ప్రియమైన ప్రియకు...
ఇంకా ఎన్నాళ్లు ఈ ఎదురు చూపులు? పైన లోహ విహంగం ఎగురుతున్నప్పుడల్లా నా మనసు కూడా ఒక విహంగమై ఎగిరిపోతే ఎంత బావుణ్ను అని.. లక్షా ఒకటోసారి అనుకున్నా.
మన ఊర్లో ఎక్కడికెళ్లినా ఒంటరిగా రావొద్దని విసుక్కుంటున్నాయి అన్నీ. మనం కలిసి తిరిగిన చోట్లన్నీ బేలగా చూస్తున్నాయి నువ్వు లేవని.
కలిసి నెమరేసుకున్న ఊసులు ఉసూరుమంటున్నాయి..
జ్ఞాపకాల దొంతరలు కైలాసగిరి కొండంత ఎత్తు ఎదిగిపోతున్నాయి..
మనం మొదటిసారి కలుసుకున్న హోటల్లో బల్లలూ, కుర్చీలూ నీ ఊసునే మరీ మరీ అడిగాయి.
ఎందుకో తెలుసా.. ఎవరూ చూడట్లేదని నీ పాదాన్ని నా పాదం చుంబించడం అవి చూశాయి కాబట్టి.
మనం రోజూ కలుసుకునే ఆర్కే బీచ్లో ఇసుకరేణువులు నన్ను చూసినప్పుడల్లా అడుగుతుంటాయి..
ప్రియమ్మ.. ఇంకా రాలేదా... మాతో గుజ్జన గూళ్లు ఆడుకోవడానికి.. తను తప్ప మాకెవరున్నారూ అని.
సముద్రం అలా వెనక్కీ ముందుకూ వెళ్లి వస్తోంది.. నాలోని రుధిరంలా. అది ముందుకు వచ్చినప్పుడల్లా నన్ను ప్రశ్నిస్తోంది..
ప్రియమ్మ ఏది..? అని.
ఆ నెలరాజు ఇప్పుడు ఒకింత అలిగి పక్షం రోజులే కనిపిస్తున్నాడు వెలుగులతో..
ప్రియమ్మ ఏది.. నా వెలుగుల్లో.. తన కళ్లల్లో వెలుగులు చూడాలి అని అడుగుతున్నాడు
కైలాసగిరిలో ప్రతి మొక్క, చెట్టు నన్ను ప్రశ్నిస్తూ.. నువ్వొక్కడివే ఎందుకు వచ్చావు.. తనతో వస్తే.. మా పూలన్నీ తనకిచ్చేద్దుము కదా అని నిలదీస్తున్నాయి.
కొండ మీద సాగరదుర్గ గుడి పూజారి... మొండికేశాడు, నీవులేక నాకొక్కడికే శఠగోపం పెట్టి ఆశీర్వదించనని
ఆ సాగరతీరాన కబుర్ల కాలక్షేపం చేస్తూ... ఎన్నెన్నో సాయంత్రాలనూ, జాబిలమ్మ షోడశ కళలను, నిశి రాత్రులను లెక్కపెట్టాం కదా! అన్నీ తలంపునకు వస్తున్నాయి.
ఇక్కడ ప్రతి అలా ఒక కల లాగా నన్ను వెంటాడుతోంది. పదే పదే నిన్ను గుర్తుచేస్తోంది. గవ్వలను ఏరుకుంటూ... మన కాలి గుర్తులను మనమే చూసుకుంటూ నడిచిన సాగర యాత్రలన్నీ నన్ను ముసురుకుంటున్నాయి. ఈ ఇసుకలో పదే పదే రాసుకున్న మన బాసలు కోయిల పాటలా నాలో నాకే వినిపించి బరువనిపిస్తున్నాయి. నువ్వు ఎప్పుడొస్తావు? నాలో సవ్వడై ఎప్పుడు నినదిస్తావు? ఎదురుచూస్తుంటాను..
- ఎ.వి.రాధాకృష్ణ మూర్తి, విశాఖపట్నం