ఊర్మిళనే కానీ...!!

  • 1449 Views
  • 0Likes
  • Like
  • Article Share

    రుక్కు రామిశెట్టి

  • మధిర, ఖమ్మం జిల్లా
  • 9390279127

ప్రేమలేఖల పోటీలో రూ.1116 గెలుచుకున్న లేఖ

బావా!
నేను నీ రుక్కుని! బాగున్నావా?

నీకు ఉత్తరం రాయాలనుకుంటూనే వారం రోజులు గడిపేశా. మామయ్య గారి బాగోగులు చూసుకోవడం, ఇంటి పనులతో తీరికలేక రాయడం ఆలస్యమైంది. నువ్వు దూరంగా ఉన్నావనే కానీ నా మనసులో ప్రతి క్షణం నీ గురించే ఆలోచనలు. ప్చ్‌.. ఏంచేయను! నీ జ్ఞాపకాలతోనే బతుకుతున్నా.
ఇవాళ నిండు పౌర్ణమి. భోజనాలయ్యాక, మన పాప కీర్తిని పక్కలో పెట్టుకొని ఆకాశం వంక అలా చూస్తున్నాను. ఏదో అనుభూతి కలిగింది. వెన్నెల్లో చందమామని చూస్తే... కశ్మీర సరిహద్దుల్లో- శరీరాన్ని కోసే చలిలో, ఆ మంచుకొండల మధ్య దేశ రక్షణ కోసం ఒంటరిగా నిలుచున్న నువ్వు కనిపించావు.
బావా! ‘నాన్న ఎప్పుడొస్తారమ్మా?’ అని పాప అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ‘వస్తారమ్మా’ అంటూ తనని జోకొడుతున్నాను. తనకు ఆ మాట చెబుతున్నప్పుడు నా కళ్లలో నీళ్లు! అది చూసి ‘ఏమ్మా! ఏడుస్తున్నావు’ అని పాప అడుగుతుంటే మాట గొంతు దాటట్లేదు. ఎందుకోగానీ ఇలాంటప్పుడే రామాయణం గుర్తుకొస్తుంది. సీతారాములతో పాటూ లక్ష్మణుడు వనవాసానికి పయనమయ్యాడు కదా. వాళ్లతో ఆయన భార్య వూర్మిళ కూడా బయల్దేరబోయిందట. కానీ, లక్ష్మణుడు వద్దన్నాడట. అప్పటి నుంచి ఆయన తిరిగివచ్చేవరకూ వూర్మిళ అలాగే నిద్రపోయిందట- ఎవరితోనూ మాటామంతీ లేకుండా!!
అయినా బావా! వూర్మిళ కంటే నా పరిస్థితి కాస్త మెరుగేలే! ఏడాదికోసారి నువ్వు నెలరోజుల సెలవు మీద వస్తావు చూడు... అప్పుడు వసంతం వచ్చినట్లు ఉంటుంది. ఆ నెలరోజులూ ఎలా గడిచిపోతాయో తెలియదు. ఇట్టే అయిపోతాయి. నువ్వు తిరిగి ఆ మంచుకొండల్లోకి పయనమయ్యాక మళ్లీ నేను శిశిర లతనైపోతాను. వచ్చే వసంతం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తుంటాను. ఈమధ్యలో నాకు వూరటనిచ్చేది నీ ప్రతిరూపం... అదే బావా! మన కీర్తి. దాన్లోనే నిన్ను చూసుకుంటూ రోజులు గడిపేస్తుంటాను.
మనసు మరీ ఒంటరిదైపోయినప్పుడు జ్ఞాపకాలన్నీ కళ్లముందు కదలాడుతుంటాయి బావా! అప్పుడు నువ్వు ఇంటర్‌అనుకుంటా! నేను పదో తరగతి. నేను పరికిణీ మీద ఓణి వేసుకుని పుస్తకాల సంచితో బడికి వెళ్తుంటే, నువ్వు గేటు ముందు నిలబడి నావైపే కన్నార్పకుండా చూసేవాడివి గుర్తుందా!
నాకెంత సిగ్గేసేదో! సాయంత్రం ఇంటికెళ్లి అద్దంలో నన్ను నేను చూసుకునే దాన్ని! అయినా నువ్వెందుకలా చూసేవాడివో నాకు తెలిసేది కాదు. భయమో, కుతూహలమో కానీ విషయం మా అమ్మకు చెప్పాను. ‘‘వాళ్ల నాన్న మా అన్నయ్యేనే. వాడు నీకు మేనబావ. తన ఇష్టానికి వ్యతిరేకంగా మీ నాన్నను పెళ్లి చేసుకున్నానని మాట్లాడటం మానేశాడు మీ మామయ్య. మనింటి మీద కాకి ఆయనింటి మీద వాలకూడదన్నంతగా కక్ష కట్టాడు’’ అంది అమ్మ. ఇంతలో ఎప్పుడొచ్చాడో కానీ, నాన్న ఈ మాటలు వినేశాడు. ‘‘వాడితో మాట్లాడొద్దు. మనకంటే ఆస్తిపరులని వాళ్లకి గర్వం’’ అన్నాడు.
అలాంటిది మనమిద్దరం ప్రేమించుకున్నాం. వూరి విడిచిపెట్టిపోయి మరీ పెళ్లి చేసుకున్నాం. తర్వాత బస్తీలో చిన్న అద్దెగదిలో కాపురం... నన్ను పోషించడానికి నువ్వు కారు డ్రైవర్‌వి అయ్యావు. తర్వాత మన పాప పుట్టిన ఆర్నెల్లకే సైన్యానికి ఎంపికయ్యావు. నాతో పాటు దేశమన్నా నీకంతే ప్రేమ కదా!
కాలం కలిసివచ్చి మన రెండు కుటుంబాలు దగ్గరయ్యాయి. మామయ్య గారు మన దగ్గరికి వచ్చేశారు. సంతోషమే కానీ, నీకు దూరంగా ఉండటం మాత్రం బాధగా అనిపిస్తుంటుంది.
జాగ్రత్త బావా! ఉంటాను మరి. పక్కన పాప కలవరిస్తోంది... ‘‘నాన్న ఎప్పుడొస్తారమ్మా!’’ అంటూ!!!

- రుక్కు రామిశెట్టి
 

ఊర్మిళనే కానీ...!!

వెనక్కి ...

మీ అభిప్రాయం