అమృతమూర్తికి ఆత్మీయ లేఖ

  • 825 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా॥ గోగినేని వెంకటరత్నం

  • గుడివాడ,
  • 9885553053

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

తల్లీ రంగరాయా!
పదహారేళ్ల నూనూగు మీసాల వయసులో, పుట్టి పెరిగిన వూరిని వదిలి గోదావరి పాయల వెంట బొగ్గు ఇంజన్‌తో పరుగెత్తే సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి మొదటిసారి నీ ఒడి (కాకినాడ ‘రంగరాయ వైద్యకళాశాల’)లో అడుగుపెట్టిన రోజు నాకింకా గుర్తే! ఆ రోజు నుంచి నువ్వు నాకు మరో తల్లివి అయ్యావు.
పాల చెక్కిళ్లు, బెదిరే కళ్లు, వణికే కాళ్లు, కౌమారం నుంచి యవ్వనంలోకి తుళ్లుతున్న వళ్లు! ఆప్యాయంగా, ఆదరంగా నువ్వు అందించిన చేతిని ఆధారం చేసుకుని... కొత్త ప్రాంగణం, కొత్త స్నేహితులు, కొత్త చదువులు, ర్యాగింగుల భయాలు, రకరకాల ఆకర్షణలను కలబోసుకుని కొత్త జీవితాన్ని సాకారం చేసుకున్న విధానం మర్చిపోలేనిది. వైద్య సేద్యానికి అవి ఏరువాకలు!
తల్లీ రంగరాయా! కుల, ప్రాంత, మతరహితంగా నన్నో బిడ్డగా అక్కున చేర్చుకున్న తీరు, నీ వ్యక్తిత్వం, క్రమశిక్షణ, అనురాగం నన్ను ప్రయోజకుడిగా తీర్చిదిద్దాయి! దయావర్షాన్ని కురిపించే నీ చల్లని చూపుల పర్యవేక్షణలో ఎందరో గురువర్యులు నాకు విద్య నేర్పిన క్షణాలు ఇప్పటికీ నా కళ్లముందు కదలాడుతున్నాయి.
చదువులో ముందుంటే పతకాలిచ్చి ప్రోత్సహించావు. వెనకబడితే నేనున్నానంటూ ముందుండి దారి చూపావు. వయసు వ్యామోహాల్లో చిక్కుకోకుండా క్రమశిక్షణ నేర్పావు! పక్కతోవ పట్టకుండా ప్రతీ క్షణం కాపాడావు. విజ్ఞానాన్ని, వైద్యవిద్యా మెళకువలను, చికిత్సా విధానాలను మాకు బోధించిన విధానం అద్భుతం!
మాతా! రంగరాయా! నీ ఒడిలో చదువులనే కాదు నడవడిక, నడతలనూ నేర్పావు! కష్టాలు, కన్నీళ్లు, అసూయా ద్వేషాలు, అన్యాయాలు, తిరస్కరణలు, తిరోగమనాలను ఎదుర్కొనే వ్యక్తిత్వం అలవాటు చేశావు. మా వికాసం, విజ్ఞానం, వ్యక్తిత్వ పరిణితి నీ కనుసన్నల్లోనే జరిగింది. పల్లెటూరి మట్టి ముద్దలాంటి అమాయక బాలుణ్ని సమాజానికి ఉపయోగపడే వైద్యుడిగా మలిచావు.
నీ బిడ్డల్లో ఎంతోమంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖామంత్రులు, వైద్య విశ్వవిద్యాలయ ఉప కులపతులు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు... నా అన్నదమ్ములు ఏ స్థాయిలో ఉన్నారో తలచుకుంటే ఎంతో గర్వంగా ఉంటుంది! ఇదంతా నీ దీవెనల చలువే తల్లీ! అమ్మా! రంగరాయా! తల్లిదండ్రులను మించిన ప్రేమను పంచిన నిన్ను, జీవితకాలం మరవలేని జ్ఞాపకాలను ఇచ్చిన నిన్ను, శిలలాంటి మమ్మల్ని శిల్పాలుగా మలచిన నిన్ను వదిలి వెళ్లే రోజున చెమర్చని కన్నే లేదు! కన్నీటితో తడవని చెక్కిలి లేదు!!
నిన్ను వదిలి దేశవిదేశాలు తిరిగినా, తల్లీ నీ ఒడిలో గడిపిన ఆ మధుర క్షణాలను ఎలా మర్చిపోగలను!
రంగరాయ జననీ! ఈనాటికీ నీ పేరు వినగానే కృతజ్ఞతాభావం ఉప్పొంగుతుంది. నీపైన మమతానురాగాలతో హృదయం ఆర్ద్రమవుతుంది. నా జీవితగమ్యానికి, ఈ జీవన రసగంగా ప్రవాహానికి కర్తవైన మాతా! నీకు, నా గురువులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను.. ప్రణమిల్లి పాదాభివందనం చేసి ప్రార్థించడం తప్ప!
నడివయసు దాటి వృద్ధాప్యపు తొలిమెట్టుపై అడుగిడుతుంటే తల్లీ! నా గతస్మృతులన్నీ ‘రంగరాయ’లోనే తిరుగాడుతుంటే ఇప్పటికైనా ఈ కృతజ్ఞతాపూర్వక ప్రేమలేఖ నీకందజేసి నా హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాను తల్లీ!
సంవత్సరాలు క్షణాలుగా కరిగిన ఆ రోజులు, ఆటపాటలు, చిలిపితనాలు, అల్లర్లు, వూగిసలాటలు, ఉత్సాహాలు, ఆవేశాలు, ఆక్రోశాలు, ఆందోళనలు, హింసతో సమ్మిళితమైన ఒక సగటు విద్యార్థి, నిష్ణాతుడైన ఓ వైద్యునిగా మారిన పరిణామక్రమం నా హృదయపు యవనికపై మరపురాని ముద్రగా మిగిలింది! ఆ గురువరేణ్యుల, ఆ మహనీయుల బోధనలు ఇంకా నా చెవుల్లో గింగురుమంటున్నాయి! కాలమా! వయసు పొరల్ని కప్పుతున్నావా! నా మనసుకు చెప్పకుండా నా తనువును దోచుకోవాలనుకుంటున్నావా! అయినా నా దేవాలయం ‘రంగరాయ వైద్యకళాశాల’, నా గురుదేవులు... నేను చేసే ప్రతి వైద్య ప్రక్రియలోనూ ప్రతిఫలిస్తూనే ఉంటారు!
తల్లీ! నువ్వు ప్రసాదించిన ఈ నిపుణత, సేవాభావం సమాజాభివృద్ధికి, ఆరోగ్యకరసమాజ సాధనకు చివరి వూపిరి ఉన్నంత వరకు కృషి చేస్తా..!!
 

 

అమృతమూర్తికి ఆత్మీయ లేఖ

వెనక్కి ...

మీ అభిప్రాయం