నీకోసం ఎదురుచూస్తా

  • 314 Views
  • 0Likes
  • Like
  • Article Share

    బోజ‌డ్ల శివ‌కుమారి

  • ఖమ్మం
  • 9490144028

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియమైన నాలోని నీకు,
అడవిలోకీ వెన్నెల వస్తుంది. ఆ వెన్నెల్లో మంచి గంధం వాసన వస్తుంది... వసంతంలా వచ్చిన నీ లేఖను విప్పితే ఇదే భావం నన్ను కదిపేసింది.
ఆశ్చర్యం... నువ్వు చేతి రుమాలుపై రాసి పంపిన ఉత్తరం... మబ్బుతునక ఏదో తాకినట్లు... తెల్లపావురం వచ్చి నా చేతుల్లో వాలినట్లు ఉంది. ఎవరైనా ఎపుడైనా ఇలా రాశారా? ఎంత అందమైన జ్ఞాపికో తెలుసా, జీవితం అంతా దాచుకుంటాను.
వంశీ, నీ ఉత్తరం మోసుకొచ్చిన కబుర్లు ఈ మండు వేసవిలో మా మారుమూల పల్లెలో నాకైతే చిరుజల్లులో తడిసినట్లు, గుప్పెడు సన్నజాజులు గుండెమీద చల్లినట్లే ఉంది. నువ్వు వస్తున్నాననే కబురే అందులో లేకపోతే ఊపిరి ఆగిపోయేదేమో!
చిరుజల్లు అంటే నీకేమైనా గుర్తుకు వచ్చిందా? ఉస్మానియాలో మన మిత్ర బృందమంతా సన్నటి వాన తుంపరలో తడుస్తూ మట్టి వాసన పీలుస్తూ నడుస్తుంటే, ఆ జల్లుకు మట్టివాసనను పోల్చమన్నావు కదూ!
నేనేమో ‘ఈ భూమిపై ఆకాశం పోసే తలంబ్రాలే వాన చినుకులు. ఆ తల్లి మేని పరిమళాలే ఈ మట్టివాసనలు’ అన్నాను. నువ్వేమో ‘పుడమితల్లి షవర్‌బాత్‌ చేస్తుందోయ్‌... ఆమె వాడే హెర్బల్‌ సోప్‌ వాసనే అది’ అన్నావ్‌. నాకంటే నువ్వే బాగా చెప్పావ్‌ కదూ. ఏ విషయమైనా నువ్వే బాగా చెబుతావ్‌.
నిన్నటి వరకూ నువ్వు పంపిన ‘అనుక్షణికం’ నవల చదివాను. వడ్డెర చండీదాస్‌ ఎంత బాగా రాశాడు. ఎన్ని జీవితాలు మన కళ్లమందు కనిపిస్తాయ్‌. ‘స్వప్నరాగలీన’ ఎంత అందమైన ఊహ. ఎందుకు చనిపోయింది? ప్రకృతిలో కలిసిపోయిందా? నమ్మాలనిపించటం లేదు. పాపం మోహన్‌... శ్రీపతిది ఎంతగొప్ప పాత్ర. ఏమైనా ఓ మంచి పుస్తకాన్ని పరిచయం చేశావు.
నువ్వు వస్తావని ఈ రోజు మా ఊరి మొదలులో ఉన్న వాగు దగ్గరికి వచ్చి కూర్చున్నాను. వాగైతే నీ కాళ్లకు నీళ్లు ఇవ్వటానికే అన్నట్లు నిశ్శబ్దంగా నిలబడిపోయింది. నే వస్తూ వస్తూ పూలతో స్వాగతం చెప్పాలని మా తోటలో గులాబీలన్నీ కోసుకొచ్చాను.
ఓ రోజు నువ్వు మంచుతో గులాబీ పువ్వు చెక్కి నాకిచ్చావ్‌ గుర్తుందా. అది క్షణకాలమే ఉన్నా ఆ స్మృతి జీవితకాలం ఉంటుంది.
చలం గీతాంజలిలో చెప్పినట్లు ‘‘నా దీప కాంతులు ప్రతి నిమిషం నీ తలపుల్ని ముద్దు పెట్టుకుంటాయి. రోజులు గడుస్తాయి కాని నేను నీకోసం కాచుకుని ఉంటానంది నా ప్రేమ... రంగు రంగు రెక్కలతో ఎగిరే కీటకాల్లా నా కలలు నీ చుట్టూ పరిభ్రమిస్తాయి. రా నేస్తం రా... నీకై నేను నిరీక్షిస్తూనే ఉంటాను.
నీ ఆలోచనల్లో నేను మునిగిపోయాను. నా చేతుల్లో గులాబీలన్నీ నాకు తెలియకుండానే నీళ్లలోకి జారిపోయి, నాకంటే ముందే నీ పాదాలను చుట్టేయాలని, ఒయ్యారంగా ఊగుతూ నువ్వు వచ్చేదారి వైపు ఎలా పరుగెత్తుకుంటూ వెళ్లాయో. పాపం వాటికేం తెలుసు నువ్వు మాత్రం నీకై ఎదురుచూసే నా కళ్లనే ముందుగా ముద్దాడతావని.
మలి సంధ్యవేళ... చీకట్లు మా ఊరిపై పరుచుకుంటున్నాయి. నువ్వు రాక నా కళ్లు చెరువులవుతుంటే ఇంటికి ఎలా చేరానో...
‘నీకై వెదకి వేసారా నా వెర్రి బతుకు
ఎపుడేని తుదిరేయి కనుమూయునా...’ అన్న కృష్ణశాస్త్రి గీతం పదేపదే తలపునకు వస్తుంది.
వంశీ.. ప్రేమను మించింది సృష్టిలో ఉందా. తాగ గలగాలే గానీ... గాలిబ్‌ గీతంలా మధురంగా గుండెల్లోకి ఒదిగి పోతుంది.
ఎవరో అన్నట్లు ‘మా ఇంటి వాకిట నా కళ్లు ప్రమిదలై నీకోసం వెలుగుతూనే ఉంటాయి’’. నీకోసం జీవితం చివరికంటా ఎదురు చూస్తూనే ఉంటాయి.
ఎంతో రాయాలని ఉంది. మరెన్నో ఊసులు చెప్పాలని ఉంది. కానీ నువ్వు రాక దిగులు పడ్డ మనసు పలకలేక పోతోంది.
మరి ఉంటాను. నీకై ఎదురు చూస్తూ

నీ శివాని

 

 

నీకోసం ఎదురుచూస్తా

వెనక్కి ...

మీ అభిప్రాయం