రెక్కలొచ్చిన వేళ

  • 153 Views
  • 0Likes
  • Like
  • Article Share

    దోరవేటి, (వి.చెన్నయ్య)

  • హైదరాబాదు
  • 9866251679
దోరవేటి, (వి.చెన్నయ్య)

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

అమ్మలూ!
‘నన్ను
క్షమించు నాన్నా!’ 
      ఇంట్లో జరిగిన సంఘటన వల్ల నీ మనసు చాలా గాయపడిందని నాకు తెల్సు! అందుకే నా మనోభావాలు నీతో పంచుకుందామని నాకలవాటైన పద్ధతిలో ఇలా రాస్తున్నాను. 
      నీ ప్రేమ విషయంలో అమ్మ అంత కటువుగా వ్యవహరించకుండా ఉండాల్సింది. ఇప్పుడు నువ్వెంత దుఃఖంలో ఉన్నావో నాకు తెలియంది కాదు. నా కూతురు ఇలాంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తుందని నా నమ్మకం. అందుకే నువ్వు బెంగళూరుకి (నీ ఉద్యోగ స్థలానికి) వెళ్తానంటే నవ్వుతూ అంగీకరించాను. ‘ధైర్యమే జీవనం- బలహీనతే మరణం’ అన్నారు స్వామి వివేకానంద. ఏనాడూ ధైర్యం కోల్పోకు బేటా!
      పూర్వం స్వయంవరాల్లో ఆడపిల్ల తనకు నచ్చిన వరుణ్ని ఎంపిక చేసుకునే అవకాశముండేది. మూడుతరాల కిందటి వరకు కన్యాశుల్కం అధికారం చెలాయించింది. నెలల పసిగుడ్లను తల్లిదండ్రులు అమ్ముకునేవాళ్లంటే ఎంత దారుణం. ఆ తర్వాత వరకట్నం వికృతాకారమెత్తి అబలల జీవితాలని ఛిన్నాభిన్నం చేసేసింది.
      మరిప్పుడు ప్రేమవ్యూహంలో చిక్కి కత్తిపోట్లకు, యాసిడ్‌ దాడులకు, బ్లాక్‌మెయిల్స్‌కు, ఫేస్‌బుక్‌లకూ.. ఇలా పరిపరివిధాలా బలి అవుతున్న అమ్మాయిలెందరో. 
       అందుకు వాళ్ల శారీరక బలహీనతతో పాటు మానసిక మార్దవం కూడా కారణం కావచ్చు. నీ విషయంలో మీ అమ్మను తప్పుబట్టలేం. ఈ కాలంలో కూడా పాత ఆలోచనలతో నెట్టుకొస్తున్న సగటు భారతీయ స్త్రీ కదా! తనకు తాను విధించుకున్న చట్రం అలాంటిది. సంప్రదాయాన్ని విచక్షణతో ఆచరించలేక పోవడం సామాజిక దౌర్భాగ్యం! కులమతాల అడ్డుగోడల్ని నిర్మించుకుని, వాటిని ఛేదించలేక ‘సాలీడు’లా తన్లాడుకునే మీ అమ్మలాంటి వాళ్లు సమాజంలో అనేకమంది ఉన్నారు. వాళ్ల అనుభవాలు, ఆలోచనలు, భయాలు ఎప్పుడూ శాంతంగా ఉండనివ్వవు. నీ విషయంలో తను అట్లాగే ఆలోచించింది. కులాంతరం, వర్ణం ఇలా అన్ని విషయాల్లోనూ వ్యతిరేకించింది. ‘తల్లిదండ్రుల అదుపాజ్ఞల్లో మసలలేక, క్రమశిక్షణ అలవడని వాళ్లే ప్రేమ, దోమ అంటూ జీవితాలను నాశనం చేసుకుంటారని ఆమె విశ్వాసం. అందుకే నీవొకర్ని ప్రేమించావన్న మాటనే జీర్ణించుకోలేకపోతోంది.
       తన పెంపకంలోనే లోపమున్నదన్న భావం ఆమెను తీవ్ర మనస్తాపానికి గురిచేస్తోంది. ఆ మానసిక క్షోభనుంచి తను ఇప్పటికీ బయటపడలేదు. తనకసలే రక్తపోటు. నేనూ తనను వ్యతిరేకిస్తే- ఆమె పరిస్థితి మరింత దిగజారగలదని మౌనం వహించానే తప్ప నీ ప్రేమ పట్ల, నిర్ణయం పట్ల నాకు నమ్మకం లేక కాదు. ప్రేమ ఎప్పుడూ గొప్పదే! కానీ, దాన్ని అర్థం చేసుకుంటున్న తీరు, వాడుకునే పద్ధతి వల్లనే అది పల్చనైపోతోంది.
      నీ ప్రేమ నీవైపు నుంచి, అతని వైపు నుంచి ఎంత స్వచ్ఛంగా ఉందో ఆలోచించు! యువతీ యువకులు ఒకరికోసం మరొకరు జీవించడానికి నిర్ణయించుకుంటే, వాళ్ల గమనంలో ఎదురయ్యే ఆటంకాలను అవలీలగా అధిగమించి విజయం సాధిస్తారు! నేను మీ అమ్మకు నెమ్మదిగా చెబుతాను. నువ్వు అన్ని విధాలుగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో తల్లీ! నీ ప్రేమను కాపాడటం కోసం నేను ఎల్లవేళలా నీకు అండగా ఉంటాను! పాతిక సంవత్సరాల చిట్టితల్లికి ఇంతకంటే చెప్పవలసింది ఉంటుందని అనుకోను.  

ప్రేమతో నాన్న ...

రెక్కలొచ్చిన వేళ

వెనక్కి ...

మీ అభిప్రాయం