ఆనంద రసార్ణవం

  • 272 Views
  • 0Likes
  • Like
  • Article Share

    చక్కిలం విజయలక్ష్మి

  • కర్నూలు
  • 9866823450

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

నా ప్రేమైకమూర్తి, ప్రవీణ్‌
మీకు ఉత్తరం రాసి ఎన్నాళ్లయింది! బహుశా ఏళ్లు! (ఇప్పుడైనా మీరొంటరిగా వెళ్లాల్సిన తప్పనిసరి పని మీద వెళ్లారు కాబట్టి). కొన్ని సౌకర్యాలు అపురూపమైన సౌందర్యాలను కనుమరుగు చేస్తాయి. మొదట టెలిఫోన్లు, తర్వాత సెల్‌ఫోను అందుబాటులోకి రావడంతో లేఖలు- ముఖ్యంగా ప్రేమలేఖలు రాసే కళ కలగానే మిగిలిపోయింది. మనిద్దరిదీ ఒకే ఊరవడం, ముఖ్యంగా మనం ఎడంగా ఉండలేక నేను పుట్టింటికి వెళ్లకపోవడమో, లేదా మీరు పంపక పోవడమో... అదేదో మరి... ఇద్దరం అందమైన అందుబాటులో ఒదిగిపోయాం. అందుకే ఉత్తరాల అవసరం హుష్‌ కాకి అయిపోయింది.
      ఈ రోజు మీకెన్నో చెప్పాలని ఉంది. అందుకే ఉత్తరం రాయాలనిపించింది... సెల్‌ రాక్షసి నోరు మూయించి. నా మనసు ‘ఏమిటీ విశృంఖలత్వం’ అని నిలదీస్తే ‘నాకేం తెలీదు. అమాయకురాలిని. నా కలం నా మాట వినలేదు మరి’ అని చెప్పొచ్చని ధైర్యం. సంసారం, సంప్రదాయం, సదాచారం, సమయాభావం... దాంపత్యం, కుటుంబ జీవితానికి గౌరవాన్ని కలిగిస్తాయి. నిజమే. కానీ అప్పుడప్పుడూ మనసుకు చిలిపిదనం మొగ్గ తొడుగుతుంది. కాల నిమిత్తం లేకుండా పూలు పూస్తోంది. పాత, ‘ఆపాత’ జ్ఞాపకాల పరిమళాలు గుండె దాటి బయటికి వచ్చి చుట్టూ అలముకుంటాయి. ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మరి పులకల పూలు విరిసిన మనసు... పూభారంతో కళ్లల్లోంచి, నవ్వుల్లోంచి బయటికి వంగి, పొంగి సందడి చేస్తుంది. మీ దోసిట్లో రాల్చాలని దాని ప్రయత్నం కాబోలు!
      ఎవరో అన్నారు ‘నీదెంత అద్భుతమైన, అపురూపమైన ప్రేమ! కనీసం అది అతనికి అర్థం అవుతుందా?’ అని. మీరర్థం చేసుకోవాలన్నది కాదు నేను, నా ప్రేమ ఆశించేది. మిమ్మల్ని ప్రేమించాలని... అంతే! ప్రేమిస్తాను... అంతే! అందంగా, అద్భుతంగా, అపురూపంగా... అదీ నా ప్రేమ ఎలాంటిదో నాకు అర్థం కాకుండా. నాకే అర్థం కాకుండా... అంతే! అమాయకంగా, ఆడంబరం లేకుండా... అంతే! అందులో మాత్రమే ఆనందం ఉంది. కొలతలు కొలిచి ఇవ్వడానికి, ఇచ్చినదాని కొలతలు వివరించడానికి ప్రేమ వస్తువా? ఓపలేని మాధుర్యం!!!
      ఎన్నో వెచ్చని వెన్నెల రాత్రులు. అంతకంటే చల్లచల్లని పగళ్లు... మన అనురాగ ఆంగణం నిండా మకరందాన్ని ఇంధనంగా పోసిన వెన్నెల నెగళ్లు. మేనుకు సంబంధం లేని మనో మాధుర్యాలు. భావ సౌకుమార్యాలు. ఏం రాయను? మనసు మడతల్లో ఉంచిన సువాసన ఉండల్లా ఒక్కో జ్ఞాపకమూ కదిలిస్తే గుప్పుమంటోంది. మన దాంపత్య జీవితంలో ఇంత రాగరస పోషణ చేశామని ఎవరైనా ఊహించగలరా? అసలు సాధారణ సంసారికులు అడుగడుగునా, అణువణువునా ధార్మిక, మార్మిక మధురిమలను పండించుకునే అవకాశం ఉందని ఎందరికి అవగాహన ఉంది? 
      ధనానికీ, వయసుకూ, సొగసుకూ సంబంధం లేని కలయిక తీయని అనుబంధమవుతుంది. అసలు వైవాహిక బంధం అంటేనే జీవితకాల ఆనందానికి తరగని ఇంధనం. ఈ బంధం, బాంధవ్యానికి వయసు పెరగదు. వృద్ధాప్యమూ రాదు. 
      పక్కింటావిడ విసుగ్గా అంటుంది. ‘మీ ఆయనకు నైట్‌ డ్యూటీలు... ఇంట్లో ఉండరు.’ ఇలాంటివి కొంత బాధాకరమే. కానీ దంపతుల మధ్య ఆనంద రసార్ణవానికి నడిరేయి ఏ జామూ కానక్కర్లేదు. వారి అవిభక్త మనసు (మనసులు) ప్రేమానురాగాల కలబోతతో సరస స్వారస్య రసాల సరసిలా మారితే ఆ గుండె మడుగులో పట్టపగలే కలువలు పూస్తాయి. నట్టనడిరాత్రి కమలాలు విరబూస్తాయి. పది మందిలోనైనా మొగుడు గారు విసిరిన చిలిపిచూపు బాణంలోని కొంటె భావపు పదును ఆ ఇల్లాలు కనిపెడ్తే, ఆ పదును కోసిన తీపితీపి కోత వలపు సలుపు కలిగిస్తే... దానికి, ఆ అనుభూతి పరస్పర పంపకానికి ఏ ఏకాంతం అవసరం?  పిల్లల మధ్యా, పెద్దల మధ్యా వారికి సాధారణంగా కనిపించే భార్యామణి నవ్వులో రహస్యంగా దాగిన అధర మాధుర్యం అరచుక్క అలవోకగా జారిన వైనాన్ని పెనిమిటి గుర్తిస్తే... ఆనందం అర్ణవమేంటి! సునామీ అయిపోదూ? ప్రత్యేకంగా పడగ్గది ఉన్నా, ఓ పక్క పెద్దలూ, పిల్లలూ తిరుగుతున్నా వెనకనుంచి వచ్చి పెళ్లాం మడమల్ని ఆమె చుట్టుపక్కల పని ఉన్న నెపంతో తన పాదాల వేళ్లతో చిలిపిగా తొక్కే సరసాన్ని ఆస్వాదించేందుకు ఏ అరకులోయో వెళ్లక్కర్లేదు. అభిరుచి ఉంటే చాలు... చాల్చాలు ఈ పూటకీ నవరసాల నవకాయ వంటకం చాలు. మరోసారి కర్పూర విడేలు కట్టి, కొస వేళ్లకు చుట్టి, తాంబూలపు చిలకలుగా అందిస్తాను ఏదో రసంగా, సరసంగా.
      అందరు భార్యల్లా ‘ఎలా ఉన్నారో ఏమిటో! వేళకు భోజనం చేస్తున్నారా’ అని రాయకుండా ఏంటీ శృంగార సౌదామిని! అని ఆశ్చర్యపోతున్నారా? నోరు పెద్దగా తెరవకండి. అసలే ఆ ఊళ్లో దోమలెక్కువట. ‘కిసుక్కు’న... నా నవ్వు వినిపించిందా?

 మీ 
ప్రియ... 
హర్షిణి

ఆనంద రసార్ణవం

వెనక్కి ...

మీ అభిప్రాయం