నువ్వూ నేనూ!

  • 1192 Views
  • 0Likes
  • Like
  • Article Share

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

ప్రియమైన నీకు,
నీకు రాస్తున్న మొదటి ప్రేమలేఖ ఇది. ఇప్పుడు నా మనసులో కదులుతున్న భావాలను నీతో పంచుకుందామంటే నువ్వు అందుబాటులో లేవు. నువ్వు ఉన్నప్పుడు ఆ భావాల్ని వ్యక్తపరచే వయసు నాకు లేదు. నా ఆలోచనల వరసకు ఎప్పుడూ నీ అండదండలుండేవి. ఆ ధైర్యమే ఈ రోజు నేను నా కాళ్ల మీద నిలబడగలిగేలా చేసింది. ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ వెన్నుతట్టేవాడివి. నీ చూపులతోనే నా మనసులోని భారాన్నంతా తొలగించేవాడివి. నా ఇష్టసఖుడివి కాబట్టి ఏ శుభవార్తనైనా ముందు నీకే చెప్పేదాన్ని. నాకు శుభం జరుగుతుందని తెలిసినప్పుడు నీ ముఖంలో కనపడే సంతోషాన్ని చూసి ఆనందించేదాన్ని. ఇప్పుడు మనం వేర్వేరు చోట్లలో ఉన్నాం. అయినా ఎప్పటిలానే శుభవార్తలు ఉంటే నీకే మొదట చెబుతున్నా... అయితే ఫోనులో! అందుకే ఆ సమయంలో నీ ముఖంలో కదలాడే సంతోషాన్ని చూడలేకపోతున్నా! కానీ, నీ మాటల్లో మాత్రం అది ధ్వనిస్తుంది.
మనిద్దరి మనసులూ ఒకటే. కానీ మన దారులు వేరు. కానీ, ఈ ఎడబాటుతో ఇద్దరం తీయటి బాధను అనుభవిస్తున్నాం. నువ్వు నా మీద పెంచుకున్న ప్రేమ, నమ్మకం చాలా గొప్పవి. నేనూ అంత నమ్మకంతోనే నిన్ను ప్రేమిస్తున్నాను.
ప్రస్తుతం బాధను కలిగించే విషయాలేవీ నీతో పంచుకోలేను. నువ్వు నీ బాధ్యతల్లో మునిగి తేలుతున్నావు. ఈ సమయంలో నీ ఏకాగ్రత చెదిరిపోవడం నాకిష్టం లేదు. అందుకే ఇదివరకు నువ్విచ్చిన ధైర్యంతోనే ముందుకు నడుస్తున్నాను. నిజం చెప్పనా! ఒక్కో విషయంలో నాకెంతో ఏడుపొస్తుంటుంది. మరుక్షణం నువ్వు గుర్తుకొస్తావు. వెంటనే ‘ఎందుకిలా పిచ్చిదానిలా ఏడుస్తున్నాను! నాకేం తక్కువ, ఇంత చిన్న సమస్యను పరిష్కరించుకోలేనా’ అని నన్ను నేను సమాధానపర్చుకుంటూ, జలపాతంలా ఉరికే కన్నీటికి అడ్డుకట్ట వేసుకుంటూ ఉంటాను. ఆ కష్టాన్ని అధిగమించాక... ఆ విజయాన్ని నీతో మాత్రమే మనస్ఫూర్తిగా పంచుకోగలను. అలా పంచుకునే సమయంలో నా సంబరం అంబరమంటుతుంది.
నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటననూ, నీకు ఎదురయ్యే ప్రతి అనుభవాన్నీ నాతో పంచుకునేవాడివి. కానీ, ఇప్పుడలా లేవు. నావన్నీ వింటావు - ‘‘నేనున్నానంటావు’’. మరి నీవన్నీ వినడానికి నేను లేనా? లేక నేనున్నాననే ధైర్యాన్ని నీకు ఇవ్వలేకపోతున్నానా? దూరంగా ఉన్నంత మాత్రాన నీ ఆలోచనలలో భాగస్వామిని కాలేకపోతున్నా? అది నా దురదృష్టమా! ఏది ఎలా జరుగుతోందో నాకు తెలియట్లేదు. కానీ, నీ మీద నాకున్న ప్రేమ శాశ్వతం. ఈ లేఖ చదివిన తర్వాత అయినా నా బాధను అర్థం చేసుకుంటావని, ఎప్పటిలాగానే నీ అంతరంగాన్ని నాతో పంచుకుంటావని ఆశిస్తున్నాను.
ఉద్యోగబాధ్యతల్లో, కుటుంబ విషయాల్లో నువ్వు తప్పు చేసినప్పుడు... ‘‘ఇది తప్పు’’ అని నేనంటే, నా మాటను గౌరవించావు. తప్పుల్ని సరిదిద్దుకున్నావు. నువ్వు ఉద్యోగాన్ని ఎంచుకునే సమయంలో నేను ఇచ్చిన సలహాను ఇష్టపడ్డావు. నా ఆలోచనల్లోని ఉద్యోగాన్నే ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. నా మాటకు నువ్వు విలువ ఇవ్వడం నాకెంత సంతోషంగా ఉందో తెలుసా! మాటల్లో చెప్పలేను. ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏం కావాలి... మన మనసులొకటే అనడానికి. భౌతికంగా నువ్వు నా పక్కన లేకపోవచ్చు. కానీ, అనుక్షణం నా శ్వాస నిన్నే స్మరిస్తూ ఉంటుంది. నా మనసెప్పుడూ నీతోనే ఉంటుంది.
‘నాకేంటి’ అనే గర్వాన్ని విడనాడి నువ్వు అందరినీ గౌరవించాలన్నది నా ఆశ. తోటివారికి సాయపడే మంచి మనసున్న మనిషిగా ఎదిగి, నువ్వు ఉన్నతస్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా...

ఇట్లు
నీ
మధువతి

నువ్వూ నేనూ!

వెనక్కి ...

మీ అభిప్రాయం