జ్ఞాప‌కాల మ‌దిలో...

  • 70 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ప్రమీలారాణి సూర్యదేవర

  • ఖమ్మం
  • 9849366718

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియమైన అనూ,
ఇక్కడ మేం క్షేమం. మీరు క్షేమమని భావిస్తాను. ఈమధ్య నా మనుమడు, మనుమరాలు నా తలపులలో ఒకటే తిరుగుతున్నారు. 
      అన్నట్లు, సౌమ్య పుట్టినరోజు ఈ వారంలోనే కదూ! దానికి, నా ఆశీస్సులు తెలియజేయి. అది బాగా చదివి విజ్ఞానవంతురాలు, సంస్కారవంతురాలూ కావాలని కోరుకుంటున్నాను.
      ఏంటో- ఉద్యోగాలని విదేశాల్లో ఉంటున్నారు. ఉరుకుల పరుగుల జీవితాలు. మీరిక్కడే ఉండుంటే పిల్లల్ని అలా వదిలే దాన్నా. నిరుడు దాని పుట్టినరోజూ, మీ సెలవులూ కలసి రావటంవల్ల ఇక్కడికి వచ్చారుగానీ, లేకపోతే పిల్లలకు మా పేర్లు కూడా గుర్తుండేవి కావు. 
      మన ఊళ్లో బంధువులు, పెద్దవాళ్ల ఆశీస్సులతో, ఆప్యాయతలను పంచుకుంటూ గడిపిన ఆ పుట్టినరోజు వేడుక నాకింకా నిన్నమొన్న జరిగినట్లే అనిపిస్తుంది. 
      ఆరోజు పిల్లలు అందరితో కలసిపోయి సంతోషంగా గడిపిన క్షణాలూ, అప్పుడు వాళ్ల కళ్లల్లో వెలుగులు నేనింకా మర్చిపోలేదంటే నమ్ము. వాళ్లకు మనమిచ్చే తీపిగుర్తులు అవేకదా.
      పల్లెవాతావరణం, అక్కడివారి పనులు, అలవాట్లు గమనిస్తూ, పిల్లలు ఆవుల్ని, గేదెల్ని చూసి ‘ఏంటి, అవి అలా కూర్చున్నాయేంట’ని అడిగితే మనం ఎంతసేపు నవ్వుకున్నాం. ఇవన్నీ ఇక్కడ భలేగున్నాయంటూ భరత్‌ వరిగడ్డివామెక్కి ఎంత అల్లరి చేశాడు. సౌమ్య కోడిపెట్టలు కప్పే జల్లల్లో దూరి ‘వాటికి గాలి ఎట్లా ఆడుద్ది, అవి చచ్చిపోవా’ అంటూ ప్రశ్నలు వేసింది. ఎన్ని మాటలు, ఎన్నెన్ని ప్రశ్నలు. దాని మాటలు, ముచ్చటగా ఇంకా వినాలనిపించేవి.
      భరత్‌ నెమ్మదస్థుడిగా ఉంటాడేగానీ చాలా తెలివైనవాడు. సెల్‌ఫోనును ఎన్ని విధాలుగా వాడుకోవచ్చో నాకు నేర్పాడు. భలే ఆశ్చర్యమేసింది దాన్లో ఇంత పరిజ్ఞానం ఉందా...ని.
      అనూ, తల్లిగా జాగ్రత్తలు చెబుతున్నా, ఏమనుకోకు. ఈ కాలంలో కంప్యూటర్లు లేకపోతే పనే జరగట్లేదు. అయితే, దాన్లో కూడా మంచిచెడులుంటాయి. మంచినే గ్రహించమని పిల్లలకి అర్థమయ్యేట్లు చెప్పు. 
      సౌమ్యని చూస్తుంటే నా బాల్యం గుర్తుకొస్తుంది. ఇలాగే సెలవుల్లో మా అమ్మమ్మ గారింటికి వెళ్లేవాళ్లం. అక్కడ సాయంత్రం వాకిలి శుభ్రం చేయించి నీళ్లు చల్లించేది. అప్పుడు తను ముగ్గుపెట్టి వరుసగా నవారు మంచాలేయించేది. అందరం వాటి మీద చేరి ఇష్టమొచ్చినట్లు గోలచేసేవాళ్లం. ఈ సందడికి చుట్టు పక్కల వాళ్లూ వచ్చి ఎన్నో ముచ్చట్లాడుకునేవారు. ఎక్కడెక్కడి విషయాలో చెప్పుకునేవారు. అప్పుడు నేను చిన్నదాన్ని కాబట్టి వాళ్ల మాటలు అర్థమయ్యేవి కాదు. కానీ వాళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలు తెలుస్తుండేవి. 
      రాత్రి భోజనాలయ్యాక అమ్మమ్మ ఎన్నో కబుర్లు చెప్పేది. మా తాతతో కలసి బంధువుల కబుర్లన్నీ తిరగేసేది. అందులో ఏదిమంచి, ఏదిచెడు, ఏది మనం గ్రహించాలో చెప్పేవారు. వాటిలో నీతి, జాగ్రత్తలు కనిపించేవి. సెలవులు వస్తున్నాయంటే, మళ్లీ తాతగారింటికి వెళ్లొచ్చని భలే సరదా పడేవాళ్లం. దొడ్లో ఒక పక్క గిత్తలు, మరోపక్క పాడిగేదెలు, దూడలు, పెద్దపెద్ద నీళ్లగాబులు. ఇంట్లో మాచుట్టూ తిరిగే పిల్లులు. మేము అప్పుడప్పుడు దూడలను పరిగెత్తించి ఆడుకొనేవాళ్లం. అబ్బో ఆ సందడే వేరు. ఆ ప్రేమలే వేరు. ఈకాలంలో ఎన్నో కోల్పోతున్నానని, మీరు విదేశాలకు వెళ్లటం వల్ల మాతోనూ తృప్తిగా గడపలేక, ఒక్కోసారి ఎంత సంభాళించుకున్నా ఏదో వెలితిగా అనిపిస్తోంది.
      చిరంజీవులిద్దరికీ చదువుతోపాటు చిన్నప్పటినుంచే సంస్కారం, జీవితపు విలువలను నేర్పు. వాళ్లకి నా ముద్దులు. మీ ఇద్దరికీ నా ఆశీస్సులు. నువ్వు ఫోన్లో మాట్లాడేకన్నా, వీలుచూసుకొని ఉత్తరం రాస్తే మీతో గడపాలని పించినప్పుడల్లా వాటిని చదువుకొని తృప్తిపడతాను

ఆశీస్సులతో అమ్మ, 
               రాణి

 

జ్ఞాప‌కాల మ‌దిలో...

వెనక్కి ...

మీ అభిప్రాయం