తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

విమర్శ వర్షిస్తేనే సాహిత్యం హర్షిస్తుంది

  • 1623 Views
  • 1Likes
  • Like
  • Article Share

    గాలి సురేష్‌ నాయుడు

  • అనంతపురం
  • 9949742227

సాహితీ విమర్శలో నలభై ఏళ్ల అనుభవజ్ఞుడాయన. మంచిని మంచిగా, చెడును చెడుగా ఎత్తిచూపే విమర్శ ఆయనది. రచనలో గుణదోషాలకు విలువకట్టడంలో తనపర భేదం లేదు... అందుకే ఆయన విమర్శకు అంత విలువ. దశాబ్దంన్నర తర్వాత తెలుగు సాహిత్య విమర్శకు సాహిత్య అకాడమీ అవార్డు సంపాదించి పెట్టిన ఆ అక్షరశ్రామికుడు... మార్క్సిస్టు మార్గంలో సాహిత్యాన్ని నిశితంగా విమర్శిస్తూ, సమసమాజాన్ని కాంక్షించే ఆ ఆచార్యుడు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి. భాషా సాహిత్యాల గురించి తన మనోభావాలను, ఆలోచనలను ‘తెలుగువెలుగు’తో పంచుకున్నారిలా...
తె.వె: సాహిత్య విమర్శకుడిగా మీ ప్రయాణంలో ఆది అంకం ఏంటి? ఎలా ఉండేది?

నా చిన్నతనంలో మా నాన్న పొలంలో కష్టపడటం నేర్పారు. గురువులు చదువులో కష్టపడటం నేర్పారు. ఆ ముగ్గురు గురువులు... ఆచార్య జి.ఎన్‌.రెడ్డి, ఆచార్య మద్దూరి సుబ్బారెడ్డి, ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావుల ప్రోత్సాహంతోనే నా సాహిత్య విమర్శకు పునాది పడింది. వృత్తిని బాధ్యతగా భావించడంవల్లే నేను ఈ స్థాయికి ఎదగగలిగాను. ఉపాధ్యాయ వృత్తిని కేవలం వృత్తిగానే భావించి ఉంటే ఏమీ చేయగలిగేవాణ్ని కాదు. అందుకే తరగతిగదిలో పాఠం చెబుతూనే విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు గురించి ఆలోచించగలిగాను. నా విద్యాభ్యాసం తిరుపతిలో జరిగితే, ఉద్యోగ జీవితం అనంతపురంలో నడిచింది. అనంత పౌరసమాజమే నన్ను తీర్చిదిద్దింది. ఇక్కడి విద్యార్థులు, ప్రజా సంఘాలు, రాజకీయ పరిస్థితులు, రచయితల వల్లే నన్ను నేను మెరుగుపరచుకునే అవకాశం దక్కింది. ఇక్కడి పరిస్థితులపై అవగాహన లేకుంటే నేను వేరే రాచపాళెంగా మిగిలిపోయే వాణ్నేమో.
ప్రభావితం చేసిన వ్యక్తులు, సంఘటనలు...?
ఓసారి సి.నారాయణరెడ్డి గారిని కలిశాను. అప్పుడు... ‘నిన్ను ఇంకొకడు విమర్శిస్తున్నాడంటే... నువ్వు ఎదుగుతున్నావని అర్థం. నీ పనే అన్నిటికీ సమాధానం. పనిచేసుకుంటూ వెళితే అదే నీకు దారిచూపుతుంది’ అన్నారాయన. అదే ఇప్పటికీ నన్ను నడిపిస్తోంది. సాహిత్య విమర్శలో బాధ్యత నాకు ఉందనుకున్నా. అంతేకానీ అన్నింటా ‘రాచపాళెం’ ముద్ర ఉండాలనుకోలేదు. నేను పయనిస్తున్న మార్గం మార్క్స్‌వాదం, అంబేద్కర్‌వాదం. నాకు అనంతపురం వచ్చాకే మార్క్సిజం పరిచయమైంది. జీవితంలో పరిస్థితులకు, దేశంలో పరిస్థితులకు అదే సమాధానం అనిపించింది. నాకూ అది నచ్చడంతో దాన్ని చదువుకున్నా. దీనికోసం మార్క్సిస్టు సాహిత్యాన్ని, మార్క్సిస్టు తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేశాను. 1991లో అంబేద్కర్, 1995లో జాషువా శతజయంతులు వచ్చాయి. అప్పట్లో అంబేద్కరిజం వైపు అడుగులేశాను.
విమర్శ అంటే ఏంటి? ఏది మంచి  విమర్శ?
సాహిత్య విమర్శ అంటే ఒక రచనను, రచయితను చదవడం, అర్థమైన దానిని వివరించడం. ఆ రచయిత దేన్ని ఆదర్శంగా తీసుకుని రచన చేశారన్నది ఇక్కడ ప్రధానం. ఇప్పటి రచయితలు వస్తువును బాగానే తీసుకుంటున్నారు. కానీ, దాన్ని అర్థం చేసుకోవడంలోనే తాత్విక నేపథ్యం లేకపోవడంతో చిత్రణ సరిగా ఉండటం లేదు. ఫలితంగా గొప్ప నవలలు, కథానికలు రావడం లేదు. రచయిత ఇష్టాయిష్టాలను వ్యక్తపరచడానికి పాత్రల్ని వినియోగించుకుంటున్నారు. అది సరికాదు. అలాంటి దోషాలున్న చోట స్నేహితులైనా ఎత్తి చూపుతున్నాను. గుణాలను, దోషాలను ఎత్తిచూపడంలో కట్టమంచి రామలింగారెడ్డి ఆద్యుడు. ఆయన తనకు నచ్చినదాన్ని ఎంతగా ప్రశంసిస్తారో, నచ్చనిదాన్ని అంత తీవ్రంగానూ ఖండిస్తారు. గుణదోషాల్ని కొలతేయగలిగిన వాళ్లలో రాచమల్లు రామచంద్రారెడ్డి, త్రిపురనేని మధుసూదన్‌రావులు ముఖ్యమైనవాళ్లు. రాచమల్లును శ్రీశ్రీ క్రూరుడైన విమర్శకుడన్నారంటే ఆలోచించండి. సన్నిహితులనూ విమర్శల్లో వదిలిపెట్టరాయన. ఇక, త్రిపురనేని కూడా అంతే. నేను వాళ్లంత గట్టిగా విమర్శించను కానీ, రచయిత రచనను పట్టిచూపుతాను. రచనలో మంచిని మంచిగా, చెడును చెడుగా గుర్తించేదే సద్విమర్శ. ఇవి సాపేక్ష పదాలు. ఒకరికి నచ్చినవి మరొకరికి నచ్చవు. అయితే రచయితకు ఓ దృక్పథం ఉంటుంది. దాన్ని సమాజమే గుర్తిస్తుంది.
మీరు మార్క్సిస్టు విమర్శకులు కదా! మరి ఒక కోణం నుంచి చూస్తే అది పూర్తిస్థాయి విమర్శ ఎలా అవుతుంది?
మనకు అందుబాటులో ఉన్న తత్వశాస్త్రాల్లో మార్క్సిజం ఒకటి. రాజ్యాన్ని, సమాజాన్ని, సాహిత్యాన్ని అర్థంచేసుకోవడానికి మార్క్సిజం ఇంకే తత్వశాస్త్రం కన్నా ఎక్కువగా సరిపోతుంది. సంప్రదాయవాదమంటే ఆధ్యాత్మికవాదం, భావవాదం. భారతదేశాన్ని చూస్తే.. అది వర్ణవ్యవస్థను ప్రోత్సహించేది. సంప్రదాయవాదం ఎక్కువమంది ప్రజలకు వ్యతిరేకం. అందరికీ అనుకూలమైంది మార్క్సిజం ఒక్కటే. భారతదేశంపరంగా అంబేద్కరిజాన్ని కలుపుకోవాలి. ఇక్కడ కులసమస్య ఎక్కువ. కుల నిర్మూలనకు పాటుపడాలి.
విశ్వనాథ, కట్టమంచి తెలుగులో అద్భుత విమర్శకులు కదా!...
విశ్వనాథ సత్యనారాయణ, కట్టమంచి రామలింగారెడ్డి 20వ శతాబ్ది ఆరంభంలో రెండు విమర్శ మార్గాలకు ప్రతినిధులు. ఆధునిక సాహిత్య విమర్శకు కట్టమంచి ఆద్యుడు. 1914లోనే ‘కవిత్వ తత్వ విచారం’ అనే విమర్శా గ్రంథం రాశారు. అది మంచి, చెడులను అలాగే చెప్పిన పుస్తకం. కురుగంటి సీతారామయ్య ‘అలంకార తత్వ విచారము’ అనే పుస్తకాన్ని ‘కవిత్వ తత్వ విచారాన్ని’ ప్రతిఘటిస్తూ రాశారు. ఆ తర్వాత కాళూరి వ్యాసమూర్తి ‘కవిత్వ తత్వ విచార విమర్శ’ను రాశారు. అప్పటి నుంచి తెలుగు సాహిత్య విమర్శ సంప్రదాయ, ఆధునిక మార్గాల్లో వెళుతోంది. సంప్రదాయ మార్గం విశ్వనాథది అయితే కట్టమంచిది ఆధునికం. కవిత్వ తత్వ విచారం ఆధునిక సాహిత్య విమర్శకు కొలమానంగా మారింది. తర్వాత కట్టమంచి శిష్యులు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ ఈ రెండు మార్గాలను సమన్వయం చేసేందుకు ప్రయత్నించి విజయం సాధించారు. ఆయన పిడివాది కాదు. వేమన, నాటకోపన్యాసాలు, సారస్వతాలోకం అనేవి ఆయన విమర్శా గ్రంథాలు.. ఇక పుట్టపర్తి నారాయణాచార్యుల తర్వాత అభ్యుదయ సాహిత్యం వచ్చింది. ఎమ్మార్‌ చంద్ర, పుచ్చలపల్లి సుందరయ్య వంటి వారి నుంచి శ్రీశ్రీ, కొడవటిగంటి వంటి వారంతా అభ్యుదయవాదులే. అయితే విశ్వవిద్యాలయాల్లో మొన్నటివరకు విశ్వనాథ మార్గమే కొనసాగింది. ఆయన అనుయాయులు చాలామంది ప్రొఫెసర్లుగా ఉన్నారు. దాంతో వారి భావాలను సాహిత్య విమర్శపై బాగా ఎక్కించారు. పోటీపరీక్షల్లోనూ వాళ్లు వాళ్ల అభిప్రాయాలనే చొప్పించారు. నవ్య  సంప్రదాయవాదాన్ని నెట్, స్లెట్‌ వరకు చేరవేశారు. విశ్వవిద్యాలయాల బయటేమో కట్టమంచి హవా సాగింది. సమాజంలో మాదిరిగానే సాహిత్యపరంగానూ రెండు వర్గాల మధ్య ఈ సంఘర్షణ జరుగుతోంది.
సాహితీ విమర్శలు రచయితల దృక్పథాన్ని మారుస్తాయా?
తప్పక మారుస్తాయి. ఉదాహరణకు 1980లో యండమూరి ‘తులసీదళం’ నవల రాశారు. అది సూడో సైంటిఫిక్‌ నవలగా పేరొందింది. అత్యాధునిక సాంకేతికతను వాడుకుని దెయ్యాలు, భూతాలున్నాయని రాయగా.. వాటిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొమ్మూరు వేణుగోపాలరావు ఆ నవలకు ముందుమాట రాస్తే.. రంగనాయకమ్మ దానిమీద ‘తులసీదళమా.. గంజాయిదమ్మా?’ అనే విమర్శ రాశారు. దీనిపై కోర్టుకు వెళ్లినా, విమర్శ వెనక్కి తీసుకోనన్నారామె. ఈ సందర్భంలో సాహిత్య విమర్శ విజయం సాధించిందని భావిస్తున్నా. గుంటూరు శేషేంద్రశర్మ కూడా మార్మిక, తాంత్రికవాదాన్ని కలిపి నవలగా రాశారు. అది ధారావాహికగా వచ్చింది. దీన్నీ మహిళలు విమర్శించారు. కొడవటిగంటి ‘మంచి సమాజం ఏర్పడాలంటే మంచి సాహిత్యం రావాలి. మంచి సాహిత్యం రావాలంటే మంచి సాహిత్య విమర్శ రావాలి. సాహిత్య విమర్శ సైతం విమర్శకు గురికావాలి’ అన్నారు. అది  అక్షరాలా అనుసరణీయం.
ప్రపంచీకరణ, ఆధునిక సాంకేతికత ఒకవైపు.. మార్కులు, ఉద్యోగాల కోసం చదువుతున్న పరిస్థితి మరోవైపు..  సమాజాన్ని ప్రభావితం చేస్తున్న దశలో తెలుగు భాషా సాహిత్యాల మనుగడ ఎలా ఉండొచ్చు?
వందేళ్ల కిందటే గురజాడ ‘ముత్యాలసరాలు’ రాశారు. అందులో ఇంగ్లిషు విద్య భారతీయుల్లో తెచ్చే మార్పును చెప్పారు. ‘పొట్టకూటికి నేర్చు విద్యలు పుట్టకీట్లు కదిల్చెను’ అన్నారు. ఆయన అన్నట్లే అది ఉద్యోగానికి పరిమితం కాకుండా అన్నింటినీ ప్రభావితం చేస్తోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో పెట్టుబడిదారీ వ్యవస్థ వంటివి కీలకమయ్యాయి. మెకాలే విద్యను సార్వత్రికం చేయడమూ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడ లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయి. ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ విధానాలవల్ల మన ఇరుగు పొరుగు దేశాల గురించి ఏమాత్రం తెలియనివాళ్లు సైతం అమెరికా లాంటి దేశాల్లో, ఊహించని రీతిలో లక్షల్లో జీతాలు పొందుతున్నారు. అయితే భారత్‌లో ఉపాధి లేకుండా పోవడం ఏమి గర్వం! ఇలా ఎన్నో ఉన్నాయి. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. ప్రపంచీకరణను ఆమోదిస్తే నష్టాలన్నీ భరించాలి. అందుకని రాజ్యాంగంలో రాసుకున్న ‘స్వావలంబన’ అనే మాటకు కట్టుబడి ప్రపంచీకరణను వ్యతిరేకించాలి. అప్పుడే తెలుగు భాషకు మనుగడ.
మాండలికం ప్రత్యేక భాష అవుతుందా?
మాండలికం ఒకప్పటి మాట. ప్రాంతీయత, ప్రాదేశికత, స్థానికత అని నేడు అంటున్నాం. మాండలికం అనే మాటను భాషా శాస్త్రవేత్తలు సృష్టించారు. భారత్‌ మిట్టపల్లాల దేశం. సమతలం కాదు. అలాగే భాష, తిండి, వేషధారణలోనూ వైవిధ్యం కనిపిస్తుంది. ఇది అనివార్యం. మాండలికాలను కాపాడుకోవాలి. కానీ అదే సర్వస్వం అనుకోకూడదు. మాండలికం ఉంటుంది. కానీ, ప్రమాణ భాషా సృష్టించుకోవాలి. గురజాడ, కందుకూరి వంటివారు దీనికోసం కృషిచేశారు. తర్వాత కాలంలో కృష్ణా, గుంటూరు జిల్లాల శిష్టుల భాషే ప్రమాణభాషగా మారింది. అదే తెలుగువాళ్ల అందరి రచనాభాషగా మారింది. సినిమాలు తెలుగుకు చేసిన నష్టం అంతాయింతా కాదు. హాస్యనటులకు, పనిమనుషులకు రాయలసీమ భాష.. నాయికా నాయకులకేమో కోస్తాంధ్ర భాష వాడతారు. సీమ భాషను ప్రతినాయకుడికి వాడుతున్నారు. ఇది తప్పు. ఈ ధోరణి మారాలి. ఒకప్పుడు రాయలసీమ భాష ఎగతాళికి గురైంది. తెలంగాణ సాహిత్యాన్ని కోస్తా పత్రికలు తిరస్కరించిన పరిస్థితి ఉంది. ఇప్పుడైతే గోండు భాషలో రాసినా చక్కగా చదువుకుంటున్నారు.
నాటికి, నేటికీ తెలుగు భాషా సాహిత్యాల పట్ల విద్యార్థుల్లో స్పందన?
మేం విద్యార్థులుగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులకంటే ముందే తరగతి గదిలో కూర్చునే వాళ్లం. 1990 నుంచే తరగతి గదులు ఖాళీ అవడం ప్రారంభమైంది. 1995 తర్వాత విద్య, వ్యవసాయం.. ఇలా అన్నీ ప్రైవేటీకరణకు గురవుతుండటంతో సమాజంలో బాధ్యతారాహిత్యం పెరిగింది. ప్రభుత్వం ఉపాధి రంగాన్ని మూసేసుకుని ప్రైవేటుపై ఆధారపడమని చెప్పడం పరిస్థితిని మార్చేస్తోంది. దీంతో విద్యార్థులు తరగతులు ఎగ్గొట్టి పోటీపరీక్షలే లక్ష్యంగా బతుకుతున్నారు. నా అనుభవంలోనే తరగతి గదిలోకి వెళ్లాలంటేనే భయమేసేది. ఎవరికి పాఠం చెప్పాలనిపించేది. ఇది రాజకీయ వైఫల్యం వల్లే జరిగింది. సామాజిక, సంప్రదాయ శాస్త్రాల్లోనే ఈ పరిస్థితి ఏర్పడింది. విశ్వవిద్యాలయాల పనితీరు ఇలా అవడానికి ప్రభుత్వమే కారణం అనుకుంటున్నా.
సాహిత్య అకాడమీ పురస్కారాన్ని సంపాదించి పెట్టిన ‘మన నవలలు- మన కథానికలు’ రాసేందుకు నేపథ్యం?
తెలుగులో సాహిత్య విమర్శలో కవిత్వానికి సంబంధించిందే ఎక్కువ. నవలలు, కథానికలను కలిపి కాల్పనిక సాహిత్యం అంటాం. దీని మీద విమర్శ పరిమితంగా వస్తోంది. ఈ లోటును భర్తీ చేసి, నవల, కథానిక విమర్శను బలోపేతం చేయడానికే ‘కథాంశం’, ‘మన నవలలు- మన కథానికలు’ అనే గ్రంథాలను రాశాను. అయితే నేను కూడా కవిత్వ విమర్శనే ఎక్కువగా రాశాను. ప్రాచీనంపై మూడు, ఆధునిక కవిత్వంపై మూడు పుస్తకాలు రాశాను. బండి నారాయణస్వామి ‘గద్దలాడతండాయ్‌’ పైనా.. కథానిక విమర్శ గురజాడ అప్పారావు దిద్దుబాటుతోనే మొదలుపెట్టాను. నవలలపై 13 వ్యాసాలే రాశాను. ఇప్పుడు కాల్పనిక సాహిత్యం ఎక్కువగా వస్తోంది. పాఠకులను ఎక్కువ తయారు చేసేవి నవలలు, కథానికలే. వీటి మీద విమర్శ రాయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే కాల్పనిక సాహిత్య విమర్శ పరిమితంగా వస్తోంది.
కవిత్వం, కథలు వస్తున్నట్లు తెలుగులో నాణ్యమైన వ్యాసాలు రావట్లేదెందుకు? వ్యాసం ఆధునిక ప్రక్రియ. కందుకూరి నుంచి కొన్ని వందల మంది దీన్ని అభివృద్ధి చేశారు. అయితే వ్యాసంలో నాణ్యత అవసరం. రెండున్నర లక్షల కథానికల్లో నాణ్యమైనవి 15శాతం, కొన్ని వేల నవలల్లో నాణ్యమైనవి కొన్నే. ఇదే సూత్రం వ్యాసాలకూ వర్తిస్తుంది. లక్షల్లో 10శాతం వ్యాసాలు మాత్రమే నాణ్యంగా ఉంటున్నాయి. మంచి వ్యాసాలు, గొప్ప వ్యాసాలు వస్తున్నా వాటి రాశి తక్కువ. మంచివాటిని ఏరుకోవడం జనానికి కష్టంగా మారింది. నిజం చెప్పాలంటే వ్యాససాహిత్య సృష్టి నిత్యావసరం. కందుకూరి తన సంస్కరణ కార్యకలాపాలకు వ్యాసాలను విరివిగా వాడుకున్నారు. బాల్యవివాహాల నిర్మూలన నుంచి వేశ్యాసమస్య వరకు అనేక అంశాల మీద ఆయన రాసిన వ్యాసాలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. జాతీయోద్యమ కాలంలో వ్యాసాలే ప్రజల్లో కదలికను తెచ్చాయి.
తెలుగు సాహిత్యంలో విమర్శ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉంది? భవిష్యత్తు ఏంటి?
తెలుగులో సాహిత్య విమర్శపై కొన్ని అసంతృప్తులు వినిపిస్తున్నాయి. విమర్శ అంతగా ఎదగలేదు, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉందన్న వాదన ఉంది. అయితే అది ఎప్పుడూ ఉండేదే. ప్రస్తుతం విమర్శలు వస్తున్నప్పటికీ.. హేతుబద్ధత కంటే మించి గందరగోళం సృష్టించే విమర్శే ఎక్కువ. స్పష్టమైన వైఖరి, నిర్దిష్ట భావజాలం లేకుండా విమర్శ చేసేవాళ్లే తెలుగులో ఎక్కువ. భావజాలం ఉన్నవాళ్ల సంఖ్య పరిమితం. భావజాల దారిద్య్రంతో రాసేవాళ్ల విమర్శ పద్యానికి తాత్పర్యం చెప్పినట్లుగా ఉంటుందే కానీ, వ్యాఖ్యానించినట్లుగా ఉండటం లేదు. శాస్త్రాలు చదువుకోకుండా విమర్శలు రాయడం సరికాదు. సాహిత్యాన్ని మాత్రమే చదివి సాహిత్య విమర్శ చేయొద్దు. అయినా... సాహిత్య విమర్శ భవిష్యత్తుకు ఢోకాలేదు.
విమర్శనాత్మక సాహిత్యంలో నేటి యువ రచయితల భాగస్వామ్యం?
యువ విమర్శకులు ఇప్పుడు తెలుగులో పదిమంది దాకా గట్టివాళ్లు ఉన్నారు. వీరికి వెలుపల ఉన్నవాళ్లు, విశ్వవిద్యాలయాల్లో పరి శోధకులు చాలా వ్యాసాలు రాస్తున్నారు. యువ విమర్శకులకు సరైన దృక్పథం, భావజాలం ఉండటం లేదు. అవి ఉంటేనే భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది. ఆశావాదులం కాబట్టి.. భవిష్యత్తులో సాహిత్యం బాగుంటుంది, విమర్శ సైతం బాగుంటుందని ఆశిస్తున్నా.
ఒక విమర్శకుడిగా సమకాలీన సాహిత్యాన్ని ఎలా చూస్తున్నారు? 
దళిత, మైనారిటీ, అభ్యుదయ, విప్లవ, స్త్రీ.. ఇలా ఎన్నో వాదాలు ఉన్నాయి. అయితే గతంలో కనిపించిన ఉద్ధృతి తగ్గినట్లు కనిపిస్తోంది. కానీ, ఆ తరహా రచనలు వస్తూనే ఉన్నాయి. మొన్ననే 2014లో రచనలు ఎలా ఉన్నాయని పరిశీలిస్తే.. స్త్రీని సాహిత్యంలో అద్భుతంగా సృష్టించిన పరిస్థితి కనిపించింది. గురజాడ చెప్పినట్లుగా ఆధునిక రచనల్లో స్త్రీకి తిరిగి గొప్పతనం చేకూరినట్లయింది.
నవలా సాహిత్యానికి ఆదరణలో అప్పటికీ, ఇప్పటికీ ఉన్న తేడా...
చాలానే ఉంది. 20వ శతాబ్దంలో అక్షరాస్యతను 3 శాతం నుంచి పెంచింది నవలలే. కొవ్వలి, జంపన అనే వాళ్లు వేయి నవలలు రాశారట అప్పట్లో. వాటిని జనం విపరీతంగా చదివారు. ఇప్పుడేమో పత్రికలు, టీవీలు, సినిమాలు.. పెరగడంతో గతంలో నవలకే కేటాయించిన సమయం ఇప్పుడు ఆరేడు రంగాలకు కేటాయించడంతో పఠనం తగ్గింది. ఇది అనివార్యం.
రెండు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధనలు ఎలా ఉన్నాయి? 
ఇది జటిలమైన ప్రశ్న. అయినప్పటికీ.. పరిశోధనలు అంత ప్రామాణికంగా లేవన్నది చాలా కాలంగా వినిపిస్తున్న మాట. ఇది వాస్తవమే. పరిశోధనలు ప్రవృత్తిగా కాకుండా ఏదైనా ఉపాధికి సాధనంగా ఉపయోగించడం మొదలుపెట్టే స్థితి నెలకొని ఉంది. ఇప్పటి పరిశోధనల్లో ప్రామాణికత 10శాతం, అప్రామాణికత 90శాతంగా ఉంది. దీనికి ఉపాధ్యాయుడిపై అదనంగా బరువుపెట్టడం, ఇతర వ్యాపకాలు.. ఇలా ఎన్నో కారణాలు. మొత్తంగా పరి శోధనలో ప్రమాణాలు లోపించాయి.
రాయలసీమ స్థానిక పదకోశం ప్రచురణలో మాండలికం ద్వారా కొత్త పదసృష్టికి ప్రయత్నించారా?
తితిదే ప్రచారం ఆరంభించే వరకు అన్నమయ్య పదాలకు అంతగా ప్రాచుర్యం రాలేదు. సంప్రదాయవాదులు ఆయన సాహిత్యాన్ని పాడుకుంటూ మాత్రమే వెళ్లిపోయారు. ప్రస్తుతం సి.పి. బ్రౌన్‌ భాషా పరిశోధనా కేంద్రం బాధ్యునిగా ఉన్న నేను రాయలసీమ నవలలు, కథానికలు పుస్తకాల్లో ఉపయోగించిన రాయలసీమ పదాలను రెండేళ్లుగా ఏరిస్తున్నా. చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. ఇంకో ఏడాదిలో రాయలసీమ ‘కల్పనా సాహిత్యం- స్థానిక పదకోశం’ అనే పుస్తకం తయారవబోతోంది. వీటితోపాటు వేమనను, అన్నమయ్యను అధ్యయనం చేస్తే అనేక విషయాలు వెలుగుచూస్తాయి. తెలంగాణలోనూ ఈ కృషి జరగాలి. ఈ దృష్టితో కె.ఎ.ప్రభాకర్‌ బాగా కృషి చేస్తున్నారు.
తెలుగులోకి వెల్లువెత్తుతున్న ఆంగ్ల మాటలను ఎలా అడ్డుకోవాలి? 
కొత్త పదసృష్టిలో విశ్వవిద్యాలయాల కంటే పత్రికల పాత్ర తిరుగులేనిది. ఇందులో ‘ఈనాడు’ కృషి గణనీయం. ఇరవై ఏళ్ల క్రితమే ఎస్కేయూ ఆచార్యులు బ్రహ్మానంద ‘ఈనాడు’ కొత్త పదాల సృష్టిలో ముందున్నదని పరిశోధనలో తేల్చారు. ‘ఈనాడు’ పడికట్టు పదాల వాడుకలోనూ చాలా దూరంగా ఉంటుంది. ‘ఈనాడు’ సాహిత్యానికి ప్రాముఖ్యం ఇవ్వదు అంటుంటారు కానీ.. అది భాషా సాహిత్యానికి చేస్తున్న సేవ అపారం. యూనిఫాం, ఇంటర్నెట్, కాంట్రాక్టరు వంటి పదాలకు తెలుగు పదాలను రూపొందించి అబ్బురపరిచారు.
అధికార భాషగా తెలుగు అమలు కావాలంటే... ?
రాజకీయ సంకల్పం ఉండాలి. చట్టాలు మనకు బాగా ఉన్నాయి. ప్రజల కంటే ఎక్కువగా నాయకులు తెలుగు గురించి మాట్లాడతారు. కానీ చిత్తశుద్ధి కావాలి. పాలకులు నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం అనుకుంటే వారంలో అమలవుతుంది.

(రాచపాళెం చంద్రశేఖరరెడ్డి: 94402 22117)


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి