తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

కష్టంగా రాయడం సులువు
సులువుగా రాయడం కష్టం

  • 2809 Views
  • 6Likes
  • Like
  • Article Share

    పద్మ కంటిపూడి

  • హైదరాబాదు, padmaavasu@gmail.com

ఏకువలోన గోదారి ఎరుపెక్కింది - ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది... మదిలో కథలా మెదిలే నా కలల సుహాసిని... పిసినారి నారివే పిసరంత పలకవే... ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా... ఇలా అనంత శ్రీరామ్‌ ఏ పాట రాసినా ఆ పదాల్లో తూగు కనిపిస్తుంది. ఊహలో, భావనలో, వర్ణనలో కొత్తదనం మురిపిస్తుంది. ఇక ‘అర్థం’ అయితే శ్రోతల మనసును మెత్తగా హత్తుకుంటుంది. మొత్తమ్మీద పల్లవి నుంచి ఆఖరి చరణం వరకూ పాటంతా పంచదార చిలుకంత తియ్యగా ఉంటుంది. ఆ తియ్యదనం ఎక్కడి నుంచి వస్తుందంటే... అందమైన తెలుగు మాటల నుంచి. అవును... అనంత శ్రీరామ్‌ అమ్మభాషలోనే రాస్తారు! అందమైన అమ్మభాషా పదాలతోనే అందరూ మెచ్చే... ఆంగ్లంతో దోస్తీ కట్టే యువతరానికీ విపరీతంగా నచ్చే గీతాలకు ప్రాణం పోస్తారు!! అందుకే, చిన్న వయసులోనే... ఫిల్మ్‌ఫేర్‌ నుంచి నంది పురస్కారాల వరకూ అన్నీ అందుకున్నారు. వాటన్నింటికీ మించి అనంత శ్రీరామ్‌ పాటంటే ‘అచ్చమైన తెలుగు పాట’ అన్న గుర్తింపును సాధించారు. ఆయనతో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి...
తెలుగు వెలుగు: జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది? 

అనంత శ్రీరామ్‌: సాంకేతిక విద్యను మధ్యలో మానేసి... సాహిత్యం వైపు రావడం జీవితంలో నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం అనుకుంటా. ఎందుకంటే ముప్ఫైల్లోకి రాకముందే చలనచిత్రాలు, రాజకీయ పార్టీలకు కలిపి ఎనిమిది వందలకు పైనే పాటలు రాయగలిగాను. స్ఫూర్తి పాటలైనా, యుగళ గీతాలైనా, ప్రత్యేక పాటలైనా... ఏ రకానివైనా అనంత శ్రీరామ్‌ రాయగలడని అనిపించుకున్నా. ఈ ప్రయాణం ఎంతో సంతృప్తినిచ్చింది. నాకు ఆంగ్లం రాదు. వచ్చిన తెలుగుతో ‘తెలుగు కోసం’ నా వంతుగా ఎంతో కొంత చేయగలిగినందుకు ఆనందంగా ఉంది.
చదువెందుకు మానేశారు?
చిన్నప్పుడు స్నేహితులతో కలిసి క్రికెట్‌ ఆడదామని వెళ్లేవాణ్ని. సరిగా ఆడలేనని చివరి స్థానమిచ్చేవాళ్లు. అప్పుడే నాకు ఆటలు సరికాదనిపించింది. చదువు మీదే దృష్టి పెట్టా. బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాలలో సీటు వచ్చింది. మూడేళ్లు చదివినా.. ఏం చదివానో అర్థం కాలేదు. ఆ చదువంతా యాంత్రికంగా ఉండేది. అంతే కాదు, విద్యార్థిగా ఉన్నప్పుడు చాలా ఆలోచించేవాణ్ని. చదువు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరాలి. అందులో సంతృప్తి లభించినా లభించకపోయినా డెబ్భైఅయిదు శాతం సమయం దానికే కేటాయించాలి. మిగిలిన కొద్ది సమయమే వ్యక్తిగత జీవితానికి! అప్పుడు ఆ జీవితం నరకంగా అనిపిస్తుంది. అదే ఇష్టమైన రంగంలో అడుగుపెడితే నా పనిలో నాకు ఆనందం ఉంటుందనిపించింది. ఈ ఆలోచనలతో చదువు మీద ఆసక్తి పోయింది. అప్పుడు నేను ఆస్వాదించే రంగం ఏదా అని ఆలోచిస్తే సాహిత్యమని అర్థమైంది. అలాగని సాహితీవేత్తగా మారి, పుస్తకాలు రాసి, అచ్చు వేసి అమ్మడం ద్వారా ఆదాయం అంటే .. అది మన తెలుగు రాష్ట్రాల్లో అంత ప్రోత్సాహకరంగా అనిపించలేదు. అటు ఆర్థికంగా.. ఇటు స్థిరంగా ఎదుగుదల ఉండాలంటే సినిమానే సరైందనిపించింది. అలా ఇటొచ్చేశా. 
సినిమా రంగానికి వచ్చిన తొలినాళ్ల అనుభవాలు?
నేను ఈ రంగంలోకి వచ్చే సమయానికి పాటల్లో తెలుగుకి ఏమవుతోందీ అనిపించేది. చాలా భయం వేసింది. ఎందుకంటే అప్పటికే ఆంగ్ల పాటల్లో అక్కడక్కడా తెలుగును కూర్చే సంస్కృతి వచ్చేసింది. నాకేమో ఆంగ్లం అంతగా రాదు. పది వరకూ తెలుగు మాధ్యమమే. ఇంటర్, ఇంజినీరింగ్‌లో చదువుకున్న సబ్జెక్టు పదాలు గ్రావిటీ, ఆర్గానిక్స్‌ వంటి వాటితో పాటు డెడికేషన్, డిటర్మినేషన్‌ అనే మాటలు తప్ప ఆంగ్లం తెలియదు. అందుకే మిడిమిడి జ్ఞానం ఉన్న ఆంగ్లాన్ని పక్కన పెట్టి కొత్తగా అచ్చమైన తెలుగులోనే రాయాలనుకున్నా. అంటే నాకు ఆంగ్లం రాకపోవడంతోనే తెలుగు మీద అభిమానం పెంచుకున్నా. అలా రచయితగా  నా ఉనికిని కాపాడుకోవడానికే తెలుగు పాటలు రాశా. నిజానికి నేటి యువతరాన్ని అచ్చమైన తెలుగులో రాసి మెప్పించడం పెద్ద సవాలు. ఇక్కడ మరో సవాలూ ఉంది. అదేంటంటే.. చాలా సందర్భాల్లో బాణీ ఇచ్చి.. పాట రాయమంటారు. దీనివల్ల ఎత్తుగడలో స్వేచ్ఛ ఉండదు. తొలి పంక్తి ఎలా వస్తే మిగతాదీ అలానే రావాలి. అంతేకాదు పల్లవి ఉన్నట్టుగానే మిగతా చరణంలోనూ చంధస్సు ప్రకారం రావాలి. అయితే, గీత రచనలో పరిమితులు తగ్గినప్పుడే మన సృజనాత్మకత బయటపడుతుంది. ఉదాహరణకు ‘లైఫ్‌ ఆఫ్‌ పై’ సినిమా చూడండి. విషయం చాలా చిన్నది. సముద్రం, అబ్బాయి, పడవ, పులి... ఇవే కథా వస్తువులు. సినిమా అంతా వీటితోనే నడుస్తుంది. ఇందుకోసం రచయిత రకరకాల తత్వాలను ఉపయోగించుకున్నాడు. సముద్రంలో ఆకలి వేసినప్పుడు చేపని తినాల్సి వస్తుంది. జీవహింస పాపం అనుకునే వ్యక్తి చేపని చంపుతాడు. దేవుడికి క్షమాపణ చెప్పుకుంటూనే ‘విష్ణుమూర్తి ఆ రూపంలో వచ్చి’ ఆకలి తీర్చినందుకు కృతజ్ఞతలు చెబుతాడు. ఇక్కడ భగవత్‌ తత్వం ఉపయోగపడింది. అలా పాటల రచనలోనూ ఎంతో సృజనాత్మకత చూపాలి.
బాణీకి అనుగుణంగా మంచి పదాలను కూర్చడానికి ఎలా కసరత్తు చేస్తారు? 
‘స్టాలిన్‌’లోని ‘పరారేపరారే...’ పాటకు ముందు బాణీ ఇచ్చారు. దానికి అనుగుణంగా రాయాలి. ‘తనానే తనానే..’కి అనుగుణంగా ‘పరారే’ అనే పదం సరిపోయింది. కానీ, వాడుకలో అది ప్రతికూల పదం అయిపోయింది. ‘స్టాలిన్‌’లో అది మెగాస్టార్‌ పరిచయ గీతం. ‘పరారే’ అంటే ప్రతికూలం అవుతుంది. అంత పెద్దనటుడికి అలాంటి పదాలు నప్పవు. ఏం చేయాలా అని ఆలోచించా. చిన్నప్పుడు పాఠశాలలో నేర్చుకున్న సూత్రం ‘-x- = +’ గుర్తొచ్చింది. అంటే, ఓ ప్రతికూల పదం పక్కన మరో ప్రతికూల పదాన్ని పెడితే సానుకూల భావం వస్తుందని! ‘పరారే పరారే ప ప ప పరారే బండెక్కి భయం పరారే’ అంటూ స్ఫూర్తి స్ఫురించేలా రాయడంతో అది సానుకూల వాక్యంగా మారిపోయింది. ఇలా ఎన్నో అనుభవాలు.
      ప్రస్తుతం సాంకేతిక విద్య ప్రాచుర్యంలోకి రావడం వల్ల భాష మీద దృష్టి పెట్టే వాళ్లు తక్కువయ్యారు. వాళ్లని కూడా పాటల ద్వారా భాషవైపు మరల్చాలి. అందుకోసం కొత్త పదాలు సృష్టించి ఇటువైపు లాగడానికి ప్రయత్నించాలి. అది చేస్తూనే ఒక్క ఆంగ్ల పదం కూడా లేకుండా చాలా పాటలు రాశా. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెటు’్టలో నాలుగు పాటలు రాశా. ‘కొత్తబంగారులోకం’లో ‘నిజంగా నేనేనా...’, ‘ఏ మాయ చేశావే’లో అన్ని పాటలూ తెలుగులో రాసినవే.
ఇష్టమైన సాహిత్యం?
ప్రబంధాలు అన్నీ బాగుంటాయి. పారిజాతాపహరణం, ఆముక్తమాల్యద నచ్చుతాయి. చిన్న కథా వస్తువులను తీసుకొని వీటిలో చక్కగా వర్ణిస్తారు. అది అందరికీ సాధ్యం కాదు. వీటిలో కథకంటే వర్ణనకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఇలాంటివి చదవడం వల్ల ఊహాశక్తి పెరుగుతుంది. శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలో... దేవీదేవరుల ఇద్దరి అనుబంధం చెబుతూ.. ‘ఒకరి ప్రతిబింబం ఇంకొకరి మణిలో కనిపించి, ఒకరి గుండెలో మరొకరు ఉన్నట్టు తెలుస్తుంది’ అంటారు. అలాంటి భావాలను తెలుసుకోవడం వల్ల మనమూ రచనా శక్తిని పెంచుకోవచ్చు. నన్ను తిలక్‌ కథలు ప్రభావితం చేశాయి. ఆయన చాలా సహజంగా రాస్తారు. పాత్రల్లో కూడా ఆ సహజత్వం కనిపిస్తుంది. కథ అయినా కాల్పనికత కనిపించదు. సులువుగా రాయడం కష్టం... కష్టంగా రాయడం చాలా సులువు. రాబందు కబళిస్తుందని రాయడం సులువు. మన ఎదురుగా ఉన్న అక్కా, చెల్లి.. ఇలా ప్రవర్తిస్తారనేది చెప్పడం చాలా కష్టం. అది తిలక్‌ గారికే సాధ్యం. యండమూరి, దాశరథి రంగాచార్యుల నవలలన్నా ఇష్టమే. నిజానికి పద్యాల కన్నా గద్యమే ఎక్కువ చదువుతాను. ఎందుకంటే పాటలు రాస్తూ పద్యాలు చదవడం వల్ల ఆ ప్రభావం వాటి మీద ఉంటుందని నా అభిప్రాయం. 
సమకాలీన సాహిత్యాన్ని చదువుతుంటారా?
ఇప్పుడు సాహిత్యం మీద సామాజిక అనుబంధ వ్యవస్థల ప్రభావం ఎక్కువైంది. ఎవరి రచనలను వాళ్లు ‘పోస్ట్‌’ చేస్తున్నారు. కొందరు ఫొటోషాప్‌లో జిమ్మిక్‌లు చేసి మామూలు అక్షరాలను/ పుస్తకాలనూ అద్భుతాలుగా చూపుతున్నారు. ఆకర్షణీయంగా ఉందని ఒక పుస్తకాన్ని కొన్నా అది విషయపరంగా ఆకట్టుకోలేకపోవచ్చు. పుస్తకాలు నాణ్యమైన ముద్రణ, గ్రాఫిక్స్‌తో వస్తున్నాయి. ఇలాంటివి పది వస్తే ఒక్కటి బాగుంటోంది. ‘విషయం’ మాత్రం సంతృప్తి పరచట్లేదు. ఒక్కోసారి మంచి రచనలు బడ్జెట్‌ పరిమితుల వల్ల చదువరులను   ఆకర్షించలేకపోవచ్చు. ఇలాంటి పరిణామాల వల్ల బాగుండే రచన ఏదో... బాగాలేనిదేదో వెలికి తీయలేకపోతున్నాం.
చలనచిత్ర గీత రచయితల్లో ఇష్టమైన వాళ్లెవరు?
ఆనాటి సాహిత్యాన్ని ఇష్టపడతాను. కానీ, ఈనాటి రచయితలే నాకిష్టం. అప్పటి వాళ్లకి ముందు బాణీ ఇవ్వకపోవడం వల్ల ఎత్తుగడకి అవకాశం ఉండేది. అప్పటి పదాలు ఇప్పుడున్నంత పరిమితం కాదు.  ఇప్పుడు ‘బంధం, స్నేహం, ప్రాణం..’ తదితర పదాలు బరువయ్యాయి. వాటిని రాస్తుంటే ఒప్పుకోవట్లేదు. ఉదాహరణకు బంధం అనే పదాన్ని వాడకుండా అనుబంధాన్ని వర్ణించడం సవాలుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి రచయితలు చాలా కష్టపడుతున్నారు. విలువలతో కూడిన పాటలు రాసే సీతారామశాస్త్రిగారంటే నాకిష్టం. కట్టుబాట్ల మధ్య ఉంటూ సమాజాన్ని ఒప్పించే సాహిత్యం రాస్తారాయన. కొత్త బంగారులోకంలో ‘నీ ప్రశ్నలు నీవే..’ పాట బాగా ఇష్టం. 
మీ పాటల్లో మీకిష్టమైంది?
అన్నీ ఇష్టమే. కానీ, ఈ క్షణానికి తోచిన పాట అంటే... ఈ మధ్యకాలంలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’లో ‘ఏం సందేహం లేదు’ అనే పాటలో ‘నా కళ్లలోకి వచ్చి నీ కళ్లాపి చల్లి ఓ ముగ్గేసి వెశ్లావే’ అని రాశా. నా కలల్లో రంగులు నింపావు అనడానికి బదులు అలా రాశానన్న మాట.
చేసిన పదప్రయోగాలు?
ఒక్క సందర్భంలో చేశా. ‘యమదొంగ’ సినిమా కోసం. జూనియర్‌ ఎన్టీఆర్‌ యముడు అయితే ఏం పేరు పెట్టాలా అనే మీమాంసలో ఉన్నాం. కాస్త వినోదం కావాలి... ఆ పదప్రయోగ వల్ల అసలు యముడికి ఈర్ష్య రావాలి... కాబట్టి ఆంగ్లంలో యంగ్, సంస్కృతంలో యమ కలిపి ‘యంగ్‌ యమ’ అని  సృష్టించా. ‘యువ యముడు’ అంటే పలకడానికి బాగోదు. యంగ్‌ యమ అనడం వల్ల యతి కుదిరింది. శబ్ద సౌందర్యం కూడా బాగుంది.
రాజకీయ పార్టీలకు పాటలు రాశారు కదా...?
ఆ. అన్ని పార్టీలకూ రాశాను. పూర్తిగా రాజకీయ గీతాలని వాటిని ప్రత్యేకంగా చూడకపోవడం వల్లే ఇది సాధ్యం అయింది. సినిమాల్లో కథానాయకులు ఉంటే ఇక్కడ నాయకులుంటారు. సినిమాల్లో సన్నివేశాలుంటాయి. ఇక్కడ సందర్భాలుంటాయి. అక్కడ దర్శకుల భావజాలాన్ని అన్వయించుకుని రాయాలి. ఇక్కడ నాయకుల మనసులోని భావజాలాన్ని అన్వయించుకుని రాశా. నాకేమీ వ్యక్తిగత అభిమానాలు లేవు.  పార్టీని సినిమాగా భావించా. దర్శకులు నేర్పించే సూత్రాలను ఇక్కడ అన్వయించా. క్యాచీ అన్నదానికి నాదైన నిర్వచనం ఏర్పరచుకుని రాశా. ఉదాహరణకు ‘జన్మభూమి’ పాటలు రాసినప్పుడు ‘తెగించి దూకరా.. తెలుగు తమ్ముడా..’ అన్నా. యతి బాగా కుదిరింది. అలాంటి పదాలు శ్రోతలను బాగా ఆకర్షిస్తాయి.
పాటలు సరే... ఇంకేమైనా ప్రక్రియల్లో రచనలు చేస్తుంటారా?
అప్పుడప్పుడు వచన కవితలు రాస్తుంటా. సరదాగా. పాటలకే సమయం సరిపోతోంది.
ఇప్పటి తరం సాహిత్యం మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదనుకుంటున్నారు?
కాలం మారింది. అయితే పెద్ద తరానిదే ఆ తప్పు. ఎదుటి వాళ్లని చూసి పెద్దలు తమ పిల్లలకు వాతలు పెడుతున్నారు. ఖరీదైన కళాశాలల్లో, ఐఐటీలు, ఐఐఎమ్‌ల్లో తమ పిల్లలు చదవాలని కోరుకుంటున్నారు. అంటే పిల్లల్ని వాళ్లు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చదివిస్తున్నారు. అందుకే ఇప్పటి తరాన్ని తప్పుపట్టను. పాఠ్యపుస్తకాలు చదివితేనే మార్కులంటే వాళ్లు సాహిత్యం మీద ఎందుకు ఆసక్తి చూపుతారు? ఆ పాఠ్యాంశాల్లోనే సాహిత్యాన్ని పెట్టి.. మార్కులు రావాలని నియమం పెడితే నేటి యువతరం ఎందుకు చదవదు? పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ ల్యాబ్స్‌ అంటున్నారు. వాటికి బదులు సాహిత్యాన్ని పెడితే మానసిక వికాసం కొంతైనా పెరుగుతుంది కదా. సాంకేతిక విద్య ఉంటే సాహిత్యాన్ని వెలివేయాలా? ఈ విద్యావిధానంలో చదివించే వాళ్ల తప్పుగానీ.. చదివే వాళ్లది ఏ మాత్రం కాదు. పెద్దలు మారితే మార్కులతో పాటు ‘మార్పుల’ కోసమూ యువత చదువుతుంది. 
తెలుగులోకి వస్తున్న ఆంగ్ల పదాలను ఎలా తెలుగు చేసుకోవాలి?
భాషకీ, సామాజిక జీవితానికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఆ కాలంలో కత్తులు, గునపాలు, పొయ్యి, పెనం.. వాడేవాళ్లం. కాబట్టి వాటికి తెలుగు పేర్లు పెట్టుకున్నాం. ఇప్పుడు వాడే వస్తువులకి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌... అని ఆంగ్ల పేర్లు వచ్చాయి. వాటికి తెలుగు పేర్ల సృష్టి సరిగా జరగలేదు. ఇప్పటి తరం పలకడానికి సులువుగా ఉండేలా పదసృష్టి చేయాలి. సంస్కృతం జోలికి పోకూడదు. ఉదాహరణకు ఇంటర్‌నెట్‌ను అంతర్జాలం అని రాస్తున్నారు. దాని బదులు ‘లోవల’ అంటే సులువుగా ఉంటుంది కదా. తెలుగు పండితులందరూ ఈ పదసృష్టిలో భాగస్వాములు కావాలి. ఇకనుంచి మన మార్కెట్‌లోకి వచ్చే ఏ వస్తువుకైనా తెలుగు పేరు పెడితేనే విడుదలకు అనుమతిస్తాం అని మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఓ నిబంధన జారీ చేస్తే... ఆ సంస్థల వాళ్లూ తప్పక అయినా తెలుగు పేర్లు పెడతారు. వ్యాపారం కోసం కాబట్టి సులువైన పదాలను వాళ్లే వెతికి పట్టుకుంటారు. మనం కోరుకునే మార్పూ వస్తుంది. 
తెలుగులో మాట్లాడకపోతే ఏంటి అంటున్నారు చాలామంది...?
అమ్మ చేతి పప్పన్నం తినకుండా రోజూ బిర్యానీ తింటే ఏం కోల్పోతామో అదే కోల్పోతాం. అమ్మ చేతి రుచిని చవిచూసే అదృష్టాన్ని కోల్పోతాం. తెలుగుని మర్చిపోయినా అలాగే ఉంటుంది. రోజూ రెస్టారెంట్‌లో తింటే మొహం మొత్తేస్తుంది. రోజూ ఆంగ్లం మాట్లాడితే మన మూలాలను కోల్పోయి గాలిలో ఎగురుతాం. తర్వాత కింద పడిపోతాం.
చిన్న వయసులోనే గుర్తింపు తెచ్చుకున్నారు కదా. ఎలా అనిపిస్తోంది?
అదృష్టం. అది వేగంగా నన్ను ముందుకి లాగింది. విశ్వవిద్యాలయాల్లో తెలుగు చదువుకుని ఏడాదికి వందల మంది బయటికి వస్తున్నారు. వాళ్లకి నాకంటే ఎక్కువ సాహితీ పరిజ్ఞానం ఉంది. ఏదో అదృష్టం ఒకటి వాళ్లకి ఇవ్వని అవకాశాన్ని నాకిచ్చింది. ఏ విజయం వచ్చినా నాది అని నేను చెప్పుకోను. అది అదృష్టం అంటాను. ఈ పాటలే రాయగలడు అనే ముద్ర లేకపోవడం నన్ను కాపాడింది. విప్లవగీతాల రచనలో నాది మొదటి స్థానం కాకపోవచ్చు. ఆ విప్లవం రాసే వాళ్లు అందుబాటులో లేనప్పుడు... అతని బడ్జెట్‌ అందుబాటులో లేనప్పుడు... నా పేరు ప్రత్యామ్నాయం అవడం చాలా అదృష్టం. 
మర్చిపోలేని ప్రశంస?
కీరవాణి గారి కితాబు. చిత్ర పరిశ్రమలోకి రావాలనుకుంటున్న వారిని ఉద్దేశిస్తూ ఓ పత్రికా ముఖాముఖిలో చాలా కటువుగా హెచ్చరించారాయన. ముప్ఫై ఏళ్లు దాటితేనే కథలు రాయడానికి రండి అన్నారు. ఎందుకంటే, అనుభవించిన జీవితం మనకు అనుభవాల్ని నేర్పుతుంది అన్నారు. నేను 21లో ఇక్కడ అడుగుపెట్టాను. 22లో ఆయనకి రాయడం మొదలుపెట్టాను. దీని మీద ఓ ఆడియో విడుదల వేడుకలో ఆయన మాట్లాడుతూ ‘నేనే హెచ్చరించా... ముప్ఫై దాటంది ఈ రంగంలోకి రావద్దని... దాన్ని ఖండిస్తూ అనంత శ్రీరామ్‌ విజయం సాధించాడు. అయినా సరే, తనని మినహాయించి... మిగతా ఎవరూ రావద్దు’ అని చెప్పారు.

* * *


వెనక్కి ...

మీ అభిప్రాయం