఇంటికి నడుస్తుంటే దారిలో కనిపించిన ప్రతి ఒక్కరికీ ‘నా మనవడమ్మా. నేను లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేడు. ఎక్కడికెళ్తే అక్కడికి వచ్చేస్తాడు’ అని అబద్ధం చెప్పేదానివి. నిజానికి నువ్వే ఉండలేక నన్ను తీసుకెళ్లేదానివి. రోజూ నాతో నుదుటి మీద ముద్దులు పెట్టించుకునే దానివి. ఎందుకని అడిగితే ‘మీ తాత పోయాక నా జీవితంలో ఆయన లేని లోటు నీతో, నుదుటిపై పసుపు కుంకుమలు లేని లోటు నీ ముద్దులతో భర్తీ అవుతుందిరా బంగారు తండ్రీ’ అనే దానివి. ఆ మాటలతో తాతంటే ఏంటో ఇప్పుడు అవగతం అవుతోంది. నన్ను కావలించుకోవడానికే నీ చేతులూ, నా కళ్లలోకి చూసి ఆనందించడానికే నీ కళ్లూ ఉన్నాయనేంతలా భావించేదానివి. నా జీవితాన్ని నీ ప్రేమ ఎంతగానో ప్రభావం చేసింది నాన్నమ్మా. నా బాల్యం నువ్విచ్చిన వరమే. నా జీవిత ప్రస్థానం నీ ఒడి నుంచి మొదలైందే. నువ్వెళ్లిపోతే నా జీవితంలో ఏర్పడే అగాధాన్ని ఎవరు పూడ్చగలరు నాన్నమ్మా, నీ జ్ఞాపకాలు తప్ప!
      పెద్దవాడినయ్యా, ఉద్యోగం కోసం ఊరికి, నీకు దూరంగా ఇలా. నువ్వేమో ఊరొదిలి రానంటావు. నిజం చెప్పనా నాన్నమ్మా! మా నాన్న, నా కొడుకు నా అంత అదృష్టవంతులు కారు. ఎందుకంటే వాళ్లకి నాకులాంటి నాన్నమ్మ లేదు! ఈసారి పదిహేను రోజుల సెలవు దొరికింది. నువ్వు చూడాలనుకున్న ప్రదేశాలన్నీ చూడబోతున్నాం. అమ్మా, నాన్న, నా భార్య పిల్లలతో పాటుగా నువ్వు కూడా. రానని అనకు. సిద్ధంగా ఉండు. వచ్చి తీసుకెళ్తా... పిచ్చి నాన్నమ్మా!

ఇట్లు
ప్రేమతో... 
నీ బంగారు తండ్రి
మధు

నాన్నమ్మకు ప్రేమతో...

వెనక్కి ...

మీ అభిప్రాయం