నా మనసే... ఓ బహుమతి...

  • 335 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సుభగ

  • హైదరాబాదు.

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

నా ప్రాణసఖి శ్రీదేవికి,
నీ ఇష్టసఖి సుభగ రాస్తున్నదీ లేఖ. ఉభయకుశలోపరి. కంప్యూటర్ల కాలంలో కూడా ఇంకా ఈ ఉత్తరాలేంటని మీ ఆయన నవ్వుకుంటున్నారా ఉత్తరాల్ని చూసి? పోన్లే నువ్వు మాత్రం సంతోషిస్తావని నాకు తెలుసు. నీ పుట్టినరోజుకు ఏ బహుమతి పంపుదామా...ని ఆలోచించగా ‘ఏమివ్వను, నీకేమివ్వను? నా మనసే నీదైతే ఏమివ్వను’ అనిపించింది. నా మనసునే ఈ లేఖ ద్వారా నీ ముందుంచుతున్నాను. నా మనసుపై నడచైనా నన్ను చేరుకుంటావని చిన్న ఆశ.
      అప్పుడే నువ్వు విదేశానికెళ్లి మూడేళ్లు దాటుతోంది. ఎప్పుడూ కలిసుండే మనిద్దరం ఇలా ప్రపంచంలో తలోదిక్కయిపోయాం. ఎవరి ప్రపంచంలో వాళ్లం పడిపోయాం. యాంత్రికమైన ఈ జీవితంలో ప్రతి క్షణం గుర్తుకొస్తున్నావని అనను.
      చిరుచీకట్లు ముసురుతున్న ఓ సాయంత్రం డాబా మీద ఒక్కదాన్నీ కూర్చుని కళ్లు మూసుకోగానే తొలి ఆలోచన నీ వైపే మళ్లుతుంది. మనం ఆస్వాదించిన ఎన్నో సాయం సంధ్యలు జ్ఞాపకానికొస్తాయి. పొద్దున్నే వివిధ భారతి వారి జనరంజని కార్యక్రమం వింటూ పనులు చేసుకుంటున్న వేళ, మనమిద్దరం కోరిన పాట ‘‘పెళ్లి కానుక’’ నుంచి ‘‘పులకించని మది పులకించు’’ ప్రసారమైనప్పుడు ఎంతగా పొంగిపోయామో గుర్తుకొస్తుంది. చిన్న విషయాలకే ఎంతో సంబరపడేవాళ్లం కదా! ఇప్పుడా పాటలు వింటున్నా అంత మధురంగా అనిపించవెందుకో. తీరా మాటపడి మనసు మూగబోయిన వేళ మనసు విప్పి మాట్లాడేందుకు నువ్వు లేవే అనిపిస్తుంది. చిత్రంగా ఆ సమయాల్లోనే నాకు ఏ సలహానూ ఇవ్వవు. సాంత్వన వచనాలూ పలకవు. సదరు వ్యక్తిని దుమ్మెత్తీపోయవు. అయినా నీ సాన్నిధ్యమే నాకు సాంత్వన చేకూరుస్తుంది. మరుసటి రోజును ఎదుర్కొనే ధైర్యాన్నిస్తుంది.
      ఒక మంచి పుస్తకం చదివాక, ఆ భావావేశాన్ని పంచుకోవడానికి నువ్వులేక ఆ ఉత్సాహమంతా చప్పున చల్లారిపోతోంది. ఎన్నెన్నో ఆలోచనలు, అభిప్రాయాలు నాలోనే సమాధైపోతున్నాయి. కొత్త పుస్తకాలు చదవాలనే ఆసక్తే పోతోంది. అప్పటికీ చెప్పకపోయినా నీకోసం నేను పడే ఆరాటం      గమనించి ఈయన, ‘‘నీ స్నేహితురాలు చిరు మాటైనా మాట్లాడదు కదా, ఎలా కుదురుతుందోయ్‌ మీ మధ్య సంభాషణ’’ అని అడుగుతుంటారు. దానికి నా చిరునవ్వే సమాధానం. మనుషుల మధ్య మాటలు కానీ, మనసుల మధ్య వాటి అవసరం లేదని తెలియదు పాపం.
      నువ్వెలా ఉన్నావు? మా అన్నయ్య ఎలా ఉన్నారు? ఇంకా పెళ్లైన కొత్తలోలా ‘‘దేవీ మౌనమా? శ్రీదేవీ మౌనమా? అని ఏడిపిస్తున్నారా? నా మేనల్లుడు ఏమంటున్నాడు? ఇక్కడ నీ కోడలు పెంకి ఘటంలా తయారవుతోంది. మరి దీనితో ఎలా వేగుతాడో! నీలా మెతకగా ఉంటే లాభం లేదు. పుట్టిన వెంటనే తీసుకెళ్లిపోయావు. వాడు ఇప్పుడు నన్ను చూస్తే దగ్గరకొస్తాడో రాడో, వచ్చినా.. ఆంటీ అని పిలుస్తాడేమో! ఏమిటో ఖర్మ! అలా పిలిస్తే నేనూరుకుంటానా! అలా పిలవడులే, నువ్వెక్కడున్నా సంస్కారంతోనే వాడిని పెంచుతావన్న నమ్మకం ఉంది నాకు.
      నీ మేనకోడలు, అప్పుడే చిట్టి చిలకమ్మ చెప్పేస్తోంది. అమ్మ కొట్టిందా, తోట కెళ్లావా, పండు తెచ్చావా వరకూ సరిగ్గానే చెబుతోంది, ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా దాని చేత ఆ పండుని గూట్లో మాత్రం పెట్టించలేకపోతున్నా, గుటుక్కుమని మింగడానికే చూస్తుంది. ఇది చిట్టిపొట్టి గీతాల నుంచి పద్యాల స్థాయికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఇక ఈయన సంగతి తెలిసిందే! శని, ఆదివారాల్లో కూడా లాప్‌టాప్‌ ముందు నుంచి కదలరు. అప్పుడప్పుడు మాత్రం నేనున్నానన్నట్టు తల పక్కకు తిప్పి ‘‘ఆ ఏమంటున్నావోయ్‌?’’ అని మళ్లా అందులో మునిగిపోతారు.
       ఈ మధ్య మన ఊరెళ్లినప్పుడు సంగీత కళాశాలను చూడ్డానికి వెళ్లా, అప్పటికే విద్యార్థులంతా వెళ్లిపోయి ఆవరణ బోసిపోయింది. మన సీతమ్మ చెట్టు, అదేనే నాదస్వరం, తుంబురా గదుల ముందు ఉండే మర్రిచెట్టు బాగా ముసలిదై పోయింది, ఆ చెట్టుకింద కూర్చుని మనం నేర్చుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు గుర్తొచ్చి మనసంతా అదోలా అయిపోయింది. అక్కడ పనిచేస్తున్న లక్ష్మీదేవమ్మగారు పలకరించేదాకా చెట్టుకింద చాలాసేపు నిల్చుండిపోయా. వయసు పెరగడంతో సరిగ్గా నడవలేకపోతున్నారు పాపం. నీ గురించి అడిగారు, ‘‘మీరిద్దరూ ఈ కాలం పిల్లలు కాదమ్మా, ఇద్దరూ ఇద్దరే ఆణిముత్యాలు’’ అంటూ వెళ్లిపోయారు.
     నీ మేనకోడలు నిద్రలేచే వేళయ్యింది ఉంటాను మరి. నీ ప్రత్యుత్తరం కోసం ఎదురు చూస్తూంటా.

నీ... సుభగ 

నా మనసే... ఓ బహుమతి...

వెనక్కి ...

మీ అభిప్రాయం