అక్షరానికి అందని అనుభూతులివి

  • 279 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శివాజీ

  • సీతానగరం, తూర్పుగోదావరి జిల్లా.

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియమైన శ్రీకాంత్‌కి... ఎన్నాళ్లయ్యిందోకదూ..! నీకు ఉత్తరం రాసి. ఏమిటో అస్తమానం మాట్లాడుకుంటూనే ఉంటున్నాం ప్రపంచం మన గుప్పిట్లోకి వచ్చేశాక. ఈ ఆధునికత దూరాన్ని కూడా ఎంతో దగ్గర చేసేసింది. పరుగులు పెడుతూనే మాట్లాడుకుంటున్నాం, ఏదో పనిచేస్తూనే సమాచారాన్ని రెప్పపాటులో సంక్షిప్త సందేశంగా పంపించుకుంటున్నాం. పొద్దుటే శుభోదయ సందేశాలు, రాత్రి గడిచే ముందు శుభరాత్రితో ముగింపులు. ఎప్పుడో ఏదో బాకీ ఉన్నట్లుగా, అంతా యాంత్రికంగా.. ఏంటో అర్థంకావట్లేదీ తంతు.
      మనుషులం మాత్రమే మాట్లాడుకుంటున్నాం. నా ముఖాన్ని కాకుండా నీ ముఖాన్ని చూస్తూ మాట్లాడే అంతర్జాల అద్దాన్ని అడ్డుతెరగా పెట్టుకుని. ఎన్ని సౌకర్యాలొచ్చేశాయ్, క్షణాల మీద తీరిపోయే ఎన్ని అవసరాలు పెరిగిపోయాయి.
      కానీ, ఎదురుచూపులో ఉన్న సంతోషం ఎక్కణ్నుంచి వస్తుంది ఈ సౌకర్యాల మధ్య. రాత్రి పడుకున్నా నిద్ర పట్లేదు. ఏవో ఆలోచనలు. వెంటనే చలంగారి ‘ప్రేమలేఖ’ల మధ్యకుట్టు కాగితంలో దాచిన ఉత్తరాన్ని తీసి చాలా కాలం తర్వాత మళ్లీ చదువుకున్నాను.
      ‘‘ఫోన్, ఈ-మెయిల్‌ అంతా ట్రాష్, ఏనాటికీ ఉత్తరమే భేష్‌’’. ఎంత బాగారాశావ్‌...! అవును... మనసు గూటిలో నిదురపోతున్న జ్ఞాపకాల్ని తట్టిలేపడంలో, కొత్త జ్ఞాపకాల్ని దొంతర పెట్టటంలో ఉత్తరం చేసే పెత్తనం ఏపాటి తెలుస్తుందీ కాలానికి? ఎవరో అన్నట్టు, దేనివల్ల నీ బాధ సగమవుతుందో, దేనివల్ల నీ సంతోషం రెట్టింపవుతుందో? అది నీ మనసును చదివిన మనిషి రాసే ఉత్తరమవుతుంది. ఎంత నిజముందీ మాటలో...! అందుకేనేమో నీ ప్రతి ఉత్తరం నా మనసుతో మాట్లాడేది. మంచి పుస్తకాల్ని చదవడానికి నన్ను పురికొల్పేది. నేను తెలియని నీవు లేవు కానీ, నీవు పూర్తిగా తెలియని నేను అనే వాడినే లేకుండా చేశాయి నీ ఉత్తరాలు. అందుకే నువ్వు చదివించిన ఎన్నో పుస్తకాల్లోనే నువ్వు రాసిన ఉత్తరాలన్నీ దాచాను.
      కానీ, ఈ మధ్య నీకు బొత్తిగా తీరిక దొరకడంలేదు కదూ. ఉత్తరం రాయడం పూర్తిగా మానేశావ్‌. మొన్న రెండు మాసాల కిందట కొప్పర్తి మాష్టారి ‘విషాద మోహనం’ కవితా సంకలనాన్నిచ్చాను. దానిపై 
      నీ అభిప్రాయం చెప్పడానికైనా మళ్లీ ఉత్తరం రాస్తావని ఎదురు చూశాను. మాట్లాడుకున్నప్పుడల్లా ఆ కవిత్వంలోని ఆర్ధ్రతను గుర్తు చేసుకుంటున్నావే కానీ నీ శైలిలో ఒక ఉత్తరం మాత్రం రాయలేకపోతున్నావ్‌. ఏం చేస్తావులే నీకు రాయాలని ఉన్నా తీరికెక్కడిది. అస్తమానం నువ్వే రాయాలేంటి? ఈ సారి నేను రాస్తున్నా. పని ఒత్తిడిలో నిత్యం ఉక్కిరిబిక్కిరిగా ఉండే నీకు నా ఉత్తరం ఉపశమనం ఇవ్వాలని రాస్తున్నా. నిన్ను ఉల్లాస పర్చాలని రాస్తున్నా. ఇంతకీ ఏముంటాయ్‌ రాయడానికి? ఎప్పటికప్పుడు అన్నీ మాట్లాడేసుకుంటుంటే.!  మొన్న ఓ పనిమీద ఆదినారాయణ, నేనూ విశాఖపట్నం వెళ్లాం. మనసు అసలు ఊరుకోకపోతే మనం చదువుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మనల్ని కలిపిన శాతవాహన, 78 దగ్గరకి వెళ్లాను. తాళం వేసుంది. ఇప్పుడున్న వాళ్లు బయటకెళ్లుంటారు. చాలాసేపు ఆ తలుపు ముందే నిల్చుండిపోయాను. ఎందుకో తెలియకుండానే కళ్లుచెమర్చాయి. నీతో పంచుకున్న రోజులు, ఒకరి ముందు ఒకరం ఒలకబోసుకున్న ఎన్నో ఆశలు, ఆ ఆశలపై పెట్టుకున్న నమ్మకాలు, అప్పుడప్పుడూ రెండో ఆటకోసం తీసిన పరుగులు, తిరిగి రాగానే ఆ చిత్రంపై తెల్లవార్లూ సాగిన సమీక్షలు, తలుపు తెరవగానే ఉత్తరాల కన్నంలోంచి అప్పారావు తాతయ్య లోపలికి విసిరిన ఉత్తరాలు... ఇలా ఒక్కొక్కటిగా అన్నీ గుర్తొచ్చాయి. అన్నీ పలకరించాయి. వాళ్లొస్తే గదిలోపలికెళ్లి, మన నీడల్ని మోసిన ఆ గోడల్ని తడమాలనిపించింది. ఒక లక్ష్యం కోసం ఆ గోడపై మనం రాసుకున్న ‘‘కడలి కెరటం నాకాదర్శం... లేచిపడినందుకు కాదు, పడినా లేచినందుకు’’ మాట గుర్తొచ్చింది. రెండో అంతస్థు నుంచి కిందికి చూస్తూ మనం రాసుకున్న కవితల్ని అందరికి వినబడేలా చెప్పిన క్షణాల్ని ఓ కవితగా రాయాలనిపించింది. చుట్టూరా ఎన్నో మార్పులొచ్చేశాయి. కానీ మన జ్ఞాపకాల మెత్తటి గాలులు మాత్రం ఇంకా అలా తాకుతూనే ఉన్నాయి. గతానికి, వర్తమానానికి మధ్య ఉన్న ఆనవాళ్లే కదా జ్ఞాపకాలు. అవి నీ నుంచి నాకు బోలెడన్ని ఉన్నాయి. అక్షరాలకు దొరకని అనుభూతులూ ఉన్నాయ్‌. అన్నట్టు, చాలా కాలం తర్వాత మొన్ననే మళ్లీ సీతారామయ్యగారి మనవరాలు చిత్రాన్ని చూశాను. ఎన్నిసార్లు ఆ చిత్రం లోతుల్ని తవ్వుకుంటూ గడిపామో కదా...! ఎంత గుర్తొచ్చావో చెప్పలేను. అది మన మనసుల్ని తడిచేసిన దాదాపు రెండు పుష్కరాల కాలానికి మళ్లీ అలాంటి తడినే ఇచ్చింది నువ్వు దర్శకత్వం చేసిన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఎంత మంచి చిత్రాన్నందించావ్‌. చాలా సంతోషం.
      మర్చిపోయాను, రమేష్‌నాయుడిగారి పాటలన్నిటినీ పోగుచేసి నీకోసం అట్టే పెట్టి ఉంచాను. అమ్మ నీకిష్టమని రేపో ఎల్లుండో పూతరేకులు చుడతానంది. వాటితో పాటు ఆ పాటల్ని కూడా తీసుకుని హైదరాబాద్‌ బయలుదేరి వస్తాను. ఇక ఉంటాను మరి.

ఎప్పటికీ నీ... శివాజీ

అక్షరానికి అందని అనుభూతులివి

వెనక్కి ...

మీ అభిప్రాయం