నా జీవం.. నా సర్వం

  • 197 Views
  • 0Likes
  • Like
  • Article Share

    మట్టపర్తి రామకృష్ణ

  • ముమ్మిడివరం, తూర్పుగోదావరి
  • 9908803353
మట్టపర్తి రామకృష్ణ

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియమైన నాన్నకు
ఏంటి మా అబ్బాయి ఇంత ప్రేమగా పిలుస్తున్నాడు! అనుకుంటున్నావా నాన్నా! సాధారణంగా అమ్మాయి నాన్నకూచి అని, అబ్బాయి తల్లి చాటు బిడ్డ అంటారు. అది నిజమేనేమో.. నిజానికి తండ్రీ కొడుకుల మధ్య మాటలు అరకొరగానే ఉంటాయి. చెప్పాలంటే మనిద్దరి మధ్య ఇప్పటివరకూ జరిగిన సంభాషణ లెక్కగడితే కొన్ని గంటలే. అప్పుడప్పుడూ అమ్మతో అంటుండగా విన్నాను. ‘‘వాడు నీ కొడుకే... ఏమైనా నీకు చెప్పే చేస్తాడు. నీకు నచ్చనిది చెయ్యడు. సర్లే వాడికి నచ్చిందే చేయమను’’ అని.
      గుర్తుందో లేదో! చిన్నప్పుడు మీరు ఇంట్లో లేనప్పుడు బిగ్గరగా ఏడ్చేవాణ్ని. మీరు రాగానే గమ్మున అయిపోయేవాడిని. మీరంటే భయంతో కాదు నాన్నా!  ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించి అలా చేసేవాణ్ని. గొప్ప పని చేసినా, మంచి మార్కులు తెచ్చుకున్నా, ఊరంతా పొగుడుతున్నా, ఏమాత్రం మెచ్చుకోలుగా కూడా చూడకుండా పోతుంటే ఏంటో ఈ మనిషి అనుకునేవాణ్ని. కాస్త ఎదిగాక తెలిసింది మీ మనసేమిటో. అవును మరి! దూరమైతేనే కదా తెలిసేది నాన్న విలువ.
      మీతో ఎన్నో చెప్పాలని, తనివితీరా మాట్లాడాలని అనుకునేవాణ్ని. ఎదురుపడితే నోరు మెదపలేక పోయేవాణ్ని. అవును నేనెప్పుడు ఫోన్‌ చేసినా ‘‘ఎలా ఉన్నావురా! ఉండు మీ అమ్మకి ఇస్తున్నాను!’’ అంటూ.. ఇచ్చేస్తారు. అప్పుడు కూడా నాకు ఏం మాట్లాడాలో తెలియదు. 
      ‘‘నేనెలాగో మట్టి పిసుక్కుంటూనే బతికాను. కానీ నా కొడుకు అలా కాకూడదు. పెద్ద చదువులు చదవాలి. పేరున్న ఉద్యోగం చేయాలి. వాడికి సంతోషాన్ని ఇవ్వడం కోసం మనం పడుతున్న అగచాట్లు వాడికి చేరనివ్వకూడద’’ ని రాత్రివేళలో మీరు అమ్మతో అన్నమాటలు విని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను నాన్నా.
      నాకు ఒంట్లో బాగాలేకపోతే ఎండ, వాన అసలు ఏమీ లెక్కచెయ్యకుండా మొండిగా డాక్టరు కోసం పరుగెత్తేవారు. బాధతో మూలుగుతుంటే అప్రయత్నంగా వచ్చే మీ కంట తడిని అమ్మకు కూడా కనిపించకుండా దాచుకునేవారు. వాడికి ఏమీ కాదులే! అని ధైర్యం చెప్పేవారు.
      మీ మాటలే నాకు కొండంత ధైర్యాన్నిచ్చేవి. మంచం మీద పడుకుని ఉంటే వరండాలో నిద్రన్నదే మరచిపోయి ఆతృతగా తిరుగుతున్న మిమ్మల్ని తలుపు చాటు నుంచి చూసిన జాడలు ఈనాటికీ నాకు మసకమసకగా కనిపిస్తున్నాయి నాన్న.
      ఉద్యోగమొచ్చి.. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటుంటే..‘‘ వాడు ఎక్కడికి వెళ్లిపోతున్నాడనీ ఇంత ఏడుపు! రాత్రి బస్సు ఎక్కితే తెల్లారే సరికి నీ కళ్లు ముందు ఉంటాడు’’ అని అమ్మకు ధైర్యం చెప్పినా మీలో మీరే ఎంత కుమిలిపోయేవారో నాకు తెల్సు.
      వెళ్లొస్తాను! అని చెప్పి వెళ్లిపోయాను. జాగ్రత్త నాన్న! అంటూ... నా వంక తదేకంగా చూస్తున్న మీ కళ్లల్లో నీళ్లు నన్నింకా తడుపుతూనే ఉన్నాయి నాన్నా.
      నా మొదటి సంపాదన చూసుకున్నప్పుడు... చిన్నప్పుడు మీరు ఇచ్చిన రూపాయే స్మృతి పథంలో మెదిలింది. ఇప్పటికీ అంటుంటారు నీకు ఏమిచ్చానురా అని, మీ జీవితాన్నే నాకు ధారబోశారు నాన్నా. ఇంతకంటే ఏం కావాలి. నేను ఎప్పటికీ సన్నాఫ్‌ సత్యనారాయణే. 

ప్రేమతో మీ కుమారుడు..

నా జీవం.. నా సర్వం

వెనక్కి ...

మీ అభిప్రాయం