నీకోసమే నేను...

  • 386 Views
  • 0Likes
  • Like
  • Article Share

    - డా।। సమ్మెట విజయ

  • సికింద్రాబాదు
  • 9989820215

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియమైన నీకు...  
      నా భావాలన్నీ తెలపడానికి ఈ మార్గం ఎంతవరకు నీకు చేరుతుందో తెలీదు... కానీ నా ఆలోచనలను నీతో పంచుకోకుండా ఉండలేను.. నీ మీద నాకెంత ప్రేముందో చెప్పమంటే అందరూ ఆకాశమంత... సూర్యుడంత, చంద్రుడంత అంటుంటారు... నేను ప్రేమించేది నిన్నే అయినప్పుడు ఏ కొలమానం నీ కోసం ఉపయోగించను... నా కష్టం సుఖం దుఃఖం అన్నింటినీ నీతోనేగా పంచుకునేది.. నన్ను ఓదార్చేది నువ్వు. కంటికి కనిపించకుండా అప్పుడప్పుడూ విసిగించేదీ నువ్వే... ఒక్కోసారి మరీ ప్రతాపం చూపించేసి విరగబడి నవ్వేది నువ్వే... 
      నీ గురించి ఎన్నని చెప్పను... అందరూ ఉదయానేలేచి నీకు నమస్కరించి తమ పనుల్లో తాము పడి ఉంటే... నిన్ను పలకరించి పరామర్శించి... నీతో కాసేపు మాట్లేడేది నేనే... అందరూ నిన్ను ప్రార్థిస్తారు... నీ మీద అష్టకాలు చదువుతారు... నీ కోసం పూజలు చేస్తారు... కొందరికి నువ్వసలే పట్టవు... పట్టించుకోరు... లెక్కచేయకుండా వాళ్ల పనుల్లో లీనమవుతారు... అయినా నువ్వు అందరినీ పట్టించుకుంటావు... అందుకేగా నువ్వంటే నాకిష్టం.. ఆ విశాలదృక్పథం నాకిష్టం... అదిగో మళ్లీ ఎంతిష్టమని అడగకు... అదెంతో నేను చెప్పలేను బాబూ!
      ఒకసారి ఒక ముసలవ్వ చలికి గజగజ వణుకుతూ నిన్ను శాపనార్థాలు పెడుతుంది... నేను నీకెక్కడ కోపం వస్తుందో అవి కంగారు పడుతున్నాను... అబ్బే అలాంటిదేమి లేదంటూ చిరునవ్వులు చిలకరిస్తూ మెల్లగా ముడుతలు పడిన ఆ అవ్వ దేహాన్ని ఆప్యాయంగా స్పృశించావు.... నీ స్పర్శతో విచ్చుకున్న ఆ అవ్వ ముడతల మెరుపులని నాకు చూపించాలనే కదూ ఆ పనిచేశావ్‌... మరో సారి... వరదలు ముంచెత్తి నువ్విక రావని అందరూ నీమీద అలకలు పోయారు. నువ్వు లేక అన్నం సహించక అందిరితో పాటూ నేనూ నీ రాక కోసం ఎదురు చూశాను....
      అప్పుడు దూకుడులో మహేశ్‌బాబు కన్నా జోరుగా దూసుకుని వచ్చావు... నాగుండెలనిండా ఎంత ఆనందం... ఎంతహాయి!
      రోజూ పిల్లలంతా ఉదయాన్నే కళ్లు మూసుకుని ప్రార్థన చేస్తుంటే నేను కళ్లనిండా నిన్నే చూస్తున్నాను... అప్పుడు నా శరీరమంతా నీ చూపులతో ఒక కొత్త కాంతిని నింపి ఆ రోజుకి సరిపోయే శక్తినంతా మూటకట్టి నా కళ్లలో నువ్వు నింపేస్తావ్‌... ఇక ఆ రోజంతా నాలో ఎంత ఉత్సాహం! ఉల్లాసం... అదెంతో నీకెలా చెప్పను?
      బాంధవ్యాలు, స్నేహాలు, పైపైని పలకరింపులు, అడుగడుగునా మోసాలు, అసూయలు, అన్యాయాలు అన్నీ నా చుట్టూ చేరి నన్ను నిలువునా ముంచెత్తిన సమయంలో నా తోడూ నీడా నీవై నీతో నేనెప్పుడూ అంటూ నిలిచావు... నాలోని ప్రతీ భావం నీతో పంచుకుంటూ నేనెంత ఊరట పొందానో నీకెలా చెప్పను...నీ తలపు నా హృదయంలో ఎంత ఆనందాన్ని నింపుతుందో ఎలా వివరించను? అలసట ఎరుగని నీ పనితనం, అందరిపట్లా నీ సమానభావం, నిరాశతో కుంగిపోయేవారికి నిండుధైర్యం నింపే నీ వ్యక్తిత్వమే నీపై ప్రేమను పెంచుకునేలా చేసింది. నిరంతరం నీ కళ్లముందు నిలిచి ఉండడం కోసం... నీకోసం... కేవలం నీకోసం... నేను ఎన్నిసార్లైనా మరణిస్తాను.... మళ్లీ మళ్లీ నీకోసం జన్మిస్తాను... ప్రేమ అజరామరమైందని నిరూపిస్తాను... ఇంకా ఏం చెప్పను... నీ కిరణ సమీరంతో పరవశించిపోతూ... ప్రేమంత ప్రేమతో....

నీ విజయ.

నీకోసమే నేను...

వెనక్కి ...

మీ అభిప్రాయం