నాన్నకు ప్రేమతో

  • 1956 Views
  • 3Likes
  • Like
  • Article Share

    భాగ్య

  • తొమ్మిదో తరగతి
  • వడ్లమూరు, తూర్పుగోదావరి జిల్లా

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియమైన నాన్నకు...
నీ అనురాగాల కూతురు భాగ్య ప్రేమతో రాస్తున్న లేఖ. ఇది నీకు అందుతుందని... అంది నువ్వొస్తావని ఆశతో రాయట్లేదు. ఎందుకంటే నువ్వు ఎప్పటికీ తిరిగి రావని తెలుసు. నువ్వు ఉంటే నన్ను చాలా బాగా చూసుకునేవాడివని అమ్మా, అమ్మమ్మ, నానమ్మ చెబుతూ ఉంటారు. నీకేదో మాయల మహమ్మారి మెదడువాపు వ్యాధి వచ్చి చనిపోయావట కదా. అప్పటికి అమ్మకి ఆరోనెలట. నేను నిజంగా దురదృష్టవంతురాల్ని కదా నాన్నా! నిన్ను కళ్లారా చూడలేకపోయాను. నీ ప్రేమకు నోచుకోలేకపోయాను.
నీ గురించి అంతా గొప్పగా చెబుతుంటే ఆ మాటలు విని నీ రూపాన్ని నా గుండెల్లో ప్రతిష్ఠించుకున్నాను.
వూహ తెలిసినప్పటి నుంచీ నిన్ను ఫొటోలో చూడటమే తప్ప నాకేం అదృష్టం మిగిల్చాడు నాన్నా ఆ దేవుడు! నీకు తెలుసా? ఎలా తెలుస్తుందిలే నేను ఆగస్టు 15కి బడిలో బొమ్మల పోటీలో, వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాను. అప్పుడు అందరూ అభినందిస్తున్నా నాకెందుకో తృప్తిగా లేదు, ఏదో లోటు. అమ్మ కళ్లల్లో కూడా ఆనందం కన్నా ఏదో బాధ..!!.
నువ్వు లేని బాధను, లేవనే వ్యథను ఎవరికి చెప్పుకోను? అంతులేని విషాదంతో... రకరకాల సమస్యలతో సతమతమవుతోంది అమ్మ. ఆ విషయం తెలిసి నా వేదనతో అమ్మని ఇంకా ఎలా అతలాకుతలం చెయ్యను నాన్నా?
అందుకే, నిత్యం నీ ఫొటోని చూస్తూ.. నా కన్నీళ్లు ఎవరికీ కనిపించకుండా నా కళ్లలోనే ఇంకిపోయేలా ఏడుస్తున్నాను. పెదవులు దాటని దుఃఖం ఘనీభవించి గుండెల్లోనే దాక్కున్నప్పుడు నా మనసు ఎంతలా కుంగిపోతుందో తెలుసా నాన్నా? ఇన్నాళ్లు... ఇన్నేళ్లు... కనిపించని నీ కోసం నా మనసు ఎంత అన్వేషించిందో... ఎంతలా ఆక్రోశించిందో... ఎవరికి తెలుసు, నాకూ ఆ దేవుడికి తప్ప. నువ్వు లేని ఒంటరి బతుకును భరిస్తూ అమ్మ నన్నెలా పోషిస్తోందో... సంసారాన్ని ఎలా ఈదుకొస్తోందో... తలచుకుంటేనే నా చిన్ని గుండె కన్నీరు గోదారై పారుతుంది.
      కాకుల్లా పొడుచుకు తినే ఈ జనారణ్యంలో అమ్మని మోడుబారిన కొమ్మగా విసిరేసి, మమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఎటెళ్లిపోయావు నాన్నా? నీకు మనసెలా ఒప్పింది? ఆ.. నువ్వేం చేస్తావులే, ఆ మాయదారి రోగం నిన్ను తీసుకెళ్లి పోయింది!
నీ కోసం ఇంతలా ఎందుకు తపిస్తున్నానో తెలుసా!
      పాఠశాలలో నాకు మంచి మార్కులు వచ్చాయి. ఉపాధ్యాయులు, నా తోటి విద్యార్థులు అందరూ మెచ్చుకుంటున్నారు. అభినందిస్తున్నారు. అయినా, గుండెల్లో దాచుకుని లాలించి... పాలించే నాన్న నాకు లేడనే నిజం గుర్తొచ్చి బాధించడం మొదలైంది. అప్పట్నుంచే ఒంటరితనమనే భయం మనసులో పాతుకుపోయింది. ఎవరైనా చిన్న పిల్లలు పడిపోతే వాళ్ల నాన్న పరుగున వచ్చి ఎత్తుకుని ముద్దాడినప్పుడు, నువ్వు బతికుంటే నన్నూ అలాగే ముద్దాడే వాడివేమోనని వూహించుకునేదాన్ని. ఆ నాన్నప్రేమ నాకు లేకుండా పోయిందనే గుండె బరువుతో మరుక్షణంలో కూలబడిపోయేదాన్ని.
      నువ్వు లేని లోటు ఎంతని చెప్పనూ? ఏమని చెప్పనూ? ఎవరికి చెప్పినా ఎగతాళి చేస్తారని, నాన్న లేనిదాన్నని దూరం చేస్తారేమోనని భయంతో బిడియంతో నాలో నేనే కుమిలిపోతున్నాను.
      నేను బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మని కళ్లల్లో పెట్టి చూసుకుంటాను నాన్నా! నువ్వు ఎక్కడున్నా నీ ఆశీస్సులు మాకందిస్తావనే ఆశతో జీవిస్తున్నా...

ఉంటాను, నాన్నా!
నిత్యం నీ కోసం తపించే నీ కూతురు

నాన్నకు ప్రేమతో

వెనక్కి ...

మీ అభిప్రాయం