నా కథ మీరు చెప్పరూ...!

  • 34 Views
  • 0Likes
  • Like
  • Article Share

    రాజేశ్‌ చెర్రి

  • మార్కాపురం, ప్రకాశం జిల్లా.

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

నా ‘వేలు’ విడిచిన మిత్రులందరికీ....
      ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. కొంతకాలంగా మీరంతా నన్ను మర్చిపోయారు. కానీ నేను అలా మిమ్మల్ని మరువగలనా? ఇంతకీ నేనెవరంటారా! ఎప్పుడూ మేధావుల చేతిలో ఉంటా. అలాగని వాళ్లని పొగరాయుళ్లనీ, నన్ను సిగరెట్టనుకునీ తిట్టిపోయకండి. చదువుకున్న వాళ్ల ఆయుధం అక్షరమైతే, ఆ అక్షరానికి అక్షయపాత్రను నేను. మీ కలలకు అక్షరరూపమిచ్చే కలాన్ని. ఎక్కడో ఒక చదువరి జేబులోనో, కవుల మాసిన గడ్డంలోనో, ఆకుపచ్చని సంతకానికి ఆదరువుగానో, ప్రేమలేఖలు రాసే అమ్మాయిల మృదువైన వేళ్లమధ్యనో ఊగి, సాగి, నలిగిపోతూ మేం పొందే సంతృప్తి అంతాయింతా కాదు. మొన్నటికిమొన్న ఓ ప్రేమికుడు ప్రియురాలికి లేఖలో ‘నీ సన్నని నడుము ఒంపులో ఆ సొగసు చూడతరమా..’ అని రాస్తుంటే నా వరకు నేను సిగ్గుతో చచ్చిపోయాననుకోండి!
      ఆ రోజుల్లో చక్కటి దస్తూరీతో రాసే లేఖలు చూస్తేనే అవతలివాళ్ల మనసు నిండిపోయేది. ఆ లేఖను అయినవాళ్ల మధుర జ్ఞాపకంగా దాచుకునేవాళ్లు. ఇప్పుడు ఇన్‌బాక్సు నిండిపోతే తీసి పారేయాలి. ఈ-మెయిల్‌ దెబ్బతో ఉత్తరం మిత్రుడు కనుమరుగైపోయాడు. హు! అనుబంధాలు కోల్పోతున్న తరానికి జ్ఞాపకాలెందుకూ! మనలో మనమాట... నిన్నటి డైరీ వీరుడు ఇప్పుడేమయ్యాడు? ఎన్నో ఊసులు పంచినవాడు, నేడు చిట్టాపద్దుల దుమ్ములో ఉక్కిరిబిక్కిరవుతున్నాడా? ఈమధ్యన చిన్నారులు బొమ్మలు సైతం ‘బొమ్మల్‌గియ్‌’ అనే యాప్‌లో గీస్తున్నారంట. మా పక్కింటి పెన్సిల్‌గాడు చెబితే తెలిసింది. మీ చేతుల్లోకి కెమెరా సెల్‌ఫోన్లూ, లాప్‌టాపులొచ్చాయి. దాంతో భావోద్వేగాల్ని ఫొటోలుగా మారుస్తున్నారు గానీ, అక్షరాలుగా మార్చట్లేదు. మమ్మల్ని పుష్కరానికొకసారన్నా వాడక, మా గొంతులో ఇంకు వాడి, ఊపిరందక సతమతమవుతున్నాం. ఇలాగైతే కత్తికన్నా కలం గొప్పది అన్న నానుడి ఇక నానదు. 
      ‘అసలు మీ కలం కులం గొప్పేమిటి?’ అంటారా! కల్పవృక్షాన్ని కాఫీపొడి అడిగినట్టుంది మీ వాలకం. మేము మీకంటే మేధావులం. ఉత్తమ విద్యార్థికి దక్కే తొలి బహుమతి మేమే కదా! మాకు టాగోర్‌ కవిత్వం తెలుసు, వేటూరి పాట తెలుసు, కూనలమ్మ కూత తెలుసు. శాస్త్రవేత్తల ప్రయోగాలూ తొలిసారి మాకే పరిచయం. త్రివిక్రమ్‌ వెటకారానికి మీకంటే ముందుగా పగలబడి నవ్వేదీ మేమే.  ‘ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అని కాళోజీ పలికింది, గుండెలమీద మేమున్నామన్న ధైర్యంతోనే కాదూ!
      నిన్న మా యజమాని జేబులో నన్నుంచుకొనే, సెల్‌ఫోన్‌ సందేశంతో మిత్రుడికి శుభాకాంక్షలు పంపించాడు. ఎలాగో తెలుసా? హెచ్‌పిఎన్‌ఆర్‌ (హ్యాపీ న్యూ ఇయర్‌), అది ఆంగ్లమేనంట, పైగా సందేశ భాషట. నాకైతే సందేహభాషే. అదంతా ‘కట్టె కొట్టె పంపించే’లాగా ఉంటుంది. దాన్ని మన భాషలోకి తర్జుమా చేస్తే ‘నూ సం శు’ అవుతుంది కాబోలు. అందులో పూర్తి అక్షరాలు కనబడలేదు సరికదా! మనస్ఫూర్తిగా శుభం పలికిన భావనా కానరాలేదు. అదే నన్ను పుచ్చుకుంటే అలా అసంపూర్తిగా వదిలేయాలనిపిస్తుందా? భావోద్వేగాల్ని అందమైన మాటలతో పంచుకోవాలని అనిపించదూ! ‘ప్రియమైన మిత్రునికి..’ అన్న ప్రారంభం ఎంత హాయిగా ఉంటుంది! ఆనాడు ఏ సందేశానికైనా పునాది ఇదే కదా! ఇక ఈ కొత్తయేడుకి ఓ సాఫ్ట్‌వేర్‌ వీరుడు ప్రేమలేఖ మొదలెట్టాడు. నన్ను చేతిలోకి తీసుకున్నాడు. ఇక ఆ రుద్దుడికి నా ఒళ్లు, రాతకి నా మనసూ రెండూ విరిగిపోయాయంటే నమ్మండి. ఇంతకీ ఏం రాశాడనేగా... నవ్వినట్టూ, ఏడ్చినట్టూ దిష్టిబొమ్మలూ (ఎమోటికాన్స్‌), రెండు హృదయాకారాలు! నాకు మాత్రం హాహాకారాలే. ఇక వాటం తప్పిందని నన్ను పక్కన పడేశాడు. ప్రకృతి వర్ణన చేయమంటే. సిగ్నల్‌  లైటు చూస్తూ గడిపేవాళ్లం, చెట్టూచేమల గురించి ఏమి రాస్తామని నిట్టూర్చాడు. పెన్ను పట్టకపోతే భావాలన్నీ ఇంకిపోవా మరి. 
      హృదయ రాహస్య మితరులకెట్లు తెలియు/ నేను ప్రణయగీతములు రచింపకున్న! అని కవి గాలిబ్‌ అన్నాడు. నేనూ అదే అంటున్నా! రచనలోనే సృజన ఉన్నదని నా భావన. కానీ, ఇప్పుడు మీరు ఆ విషయం మర్చిపోయి, స్వీయచిత్రాలు (సెల్ఫీలు) తీసుకుంటూ గడిపేస్తున్నారు. ఇక అంతరిస్తున్న జాతుల్లో మమ్మల్ని కూడా చేరుస్తారు కాబోలు. బాబ్బాబు.. ఆ పుణ్యం మాత్రం కట్టుకోకండి! నా బాధ వింటారనే మీకు ఈ లేఖ రాస్తున్నా! భావాలను చక్కటి భాషతో పంచుకొమ్మని నా అభిలాష. చుట్టాలనూ పక్కాలను కలిసినప్పుడు యాపిల్సూ గట్రా కాదు, నాలుగు పెన్నులిచ్చుకోండి. పండగ రోజు కూడా పాత పెన్నేనా అని చిన్నబుచ్చుకోవద్దు. భావాలు కొత్తవేగా. రేపటికి నలుగురు కవులను పుట్టించండి బాబూ! ఎన్నో కథలూ, ఆత్మకథలూ నాతో చెప్పించారు. నేను దూరమవుతున్న కథ కూడా చెప్పుకోండి, ఆనక మీ భావాలకు రూపాన్నివ్వండి. సెలవా మరి!                                                           

ఇట్లు... మీ చేతి నేస్తం
 ‘కలం’

నా కథ మీరు చెప్పరూ...!

వెనక్కి ...

మీ అభిప్రాయం