ఆ మలిసంధ్య కాంతుల్లో...

  • 173 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తుపాకుల సాయిచరణ్‌

  • బోరిగాం, నిర్మల్‌ జిల్లా
  • 9949727073
తుపాకుల సాయిచరణ్‌

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

‘‘ఎలా ఉన్నావ్‌ తాతా!’’ ఇలా.. ఎన్నిసార్లు ఫోన్‌ చేసి అడిగినా ఏంటో! నాకు తృప్తిగా అనిపించదు. నాకు బదులిస్తూ నీ గొంతులో ఒలికే పదాల కంటే నీ మనసు నుంచి వచ్చిన అక్షరాలను చూస్తేనే నాకు సంతృప్తి.
       సెలవులకి ఇంటికొచ్చినప్పుడు నేను రాసిన ఉత్తరాలను మళ్లీ నాతోనే చదివిస్తూ, నువ్వు రాసినవి చదివి వినిపిస్తూ ఆనందించేవాడివి. ఓసారి నువ్వు రాసిన ఉత్తరం ఒకటి పోస్ట్‌ మాస్టారు పోగొట్టాడని తెలిసి యుద్ధమే చేశావు. వాటిల్లో నా భవిష్యత్తు పై దిగులు చెందుతూ రాసినవే ఎక్కువ. నీ ఉత్తరాలను చదువుతున్నప్పుడు నీ గంభీరమైన గొంతు స్పష్టంగా వినిపించేది. పోస్టుమాస్టరు సుందరం నా ఉత్తరాలు తీసుకొస్తూ మన కుటుంబ మిత్రుడైపోయాడని ఓ సారి నువ్వు రాసిన మాటలు చదివి ఆనందమేసింది. ‘‘ఉత్తర ప్రత్యుత్తరాల్లోని అనుభూతి అంతా ఇంతా కాదురా మనవడా!’’ అని, నువ్వన్న మాటలు అక్షరసత్యాలని నాకు తెలిసేందుకు ఎంతో కాలం పట్టలేదు.
     నా స్నేహితులు అప్పుడప్పుడూ.. ‘‘ఏంట్రా ఇంకా ఉత్తరాలు రాస్తున్నావ్‌! ఎంచక్కా వీడియోకాల్‌ మాట్లాడొచ్చుగా’’ అనేవారు. అందులో ఉన్న ప్రేమ మీకేం తెలుసు! అన్న నీ మాటలనే వారికి బదులిచ్చేవాణ్ని. ‘‘అంతలా తాతపై ప్రేమ ఒలకబోస్తావ్‌ ఇంతకీ నీకు మీ తాత ఎంత ఆస్తి ఇచ్చాడేంటి!’’ అని వెటకారపు ప్రశ్నలు అడిగినప్పుడు ఈ ఉత్తరాలకట్టనే ఆస్తిగా ఇచ్చారని గర్వంగా చెప్పుకుంటున్నా. కోపమైనా, సంతోషమైనా, ఏ ఉద్వేగాన్నైనా ఉత్తరంలా రాసి పంపిస్తే మనసులో కష్టం దూరమవుతుందని నువ్వు చెప్పిన మాటలను వారికీ అలవాటు చేస్తున్నా.
     నాయనమ్మతో నీ ముచ్చట్లను చూస్తే నీలో ఓ మంచి కవి ఉన్నాడేమో అనిపించేది. ప్రతి ఉత్తరంలో ‘‘చివరికి ఓ మాట’’ అంటూ రాసేవాడివి. ‘‘జీవితంలో ఏదీ శాశ్వతం కాదురా మనవడా..’’ అని ఎందుకో ఈ మాట బయట చాలాసార్లు విన్నా నీ నోటి వెంట వింటే ఏదో తెలియని ఉద్వేగం కలిగేది. 
     మొన్న దసరాకు ఇంటికెళ్లినప్పుడు నీ గదిలోకి వెళ్లి చూశాను. గోడలన్నీ నా ఉత్తరాలతో నింపేశావు. అద్భుతంగా అనిపించిందా క్షణం! మునుపెప్పుడూ ఆ గది అంతందంగా కనిపించలేదు. నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి నాకు ఆ గదిని బహుమతిగా ఇచ్చావు కదూ! అక్కడ పట్టీల మంచంపై నీ పక్కన కూర్చొని నేర్చుకున్న విషయాలెన్నో గుర్తొచ్చాయి. కానీ, నా చివరి ఉత్తరాన్ని చదవ కుండానే వెళ్లిపోయావ్‌! ఏ మనవడికీ ఇవ్వని అందమైన లేఖా నైపుణ్యాన్ని నాకు అందించావు. ఈ జన్మకిది చాలు!
     నీ నుంచి ఆరేళ్లుగా ఉత్తరాలు రావడం లేదు. లేని మీ తాతయ్యకి ఎన్ని ఉత్తరాలు రాస్తే ఏం లాభం! అన్న సుందరం మావయ్య మాటకి మౌనంగా నిట్టూర్చాను. చివరగా ఓ కోరిక తాతా! ఈ ఉత్తరాన్ని కూడా ఎప్పటిలాగే చదివి ఒక స్వప్నంగా జవాబు ఇస్తావు కదూ!

నీ మనవడు

ఆ మలిసంధ్య కాంతుల్లో...

వెనక్కి ...

మీ అభిప్రాయం