తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

జానపదాన్ని కాపాడితే అమ్మభాషను కాపాడినట్లే

  • 7633 Views
  • 83Likes
  • Like
  • Article Share

    బి.ఎస్‌.రామకృష్ణ

  • విశాఖపట్నం
  • 8008535410

జానపద గేయాలకు సరికొత్త ఉరవడి సృష్టించి... పల్లెపదాలకు కొత్త ఊపునీ, ఉత్సాహాన్నీ ఇచ్చి.... ప్రజల్లో చైతన్యం నింపి.... పోరాట స్ఫూర్తిని రగిల్చి.... ప్రజా ఉద్యమాలకు ఊపిరులూదిన ఘనత ఆయన సొంతం. ఆయన పాటపాడుతూ చిందేస్తుంటే... ఎవరికైనా ఆయనతో గళం కలిపి చిందేయాలనిపించక మానదు. ఆయన పాటల్లోని పదాల తూటాలు నేరుగా జనాల్లోకి వెళ్లి పోరుబాట పట్టించగల ఆవేశాన్నీ, దేశభక్తినీ రగల్చగలిగేంత శక్తిమంతంగా ఉంటాయి. ఆధునిక జానపద పాటను ఉద్యమాలకు అందించిన తొలి కవిగా ఆయన జాతీయస్థాయిలో పేరుగాంచారు. ‘ఏం పిల్లడో ఎల్దుంమొత్తవా?’ అంటూ ఉత్తుంగతరంగంలా సాగే ఒక్కపాట దేశమంతా పాకి ఉద్యమ చిరునామాగా నిలిచి ఉందంటే ఆయన ప్రతిభాపాటవాలు అర్థం చేసుకోవచ్చు. జాతి మరువలేని ఎన్నో అచ్చతెలుగు జానపద పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. జానపద పాటలే ఊపిరిగా, అతి నిరాడంబరంగా జీవిస్తున్న ప్రజాకవి, ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు ‘తెలుగు వెలుగు’తో తన యాభైఏళ్ల జానపద జీవిత అనుభవాల్ని పంచుకున్నారు.
జానపదానికి ఇలా పరిచయమయ్యాను..
మాది విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామం. నాన్న జగన్నాథం, అమ్మ చినతల్లి. నెలల వయసున్నప్పుడే అమ్మ చనిపోవటంతో అమ్మప్రేమకు దూరమయ్యా. ఐదో తరగతి వరకు సొంతూళ్లోనే చదివి ఆరో తరగతి పార్వతీపురంలోనూ, ఏడో తరగతి నుంచి పెదబొండపల్లిలోనూ చదివాను. అప్పుడప్పుడు ప్రాస కలిసేలా చిన్నచిన్న కవితలు రాసుకుని తెలిసిన వాళ్లకు వినిపించేవాడిని. దీంతో అందరూ నన్ను ‘ఒరేయ్‌... కవీ’ అని పిలిచేవారు. ఆ ఉత్సాహంతో మరికొన్ని కవితలు రాసి వినిపిస్తుండేవాడిని. చివరికి అదో వ్యాపకంగా మారింది. నా చిన్నతనంలో బుర్రకథల ప్రదర్శనలు పెద్దఎత్తున జరిగేవి. నేనెందుకు బుర్రకథ రాయకూడదనిపించింది. 
      8వ తరగతి చదివే రోజుల్లోనే సొంతగా గాంధీ జీవితంపై ఒక బుర్రకథను రాశా. ఆరోజుల్లో పాఠశాల వార్షికోత్సవాలు పండుగల్లా జరిగేవి. అక్కడ నేను రాసిన బుర్రకథను ప్రదర్శించా. ‘అంబవైన నీవేనమ్మ భారతాంబ.... జగదాంబవైన నీవేనమ్మ శారదాంబ.. పోరుబందరులో షావుకారుగాంధీ సామాన్యుడుకాదు.... తందానా తందానా దేవనందనానా..’ అంటూ దేశభక్తి, గాంధీ మహాత్ముని విశిష్టతలను కలగలిపి రాసిన ఆ బుర్రకథకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
సిపాయి అవ్వబోయి...
పదోతరగతిలో ఉన్నప్పుడు చైనాతో యుద్ధం వచ్చింది. ఇంట్లో చెప్పకుండా ఆరుగురు మిత్రులతో కలిసి సైన్యంలో చేరేందుకు ఎంపిక ప్రక్రియకు వెళ్లి ఎంపికయ్యా. అయితే ఆ ఉద్యోగం నన్ను నిర్బందించినట్లుగా ఉండేది. మళ్లీ సొంతూరుకు వచ్చేశాను. ఒడిశాలోని రాయగడలో పొలాల ధరలు బాగా తక్కువని నాన్న అక్కడ 30 ఎకరాలు కొన్నారు. ఆ పొలం పనులు చూసుకుంటూ ఖాళీ సమయంలో సినిమా హీరోలను అనుకరిస్తూ మిమిక్రీ చేస్తుండేవాడిని. సినిమా థియేటర్ల పోస్టర్‌ రిక్షాలో మైకు పట్టుకుని మిమిక్రీ చేస్తుంటే జనాలందరూ బిలబిలమంటూ వచ్చేవారు.. ఆ రోజుల్లో అది గొప్పగా అనిపించేది. అలా ఆరునెలలు గడిపేశా. ఆ తరువాత ఐ.టి.ఐ. చదివితే ఉద్యోగాలొస్తాయని తెలిసి బొబ్బిలి ఐ.టి.ఐ.లో చేరా. రెండు సంవత్సరాలు కష్టపడి ఫిట్టర్‌ కోర్సు పూర్తిచేశా. 
తర్వాత విజయనగరం జిల్లా వీరభద్రపురం గ్రామానికి చెందిన విజయలక్ష్మిని వివాహం చేసుకున్నా. ఆమెను పోషించడానికైనా కొంత డబ్బు వెనకేసుకోవాలన్న స్పృహ అప్పుడొచ్చింది. ఏం చేయాలో  పాలుపోలేదు. ఉద్యోగాల కోసం వేట  మొదలుపెట్టాను.
పక్షవాతానికి గురయ్యా...
కొడుకు, కూతురు పుట్టినా చేయడానికి సరైన ఉద్యోగం దొరక్క ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడేవాడిని. అత్తింటివారు మమ్మల్ని అర్థం చేసుకుని వాళ్లింటికి తీసుకెళ్లి కొన్నాళ్లు పోషించారు. నాకు చాలా సిగ్గుగా ఉండేది. కవితలు చెప్పుకుంటూ ఖాళీగా కూచుంటావంటూ చుట్టుపక్కలవారు ఎగతాళి చేస్తుంటే తీవ్ర ఆవేదనకు లోనయ్యేవాడిని. అక్కడక్కడ పొలం పద్దులు రాస్తే రోజుకు మూడురూపాయలు వచ్చేవి. ఆ మొత్తం దేనికీ సరిపడేదికాదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడక మానసికంగా తీవ్రమైన క్షోభ అనుభవించేవాడిని. దీంతో ఆరోగ్యం దెబ్బతిని పక్షవాతం వచ్చేసింది. మూతివంకర పోవడంతో నాపనైపోయిందనుకున్నా. అదృష్టవశాత్తూ కొద్దికాలానికి కోలుకున్నా. తరవాత  హిందుస్తాన్‌ షిప్‌యార్డులో యూనియన్‌ నాయకుడైన ఆడారి సత్యనారాయణవల్ల షిప్‌యార్డులో దినసరి కూలీగా అవకాశం వచ్చింది. తరువాత ‘వారపు కూలీ’గా, ‘89రోజుల’ కూలీగా కూడా కొంతకాలం పనిచేసిన తరువాత నా నియామకం ఖరారైంది. అప్పటికి నేననుభవిస్తున్న ఆర్థిక బాధలకు కొంత అడ్డుకట్ట పడినట్లైంది.
పురిపండా వ్యాఖ్యలతో కొత్త ఉత్సాహం....
ఉద్యోగం కోసం 1970లో విశాఖ వచ్చినపుడు, అదే రోజు పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో జగదాంబ సెంటర్లో భారీ బహిరంగసభ జరుగుతోంది.. విశాఖ రచయితల సంఘం, అభ్యుదయ రచయితల సంఘం, విప్లవ రచయితల సంఘం తదితరాలకు చెందిన ఎందరో కవులు వచ్చారు. ఆనాడు జానపద కవితలు చెప్పే వారు, పాటలు పాడినవారు ఒక్కరూ లేరు. నాకు ఒక అవకాశం ఇవ్వాలని అడిగా. నేను రాసుకున్న జానపద పాటల్ని పాడాను. ఉత్సాహంగా చిందేస్తూ... పాడుతూ ఉంటే ఆహూతులు కూడా ఊగిపోయారు. నాతో గళం కలిపారు. ఆరోజు కార్యక్రమానికి వచ్చిన రచయిత, కవి, సాహితీవేత్త పురిపండా అప్పలస్వామి మాట్లాడుతూ ‘కవితా లోకంలో నీకంటూ ఓ సింహాసనాన్ని నువ్వు వేసుకున్నావు’ అంటూ నాలో కొత్త ఉత్సాహం నింపారు. ‘సామాన్యుల నాడి పట్టుకుని... ఎవరికీ అర్థం కాని కవితల కన్నా అందరికీ అర్థమయ్యే చిన్నచిన్న పదాలతో జానపదానికి సరికొత్త ఉరవడి సృష్టించావ’ంటూ ప్రోత్సహించారు.
ఉత్తరాంధ్ర యాస, మాండలికానికి ప్రత్యేక గుర్తింపు....
రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరాంధ్ర ఒకింత వెనకబడింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక యాస, ప్రత్యేక పదాలు ఉండటంతో చాలా మంది కవుల రచనలు ఉత్తరాంధ్రవాసులు అర్థం చేసుకోలేని పరిస్థితి ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో నేను రాసే కవితలు ఇక్కడి యాసకు అనుగుణంగా ఉండటంతో సామాన్యుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఉత్తరాంధ్ర యాసకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు రావడానికి నా రచనలు దోహదపడ్డాయంటారు. అదో సంతోషం.
ప్రజాగాయకుడిగా రూపాంతరం....
పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో 1974లో పార్వతీపురంలో ప్రథమ రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పౌరహక్కుల నేతలు, అరసం, విరసం కవులు, స్థానికులు 50వేలమందికిపైగా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో... 
కూడూ గుడ్డా లేనీ కూలీ నాలోలూ.. కొట్టాలీ కొడవలికీ కక్కులూ.. కొయ్యాలీ వరిసేను దుబ్బులూ.. ఎయ్యాలీ ఓవోవూ కుప్పలూ.. పంటకు వచ్చిందీ కామందుల సేనీ.. ఆకలి మంటలని ఏడుపింక మానీ.. ఎన్నుగింజ కడదాకా కష్టమంత మనదేనని.. ఎదురొచ్చిన దొరబాబుని గుండె గుద్ది కొయ్యరండి.. అంటూ నేను పాడిన పాటలకు జనాలు నీరాజనాలు పలికారు. కార్యక్రమానికి హాజరైన శ్రీశ్రీ నా గురించి మాట్లాడుతూ ‘ప్రజా గాయకుడు’గా సంబోధించారు. ప్రజలతో పాటూ వన్స్‌మోర్‌ అన్నారు. ‘నువ్వే ప్రజాకవివి’ అంటూ నేను రాసుకున్న ఎనిమిది పాటల్ని పాడించుకుని విన్నారు. వాస్తవానికి ఆయన ప్రశంసలతోనే నేను వెలుగులోకి వచ్చానంటే అతిశయోక్తికాదు. శ్రీశ్రీతోపాటూ రావిశాస్త్రి, కారా మాస్టార్ల పరిచయాలూ నాకు దిశా నిర్దేశం చేశాయి.
ఉద్యమాలకు ఊపిరులూదిన జానపద సాహిత్యం....
ఆరోజుల్లో శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం ఉవ్వెత్తున ఎగసింది. పేదలు పడుతున్న కష్టాలు, బాధలు, సమస్యలన్నింటినీ జోడిస్తూ నేను పాటలు రాసేవాడిని. వారిని కష్టాల్లోంచి విముక్తుల్ని చేయాలన్న బలమైన సంకల్పంతో కలం కదిలించేవాడిని. అత్యంత ప్రభావవంతమైన ఉత్తరాంధ్రయాస, మాండలికంలోని పదాలను ఉపయోగించి వాటిని పాడుతూ వీరావేశంతో వేదికలపై చిందేస్తూ ఊగిపోయేవాడిని. వాస్తవానికి నేను మార్క్సిజం, లెనినిజం ఏమీ అధ్యయనం చేయలేదు. శ్రీకాకుళ ఉద్యమంలో పాలుపంచుకోలేదు. కానీ మార్క్సిజం, లెనినిజం, శ్రీకాకుళ ఉద్యమ స్వరూపం నా పాటల్లో ఉంటాయని శ్రీశ్రీ చెప్పారు. అలా ఆధునిక జానపద పాటను ఉద్యమానికి అందించిన తొలికవిగా జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది.
40 భాషల్లోకి ‘ఏంపిల్లడో’ తర్జుమా....
నన్ను దేశవ్యాప్తంగా పరిచయం చేసిన పాట మాత్రం ‘ఏం పిల్లడో ఎల్దుంమొత్తవా?’ పాటే. ప్రధానంగా ఉత్తరాంధ్ర వాసుల్ని తీవ్రంగా కదిలించిన పాట ఇదే. ఒక భాష నుంచి మరో భాషలోకి తర్జుమా అవుతూ ఇప్పటి వరకు మొత్తం 40 భాషల్లోకి ఆపాట తర్జుమా అయ్యింది.
ఏం పిల్లడో ఎల్దుమొత్తవా? 
ఏం పిల్లో ఎల్దామొత్తవా?
అరె శ్రీకాకుళంలో సీమకొండకు ।। ఏంపిల్లడో।।
చిలకలు కత్తులు దులపరిత్తయట ।। ఏంపిల్లడో।।
సాలూరవతల సవర్ల కొండకు ।। ఏంపిల్లడో।।
సెమర పిల్లులు శంఖమూదెనట ।। ఏంపిల్లడో।।
నలగొండ నట్టడివిలోనికి ।। ఏంపిల్లడో।।
పాముల్ని పొడిచిన చీమలున్నయట ।। ఏంపిల్లడో।।
తెలంగాణ కొమరయ్య కొండకీ ।। ఏంపిల్లడో।।
గెద్దని తన్నిన గేతులున్నయట ।। ఏంపిల్లడో।।
ఆకులు మేసిన మేకల కొండకి ।। ఏంపిల్లడో।।
పులుల్ని మింగిన గొర్రెలున్నయట ।। ఏంపిల్లడో।।
రాయలసీమ రాలు కొండకీ ।। ఏంపిల్లడో।।
రత్తం అరె రత్తం రాజ్జెం యాలతన్నదట ।। ఏంపిల్లడో।।
తూరుపు అరె తూరుపు దిక్కున దోరకొండకీ ।। ఏంపిల్లడో।।
తుపాకి చల్‌ తుపాకి పేల్చిన తూరీగలున్నయట ।। ఏంపిల్లడో।।
కలకత్తా కొసకాడ కొండకీ ।। ఏంపిల్లడో।।
ఎలికలు పిల్లిని ఎంటాదగిలెనట ।। ఏంపిల్లడో।।

అంటూ సాగే ఈ గేయానికి గజ్జెకట్టి ఆడుతుంటే పూనకం వచ్చినట్లు ఊగిపోయేవాళ్లు. ఈ పాటతో ప్రభావితమై చాలా మంది ఉద్యమాలవైపు మళ్లిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇలా ఓ అరవైదాకా   పాటలు రాశాను.
స్ఫూర్తినింపిన గేయం...
‘యంత్రమెట్లా నడుస్తు ఉందంటే’ 

పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు పడుతున్న శ్రమకు, కష్టానికి సంఘీభావంగా కార్మికలోక సోదరుల కోసం రాసిన ఓ పాట దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
‘యంత్రమెట్లా నడుస్తు ఉందంటే....
ఓరన్నో లమ్మి రైలు, లారీ, కారూ, బస్సూ, మిల్లు, మిషను, మోటరు సైకిలు’
 
అంటూ సాగే ఆపాటకు కార్మికలోకం హారతులు పట్టింది. అమెరికా, బ్రిటన్‌ దేశాల పరిశ్రమల్లోని కార్మికవర్గాలు కూడా ఆపాటను ఇంగ్లిషు భాషలోకి మార్చుకుని దాని స్ఫూర్తిని అందిపుచ్చుకున్నాయి. 
‘భూమి భాగోతం’... మరో చైతన్యధార
ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడమే లక్ష్యంగా నేను రూపొందించిన తొలి సాంఘిక నృత్యరూపకం ‘భూమిభాగోతం’. మొత్తం 30పాటలతో, 30 రాగాలతో గంటన్నర నిడివుండే ఈ నృత్యరూపకానికి సైతం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నిరుపేదల భూములపై భూస్వాముల పెత్తనాలు, ఆక్రమణలకు నిరసనగా ఆ నృత్యరూపకాన్ని రచించాను. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10వేల చోట్ల దీన్ని ప్రదర్శించారు. హైదరాబాద్‌ నగరంలో ఒకేరోజు ఒకే వేదికపై 30సార్లు ప్రదర్శనకు నోచుకున్న నృత్యరూపకంగా కూడా గుర్తింపు పొందింది. దీని మీద ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఒకరు పీహెచ్‌డీ చేశారు. వందేమాతరం శ్రీనివాస్‌ ఈ నృత్యరూపకానికి ప్రభావితుడై సుమారు 500 ప్రదర్శనలిచ్చారు.
జజ్జనకరి జనారేతో మరో ప్రభంజనం...
నాకు బాగా గుర్తింపు తెచ్చిన పాటల్లో ‘జజ్జనకరి జనారే... జనకుజనాజనారే...’ మరో ప్రభంజనమనే చెప్పాలి. అన్నివర్గాల నిరుపేదల జీవితాల్లో.. వారి వృత్తిపరమైన కష్టాలను ప్రతిబింబించేలా ఆపాటను రాశాను. వాస్తవానికి ఏ నిఘంటువులోనూ ‘జజ్జనకరి జనారే... జనకుజనా జనారే’ అన్న పదాలకు అర్థం ఉండదు. అవి కేవలం డప్పు దరువుకి అక్షర రూపంగా నా మస్తిష్కం నుంచి వచ్చిన పదాలు. 
ఒరె నాటి నుండి నేటి వరకు- జజ్జనకరి జనారే 
ఓటులెన్ని ఏస్తున్నా- జనకుజనాజనారే
నీ పోడు భూమి బీడు భూమీ- జజ్జనకరి జనారే
పంట చేరకున్నదీ- జనకుజనాజనారే
నీ ఇంటిలోన అద్దిరబన్నా.. ఒంటిలోన  అద్దిరబన్నా..
పొయ్యిలోన అద్దిరబన్నా.. పిల్లికూన అద్దిరబన్నా..
తొంగున్నాది అద్దిరబన్నా..  అరె బందిస్తే పిల్లికూన బకిరి బకిరి సంపదేటి?
జజ్జనకరి జనారే.. జనకుజనాజనారే..
అంటూ పాటంతా డప్పు దరువుకి అనుగుణంగా సాగుతుంది.
ఉత్తరాంధ్ర కష్టజీవి స్వరూపమే నా ఆహార్యం...
నాకు ప్రత్యేకతను తెచ్చిన అంశాల్లో ఆహార్యం కూడా ప్రధానమైంది. ఉత్తరాంధ్ర కష్టజీవి స్వరూపాన్ని ప్రతిబింబించేలా ప్రదర్శనల సమయాల్లో దుస్తులు ధరించేవాడిని. వంటిపై తెల్లని బనీను, తెల్లని అంచుల పంచెకట్టు, నడుంచుట్టూ ఎర్రని తువ్వాలు కట్టు, కాళ్లకు గజ్జెలు, భుజంమీద ఎర్ర అంచున్న నల్లని గొంగళి, చేతిలో పశువులు కాసే కర్ర, వేళ్లకు అందెలు, కుడిచేతిలో రుమాలుతోనే ప్రదర్శనలిచ్చాను. గత 50ఏళ్లుగా ఇదే ఆహార్యంతో ప్రదర్శనలిస్తున్నా. ఇప్పటి వరకు ఐదువేల వరకు ప్రదర్శనలిచ్చాను.
స్వీయ ఆంక్షలతో నియమబద్ధంగా జీవిస్తున్నా
డబ్బు కోసం కళను అమ్ముకోకూడదన్న సిద్ధాంతాన్ని అక్షరాలా తు.చ. తప్పకుండా నాటి నుంచి నేటి వరకు పాటిస్తున్నా. నా సిద్ధాంతాలు, భావజాలం ప్రతిఫలించే సినిమాలకైనా గేయాలు రాయాలని చాలా మంది మిత్రులు సూచించడంతో చాలా సంవత్సరాల తరువాత మనసు మార్చుకున్నా. రేపటి పౌరులు, కర్తవ్యం, అర్ధరాత్రి స్వాతంత్య్రం, ఎర్రసైన్యం, ఉగ్ర నరసింహం, చీమలదండు, అగ్గిరాజు, విముక్తికోసం, విప్లవశంఖం, మరో ప్రపంచం, అడవిదివిటీలు ఇలా ఓ నలభై సినిమాలకు కొన్ని పాటలురాశా. సమాజాన్ని చైతన్యవంతం చేయాలన్న నా లక్ష్యం సినిమా మాధ్యమం ద్వారా నెరవేరుతుందన్న ఒకేఒక ఉద్దేశంతో మాత్రమే రాశా. 
జానపద సాహిత్యాన్ని కాపాడాలి...
పల్లెల సంస్కృతీ సంప్రదాయాల నుంచి, నిరక్షరాస్యులైన తాతలు, అమ్మమ్మల నుంచి జానపద కవిత్వం పుట్టుకొచ్చింది. నాటి సమాజాన్ని, ప్రకృతినీ, మానవ జీవనాన్ని చూసి స్పందించి హృదయాంతరాల్లోంచి పెల్లుబికిన ఆనందంలోనూ, దుఃఖంలోనూ మన పూర్వీకులు ఎన్నో జానపద పాటలు పాడుకున్నారు. సొంతంగా బాణీలు కట్టుకున్నారు. జానపద సాహిత్యానికి బీజాలు వేశారు. మనసుకు హత్తుకునే కశాఖండాల్లాంటి ఎన్నో పాటలు పాడుకునేవారుగానీ వాటికి పుస్తకరూపం ఇవ్వాలన్న ఆలోచన వారికి ఉండేదికాదు. అక్షరజ్ఞానం అంతకన్నాలేదు. దీంతో పూర్వీకుల నోళ్లలో నానిన ఎన్నో జానపదగేయాలు కాలగర్భంలో   కలిసిపోయాయి. 
జానపదులు కొత్తవాళ్లు ఎవరైనా అడిగినపుడు వాళ్లముందు పాడటానికి ఇష్టపడరు. అందుకని నేను పొలంపని చేసుకునేవాళ్ల పాటలను చెట్టు చాటునుంచే విని రాసుకునేవాడిని. గిరిజనుల గీతాలూ అంతే. వాళ్ల పదాలు కొన్ని పట్టుకుని వాళ్ల బాణీలోనే..
అంబాతకాడే తుంబలుగట్టెం.. 
అజామనారే అంబలి జుర్రెం.. 
కొండోలూ కోయోలూ కోరిక లేనోలూ.. 
గలగలగల పారుతున్న ఏరుల పక్క.. 
పిట్టలు కట్టిన గూడుల్లాగ గుడిసెలు కట్టెం.. 
సెట్టులుమీదా .. సీమల్లాగా.. తిరుగుతుంటమమ్మో.. 
కొండల్లో పండుల్నీ కొరుకుతుంటమమ్మో.. అంబాతకాడే..
అని రాశా. 
జానపదం పల్లెల్లోనే స్వచ్ఛంగా ఉంది. ఇప్పటి సినిమాల్లో వింటున్నది జానపదం అనుకోవటం పొరపాటు. జానపదం అంటే మౌఖిక సంప్రదాయం ఉండాలి, జీవనంలో జాతీయ తత్వం ఆ పాటలో ప్రతి ఫలించాలి. జనజీవన సంప్రదాయం ఉండాలి, మరీ ముఖ్యంగా నిరక్షరాస్యులైన గ్రామీణులు పాడిందై ఉండాలి. అంటే పదిమంది కలిసి కట్టిన పదాల కూర్పుగా ఉండాలి. అదే అసలైన జానపదం.
జానపదం అంటే ఇష్టంతోనే... 
ఏడాదిన్నర కిందట ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.ఎస్‌.ఎన్‌.రాజు నన్ను పిలిచి జానపద అధ్యాపకుడిగా సేవలందించమన్నారు. జానపద కళల్ని ముందు తరాలకు అందించాలన్న నా ఆశయం కూడా నెరవేరినట్లవుతుందని ఈ బాధ్యతని స్వీకరించాను. పిల్లలు కూడా ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. పల్లెల్లోకి వెళ్లి జానపదాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఇంజినీరింగ్‌ కాలేజీల్లో కూడా జానపదంమీద మాట్లాడుతున్నాను. ఇంతకన్నా ఆనందం ఏముంటుంది. 
అందుకే జానపదాన్ని ప్రార్థిస్తూ..
ఆరిందం.. ఆరిందం..
ఆరిందం ఎల్తందండీ జానపదుల బండీ..
సూడండీ రండీ.. పాడిందీ వినరండీ..  ।।ఆరిందం।।
డప్పుల దడదడ దరువుల బండీ చల్‌ చల్‌ చల్‌..
తప్పెటగుళ్ల టకటక బండీ చల్‌ చల్‌ చల్‌ చల్‌ చల్‌.. ।।ఆరిందం।।
బండంటే బండి కాదురా.. బతుకు సారం బండి ఇరుసురా..
కాలి చిప్పలూ కవుల కలాలూ.. దాని రేకులూ దళిత శరాలూ..
సంగీతం దాని వలపలెద్దురా.. సాహిత్యం దాని దాపలెద్దురా..
భామామణుల భాగోతాలా మద్దెల దరువుల ఎద్దుల బండీ.. ।।ఆరిందం।।

అంటూ ఆరు చరణాలతో ప్రార్థనా గీతం రాశా.. నేను ఏకవితలు రాసినా, ఏపాటలు పాడినా జానపదాభ్యుదయమే అంతిమ లక్ష్యం. జానపదమే నా ఊపిరి. భూమిభాగోతం, సిక్కోలు యుద్ధం, బుర్రకథలు, నాటకాలూ, పాటలూ ఇలాంటి జానపద వాగ్గేయ కథారూపాలన్నీ కలిపి ఓ మూడువందల యాభైపైనే రాశాను. వాటిని ఓ పుస్తక రూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నా.
అసలైన అమ్మ భాష అక్కడే ఉంది..
పల్లెల్లో జానపదం ఉందన్నది ఎంత నిజమో, జానపదాల్లో అమ్మభాష ఉందన్నదీ అంతే నిజం. జానపదాన్ని కాపాడితే అమ్మభాషను కాపాడుకున్నట్లే. రాజుల కాలంలో గ్రంథ సాహిత్యాన్నే పెంచిపోషించారుగానీ జానపద సాహిత్యంపట్ల పెద్దగా ఆసక్తిచూపలేదు. ఇప్పటికైనా పల్లె పదాలను పొదివి పట్టుకుంటే మన అమ్మ భాషలో మరికొన్ని కమ్మనైన పదాలు తేనెలొలికిస్తాయనటంలో సందేహంలేదు.    
(వంగపండు: 94413 05889)

***


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి