మీకే రాస్తున్నా...

  • 510 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వి.మేధ

  • అయిదో తరగతి, నలందా విద్యానికేతన్‌
  • విజయవాడ.
వి.మేధ

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

గౌరవనీయులైన తెలుగు ఉపాధ్యాయిని ధనలక్ష్మి గారికి,
      మీరు మమ్మల్ని ఎవరికి తోచిన విధంగా వాళ్లను మిత్రులకుగాని, అమ్మనాన్నలు, లేదా అమ్మమ్మ తాతయ్యలకు లేఖలు రాయమన్నారు కదా! నేను మాత్రం మీకే రాస్తున్నా.
      ఎందుకంటే, మీరంటే నాకు చాలా ఇష్టం. మీ క్లాసంటే మరీ ఇష్టం. మీ క్లాసు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటా. తెలుగు వాచకంలో ఆరో పాఠం ‘అన్నం’ ఎంత బాగా చెప్పారో! ఇదే కాదు మూడో తరగతిలో మీరు చెప్పిన ‘దయ’ పాఠం నాకింకా గుర్తుంది.
      గురజాడ తాతయ్య ‘దేశమును ప్రేమించుమన్నా’ గేయం, వేములపల్లి శ్రీకృష్ణ గారి ‘చేయెత్తు జైకొట్టు తెలుగోడ’ పాట... రెండూ నాకు చాలావరకు కంఠతావచ్చు. నాలుగో తరగతిలో నేర్చుకున్న, మీరు బోధించిన సుమతీ శతకం, వేమన పద్యాలు నాకు కొట్టిన పిండే. శ్రీశ్రీ గారి ‘పాపం పుణ్యం, ప్రపంచమార్గం ఏమి తెలియని పాపల్లారా’ ఎంత బాగా పాడి వినిపించారు!
      ఒకటో తరగతిలో రెండో భాషగా మా నాన్న నాకోసం తెలుగును ఎంపిక  చేశారు. తెలుగు భాష చాలా గొప్పది, తీయనైంది. మన మాతృభాషను నేర్చుకుంటే ఏ ఇతర భాషలనైనా తేలిగ్గా నేర్చుకోవచ్చన్నారు. అప్పుడు ఆయన అలా ఎంపిక చేయకుంటే నేను మీ క్లాసును పోగొట్టుకునేదాన్ని కదా! అనిపి స్తుంటుంది. ఇంకో మాట, అమ్మ నాకోసం ప్రతినెలా ‘బాలభారతం’ కొంటుంది.
      నాకు ‘మేధ’ అని పేరు పెట్టింది మా తాతయ్య. నన్ను ‘చిట్టిమేధ’ అని పిలిచేవాళ్లు. మూడో తరగతిలో ఉన్నప్పుడు తాతయ్య చనిపోయారు. సంస్మరణ సభలో తాతయ్యను మంచి మనిషి, మంచి పాత్రికేయుడు అన్నారు. ఆయన పత్రికల్లో పని చేశారు.
      నాకూ చిన్ని చిన్ని కథలు రాయాలని ఉంటుంది. ప్రయత్నం చేస్తా. మీ సాయం తీసుకుంటా. ఈ లేఖను ఈ పిల్లే రాసిందా అనుకుంటారేమో. నేనే రాశా. కాకపోతే నాయనమ్మ సాయం కొద్దిగా తీసుకున్నా అంతే.

ఇట్లు
మీ శిష్యురాలు

మీకే రాస్తున్నా...

వెనక్కి ...

మీ అభిప్రాయం