ఆగని ప్రయాణం...

  • 147 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పి.సుష్మ

  • మక్తల్, నారాయణపేట
  • 9959705519
పి.సుష్మ

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియమైన రాగ మహితకి
      గాజుల గలగలల మధ్య అందరూ కలిసి ఒకేసారి కిలకిలానవ్వడం ఎంత హాయో. ఎటుచూసినా తెల్ల పంచెలు, పట్టుచీరలే. ‘‘దుర్ముహూర్తం వస్తుంది అమ్మాయిని తీసుకురండి!’’ అంటూ.. పిలుపు. హరివిల్లుని గోరింటాకుగా చేసుకున్న ఆమె అరచేతుల్లో ఒదిగిన కొబ్బరి బోండానిది ఎంత అదృష్టమో, ఆ నల్లటి జలపాతాల మధ్య ఇరుక్కు పోయిన పువ్వులది ఏ జన్మ ఫలమో!
      ముక్కెర ముత్యం మెరుస్తూ.. సూర్యుడే సిందూరమై, నవ్వుకే వన్నె తెచ్చే ఆమె చిరునవ్వు మళ్లీ చూడాలనిపించేలా ఉంది. రెండు చేతుల్లో చెరొక కొన పసుపుతాడు, ఇద్దరు ఒక్కటయ్యే సందర్భం, ఆ ఒకరులో నేనుండకపోవడానికి.. కులాలు కారణాలు కావచ్చు. మనుషులు గీసుకున్న కులాల కంచెల్లో ప్రేమలెప్పుడూ సమాధులే కదా!
      నిన్ను మొదటిసారి చూసినప్పుడు నన్ను నేనే కోల్పోయా. మొత్తానికి నన్ను మార్చేసింది నువ్వే. మొదట్లో కొత్తగా అనిపించేవన్నీ ఇప్పుడు పాత బడ్డాయి, ఒక్క నువ్వు తప్ప. ఎందు కంత ఇష్టమో తెలీదు. ప్రతి జీవితం లోనూ కొన్ని ప్రశ్నలు సమాధానం లేకుండానే మిగిలిపోతాయి. ఇప్పుడు ఆ ప్రశ్న నేనే. నాకోసమే బతికే నేను నలుగురి కోసం బతకడం నేర్చుకు న్నాను. ముభావంగా ఉండే నేను మౌనానికీ మాటలు నేర్పేటంతగా ఎలా ఎదిగాను! మొత్తానికి మారిపోయాను.
      నిశ్చల నదీ తీరం లాంటి నాలో ఎగసిపడే అలల్లా నీ జ్ఞాపకాలు.. నీ నుంచి ఎంత దూరం పరిగెత్తినా మరీ చేరువవుతూనే ఉన్నాయి. ఇప్పుడు నాకు ఏకాంతం కావాలి. నన్ను నన్నుగా ఉండనివ్వకపోవడానికి కారణమేంటీ! అడగడానికి కూడా నువ్వు లేవు. ఒకప్పుడు నీ జ్ఞాపకాల కోసం ఏకాంతాన్ని వెతుక్కునే వాణ్ని. ప్రతి జ్ఞాపకంలో కొత్తగా జన్మించే వాణ్ని. ఈ జన్మకు ఇది చాలు అనుకునే ఆ జ్ఞాపకాలు ఈ జన్మ నాకెందుకు అనుకునేంతలా చేశాయి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయా! మన స్థితిగతులే వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్పుతాయని ప్రేమించడంలో నుంచి బతకడంలోకి మారిపోయా.
      నాకిప్పుడు అలల సవ్వడి అరుపుగా వినిపిస్తోంది. తట్టుకోలేక పోతున్నా. అక్కడి నుంచి వచ్చేస్తుంటే ఎక్కడి నుంచో ఏకాంత గాలి. వెళ్లి చెట్టుకింద కూర్చున్నా, ‘ఔరా! ఒంటరైన శిలది ఎంత వ్యధో, ఎంతకీ రాదన్న కడలి కోసం తీరాన ఎదురుచూపు’ అంటూ పరధ్యానం. ఎండిన ఆకు సవ్వడికి నాలో అలజడి. ‘మౌనంగా ప్రేమను మోసుకున్న ఆకు మనసు ఎంత బరువో, నేల రాలగానే చెట్టుకై ఎంత అరుపో’ అమాయకంగా ఆకు విసిరేసిన చూపులు నా వైపు, ‘నువ్వు నేను’ ఒకటే కదా! అని చెబుతున్నట్టు ఎందుకో ప్రతి దాంట్లో నేను కోల్పోయింది గుర్తొస్తుంటుంది నాకు.
      బతుకు భారమైన చోట జీవితం చిన్నబోతుంది కానీ మనసు బరువెక్కిన చోట ఆలోచనలు ఏ దారి వెతుక్కుం టాయో కన్నీళ్లకే తెలుసు. ఒంటరైన నా జీవితానికి నీ జ్ఞాపకాల తోడు ఈ జన్మకు చాలు. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుతూ..

ఆగని ప్రయాణం...

వెనక్కి ...

మీ అభిప్రాయం