నా హృదయపు కోవెలలో

  • 337 Views
  • 0Likes
  • Like
  • Article Share

    - చైతన్య

  • మార్టేరు, ప.గో జిల్లా
  • 9030206040

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ఆ రోజు... నిన్ను చూసిన క్షణం నుంచి నా మనసు నీ చుట్టూనే పరిభ్రమిస్తోంది. నా మనసు ప్రతీక్షణం నీ రూపాన్నే దర్శిస్తూ, నీ నామాన్నే స్మరిస్తోంది. వెలుతురు కానీ, చీకటి కానీ... అది ఎండ కానీ, వెన్నెలకానీ... వర్షంతో ముంచెత్తనీ... ఇవేవి నాకు తెలీడం లేదు.
      నీ రూపం నన్ను వెన్నంటి వస్తూ నన్ను ‘నన్నుగా’ నిలువనీయడంలేదు. ముద్దమందారంలా, స్నిగ్ధ సౌందర్యంతో, నీలాల నీకురులను ఆకాశం నిండా పరచి... చిరుజల్లులకు తడిసి మట్టివాసనను సుగంధ పరిమళాలుగా వెదజల్లుతున్న నేలమీద నీవు నడచి వస్తున్న ‘దృశ్యం’ నా హృదయ ఫలకం మీద ఆవిష్కృతమౌతోంది.
      దివినుంచి భువికి దిగిన దేవకన్యలా దివ్యంగా... నవ్యంగా... భవ్యంగా... హృద్యంగా...రమ్యాతిరమ్యంగా...నువ్వెంతలా మెరిసిపోతున్నావో తెలుసా?!
      ‘స్వప్న’... నీ పేరులోని ఆ రెండు అక్షరాలూ నాకు నిత్యపారాయణం అయిపోయాయంటే నువ్వు నమ్మగలవా?!
      అవి ఏవో మంత్రోచ్చారణ పదాల్లా పదే పదే నా పెదవులపై ఉద్వేగంగా, ఉద్విగ్నంగా నర్తిస్తున్నాయి సుమా!
      నీకో సంగతి తెలుసా? కొద్ది రోజుల కిందటే ‘తంతి’ అనే ప్రసార సాధనం కనుమరుగైపోయింది. ‘తపాలా’కి కూడా తిలోదకాలు ఇచ్చే రోజులు దాపురించకుండా, ఉత్తరంలో ఉన్న మాధుర్యాన్ని నేను అనుభవిస్తూ, నీకు అనుభవంలోకి తీసుకు రావాలనే ‘ఈ లేఖ’ని రాస్తున్నాను.
      ఆ రోజు ‘పెళ్లిచూపులు’ తర్వాత మీ నాన్నగారు నీ ‘చరవాణి’ సంఖ్యని నాకు ఇచ్చారు. అప్పటి నుంచి నా ‘సందేశాన్ని’, నాలో రేగుతున్న ‘భావావేశాన్ని’ నీకు విన్నవించుకుందామనే అనుకుంటున్నాను.
      రాత్రులు కలతనిద్రలో... వస్తున్న కలల్లో... నువ్వు తలుపు తోసుకొని మరీ తలపుల్లోకి వచ్చేస్తున్నావు.
      నా తలపుల తలవాకిలిలోంచి మందాకినీ నదిలా నువ్వు ప్రవహిస్తూంటే, నేను ‘జన్మాంతర చెలిమి’ కోసం... వందేళ్ల కలిమికోసం ‘దాహార్తుడనై’ చల్లని ‘నీటి చెలమ’లాంటి నీ దివ్యరూప సాక్షాత్కారం ముందు రెండు చేతులూ సాచి... నిల్చున్నాను.
      ఈ గుండెగదిలో నీ రూపం... మనసు మూలలంతా నీదే ధ్యానం... తనువంతా నీదే అయినట్టు ప్రతీ మూలా స్పందనలు...
      స్వచ్ఛమైన అద్దంలాంటి నా హృదయంలోకి ఆ రోజు తొంగి చూశావు. అప్పటి నీ రూపాన్ని చిత్రంగా మలచుకొని, ఆ చిత్రాన్ని నా మదిలో పదిలంగా దాచుకొని, పవిత్రంగా ఆరాధిస్తున్నాను.
      నా హృదయపు కోవెలలో నువ్వు దేవేరివి.
      మనది ‘ప్రేమ’ పరిచయం కాదు... పెళ్లి చూపుల పరిచయమే!
      ఇప్పుడనిపిస్తోంది నిన్ను నేను ప్రేమిస్తున్నానని!
      నువ్వేం చేస్తున్నావు స్వప్నా!... నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావనీ... అది నాకంటే ముందే నువ్వు ప్రారంభించావనీ... ఆరోజు నన్ను చూసిన నీ కళ్లలోని ‘వెలుగు’ ద్వారా... నిన్ను చూసిన ఆ క్షణానే నేను గ్రహించాను. నేనెంత అదృష్టవంతుణ్ని.
      ఓ నా... హృదయంలో నిదురించే నా చెలీ... ఆనాటి మన పెళ్లిచూపుల నుంచి, ఆ ఆషాఢం తర్వాత జరిగే మన పెళ్లి వేడుక వరకూ నీ ధ్యానంలోనే... నీ ఆరాధనలోనే... నిరంతరం గడుపుతూ... నీ ఆగమనం కోసం చంద్రునికోసం ఎదురుచూస్తున్న చకోర పక్షిలా... చిరుజల్లులకోసం నిరీక్షిస్తున్న మయూరంలా... ‘నీకోసం’ ఎదురుచూస్తున్న ‘నాలా’...

- నీ చైతన్య

నా హృదయపు కోవెలలో

వెనక్కి ...

మీ అభిప్రాయం