గురుభ్యోనమః

  • 46 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఎం.ధనలక్ష్మి

  • పాలకొండ, శ్రీకాకుళం జిల్లా
  • 8179965538
ఎం.ధనలక్ష్మి

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

రాధాకృష్ణ మాస్టారుకి
స్కూల్లో ఎవరైనా గుడ్‌మార్నింగ్‌ అంటే చాలు కనీసం అర్ధగంట సేపు క్లాస్‌ ఇచ్చేవారు తెలుగు భాష గొప్పదనం గురించి. ఈ సంగతి నాకింకా గుర్తుంది సార్‌ అందుకే తెలుగులోనే పలకరించాను మిమ్మల్ని.
      మరి మీరెందుకు ఇంగ్లిష్‌ చెబుతున్నారు సార్‌? అని ఎవరైనా అడిగితే ‘తెలుగు’ మాట్లాడడానికీ, భావాల్ని పంచుకోవటానికి. కానీ ఇంగ్లీషు కేవలం మనం అభివృద్ధి చెందటానికే అనేవారు కదా! నాకదేం అర్థమయ్యేది కాదు. కేవలం మీరు చెప్పారు కనుక తెలుగు భాష గొప్పదే అనుకునేదాన్ని.
      మీకొక శుభవార్త కాదు కాదు గొప్ప వార్త చెప్పాలి. మొన్ననే ఫోన్‌ చేద్దామనుకున్నా, మళ్లీ ఎందుకో ఉత్తరం రాయాలనిపించింది.
      ఉత్తరం రాయటం నేర్పించిన గురువుకే ఉత్తరం రాస్తున్నానంటే అది నా అదృష్టమేమో? దయచేసి మీరు మాత్రం ఎప్పటిలాగానే ఎర్ర ఇంకుతో అక్షర దోషాలు సరిచేసే పని పెట్టుకోకండి.. అసలే చాలా ఆనందంతో రాస్తున్నా కదా! భాష మీద పట్టు ఇప్పుడిప్పుడే పెంచుకుంటున్నా. అయినా కొన్ని తప్పులు దొర్లడం సహజం.
      ఇంతకీ నేను చెప్పబోయే శుభవార్త ఏమై ఉంటుందో ఊహించారా? నాకు ఉద్యోగం వచ్చింది మాస్టారూ!
      అల్లరి చేసిన ప్రతిసారి నన్ను ఒక మాట అనేవారు గుర్తుందా? నువ్వు కచ్చితంగా టీచర్‌ అవుతావని. మీ వాక్కు బలం, ఆ ముహూర్త ఫలం వల్ల మీరు ఊహించినట్టే నేను టీచరైపోయాను మాస్టారూ.
      నాకీ సంగతి తెలియగానే ముందు మీకే చెప్పాలని, ఉద్యోగ నియామక పత్రం చూపించి ఆశ్చర్యపరుద్దామని అనుకునేలోపే కౌన్సెలింగ్, జాయినింగ్‌ అంటూ హడావుడిలో పడిపోయానేమో మీ సంగతే మరచిపోయాను.
      అమ్మో! ఎలా భరించేవారు సార్‌! మీరు మా అల్లరిని? నాకైతే ముందు పిల్లలని క్రమశిక్షణలో పెట్టాలా? చదువు చెప్పాలా? అన్నదే పెద్ద తలనొప్పిగా తయారైంది.
      అకారణంగానే కోపమొచ్చేస్తోంది. ఊరికే చిరాకొచ్చేస్తోంది. బడి వదలిపెట్టేవేళకి తలనొప్పి పెరిగిపోతోంది.
      మేమెంత అల్లరి చేసినా, అడిగినవాటినే పదే పదే అడిగి విసిగించినా కొంచెం కూడా కోప్పడేవారు కాదు, ఒక్కసారి కూడా కొట్టలేదు. ఆలోచిస్తుంటే ఆశ్చర్యమనిపిస్తుంది... మీరే నా రోల్‌మోడల్‌ సార్‌.
      అందుకే సెలవులివ్వగానే వచ్చేస్తా, నాకుద్యోగం వచ్చిందని మీ బాధ్యత తీరిపోయిందని అనుకుంటున్నారేమో? నన్ను ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దినట్టుగానే ఉత్తమ ఉపాధ్యాయిని అంతటిదాన్ని చెయ్యాలి.
      అంతవరకూ ప్రత్యుత్తరంలో మీ దీవెనల్ని, కుదురుగా కూర్చోకుండా బంతుల్లా ఎగిరే ఈ తుంటరి తూనీగల్ని భయంతో కాకుండా సున్నిత మందలింపు లతో కట్టి పడేసి మీ అమూల్య సందేశాన్ని అందించగలరని ఆశిస్తూ...మీ అల్లరిబుడుగు.

గురుభ్యోనమః

వెనక్కి ...

మీ అభిప్రాయం