తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

పరిభాషా సృష్టి అవసరం

  • 1323 Views
  • 12Likes
  • Like
  • Article Share

    తవుటు నాగభూషణం

  • సిరిసిల్ల, కరీంనగర్
  • 800857354

ఒక వైపు వైద్యం...  మరో వైపు సాహిత్యం... రెండింటిలోనూ సమానంగా రాణిస్తున్నారాయన. ఆంగ్లం, గ్రీకు, జర్మనీ, లాటిన్‌ తదితర భాషల సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించడమే కాదు... తెలుగు పూదోటలో విరిసిన సాహితీ కుసుమాల పరిమళాలను ఆంగ్ల పాఠకులకూ చవిచూపిస్తున్నారు. 1983లో రచనా ప్రస్థానాన్ని ఆరంభించిన ఆయన 2003 నుంచి వరుసగా పుస్తకాలను వెలువరుస్తున్నారు. ఇప్పటి వరకూ యాభైకి పైగా పుస్తకాల్ని ప్రచురించారు. ఆయనే కరీంనగర్‌కు చెందిన హృద్రోగ నిపుణులు డా।। లంకా శివరామ ప్రసాద్‌. ‘తెలుగు వెలుగు’తో ఆయన ముఖాముఖి...
తె.వె: వైద్యులైన మీరు సాహిత్యం పట్ల అభిలాష పెంచుకోవడానికి కారణం?
లంకా:
మా నాన్న కుమారస్వామి ప్రధానోపాధ్యాయులు, అమ్మ సీతామహాలక్ష్మి గృహిణి. చిన్నతనంలోనే నాకు రామాయణ, భారత భాగవతాల్ని పరిచయం చేశారు. వినిపించారు. పురాణగాథలు, కావ్యాల పట్ల ఆసక్తిని పెంపొందించారు. మా తాతగారు గురునాథం మౌఖిక సాహిత్యంలో నిష్ణాతులు. ఆయన అనేక పురాణగాథల్ని చెప్పారు. ఆయన తర్వాత కృష్ణా జిల్లా ముసునూరు ఉన్నత పాఠశాలలో గోదా గ్రంథమాల వ్యవస్థాపకులు కె.టి.ఎల్‌.నర్సింహాచార్యులు మాకు తెలుగు ఉపాధ్యాయులు, ఇంటర్‌లో హిందీ అధ్యాపకులు దుర్గానంద్, తెలుగు ఉపన్యాసకులు ‘ముత్యాల ముగ్గు’ సినిమా నిర్మాత ఎమ్వీఎల్‌ గార్లు నన్ను ప్రోత్సహించారు. ఎన్నో విలువైన విషయాలు చెప్పి, సాహిత్యాభిలాషను పెంపొందించారు. ఎమ్వీఎల్‌ ద్వారా నాకు డా।। జయదేవ్, ఆయన ద్వారా బాపు- రమణలతో కూడా పరిచయం ఏర్పడింది.
వృత్తి... ప్రవృత్తినీ ఎలా సమన్వయం చేసుకోగలుగుతున్నారు?
సమయపాలన, ప్రణాళికాబద్ధంగా పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది. వైద్యవృత్తిలో ఉన్నప్పటికీ ముప్ఫై ఏళ్ల పాటు ఖాళీ సమయాన్ని ఆంగ్లం, తెలుగు, సంస్కృత భాషలపై పట్టు సాధించడానికి ఉపయోగించాను. విస్తృతంగా చదివాను. 1983లో వరంగల్‌ వచ్చాక రాయడం ప్రారంభించాను. అధ్యయనం, రాత నిరంతరం సాగుతూనే ఉన్నాయి. కార్టూన్లు, బొమ్మలూ వేస్తుంటాను.
స్వేచ్ఛానువాదంలో ఆధ్యాత్మికత, సైన్స్‌ కాల్పనిక రచనలు చేశారు. మరి వైద్య గ్రంథాలు..
నేను చదివినవీ, నేర్చుకున్నవీ, చూసిన విషయాల్ని ఇతరులకు సృజనాత్మకంగా, ఆసక్తికరంగా చెప్పాలన్న తపన ఉండేది. దాంతో వివిధ దేశాల సాహిత్యాల్ని మనవాళ్లకు అందించడంపై దృష్టి సారించాను. గుండెవ్యాధుల గురించి వైద్య విద్యార్థుల కోసం ‘నోట్స్‌ ఆన్‌ కార్డియో థొరోసిక్‌ సర్జరీ’ పుస్తకాన్ని రాశాను.
2014 వరకూ గ్రీకు, జర్మనీ, లాటిన్‌ సాహిత్యాన్ని తెలుగులోకి తీసుకొచ్చాను. ప్రస్తుతం తమిళ సాహిత్యాన్ని అనువదిస్తున్నాను. 2015లో స్పానిష్, రష్యన్‌ సాహిత్యాన్ని అనువాదం చేస్తాను. 2016 నుంచి వైద్యశాస్త్ర గ్రంథాల్ని కూడా తెలుగులోకి అనువదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.
ఎన్ని పుస్తకాలు అనువదించారు?
ప్రపంచ ప్రఖ్యాత గ్రీకు గ్రంథాలు ‘ఇలియాడ్‌’, ఒడిస్సీ, లాటిన్‌ మహాగ్రంథాలు ‘ఈనీడ్‌’, ‘డివైన్‌ కామెడీ’లతోపాటు ఆంగ్లంలోని ‘ఫారడైజ్‌ లాస్ట్‌’, ‘పిల్‌గ్రిమ్స్‌ ప్రొగ్రెస్‌’లను తెలుగులోకి, పోతన భాగవతాన్ని, ఆదిశంకరాచార్యుల సౌందర్యలహరిని ఆంగ్లంలోకి... ఇలా 27 వరకూ వివిధ భాషల గ్రంథాల్ని అనువాదించాను. కథ, నవల, కవిత్వం, నాటకం వంటి ప్రక్రియల్లోనూ 28 సొంత రచనలు చేశాను. అన్నీ ప్రచురితమయ్యాయి. స్వప్నశాస్త్రం, సంఖ్యాశాస్త్రం లాంటి పరిశోధనా గ్రంథాల్నీ రాశాను. 
అనువాద రంగంలో మీ కృషికి ప్రేరణ?
అనేక విశ్వవిద్యాలయాలకు అతిథి ఉపన్యాసకుడి (గెస్టులెక్చరర్‌)గా వెశ్లాను. పలు భాషలకు చెందిన ప్రాచీన కావ్యాలు, చరిత్ర గ్రంథాల గురించి ప్రస్తావిస్తున్నప్పటికీ వాటిల్లో చాలావరకూ తెలుగులో లేవు. అవి తెలుగువారికి పరిచయం చేయాలనుకున్నా. 
 ప్రపంచంలో తొలి నాగరికతలు ఎక్కడెక్కడ మొదలయ్యాయి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పరిణామాలు జరిగాయో పరిశోధించడం నాకిష్టం యూరప్‌ దేశాలన్నింటికీ వెశ్లాను. ఈజిప్టు, చైనా, ఇండోనేషియాలోని బాలి, టర్కీ కూడా వెళ్లొచ్చాను. అక్కడ తొలి నాగరికత నాటి ప్రాంతాల్ని, చారిత్రాత్మక ప్రదేశాల్ని సందర్శించాను. అక్కడి సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాల్ని అధ్యయనం చేశాను. ఇదే క్రమంలో ఇప్పటివరకూ తెలుగులోరాని ప్రపంచ ప్రసిద్ధ ప్రాచీన సాహిత్యాన్ని అనువదించాను.
గ్రీకు తాత్విక రచనల అనువాదంలో పదజాలానికి ఇబ్బందులు పడ్డారా?
వైద్యశాస్త్రంలో వ్యాధుల పేర్లు, పారిభాషిక పదాలు చాలావరకూ గ్రీకు పదాలే. ఆ భాష మూలధాతువుల్ని అర్థం చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. నేను ఇండో-యూరోపియన్‌ భాషల మీద కూడా కొంత పరిశోధన చేయడంతో ఎలాంటి ఇబ్బందీ పడలేదు. 
తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి ఎక్కువగా వెళ్లడం లేదు. ఆ దిశగా చేస్తున్న కృషి...?
మేం ‘సృజనలోకం’ అనే సంస్థ స్థాపించాం. దాని లక్ష్యాల్లో తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి తీసుకెళ్లడం కూడా ఉంది. ఇతర భాషల సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించినట్లు.... తెలుగు సాహిత్యాన్నీ ఆంగ్లంలో అందిస్తున్నాను. భాగవతం, సౌందర్యలహరిలతో పాటు విశ్వనాథ సత్యనారాయణ, నండూరి వెంకటసుబ్బారావు సాహిత్యాన్ని, ఆధునిక కవుల కవిత్వాన్నీ అనువదించా. రామాయణ కల్పవృక్షం ఆంగ్లానువాదం కూడా పూర్తి కావొస్తుంది. మన భాష, సాహిత్యాలు ఇతర భాషల్లోకి వెళ్లడానికి ఇంకా విస్తృత కృషి జరగాలి. 
వరంగల్‌లో రామాచంద్రమౌళి, అంపశయ్య నవీన్, వి.ఆర్‌.విద్యార్థి, నెల్లుట్ల రమాదేవి, పొట్లపల్లి శ్రీనివాసరావులతో కలిసి ‘సృజనలోకం’ ఏర్పాటు చేశాం. ప్రముఖులు నేరెళ్ల వేణుమాధవ్, పేర్వారం జగన్నాథంలు కూడా ఇందులో సభ్యులే. అనేక పుస్తకాలు ప్రచురించారు. ఆరేళ్ల పాటు ప్రతి ఏటా ‘కవితా వార్షిక’ను వెలువరించాం. 2010 నుంచి ఇది ఆగింది. త్వరలో మళ్లీ తెస్తాం.
తెలుగులో వైద్యశాస్త్ర పరిభాష రూపకల్పన ఏ దశలో ఉంది?
వైద్యశాస్త్ర పదకోశాలు తయారు చేశారు. కానీ అవి అంతగా ఉపయోగపడట్లేదు. వాటిల్లో ఉన్న పదాలకు అర్థాలను మరో పదకోశంలో వెతుక్కోవలసి వస్తుంది. నాణ్యమైన వైద్యశాస్త్ర పారిభాషిక పదజాలం నిర్మాణం దిశగా కృషి జరగాలి.
వైద్యశాస్త్రాన్ని తెలుగులో బోధించలేమా? 
రష్యా, చైనా, జర్మనీతోపాటు మరో ఇరవై పాశ్చాత్య దేశాల్లో ఇంజనీరింగ్, వైద్య విద్యలను స్థానిక భాషల్లోనే బోధిస్తున్నారు. ఆ ప్రయత్నమే తెలుగులోనూ జరగాలి. అయితే ముందు పిల్లలకు తెలుగుపై ప్రేమ పెంచాలి. తెలుగులో చదివించాలి. పారిభాషిక పదకోశాలు రావాలి. పాఠ్యపుస్తకాలు తయారు కావాలి. 
ఆంగ్ల మాధ్యమ బోధనలో కష్టనష్టాలు...?
ఇంట్లో అమ్మభాష మాట్లాడేవారు ఒక్కసారిగా ఆంగ్లమాధ్యమంలో చేరితే... పాఠాలు అర్థమవ్వక ఒత్తిడి పెరుగుతుంది. మాతృభాషలోనే విద్యాభ్యాసం సాగితే ఇలాంటి ఇబ్బందులూ ఉండవు, విద్యార్థుల్లోని సృజనను వెలికి తీయవచ్చు. 
వృత్తి విద్యలోనూ తెలుగును ఓ పాఠ్యాంశంగా పెట్టొచ్చా?
పదోతరగతిలోపే పిల్లలు తెలుగు భాష, సాహిత్యాలపై పట్టు సాధించేలా బోధించాలి. పదోతరగతి వరకు నిర్బంధంగానైనా తెలుగులోనే పాఠ్యాంశాలు ఉండాలి. ఇంటర్మీడియట్‌ తర్వాత తెలుగును ఒక సబ్జెక్టుగా పెట్టడం వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. ఆలోపే విద్యార్థులు భాషపై ఆసక్తి పెంపొందించుకుంటే... తర్వాత అదే కొనసాగుతుంది.
తెలుగు పొత్తాలకు పాఠకులు తగ్గిపోతున్నారా?
చదివే వారికి కొదువ లేదు. కానీ చదివే సమయమే తగ్గిపోతోంది. తెలుగు నేర్చుకుంటే బతుకుతెరువు ఏముంటుంది? డబ్బు సంపాదించడానికి తెలుగు అవసరమా? అని ఆలోచిస్తున్నారు చాలామంది. ఆంగ్లంలో చదివితే ఉద్యోగం, ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. ఆ పరిస్థితి మార్చాలి. తెలుగులో చదివితే ఉద్యోగం వస్తుందనే నమ్మకం కలగాలి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. తెలుగుపై పట్టున్నవారే ఉపాధ్యాయులుగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా భాషను పట్టించుకోవాలి. 
అనువాద కోణంలో చూసినప్పుడు తెలుగులో కొత్త పదసృష్టి జరగాల్సి ఉందా?
గ్రీకు, జర్మనీతోపాటు అనేక ప్రపంచ సాహిత్యాల్ని చదివాను. వాటిని మనవాళ్లకి అందించాలన్న తపనతో అనువాదాలు చేశాను. అనువాదాల్లో అనేక సమస్యలుంటాయి. గ్రీకు తదితర భాషల్లో ఉన్న పదాలకు తెలుగులో సరైన పదం చేర్చడం కొన్ని సందర్భాల్లో కష్టమనిపిస్తుంటుంది. కాబట్టి తెలుగులో విస్తృతమైన పదకోశాలు అవసరం. తెలుగును పటిష్టపరుచుకోవా లంటే... ప్రజల వాడుకలో ఉన్న పదాలన్నిం టినీ నిఘంటువుల్లోకి తేవాలి. ‘ఈనాడు’ దినపత్రిక మొదటి నుంచి ప్రజలకు అనేక కొత్త తెలుగు పదాల్ని పరిచయం చేసింది. ఇప్పటికీ అందిస్తూనే ఉంది. మొదట్లో కొత్తగా అనిపించినా ప్రజలు క్రమంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అనువాదంలో పదాలు వెతుక్కోవాల్సి వచ్చినప్పడు కొత్త  పదాలు సృష్టించుకుంటాం. రచయితలందరూ ఈ పని చేస్తారు. 
మీరు సృష్టించిన పదాలు కొన్ని...
సంస్కృతాన్ని ఉపయోగించుకుంటూ కొత్త మాటలు వాడా. వాటిని ఇప్పుడు విస్తారంగా వివరించలేను. కానీ మీ ప్రశ్నతో నాకు ఓ కొత్త ఆలోచన వచ్చింది. నా అనువాదంలో వచ్చిన సమస్యలు, పదాలతో ఒక పదకోశం నిర్మించాలనిపిస్తోంది.
యువతకు సాహిత్యాన్ని చేరువ చేయడమెలా?
ప్రాచీన కావ్యాల్ని, పురాణాల్ని సులభంగా అర్థమయ్యేలా యువతకు పరిచయం చేయాలి. రామాయణ, భారత, భాగవతాలు వారితో చదివించాలి. అవి యువతకు నీతి, నియమాల్ని, నడవడికను నేర్పుతాయి. తెలుగులో గొప్ప సాహిత్యమెంతో ఉంది. వాటిని చదివేలా ప్రోత్సహించాలి.
భాషా పరిరక్షణకు మనమేం చేయాలి?
నాటితరం... తెలుగు కోసం ఎంతోకొంత కృషి చేశారు. నేటితరం దాన్ని అభివృద్ధి చేయాలి. అంటే పుస్తక పఠనంపై ఆసక్తి చూపాలి. దానివల్ల మనం మాట్లాడేటప్పుడు ఆంగ్లం, ఉర్దూ తగ్గి తెలుగు పదాలు ఎక్కువగా గుర్తుకొస్తాయి. అలానే పాఠ్యాంశాల్లో ప్రాచీన కవులు, రచయితల గురించి ఇస్తున్నారు. వాళ్లతో పాటు కొత్త రచయితలనూ పరిచయం చేయాలి. (డా।। శివరామప్రసాద్‌: 88978 49442)


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి