నీకే అమ్మగా పుట్టాలని

  • 147 Views
  • 0Likes
  • Like
  • Article Share

    అప్పరాజు నాగజ్యోతి

  • బెంగళూరు
  • 9480930084
అప్పరాజు నాగజ్యోతి

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

నా ప్రియమైన చిన్నారీ! 
కడుపులో
నువ్వు అంకురించిన క్షణం నుంచే నాలో ఏదో తెలీని ఉత్సాహం పరవళ్లు తొక్కింది. నువ్వు భూమ్మీద పడ్డాక, కాలం పరుగులు తీయడం మొదలెట్టింది. ఒక్కమాటలోచెప్పాలంటే, తల్లిగా నేను నీకు జన్మనిస్తే, బిడ్డగా నువ్వు నాకు ప్రాణం పోశావు. 
      నీకు గుర్తుందా, నీ చిన్నతనంలో మీ నాన్న నన్ననే మాటలకీ, ఆయన్ని నాపైకి మరింత ఉసిగొలుపుతుండే మీ బామ్మా, అత్తల వైఖరికీ లోలోనే కుమిలిపోయేదాన్ని. నువ్వప్పుడు నన్ను దగ్గరికి తీసుకుని, నీ చిట్టి చేతులతో నా కన్నీళ్లు తుడుస్తుండేదానివి, నీ చిలిపి అల్లరితో నా మనసుని మళ్లిస్తుండే దానివి. ఈ అమ్మని ఓదార్చాలని ఆ వయసులోనే నీకెవరు నేర్పారు చిన్నా?
      మన ఇంటి నుంచే ప్రేరణ పొందావో, ఏమో తెలీదు గానీ, మొత్తానికీ మనుషుల ప్రవర్తనలని విశ్లేషించి, సంసార వీణల్లోని అపశ్రుతులని సరిచేసే మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టావు. నీ మాటలతో, శిలలాంటి మీ నాన్ననూ అనురాగమూర్తిగా మార్చేశావు. ఆయన చనిపోయాక వారి జ్ఞాపకాలనే నెమరేసుకుంటూ నేనీవేళ ఆనందంగా ఉంటున్నానంటే అది నీ చేతి చలవేగా చిన్నారీ!
       ఇక, నీ విషయానికొస్తే అసలు పెళ్లే చేసుకోనని మొండికేశావు. దాంతో, బాల్యంలో నీ మనసుపై పడిన చేదు గుర్తులు ఇంకా మాసిపోలేదేమోనని కలవరపడ్డాను. అప్పట్లో, నాపై అడుగడుగునా అధికారాన్ని ప్రదర్శించే మీ నాన్ననీ, మా వివాహ బంధాన్నీ చూసి నువ్వెక్కడ పురుష ద్వేషిగా మారతావో, లేక సహజీవనం లాంటి ఆధునిక పోకడల వైపు మరలుతావేమో నని భయపడేదాన్ని. అయితే, పెళ్లి తర్వాత నీ తల్లి నీతో కలిసి ఉండేందుకు ఒప్పుకుంటేనే తప్ప పెళ్లి చేసుకోనని భీష్మించుక్కూర్చుని, నీ నాలుగేళ్ల ప్రేమని ఈ తల్లి కోసం త్యాగం చేసేందుకు సిద్ధపడ్డావని, నా కాబోయే వియ్యపురాలూ, అల్లుడూ ఇంటికి వచ్చి చెప్పినప్పుడు నా మనసెంత పొంగిపోయిందో! ఎందుకురా చిన్నా! ఈ తల్లిపై నీకింత అపేక్ష! పిచ్చిపిల్లా! భౌతికంగా నీకూ, నాకూ మధ్య ఎంత దూరం ఉన్నానువ్వెప్పుడూ నా గుండెలోనే ఉంటావురా. ఈ అమ్మ మాటని మన్నించి వివాహానికి ఒప్పుకున్నావు. అదే పదివేలు! నా బంగారుకొండని, మరో వారం రోజుల్లో మెట్టినింటికి సాగనంపడం మనసుకి కష్టంగానే ఉన్నా, నువ్వు కోరుకున్న వ్యక్తి చేతుల్లో నిన్ను పెడుతున్నందుకు ఆనందంగానూ ఉంది. 
      కూతురిని అత్తవారింటికి పంపే శుభ సమయంలో, తన అనుభవాలతో పాటు మరెన్నో జాగ్రత్తలు చెబుతుంది తల్లి. అయితే, మనస్తత్వాలనే కాచి వడబోసిన నీకు నేనేం చెప్పగలను చిన్నా, మీ అత్తగారిలోనే ఈ తల్లిని చూసుకుంటూ, మెట్టినింటినే పుట్టినిల్లు గా మార్చుకోమన్న చిన్నమాట తప్ప! 
      ఇంతకంటే ఎక్కువ రాసేందుకు, చెమ్మగిల్లుతున్న కళ్లూ, వణుకుతున్న చేయీ సహకరించక ఇక్కడితో ఆపేస్తున్నాను చిన్నా. మళ్లీ నీకే అమ్మగా పుట్టాలని ఆ భగవంతుణ్ని వేడుకుంటూ...            

ఇట్లు 
అమ్మ

నీకే అమ్మగా పుట్టాలని

వెనక్కి ...

మీ అభిప్రాయం