తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

గాలి గాలంతా పాట తేలియాడుతూనే ఉంది...

  • 1642 Views
  • 3Likes
  • Like
  • Article Share

    సీహెచ్‌ లక్ష్మి

  • హైదరాబాదు.
  • 9030000696

వైవిధ్యభరితమైన తెలంగాణ ప్రజల జీవితాన్ని అక్షరబద్ధం చేస్తున్న అక్షరశిల్పి డా।। ముదిగంటి సుజాతారెడ్డి. నల్లగొండ జిల్లాలో పుట్టి కరీంనగర్‌లో మెట్టి హైదరాబాదుని కార్యక్షేత్రంగా మలచుకొని తనని తాను విస్తృతపరచుకొన్న సాహితీమూర్తి ఆమె. రచయిత్రిగా, అధ్యాపకురాలిగా, సాహిత్య విమర్శకురాలిగా, యాత్రికురాలిగా... ఇలా బహుముఖ ప్రజ్ఞతో సాహితీసేవను కొనసాగించారామె. యాసనే ప్రేమించి ఆ బాసలోనే రాస్తూ ఆ జీవన సంవిధానాన్నే స్వప్నించిన సుజాతారెడ్డి తెలుగు భాషకు చేసిన సేవ అపూర్వం. తెలుగు సాహిత్యం, భాష, విమర్శ తదితర విషయాల గురించి తన అభిప్రాయాలను తెలుగు వెలుగుతో పంచుకున్నారామె... 
తెలంగాణ ఏర్పాటయ్యాక తొలి ఉగాది పురస్కారం అందుకున్నారు, మీరెలా అనుభూతి చెందుతున్నారు...

నిజమే. ఉగాది రోజున పురస్కారం అందుకోవడం ప్రత్యేకమే. తెలంగాణ రచయితలు, కవులు, పండితులు తెలంగాణ మీది అభిమానంతో ఎంతో సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. పరిశోధనలు చేసి తెలంగాణ చరిత్ర సంస్కృతులను, సాహిత్య చరిత్రలను తవ్వి తీస్తున్నారు. ఇది మంచి పరిణామం.
గురజాడకు ముందే తెలంగాణలో భండారు అచ్చమాంబ కథలు రాశారని నిరూపించారు. కానీ ఆమె కథల్లో శిల్పం...
అచ్చమాంబ పన్నెండు కథలు రాస్తే మనకు పదే దొరుకుతున్నాయి. అన్ని కథల్లోనూ ‘శిల్పం’ ఉందని చెప్పలేం. అయితే ‘బీదకుటుంబం, దంపతుల ప్రథమకలహం...’ వీటిలో కథాశిల్పం ఉంది. వీటినిబట్టి అయినా ఆమె ప్రథమ కథారచయిత్రి అని చెప్పవచ్చు. అలాగే ఆమె సాహిత్యానికే పరిమితం కాలేదు. ఆమెకు రాజకీయ స్పృహ ఉంది. కాంగ్రెస్‌ సభలకు హాజరయ్యారు. మహిళలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడారు. హిందీ, గుజరాతీ, మరాఠీ తదితర భాషల్లో ఆమెకు ప్రవేశం ఉంది. అంత చైతన్యం ఉన్నవాళ్లు ఆ రోజుల్లో లేరనే చెప్పాలి. ఆమె తర్వాత సాయుధ పోరాటాలు, అరసం, విరసం, తెలంగాణ అస్తిత్వవాదం... ఇలా ఎన్నో కారణాల వల్ల తెలంగాణ నుంచి గొప్ప కథాసాహిత్యం వచ్చింది.
తెలంగాణలో నవలా సాహిత్యం గురించి...
నరహరిచెట్టి, కందుకూరి నవలలు రాసిన కాలంలోనే ఇక్కడ కూడా నవలలొచ్చాయి. అవన్నీ సాంఘిక నవలలు, చారిత్రక నవలలు. పోరాట నవలలకు ఆద్యుడు వట్టికోట ఆళ్వారుస్వామి. అయితే ఆ నవలలు తర్వాత కాలంలో ముద్రణ పొందకపోవడం వల్ల మరుగున పడిపోయాయి. నోరి నరసింహశాస్త్రి కన్నా ముందే వద్దిరోజు సోదరులు ‘రుద్రమదేవి’ వంటి నవలలు రాశారు. కానీ నోరి కొచ్చిన పేరు వారికి రాలేదు. తెలంగాణ నుంచి శాశ్వత సత్యాలను వివరించేవి, గొప్పవిగా నిలిచే నవలలు రాలేదు. అందులో సందేహం లేదు.
తెలంగాణ సాయుధ పోరాటంపై నవల రాసిన మహిళ మీరొక్కరే...!
సాయుధ పోరాట చిత్రణతో ఇప్పటివరకు ఇరవైనాలుగు నవలలొచ్చాయి. జాతీయోద్యమాన్ని చిత్రిస్తూ కూడా అన్ని నవలలు రాలేదు. ఇక సాయుధ పోరాటం గురించి నేను ‘మలుపు తిరిగిన కథ చక్రాలు’ నవల రాశాను. పోరాటం మీద రాసిన ఏకైక మహిళను నేనే. 1968 ప్రాంతంలో లండన్‌లో డా।। జివాగో సినిమా చూశాను. ఆ ప్రేరణతో చిన్నప్పుడు నేను చూసిన ఆడబాపల వ్యవస్థ. భూస్వామ్య దుర్మార్గం వీటన్నింటినీ నవలగా రాయాలని అనిపించింది. వ్యూహం ఏర్పడింది. రాశాను. ఒకటి రెండు పత్రికలకు పంపాను. వాళ్లు వేయకపోవడంతో ఆ పనికి నేనే పూనుకున్నాను. అలా నా నవల 1994లో అచ్చయింది. ఇప్పటివరకూ ‘తెలుగు సాహిత్యచరిత్ర’ రాసిన రచయిత్రినీ నేనే.
మీవారు గోపాలరెడ్డితో కలిసి రాసిన ‘సంస్కృత సాహిత్యచరిత్ర’ పాఠకుల ఆదరణ పొందింది. దీనికి నేపథ్యం..?
‘సంస్కృత సాహిత్యచరిత్ర’ రాయడానికి బీజాలు మేం జర్మనీలో ఉన్నప్పుడే పడ్డాయి. నేను టు బింగెన్‌ విశ్వవిద్యాలయంలో ఓరియెంటల్‌ విభాగంలో పనిచేసేటప్పుడు ఎన్నో సంస్కృత మూలకావ్యాలు, గ్రంథాలు, విమర్శ గ్రంథాలు చదివే అవకాశం కలిగింది. నాకు చరిత్ర అంటే ఉన్న ఇష్టంతో వాటిని తెలుగువాళ్లకు చెప్పాలని నోట్సు తయారు చేసుకున్నాను. మావారు గురుకులంలో చదువుకున్నారు. ఆయనకు సంస్కృత సాహిత్యం మీద పట్టుంది. ఆయన పాండిత్యం ఆధారంగా ఇద్దరం ఆ పుస్తకం రాశాం. దాన్ని తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది. అది పండితుల నుంచి సామాన్యుల వరకు అందరి ఆదరణ పొందింది.
యాత్రా సాహిత్యంలో మీ కృషి ప్రశంసనీయం. స్వదేశీ, విదేశీ యాత్రల్లో తేడా...
నా రెండు యాత్రా చరిత్రల్లో ఆ దేశాల చారిత్రక, సామాజిక విషయాలను వివరించాను. ఇవి చాలా యాత్రా చరిత్రల్లో కనిపించవు. మనదేశంలో, రాష్ట్రంలో ఎక్కువగా పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది. ట్రావెల్‌ ఏజెంట్లూ అవే ఎక్కువ ఏర్పాటు చేస్తారు. విదేశీ యాత్రల్లో చారిత్రక స్థలాలకు ప్రాధాన్యత ఉంటుంది. నాకూ వాటిని చూడటమే ఇష్టం.
మీ ‘తెలుగు సాహిత్యచరిత్ర’ ప్రత్యేకత ఏంటి?
కందుకూరి వీరేశలింగం పంతులు నుంచి వెలమల సిమ్మన్న వరకు పద్నాలుగు తెలుగు సాహిత్యచరిత్రలు వచ్చాయి. మహిళల్లో ఆ ప్రయత్నం తొలిసారి చేసింది నేనే. ఇక ప్రత్యేకత అంటే కేవలం కవులు, కావ్యాలే కాకుండా... ఆయా కాలాల చారిత్రక, సామాజిక నేపథ్యంతో ఈ సాహిత్య చరిత్ర సాగుతుంది. అంతేకాదు... స్త్రీ, దళిత, ప్రాంతీయ, ముస్లిం వాదాలను చర్చించాను. ఆధునికయుగంలో స్పష్టతకోసం వీరేశలింగం, కృష్ణశాస్త్రి యుగాలు వంటివి ప్రవేశపెట్టాను. దీనికి ఆదరణ బాగానే లభించింది. ‘తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర’ రాశాను. దీని ప్రచురణ బాధ్యత ఆంధ్ర సారస్వత పరిషత్తు స్వీకరించింది. త్వరలో ఆవిష్కరణ జరగనుంది. 
నవల- రస సిద్ధాంతం అన్న మీ ప్రతిపాదన వెనుక ఆంతర్యం?
మన విశ్వవిద్యాలయాల్లో పాశ్చాత్య సిద్ధాంతాలను గుడ్డిగా అనుకరించడం చూస్తాం. దీనికంటేే మన మౌలిక సిద్ధాంతాల నుంచి కొత్త ఆలోచనలతో, వ్యాఖ్యానాలతో సాహిత్య విమర్శ సూత్రాలను, సిద్ధాంతాలను తయారు చేసుకుంటే మంచిదని నా విశ్వాసం. అలా చేసినప్పుడే మన ప్రతిభ రాణిస్తుంది. అనుకరణలతో, అనుసరణలతో కొత్త పోకడలు పోలేం. అందుకనే రససిద్ధాంతాన్ని మనస్తత్వ శాస్త్రంతో జోడించి, వివరించి కొత్త ప్రయోగం చేశాను.
స్త్రీ వాద రచయిత్రుల్లో మీరు కనిపించరు...
స్త్రీలకు పురుషులు తోడ్పడితేనే కుటుంబమైనా, స్త్రీవాదమైనా విజయవంతమవుతుంది. పురుష విద్వేషంతో స్త్రీ సాధించిందేమీ లేదు. ‘ఆకాశంలో విభజన రేఖల్లేవు’ అనే నా నవలలో ఇదే ప్రతిపాదించాను. మంచీ చెడు అనేవి స్త్రీలలోను, పురుషుల్లోనూ ఉంటాయి. పురుషులందరూ చెడ్డవాళ్లని చెప్పటం అతివాదమవుతుంది. నేను పాశ్చాత్య స్త్రీ వాదాన్ని నమ్మను. అందుకనే కొందరు నా నవలను స్త్రీ వాదానికి వ్యతిరేకమని గట్టిగా విమర్శిస్తూ రాశారు. రాడికల్‌ ఫెమినిజంని వ్యతిరేకిస్తాను. పురుషుల్లో మార్పురానిదే స్త్రీ స్వేచ్ఛ సాధ్యం కాదు. విజయవంతం కాదు. అందువల్ల స్త్రీవాద రచయిత్రుల్లో నా పేరు కనిపించదు. స్త్రీవాదం, స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ సమానత్వం - ఇవన్నీ పురుష సమాజం సహకారంతోనే సాధ్యమవుతాయి.
మీ స్వీయచరిత్ర గురించి చెబుతారా?
ఒకరిద్దరు మహిళలు స్వీయచరిత్రలు రాశారంటారు. కానీ అవి నాకు దొరకలేదు. నా ధోరణిలో నేను నా ఆత్మకథను రాశాను. అది ‘ప్రజాతంత్ర’లో ధారావాహికగా వచ్చింది. అందరూ బాగుందన్నారు. ఎక్కువగా స్త్రీలు చేపట్టని యాత్రా చరిత్ర లాగానే ఇదీ రాశానని విమర్శకులన్నారు. 
తెలుగుభాష అంతరించి పోతోందన్న వాదన వినిపిస్తుంటుంది. మీరేమంటారు?
ప్రపంచంలో తెలుగు మాట్లాడేవాళ్లు 18 కోట్లమంది ఉంటారు. అలాంటప్పుడు తెలుగు కనుమరుగు అవుతుందనుకోవడం సమంజసంగా అనిపించదు. పాఠశాలల్లో, కళాశాలల్లో మాధ్యమంగా వాడకపోవడం, కొన్ని విద్యాలయాల్లో కనీసం ఒక సబ్జెక్టుగా కూడా బోధించకపోవడం, పాలనా భాషగా ఆదరించకపోవడం వల్ల తెలుగు వాడకం తగ్గింది. కాదనలేం. ప్రభుత్వం తెలుగు మీద అభిమానం చూపాలి. అన్నిచోట్లా తెలుగును వాడాలి. తల్లిదండ్రులు తమ పిల్లలు తెలుగు పుస్తకాలు చదివేట్లు ప్రోత్సహించాలి. థాయ్‌లాండ్, చైనా, జపాన్‌ తదితర దేశాల్లో ఆఫీసులు, వీధులు, దుకాణాల పేర్లన్నీ వాళ్ల భాషల్లోనే ఉంటాయి. వాళ్లకి ఇంగ్లీషు ఒక్క ముక్కరాదు. అయినా వేలసంఖ్యలో వచ్చే విదేశీయులు, పర్యాటకులు పుస్తకాల సాయంతో వాళ్ల భాషల్లో కొన్ని మాటలు నేర్చుకొని మాట్లాడుతారు. అంటే వాళ్లకు మాతృభాష అంటే అభిమానం ఉంది. మనకు లేదు. తెలుగు వాడకం తగ్గకూడదంటే మనం చేయాల్సింది మనం చేయాలి. అప్పుడే ప్రభుత్వాన్ని నిలదీయగలుగుతాం. మాతృభాషలో చదివితేనే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. ఆంగ్లంలో చదివినంత మాత్రాన విజ్ఞానాభివృద్ధి సాధ్యమనుకోవడం సరైంది కాదు. ఈ తరంవారిలో చాలామందికి ఇటు తెలుగు, అటు ఇంగ్లీషు ఏదీ సరిగా రావడం లేదు. తెలుగునేల రెండుగా విడిపోయినప్పటికీ భాషా సాహిత్యాలు ఒక్కటే. హిందీ రాష్ట్రాలు ఎన్నున్నా సాహిత్యంలో ఉన్నవాళ్లంతా కలిసే పనిచేస్తున్నారు. మనమూ అలాగే చేయాలి.
పుస్తక పఠనంలో విదేశాలకు మనకూ తేడా?
మనదేశంలో పుస్తకాలు, పత్రికలు చదివే అలవాటు రోజురోజుకీ తగ్గిపోతోంది. అమెరికాలో కొన్ని ఇతర దేశాల్లో సెలవుల్లో చదువుకురమ్మని పిల్లలకు కొన్ని పుస్తకాల జాబితా ఇస్తారు. పాఠశాలలు తెరిచాక ఆ పుస్తకాల గురించి మాట్లాడమంటారు. ఆ పద్ధతి ఇక్కడ లేదు. ఎంతసేపూ కంప్యూటర్లు, వీడియోగేమ్స్‌ లేదా పాఠ్యపుస్తకాలు... అవే. సాహిత్య పఠనంపట్ల ఏమాత్రం శ్రద్ధ ఉండటం లేదు. ఈ విషయంలో పిల్లల్ని నిందిస్తే సరిపోదు. దీనికి ప్రభుత్వం, పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, వ్యవస్థ స్వరూపం అన్నీ కారణాలే.
సాహిత్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రత్యేకంగా ఏం చెబుతారు?
కవిత్వం విషయంలో తెలంగాణ ఎంత ముందుందనిపిస్తుందంటే అసలు ఇతర ప్రాంతాల నుంచి కవిత్వం వస్తున్నట్లే లేదనిపించేంత. జానపద సాహిత్యం మూలాలు బాగా గట్టిగా ఉన్నాయి. అందువల్ల కవిత్వం, పాట నిలిచాయి. సాయుధ పోరాటంలో పనిచేసిన వాళ్లలో చదువుకున్న వాళ్లు కథలు రాస్తే, నిరక్షరాస్యులు పాటలు రాశారు. ఇప్పటికే తెలంగాణ గాలి గాలంతా పాట తేలియాడుతూనే ఉంది. 
ఉద్యమ సాహిత్యానికి శాశ్వతత్వం సాధ్యమా?
దాన్ని కాలమే నిర్ణయిస్తుంది. ఉద్యమ సాహిత్యం ఇక్కడ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రధానపాత్ర పోషించింది. ప్రాంతీయ అస్తిత్వవాద దృక్పథంతో కథలొచ్చాయి. దీర్ఘ కవితలొచ్చాయి. నవలలూ వచ్చాయి. మేధావులు, కవులు, రచయితలు, అందరూ కలిసి కృషిచేశారు. ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం, డయాస్పోరా- ఈ మూడూ ప్రజలు ఏకం కావడానికి ప్రేరేపించాయి.
డయాస్పోరాని వివరిస్తారా...
డయాస్పోరా అంటే మనం మాట్లాడే భాషల్లోనే మనం రాయాలి అనే ప్రాంతీయ భాషాభిమానం. అది ఇక్కడ కనిపించినట్లు మిగిలిన ప్రాంతాల్లో తక్కువగా కనిపిస్తుంది. ఇదే ఉద్యమానికి గుండెకాయగా పనిచేస్తుంది.
విశ్వవిద్యాలయాల సాహిత్య కృషి...
చాలా విశ్వవిద్యాలయాల్లో నియామకాలు పూర్తవక అన్నీ మూలబడ్డాయి. విశ్వవిద్యాలయాల్లో సదస్సులు, చర్చలు ఎక్కువగా ఏర్పాటు చేయాలి. అప్పుడే విద్యార్థులకు కొత్త విషయాలు తెలుస్తాయి. కానీ పేరున్న విశ్వవిద్యాలయాల్లో కూడా ఇప్పుడు సదస్సులు ఎక్కువగా ఏర్పాటు కావడంలేదు. ఆచార్యుల సామర్థ్యం కూడా ప్రశ్నార్థకమే!
మీరు భూస్వామ్య కుటుంబంలో జన్మించినా మీ కథలన్నీ సామాన్యులవే...
నా మూలాలు తెలంగాణ పల్లెలో ఉన్నాయి. కాబట్టి నా పాత్రలన్నీ గ్రామీణులవే. మానసికంగా నేను ఎప్పుడూ మా గ్రామాల ప్రజలకు దగ్గరగానే ఉంటాను. అందుకే వారి జీవితాల్నే చిత్రించాను. మొదటి నుంచీ నేను దోపిడీని, హింసను ఎదిరిస్తున్నాను. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోవాలనే అంటున్నాను. ఆర్థిక అసమానతలు ఉండకూడదనే రచనలు చేస్తున్నాను. ఇదే నా తత్వం. ఇదే నా రచనల తత్వం కూడా.
మీ సాహితీ రంగ ప్రవేశానికి స్ఫూర్తి...
స్కూల్లో ఉన్నప్పుడు చందమామ కథలు చదవటం ఇష్టంగా ఉండేది. అవి చదివి కొన్ని కథలు రాసి చందమామకు పంపాను కూడా. అవి అచ్చు కాలేదు. పీయూసీలో ఉన్నపుడు కొన్ని కథలు రాశాను. ‘జీవన్మృతుడు’ అనే కథ 1956లో గోలకొండ పత్రికలో అచ్చయింది. నాకు స్ఫూర్తి అంటూ ఫలానా అని చెప్పలేను. చాలా సహజంగా సంక్రమించింది.
మీపై ప్రభావం చూపిన పుస్తకాలు, వ్యక్తులు, సంఘటనలు...
కాలేజీలో ఉన్నపుడు బాపిరాజు, చలం, విశ్వనాథ, ప్రేమ్‌చంద్, శరత్‌చంద్ర, బంకించంద్ర, టాగూరు నవలలు, కథలు ఇష్టంగా చదివాను. ప్రేమ్‌చంద్‌ రచనలు, చతుర్‌సేన్‌ శాస్త్రి కథలు హిందీలోనే చదివాను. సంఘటనలంటే నేను పుట్టి పెరిగిన, నివసించిన ఊళ్లల్లో జరిగిన సంఘటనలన్నీ కథావస్తువుగా తీసుకున్నాను.
తొలితరం తెలంగాణా కథల సంకలనాలు తెచ్చారు కదా...
తొలితరం తెలంగాణ కథల ప్రథమ సంకలనం గొప్ప సంచలనం. అది ఆవిష్కరణ రోజు జీవించి ఉన్నవాళ్లు తక్కువే అయినా రచయితల బంధువులు అందరూ వచ్చారు. 1912 నుంచే తెలంగాణాలో ఇంత మంచి కథలొచ్చాయని అందరూ ఆశ్చర్యపోయారు. చరిత్రని తిరగరాసినట్లుయింది. ఇప్పుడు కూడా మంచి కథలు వస్తూనే ఉన్నాయి. జీవితాల్లోని అనేక కోణాలు, సంఘటనలు, సంఘర్షణలు, సంప్రదాయాలు అన్నీ కథల్లో చోటుచేసుకుంటున్నాయి.
మాండలిక కథా రచన మీద మీ అభిప్రాయం?
నా కథల్లో నేను సంభాషణల్లోనే మాండలికం రాశాను. కథారచనలో నుడికారం ఉపయోగించాను. వాస్తవికత కోసం, వాతావరణ దృష్టికోసం పాత్రోచితంగా మాండలిక ప్రయోగం ఎంతో అవసరం! అంతే కాని మొత్తం కథని మాండలికంలో నడిపితే ఎక్కువమంది పాఠకులను చేరుకోలేం. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు రచనల్లో తెలంగాణ వాడుక పెరిగింది. అలా వాడటం గౌరవంగా భావిస్తున్నారు. ప్రాంతీయాభిమానంతో కూడా భాషాభిమానం పెరిగింది. ఏ భాషకైనా ఇంత కన్నా కావలసినదేముంటుంది.
తెలుగు సాహిత్యంలో ప్రస్తుతం విమర్శ ఏ స్థాయిలో ఉంది?
విమర్శ కూడా తెలంగాణ నుంచే ఎక్కువగా వస్తోంది. స్త్రీ, దళితవాదాల పట్ల విమర్శ బాగానే వచ్చింది. లోతైన విమర్శ చేసే వాళ్లు ఇంకా ఇక్కడ ఉన్నారు. అదో ప్రక్రియగా ఆదరణ పొందుతోంది. ఇటీవల విమర్శకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం విమర్శకుల్ని ప్రోత్సహించే అంశమే. ఉత్తమ విమర్శకులు విస్తృతంగా ప్రాచీన, ఆధునిక గ్రంథాలు చదివినవాళ్లై ఉండాలి. పలు సిద్ధాంతాలు ధోరణుల పట్ల అవగాహన ఉండాలి. పక్షపాత ధోరణి పూర్తిగా విడనాడాలి. విమర్శన పద్ధతులు తెలిసిన వాళ్లై ఉండాలి. అన్నింటికీ మించి సహృదయత కలిగి ఉండాలి. సద్విమర్శల వల్ల రచయితలకు తప్పక మేలు జరుగుతుంది. తమ రచనల్ని గుణాత్మకంగా మలుచుకోవడానికి వీలు కలుగుతుంది.
యువ రచయితలకు సలహాలు సూచనలు...
యువ రచయితలే కాదు, రచయితలందరూ ప్రాచీన ఆధునిక రచనలు, పశ్చిమ దేశాల సాహిత్యం బాగా చదవాలి. తమ రచనలతో పాటు ఇతరులు ఏం రాస్తున్నారో, ఎలా రాస్తున్నారో చూడాలి. వేరే భాషల్లో ఎలాంటి రచనలు వస్తున్నాయో గమనించాలి. మేం కాలేజీలో ఉన్నప్పుడు రచయితల్ని చూడాలనుకునే వాళ్లం. ఇప్పుడు సాహితీ సభల్లో ఎక్కువగా యాభై పైబడినవాళ్లే కన్పిస్తున్నారు. విద్యార్థులు అసలు పాల్గొనడం లేదు. ఇది అభిలషణీయం కాదు. యువరచయితలు సభలు, సమావేశాలకు హాజరుకావాలి. సదస్సుల్లో పాల్గొనాలి. దానివల్ల వారి అవగాహన స్థాయి విస్తృతమవుతుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి