ప్రియసఖికి ప్రేమలేఖ

  • 244 Views
  • 0Likes
  • Like
  • Article Share

    విడదల సాంబశివరావు

  • చిలకలూరిపేట
  • 9866400059

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

సడిసేయకోగాలి
సడిసేయబోకే
వడలి ఒడిలో రాజు
పవ్వళించేనే
సడిసేయకే....

      నాకు చాలా ఇష్టమైన ఈ పాటను నువ్వు పాడుతూ ఉంటే నా మనసు ఆనంద తరంగాలలో ఓలలాడేది. కలిసిన ప్రతిసారీ నిన్ను అడిగిమరీ పాడించుకునేవాణ్ని. నువ్వు దూరమై మూడు దశాబ్దాలు గడిచినా నా హృదయం మాత్రం ప్రతిక్షణం నిన్ను పలవరిస్తూనే ఉంది. మనం గడిపిన మధుర క్షణాలు, నువ్వు పంచిన దివ్యమైన అనుభూతులు నా అంతరంగంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ అనుభూతుల అమృతాన్ని సేవిస్తూ నా గుండె లోతుల్లో స్థిరంగా ఉన్నావని గాఢంగా నమ్ముతూ ఎప్పటికైనా నీ భౌతిక రూపాన్ని నా కళ్లతో చూడగలననే ఆత్మవిశ్వాసంతో బతుకుతున్నాను.
      అప్పటికీ, ఇప్పటికీ ఎంత తేడా? కాలగమనంలో ఎన్ని విప్లవాత్మక మార్పులు? మానవ స్వభావాల్లో ఎన్నెన్ని మార్పులు?! నాకు అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది ‘‘మనిద్దరం ఇప్పుడు పుడితే ఎంత బాగుండేదో’’ అని. మనం విడిపోయిన ముప్ఫైఏళ్లకే యువతరం భావాల్లో పెనుమార్పులు సంభవించాయి. కులం అడ్డుగోడలను బద్దలు కొట్టుకొని తాము కోరుకున్న స్వేచ్ఛా ప్రపంచంలో భార్యాభర్తలుగా విలువైన జీవన గమ్యంలో స్థిరపడుతున్నారు. మనమిప్పుడు పుడితే మరో ఇరవయ్యేళ్ల తరువాత ఆధునిక మానవుడు రూపొందించే భావాలను మనం ఆచరణలో పెట్టి ఎవరికీ భయపడకుండా ఒక్కటిగా కలిసి హాయిగా బతికేవాళ్లం.
      ఈ ఊహ నా మెదడు పొరలను చీల్చుకొని బైటకు వచ్చిన ప్రతిసారీ నా గుండె బరువెక్కి అశాంతితో అలమటించేవాణ్ని. నీ ఎడబాటుతో చిక్కి శల్యమైన నా మనసుకు ఓదార్పు కావాలనిపించిన సందర్భాలు ఎన్నెన్నో!! నా మనసుకు సాంత్వన చేకూర్చడానికి ఓ సరికొత్త ప్రయోగం చేయాలని సంకల్పించాను. ఆ సంకల్పానికి ఆచరణ రూపమే ‘‘సరికొత్త ప్రేమలేఖ’’. నీకు జ్ఞాపకం ఉందా! ఓ రోజు మా చెల్లి నిన్ను పరిచయం చేసి నీ పేరు చెప్పేలోపే ‘మెఱుపుతీగ’ అని నేనన్నాను. నీ కళ్లు ఆశ్చర్యంతో అలవోకగా నా వైపు చూశాయి పరిచయంలేని వ్యక్తి ఇంత చొరవ తీసుకున్నాడేంటా? అని. అంతటితో ఆగలేదు నా అంతరంగంలోని భావుకుడు ‘కోటి పున్నమి చంద్రుల కాంతి నీ నెచ్చెలి మోము’లో కన్పిస్తోందనీ మరో ప్రశంస నా గుండె లోతుల్లోంచి వచ్చింది. 
      ఈ సారి నువ్వేకాదు నా చెల్లి కూడా ఆశ్చర్యపోయింది. మనం కలిసిన ఆ క్షణం మహత్తరమైంది కాబోలు. నాకే తెలియకుండా నా హృదయాంతరాళం నుంచి అద్భుతమైన భావోద్వేగం ఉప్పెనలా పొంగి పొర్లింది.
      సృష్టిలోని అందాన్నంతా ఒక్క మూసలో పోసి కరిగించి ఈ బంగారు బొమ్మను తయారు చేశాడు విశ్వశిల్పి. గతంలో ఎప్పుడూ తొంగిచూడని భావావేశం నాలో పెల్లుబికింది. అప్పటి నుంచి ప్రారంభమైన మన స్నేహం ఓ మహత్తర ప్రేమ కావ్యంలా సాగింది.
      ఓ సాయంత్రం పార్కులో మనం ముచ్చట్లు చెప్పుకుంటున్నప్పుడు వికలాంగుడైన వృద్ధుడు, అంధుడైన బాలుడు యాచిస్తూ మనముందు నిలుచున్నారు. వారి దయనీయ స్థితిని చూసి నీకళ్లు చెమర్చాయి. అప్పుడు నీలో అణువణువునా దాగున్న దయాగుణం నన్నెంతగానో ఆకట్టుకుంది. మనం శాశ్వతంగా విడిపోవడానికి ఒక్కరోజు ముందు నిన్నో కోరిక కోరాను. నీ జ్ఞాపకంగా ఓ ప్రేమమందిరాన్ని నిర్మించాలనుంది అనుమతిస్తావు గదూ? అని చిరునవ్వుతో నా ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించావే. అంతేకాదు అనాథల కోసం ఓ నీడను ఏర్పాటు చేసి వారికి ఆశ్రయం కల్పించి, విలువైన జీవితాన్ని వాళ్లకు ప్రసాదించమని నన్ను అభ్యర్థించావు. నీ కోరిక మేరకు నేను సేవారంగంలో ముందుకు సాగుతూ ఉన్నాను.
      మన పరిచయం, స్నేహం, ప్రేమ అన్నింటికీ ఓ రూపాన్ని సంతరింపజేసి అద్భుతమైన కావ్య రచన చేశాను. అది నీకు నేను రాసిన ప్రేమలేఖ. నూరు పుటల సుదీర్ఘ ప్రేమలేఖ. నీ ఉనికి ప్రశ్నార్థకమైన ప్రస్తుత స్థితిలో ఈ లేఖను నీకు ఎలా అందజేయగలను? ఈ వాస్తవం నాకు తెలుసు. కానీ, నా తృప్తి కోసం నేను రాసుకున్న సరికొత్త ప్రేమలేఖ ఇది.
      ప్రియసఖీ! ఈ జీవితం చరమాంకంలోనైనా నన్ను కలుసుకుంటావనే ఆశ నా హృదయ కుహరంలో మిణుకు మిణుకుమంటోంది. అప్పటి వరకూ నా ఈ ప్రేమలేఖ నీకోసం ఎదురుచూస్తూనే ఉంటుంది.
      నీ హృదయ స్పందన కోసం కోటిజతల కన్నులతో ఎదురుచూస్తూ...

ప్రియసఖికి ప్రేమలేఖ

వెనక్కి ...

మీ అభిప్రాయం