విజయంలోనూ... వికాసంలోనూ నువ్వే

  • 139 Views
  • 0Likes
  • Like
  • Article Share

    దుర్గం భైతి

  • రామునిపట్ల, మెదక్‌ జిల్లా.
  • 9959007914
దుర్గం భైతి

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియమణి నక్షత్రకి...
‘‘గమనించావో లేదో ఓ మనసా! దాంపత్యం లాంటి మైత్రి లేనేలేదు’’ అన్నాడో కవి. ‘‘మగడు వేల్పన పాతమాటది ప్రాణమిత్రుడు నీకు’’ అన్నారు గురజాడ. దంపతుల మధ్య ప్రేమ, ప్రోత్సాహం ఎప్పటికప్పుడు వికసిస్తూ ఉంటేనే ఆనందం విరబూస్తుంది. రెండున్నర అక్షరాల ప్రేమ ముందు ఈ ప్రపంచం చాలా చిన్నది. 
      చదువంటే ఏంటో తెలియని కుటుంబంలో పుట్టాను. చదవాలన్న తపనతో కన్నవారితో సైతం పోరాడి వందల మందికి పాఠాలు చెప్పే స్థాయికి చేరుకున్నాను. గతుకులమయమైన నా బతుకులో నీ పాత్ర కీలకమైంది. నీ సాహచర్యం నాలో న్యూనతను దూరం చేసి సరికొత్త ఉత్తేజాన్ని నింపింది. జీవితాన్ని ప్రభావితం చేసేది విద్యార్థి దశ. అప్పుడు అలవరచుకున్న పద్ధతులు, అలవాట్లు జీవితమంతటినీ నడిపిస్తాయని పెద్దలంటారు. ఇంటర్‌ చదువుతున్న రోజుల్లో నువ్వు పరిచయమయ్యావు. 
      నెలకు రెండువందల జీతంతో ఒక ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తూ, ఆ అరకొర సంపాదనతోనే డిగ్రీ చదువుతూ పడరాని పాట్లు పడినప్పటికీ నీ ప్రేమ ముందు అవన్నీ చాలా చిన్నవి. నీ లాలిత్యంలో ఎలాంటి సమస్యనైనా చిరునవ్వుతో ఎదుర్కోగలిగే ఆత్మవిశ్వాసాన్ని పొందగలిగాను. ఎప్పటికప్పుడు ఆత్మస్థైర్యాన్ని కలిగించే నువ్వంటే నాకు చాలా ఇష్టం.
      నా ప్రేమను వ్యక్తం చెయ్యడానికి కవినైతే కావ్యం రాసేవాణ్ని. రచయితనైతే గొప్ప గ్రంథమే రాసివాణ్ని. సృజనకారుడనైతే గొప్ప కళారూపాన్నే సృష్టించేవాణ్ని. నేనొక మామూలు మనిషిని కాబట్టి మనసులోనే ఆరాధిస్తున్నాను. ఎన్నో అవమానాలు, బంధువుల ఈసడింపులు, లోకుల పెడసరి మాటలన్నీ భరించాను. ఆనాడు ప్రభుత్వ కొలువుని పొందినప్పుడు నీ కళ్లలో మెరిసిన కాంతులు నాకిప్పటికీ గుర్తే. నా విధి నిర్వహణలో ఏలోటూ రాకుండా సహకరించినందుకు ధన్యవాదాలు చెప్పడం సరైందో కాదో తెలీదు కాని, నా శ్రమలో సగం నువ్వు.
      ఇంటర్‌తోనే చదువుకి స్వస్తి పలుకుతానేమో అనుకున్నాను. కాని ఈనాడు ఉపాధ్యాయుడిగా, కవిగా, రచయితగా ఎదుగుతున్నానంటే అది నీవల్లే. నా ప్రతి విజయం నీదే. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు కదా! నా లక్ష్యానికి మార్గనిర్దేశనం చేసి నన్ను గెలిపించావు. నా కష్టాలను నీవిగా భావించి, కన్నీళ్లను, కలలను పంచుకుని నా జీవిత గమనానికి నక్షత్రమై దారిచూపిన నీ గురించి ఎంత చెప్పినా తక్కువే. 
      నా విధి నిర్వహణలో పొందుతున్న సంతృప్తికి, లక్ష్యసాధనలో సమకూర్చుకోవలసిన సాధనా సంపత్తికి, నిర్మల చిత్తశాంతికి నువ్వు కల్పిస్తున్న ఆసరా చాలా గొప్పది. నాకు వచ్చిన ఈ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం నిజానికి నీదే. నీ సహకారం వల్లనే ఇది సాధ్యమైంది. నువ్వు తోడుంటే భవిష్యత్తులో మరిన్ని విజయాలు, పురస్కారాలు అందుకోగలనని ఆశిస్తూ...

నీ ప్రియ మనోహరుడు

విజయంలోనూ... వికాసంలోనూ నువ్వే

వెనక్కి ...

మీ అభిప్రాయం