అమ్మ ప్రేమకి ఆవల..

  • 185 Views
  • 0Likes
  • Like
  • Article Share

    బాలాంత్రపు వి.ఎల్‌.ఎన్‌.మూర్తి

  • కాకినాడ
  • 9849507039
బాలాంత్రపు వి.ఎల్‌.ఎన్‌.మూర్తి

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

చిరంజీవి ఉత్తమ్‌కి..
ఎలా ఉన్నావు కన్నా...
నిన్న మీ నాన్న కల్లోకొచ్చార్రా అబ్బీ... అసలు నిద్రెప్పుడు పట్టి చచ్చింది గనక. నాకు బాగానే జరిగిందని తెగ ఇదయిపోయారనుకో. అక్కలిద్దరూ పుట్టాక ఆయన చెప్పినా కూడా వినకుండా మగ నలుసు కోసం నేనే పట్టుపట్టాను.
      ఎన్ని పూజలూ, నోములూ, ఉపవాసాలూ! పుత్రకామేష్టి ఒక్కటే తక్కువ. అప్పుడు నువ్వు కడుపులో పడ్డావు. అది మొదలు నువ్వు పుట్టేదాకా ఒకటే ఆందోళన రా ఆందోళన జనకా! నీ కోసం కుంగి, క్రుశించి, నీరసించి, తపించి నిన్ను చూశాక తరించి పోయామనుకొన్నాము. భలేగా రుణం తీర్చుకొంటున్నావు నాన్నా! వంశోద్ధారకుడివని పిచ్చి గారం.. ఏనాడూ చెప్పిన మాట వినలేదు. నావీ, నాన్న ఒంటి మీదవీ అన్నీ సరకులూ... సైకిలని, బట్టలనీ, బైకులనీ, ఫీజులనీ ఇలా ఒకటేమిటి అవన్నీ నీ అనంత కోర్కెల రూపాల్లోకి మారిపోయాయి... అయినా సంతోషంగా భరించాం. ఎందుకంటే కోరుకొన్న కొడుకువి కదా. మాటలు లేటుగా వస్తుంటే మీ నాన్న వెర్రినాగన్న నోట మాటరాక ఎంత గాభరా పడిపోయేవారో. నాన్నతో మాట్లాడటమే మానేశావు కదరా.. మౌనంగా ఎన్ని రాత్రులు కుమిలి కుమిలి ఏడ్చారో.
       అక్కలిద్దరికీ పాపం నీ పుణ్యమాని అన్నీ సగం సగమే.. చిన్నక్కయితే మరీ అన్యాయం! దానికన్నీ సెకండ్‌ హ్యాండే. కానీ నిన్ను చూసి ఎంత మురిసిపోయేవారో. ఏనాడైనా ఒక్కపూట పిలిచి ఒక్క రవిక గుడ్డయినా పెట్టేవా! నువ్వు మాత్రం భగినీ హస్తభోజనం వంకతో వాళ్లింటికి రిక్త హస్తాలతోనే వెళ్లడం, తిరుగు ప్రయాణంలో మాత్రం ఏమాత్రం మొహమాటం లేకుండా వాళ్లిచ్చిన ఊరగాయలూ, వడియాలూ మోసుకుపోవడం, సిగ్గులేని జన్మరా నీది. మీ నాన్నకు ముందే తెలుసు. అందుకనే ఆడపిల్లలకు లోటు లేని సంబంధాలు చెయ్యాలనేవారు. అలాగే చేశారు. ఆఖరికి ఉన్న ఇల్లు కూడా అమ్మించి నీకు ప్లాటు మాకు పాట్లు. ఉండాల్సిన వాడివిరా! ఇంటి మీద మమకారంతో మంచంపట్టిన మీ నాన్న ఏదో పనున్నట్టు ముందే వెళ్లిపోయారు. నిజంగా బతికుంటే గుండె బద్దలయ్యేదే.
      అప్పుడెప్పుడో నువ్వు నీ స్నేహితులతో కలసి వృద్ధాశ్రమం పెట్టినప్పుడే నీ దూరాలోచన (దురాలోచన) నాకు తెలియలేదు. ‘‘అమ్మా! వారం రోజుల పాటు ఎల్‌.టి.సి. పై నార్త్‌ వెళ్లొస్తాం, ప్లాటు మరమ్మతులు చేయించాలి, అందాక ఆశ్రమంలో ఉండు’’ అని, ఆశ్రమంలో నన్ను దింపేసి నేటికి సరిగ్గా మూడేళ్లు నాయనా! మీ మామ్మ అన్నట్టు నేను మొండి పీనుగనే. నేను ఎక్కడ ఉన్నానో ఎలా ఉన్నానో పట్టించుకోనంత పనిమంతుడవయ్యావు. సంతోషం. నీ అక్కలు నీలా కాదురా. నన్ను వెదుక్కుంటూ వచ్చి అక్కున చేర్చుకున్నారు. తమతో రమ్మన్నారు. కానీ, మీ నాన్న మాటకు కట్టుబడి ఆడపిల్ల ఇంటికి వెళ్లడం నచ్చని పిచ్చి ఘటాన్ని. సెలవు నాయనా. ఎక్కువ విసిగించను. ఇంతవరకూ ఈ ఉత్తరం ఎందుకు రాశానంటే నువ్వు ఆశ్రమంలో చేర్చినప్పుడు కొన్న మంచం, కుర్చీ నేను వాడలేదు. అవి నీకు మున్ముందు ఆశ్రమంలో నీ పిల్లలు కొనివ్వకపోవచ్చు. ఇవి పట్టుకెళ్లు. కింద పడుకోలేవు. నీకు జలుబు చేస్తుంది. పిల్లలకు... స్రవంతికి దీవెనలు... 
      కన్నీళ్లు తప్ప ఏమీ మిగలని మీ అమ్మ

అమ్మ ప్రేమకి ఆవల..

వెనక్కి ...

మీ అభిప్రాయం