తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

నా కవిత్రయం... తిక్కన, వేమన, గురజాడ

  • 2142 Views
  • 17Likes
  • Like
  • Article Share

సంస్కృత ఛందో పరిష్వంగాలనూ, భావ కవిత్వపు బంధనాలనూ, అభ్యుదయ కవిత్వపు గుంభనాలనూ దాటుకుంటూ.. ‘తెలుగు నుడికారం’ అనేది ప్రజల పక్షాన నిలవాలని శ్రీశ్రీ ఆకాంక్షించారు. ‘‘దాని కోసం నేను సైతం ‘మరో ప్రస్థానం’ను అచ్చ తెలుగు జానపదమాత్రలో రాసుకొచ్చా..’’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో నన్నయాదుల నుంచి దేవులపల్లి వరకు తెలుగు అక్షరం ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ఇంతకూ ఎక్కడ... ఎప్పుడు అంటే... 1981లో, అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో జరిగిన ఓ సమావేశంలో! ఆనాటి ఆయన ప్రసంగం ఇది... 
‘‘పొలాల్లో
పని చేసేవారు వాళ్ల పాటలు వాళ్లు పాడుతున్నారు. కొండలమీద రాళ్లు కొట్టేవారు వాళ్ల పాటలు వాళ్లు పాడుతున్నారు. ఇదంతా కూడాను జానపద సాహిత్యం. దాన్ని ఒక సాహిత్యం కింద నిన్నమొన్నటిదాకా ఎవరూ గుర్తించలేదు. ఇప్పుడిప్పుడే ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆంధ్రా విశ్వవిద్యాలయం వాళ్లు దానిమీద రిసెర్చీ చేయడమే కాకుండా పీహెచ్‌డీ, డీగ్రీలు కూడా సంపాదిస్తున్నారు. న్యాయంగా మనం చూడాలంటే ఇది మన తెలుగుదేశం జాతీయత. తెలుగు నుడికారం. తెలుగు అస్తిత్వం. అసలు తెలుగు రూపమే జానపద సాహిత్యంలో కనపడుతుంది.
      ఈ జానపద సాహిత్యం ఇట్లా ఉండగా... ప్రతి ఆంధ్ర గృహంలో కూడా ఆనాటి మహిళలు అంతగా చదువుకోలేదు. మొల్ల, ముద్దుపళని ఇలా కవయిత్రులను చేతివేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. కానీ ప్రతి ఇంట్లో కూడాను స్త్రీలు పాటలు పాడేవారు. అవి చాలా అమూల్యమైన సాహిత్యం. ఆ పాటలు పాడటానికి ఈ స్త్రీలకు విద్య అక్కర్లేదు. అంటే ఏంటి? లిఖిత పూర్వకమైన విద్య. 
      వాళ్లకొక మేటి సంస్కారం, సంస్కృతి ఉన్నది. వాళ్లు నోముపాటలు పాడేరు. పెళ్లి పాటలు పాడుకున్నారు. సంతోషకరమైన పాటలూ పాడుకున్నారు. దుఃఖంతో కూడిన పాటలు పాడేరు. రకరకాలుగా గృహజీవితంలో గృహిణిగా స్త్రీ కవయిత్రి అయ్యింది. కాబట్టి మన సాహిత్యం నన్నయ్యభట్టుగారితో ప్రారంభమయ్యిందంటే నేనొప్పుకోను. అంతకుముందే! ఇంకొంతమంది వేదకాలంలో కూడా ఆంధ్ర శబ్దం ఉన్నదంటారు. మహాభారతంలో కౌరవుల పదకొండు అక్షౌహిణిల సైన్యంలో దుర్యోధనుడి పక్షాన ఆంధ్రులు పోరాడారని! అది ఒక హిస్టారికల్‌ ఫ్యాక్ట్‌. ఆ విధంగా చూస్తే మనం అత్యంత ప్రాచీనమైన వాళ్లం. కానీ మనకంటే కూడాను తమిళనాడులో తమిళభాష, తమిళ సంస్కృతి ప్రాచీనమైందని ఒప్పుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. అదేవిధంగా కన్నడం కూడా. బహుశా దక్షిణాది భాషల్లో మొదటిది తమిళం, రెండోదేమో కన్నడం, మూడో భాష మన తెలుగవుతుంది. నాలుగోదేమో మలయాళం. వీటిలో ఎన్ని విధాలుగా చూసినా సరే అత్యంత మధురమైందిగా  అందరూ అంగీకరించింది తెలుగే అనేది యథార్థం, వాస్తవం. 
      మొన్న చికాగో సభలో నారాయణరెడ్డి మాట్లాడుతూ, మన భాషకు అంత మాధుర్యం ఎందువల్ల వచ్చిందంటే మనది అజంత భాష అన్నారు. అంటే అచ్చులతో ముగుస్తుంది. శ్రీరాముడు, అన్నయ్య, ఆమె మొదలైనటువంటివి. హిందీ కానీ, తమిళం కానీ ఇవన్నీ హలన్త భాషలు. ఇంగ్లీషు కూడా హలన్త భాషే. ఎక్కడో కానీ అచ్చుతో అంతమయ్యేటువంటి పదాలు చాలా సకృత్తుగా కనబడుతుంటాయి.
      అందుకోసమే మన భాషని సంగీతానికి చాలా అనువైన భాష అని చెప్పాలి. త్యాగరాజు గారి పాటల్లో అంత సంగీత సంపత్తి కలిగి ఉండటానికి గల కారణమేంటంటే త్యాగరాజుగారు ఉపయోగించిన తెలుగు భాష. త్యాగరాజు తెలుగువాడే. తన మాతృభాషలోనే రాశాడు. కాని దానికి అంత సంగీత పరిపుష్టి లభించడానికి గల కారణం మనది అజంత భాష కావడమే. అందుకోసమే పాశ్చాత్యులు కూడా తెలుగును ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’ అన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇటాలియన్‌ భాష కూడా అజంత భాషే. వాళ్ల పేర్లు కూడాను ముసలినీ, గారిబాల్డి, మజీని ఇట్లాగా అచ్చులతోనే అంతమై ఉంటాయి. కాబట్టి ఈ అడ్వాంటేజ్‌ మన భాషకు ఉన్నది.
      మన ప్రాచీనతని అదేదో పెద్ద ప్రత్యేకతగా చెప్పుకోనక్కర్లేదు. బెంగాలీ సాహిత్యం మనకంటే చాలా తరువాత వచ్చింది. కానీ రబీంద్రనాథ్‌ టాగోర్‌ లాంటి విశ్వకవులు బెంగాలీలో ఉద్భవించారు. కాబట్టి ఒక భాష ప్రాచీనత ముఖ్యమైనటు వంటి కల్టీరియన్‌గా మనం నికషోపలంగా స్వీకరించాల్సిన అవసరం లేదు. 
      ఈనాడు తెలుగులో ఆధునిక కవిత్వం ఇంతగా అభివృద్ధి పొందిందంటే, మనకి వెనకాతల, మనకి దారిచూపిన ఎందరో కవులు ఉన్నారు. ఆదికవి నన్నయ్యభట్టు భారతం రెండున్నర పర్వాలు రాశాడు. ఆయన పూర్తిచేయకుండా వదిలిపెట్టిన భారతాన్ని తిక్కన సోమయాజిగారు పూర్తి చేశారు. అయితే అరణ్యపర్వం సగంలో నన్నయ్య భట్టు ఆగిపోయాడు. అరణ్య మధ్యంలో చనిపోయాడని చెప్పి ఆ భయం వల్ల మిగిలిన ఉత్తరార్ధాన్ని పూర్తి చేయకుండా, విరాట పర్వం నుంచి పదిహేను పర్వాలు రాశాడు తిక్కన. ఆ తర్వాత మిగిలిన భాగాన్ని ఎర్రాప్రగడ పూర్తి చేశాడు. ఎర్రాప్రగడ శిల్పాన్ని గురించి విమర్శకులు చాలా బాగా చెబుతుంటారు. నన్నయ్యభట్టు కవిత్వంలో 75% సంస్కృత పదాలుంటాయి. 25% మాత్రమే అచ్చతెలుగు పదాలుంటాయి. మరి తిక్కనగారిలో ‘ఆ రెండును... విపరీతమన్నట్లు’ అది రివర్స్‌. తిక్కనగారి కవిత్వంలో 75% అచ్చ తెలుగు, 25% సంస్కృత పదాలుంటాయి. ఆయనకు సంస్కృతం రాక కాదు.
సింగంబాకటితో గుహాంతరమునన్‌ జేడ్పాటుమై నుండి మా
తంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యత్క్రోధమై వచ్చునో 
జం గాంతార నివాస ఖిన్న మతి యస్మత్‌ సేనపై వీడె వ
చ్చెం గుంతీ సుతమధ్యముండు సమరస్థోమాభిరామాకృతిన్‌ 

ఇలా ఆ సందర్భానికి సరిపోయినటువంటి స్టైల్‌ అది. కానీ మొత్తంగా ఆయన మహాభారతాన్ని చూసినట్లయితే అచ్చతెలుగు పదాలే ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు! ఆయన భాష కర్త, కర్మ, క్రియలు, ఛందోబంధనాలు... వీటిని బట్టి గ్రాంథిక భాషలా కనబడినా, ఆయన భాషలో ఆయన నిజంగా నెల్లూరి వాడుక భాషే ఉపయోగించారని గిడుగు రామ్మూర్తి పంతులుగారు అంటూంటారు. అది కూడా మనకు కనబడుతూనే ఉంటుంది. 
      కృష్ణుడు రాయబారానికి వెళ్లే ముందర ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ద్రౌపదీ వీళ్లంతా కూడాను ‘ఏం చెప్పమంటావు, ఏం చెయ్యాలి’ అంటే ధర్మరాజు మాకు అయిదూళ్లు ఇస్తే చాలంటాడు. అర్జునుడు కొంచెం అటుఇటు అంటాడు. భీముడు నాకు యుద్ధమే కావాలంటాడు. ఇట్లా... మొట్టమొదట ధర్మరాజును చూస్తే ఆయన ‘‘ఆపద గడవంబెట్టగ నోపి శుభంబయినదాని నొడగూర్పఁగ మాకీ పుట్టువునకుఁబాండుక్ష్మా పాలుడు నిన్ను జూపి చనియె మహాత్మా’’ అని ప్రారంభిస్తాడు. 
      ఇలా వీళ్లంతా... చివరకు ద్రౌపది దగ్గరకు వస్తే... ‘చెల్లెమ్మా! నీవేం చెబుతావు’ అని అడుగుతాడు. ఈమెకి మనసులో యుద్ధం కావాలని ఉంటుంది. పైకి చెప్పదు. చెప్పకుండా చెప్పడం కోసమని చెప్పి, సినిమాల్లో క్లోజప్‌లోలా అంటామే అలాగ... క్లోజప్‌లాంటి దృశ్యం! ‘నువ్వేమో కౌరవుల దగ్గరకు వెళ్తున్నావు. రాయబారం గురించి మాట్లాడతావు. కానీ ఈ జుట్టు విరబోసుకొని ఉంది కదా. భీముడు దుర్యోధనుడి తొడలు పగులగొట్టి, లేదా దుశ్శాసనుడి గుండెలు చీల్చి ఆ నెత్తురుతో వేణీ సంహారం చేస్తానని ప్రతిజ్ఞ పట్టాడు. యుద్ధం లేకపోతే ప్రతిజ్ఞ నెరవేరడం అసాధ్యం. ఆ ప్రతిజ్ఞ నెరవేరితేనే కానీ నిద్రపట్టదు, అన్నం సహించదు. కాబట్టి నాకు యుద్ధం కావాల’ని సూటిగా చెప్పకుండా ఇన్‌డైరెక్ట్‌గా

ఇవి దుస్ససేను వ్రేళ్ళుం దవిలి సగము ద్రెవ్విపోయి దక్కినయవి: కౌ 
రవుల కడదీఱుమాటల యవసరమున దలపవలయు నచ్యుత! వీనిన్‌

‘కౌరవుల దగ్గర మాటల సందర్భంలో అవసరం వచ్చినప్పుడు అచ్యుతా! ఒక్కసారి వీటిని తలచుకో, వీటిని వాడప్పుడు పట్టుకొని లాగాడు. అప్పటి నుంచి వేణిని ముడి వేసుకోవట్లేదు. నువ్వు ఈ రాయబారానికి వెళ్లే సమయంలో ఈ విడిపోయిన, చిందరవందరైన నా శిరోజాలను జ్ఞాపకముంచుకో’ అని చెప్పింది. ఇంకొక విచిత్రం కూడా ఈ పద్యంలో నాకేం కనబడుతుందంటే సాధారణంగా ‘కౌరవుల కడ తీరు మాటల యవసరమున తలపవలయు అచ్యుతా వీనిన్‌’ అక్కడ యతికోసం అని చెప్పి ‘అచ్యుత’ అని ఉపయోగించాడా? మరి శ్రీకృష్ణునికి కేశవా, మాధవా, నారాయణా అని వందల వేల పేర్లున్నాయి. ఏదైనా ఉపయోగించవచ్చు. కానీ అచ్యుతా అనడంలో ఒక ఉద్దేశం ఉంది. ‘చ్యుతిలేనివాడా’ అని! ‘నీ పట్టుదల నాకు తెలుసు. నీవుగానీ పట్టుబడితే ఉంటది, తప్పకుండా యుద్ధం వచ్చేలా చేయగలవు’ అనేవిధంగా మాట్లాడింది. 
      ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే తిక్కన సోమయాజి శైలి నాటకీయంగా ఉంటుంది. మాట రూపంలో ఉంటుంది. నేను కవిత్వాన్ని రెండు విధాలు అంటూ ఉంటాను. ‘పోయెట్రీ దటీజ్‌ సంగ్, పోయెట్రీ దటీజ్‌ స్పోకెన్‌’, మాట్లాడే కవిత్వం ఒకటి. పాట పాడే కవిత్వం ఒకటి. తిక్కన సోమయాజి గారిది మాట్లాడే కాన్వర్జేషనల్‌ పోయెట్రీ. నన్నయభట్టు గారిది... 
నలదమయంతు లిద్దరు మనఃప్రభవానల బాధ్యమానలై 
సలిపిరి, దీర్ఘవాసర నిశల్‌ విలసన్నవ నందనంబులన్‌ 
నలిన దళంబులన్‌ మృదు మృణాలములన్, ఘనసార పాంసులన్‌
దలిరుల శయ్యలన్, సలిలధారల, చందన దారుచర్చలన్‌ 

      ఇలా లిరికల్‌గా, పొయెటిక్‌గా ఏదో పాటపాడినట్లుగా ఉంటుంది. నేనైతే పాడలేకపోతున్నా గానీ, నారాయణరెడ్డిగారు చక్కగా పాడతారు. ఈ పద్యంలోనే నన్నయ్యభట్టులో సంగీత గుణం నేను పాడితేనే మీకు కనబడి ఉంటుందనుకుంటే, ఇంకా అందులో గర్భితంగా ఆ గుణం ఉంది. అది నన్నయభట్టు కవిత్వ లక్షణం. తిక్కన సోమయాజి కవిత్వం అయితే ఇంకాను. ఇందాక చెప్పాను కదూ! కృష్ణుడు, ధర్మరాజు ఎదురెదురుగా ఇష్టాగోష్ఠిగా, ఏ అరమరికలు లేకుండా హృదయపూర్వకంగా మాట్లాడుకునే గుణాలు తిక్కన సోమయాజివి.
      ఈ రెండు గుణాలకు తరువాత 300 ఏళ్లకు ఎర్రాప్రగడ వచ్చి అరణ్య శేషాన్ని పూరించాడు. ప్రారంభించడమేమోను నన్నయభట్టు కవిత్వంలా, ఎక్కువ సంస్కృత సమాసాలు పెట్టి, రాను రాను తిక్కన సోమయాజిగారి అచ్చతెలుగుకు లింకప్‌ చేసి... ఇదంతా ఒకవిధమైన లిటరరీ ఆర్కిటెక్చర్‌. ‘శారదరాత్రులుజ్వల లసత్తర తారక... కర్పూరపరాగ పాండు రుచి పూరము లంబర పూరితంబులై’ ఇది శారద రాత్రుల గురించి రాసిన నన్నయభట్టుగారి ఆఖరు పద్యం. దాని కంటిన్యూషన్‌ పద్యం ‘స్ఫుర దరుణాంశు... సెలంగగా కరములిడె వాసరముఖంబులు శారదవేళ చూడగన్‌’. పదాలేమో ఈవిధంగా ఉన్నాయి. ఎంత చక్కగా లింకప్‌ చేశాడో చూడండి. ఆ విధంగానూ ఈ ముగ్గురూ మహాభారతాన్ని తయారు చేయడం వల్ల మన పండితులు వారిని కవిత్రయం అని గౌరవించారు.
      కానీ నా ఆదర్శంలో నా పెంకితనం దాంట్లో నా కవిత్రయం వేరే ఉన్నారు. ఆదికాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునికయుగంలో గురజాడ అప్పారావు గారు. ఈ ముగ్గురూ నాకు కవిత్రయం. వీరు నా కవిత్రయం ఎందుకంటున్నానంటే వీరు ముగ్గురూ ప్రజాకవులు. 
      ‘కావున... అంకిత... సంస్కృతి శ్రీ విభవాస్పదంబైన మహాకవితా దీక్షానిధి బూని... పద్యముల గద్యముల రచించెదన్‌ కృతులన్‌’ అని ఎందుకు రాస్తున్నానంటే ఆంధ్ర జనుల యొక్క సంతోషం కోసం మోదం కోసం అని రాస్తున్నానన్నారు తిక్కన. 
      మధ్యకాలంలో వేమన గారు ఎటువంటి ప్రజాకవో ఆ విషయం నేను వేరే చెప్పనక్కర్లేదు. ఆయన విమర్శించంది ఏదీ లేదు. సామాజిక దుర్గుణాలన్నింటినీ, హిపోక్రసీ, ఆఖరికి దేవుణ్ని కూడా ఆయన ఎటాక్‌ చేశాడు. అటువంటి వాడు వేమన. కానీ నిన్న మొన్నటి దాకా మన మహాపండితులు వేమనని కవిగా కూడా గుర్తించలేదు. ఈనాడు కొంత మోడరన్‌ క్రిటిసిజం వచ్చేసరికి వేమనని కవిగా గుర్తిస్తున్నారు. నా దృష్టిలో ఆయన కవిత్రయంలో ఒకరు.
      ఇక గురజాడ అప్పారావు మనందరికీ తెలిసినవాడే. ఆయన ఆధునిక యుగానికి మార్గదర్శకుడు. గురజాడ అప్పారావు గారు చేసిందేమిటంటే అంతకుముందంతా చంపకమాలలు, ఉత్పలమాలలు, శార్దూలాలు, మత్తేభాలు పెద్ద పెద్ద వృత్తాలు- గణబద్ధం ఛందస్సులన్నీ నిరాకరించి ముత్యాలసరం తీసుకున్నాడు. మన నేటివిటీ మాత్రాబద్ధ ఛందస్సులోనే ఉంటాయని చెప్పారు. ‘పుత్తడి బొమ్మా పూర్ణమ్మా... నచ్చనంత వీవునీవింక నచ్చకుంటె మించిపాయె’ అది ముత్యాల సరం సరళి. ఇలాగా కేవలం మాత్రాబద్ధ ఛందస్సులో కవిత్వం రాశారు. ఛందస్సు మాత్రాబద్ధం... భాషేమో వాడుక భాష. 
      గ్రాంథిక భాషలో రాస్తేనే తప్ప వృత్తాలకు రాణింపు ఉండదు. ఆ వృత్తాలకు గ్రాంథిక భాష సరిపోయింది. అదేవిధంగా వాడుక భాషకి మాత్రాఛందస్సుకు సరిపోయింది. ‘నాకు వాడుక భాషే కావాలి. నేను మాత్రా ఛందస్సునే రాస్తా’నని దారి చూపినవాడు గురజాడ. దాంతో ఏమైందంటే ఒక వెయ్యి సంవత్సరాల నుంచి అప్రతిహతంగా వస్తున్న తెలుగు కవిత్వానికి పెద్ద మలుపు ఆయన ఇచ్చాడు. దీనికి రాజకీయంగా గానీ, మనం పేర్లల్‌ తీసుకుంటే అంతవరకూ భూస్వామ్య వ్యవస్థ, ఫ్యూడల్‌ వ్యవస్థగా ఉండే జమీందారీ వ్యవస్థను మార్చి గురజాడ అప్పారావు గారు ఈ మాత్రాబద్ధ ఛందస్సులో వాడుక భాషను ప్రజాస్వామ్య వ్యవస్థగా చేశాడన్నమాట. తరువాత కొంచెం ఆయన మరుగున పడటం, భావకవిత్వం రావడం తెలిసిందే. 
      ఈ భావకవిత్వం ఎందుకంటే టాగోర్‌గారికి నోబెల్‌ బహుమతి వచ్చింది, తరువాత టాగోర్‌ గారు షెల్లీ, మెటర్నిక్‌ వంటివారి ప్రభావం మీద లిరికల్‌ పొయెట్రీ రాశారు. దాని నుంచి ప్రభావితమై రాయప్రోలు సుబ్బారావు, అబ్బూరి రామకృష్ణారావు వంటివారు భావకవిత్వానికి పునాదులు వేశారు. దానిని మంచి శిఖరానికి తీసుకెళ్లారు దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు. దాంతో ఒక 20 సంవత్సరాల దాకా... గురజాడ అప్పారావు గారు 1915లో చనిపోతే, కనీసం 35 వరకూ కూడా భావకవిత్వం ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలన సాగించింది. నేను కూడా నా చిన్నతనంలో భావకవిత్వ పద్యాలే రాశాను. నామీద దేవులపల్లి, విశ్వనాథ సత్యనారాయణ ప్రభావం ఉంది. నేనెక్కడో ఒకచోట రాశాను... వీరిద్దరి ప్రభావాన్ని వదిలించుకోవడానికి నాకు పదేళ్లు పట్టిందని! 
      ఎందుచేతంటే... నేను కూడా గురజాడ అప్పారావు గారు చూపించిన బాటనే అనుసరించాను. అంతవరకూ ఈ గణబద్ధ ఛందస్సు,.. ఈ వ్యావహారికం, గ్రాంథిక భాషలోనే రాశాను. ఇది కాదు, మనకు భావకవిత్వం పనికిరాదు. ఈ గ్రాంథిక భాష పనికిరాదు. ఈ కృతక, ఈ మృతభాష పనికిరాదు. సజీవమైన వాడుక భాషలోనే కవిత్వం కూడా చెప్పాలని ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’తో ప్రారంభించాను. ఆ డికేడ్‌ అంతా కూడాను 1930 నుంచి 1940 దాకా కొంత ఆబ్జెక్టివ్‌ కండిషన్స్, పరిస్థితులు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా నూతన కవిత్వానికి దోహదం చేయడానికి ఉపకరించాయి. 
      ఎందుకంటే ఆ రోజుల్లో ది గ్రేట్‌ డిప్రెషన్, 1930 నుంచి 1940 ది హంగ్రీ థర్టీస్‌ అంటారు. ప్రపంచ పరివ్యాప్తంగానూ ఒకవిధమైన అంధకారం ఆవరించిన పరిస్థితులు. ఆ రోజుల్లో నేను బీఏ పాసై ఉద్యోగం సజ్జోగం లేక, ఉన్న చోట ఉండలేక, చేసిన పనిచేయకుండా, అట్లాగ పరిభ్రమిస్తూ... ఆ పదేళ్లలోనూ మహాప్రస్థానం గీతాలు రాశాను. 
      అదే రోజుల్లో స్పానిష్‌ సివిల్‌ వార్‌లో రచయితలు లెఫ్ట్‌రైట్‌ వర్టికల్‌గా చీలిపోయారు. ఫ్రాంకోనీ, నియంతృత్వాన్నీ సమర్థించే కవులు కుడిచేతివైపు వెళ్లిపోయారు. అదికాదు ఈ ప్రజాస్వామ్యం, ఈ సామ్యవాదం కావాలనే వారు లెఫ్టిస్టులయ్యారు. ఎంతోమంది ఇంగ్లీష్‌కవులు నన్ను ఆవేశపర్చిన వాళ్లు అక్కడకు వెళ్లి చనిపోయారు కూడాను. ఆనాడు మనకు స్వరాజ్యం లేదు. జవహర్‌లాల్‌ నెహ్రూగారు కూడా బెల్‌గ్రేడ్‌ వెళ్లారు. ఇటలీకి రమ్మని ముస్సోలినీ ఆహ్వానం పంపించారట.. ఓ నో నథింగ్‌ డూయింగ్‌ నేను రాను అని పాయింట్‌బ్లాక్‌గా ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించాడు. ఈ విషయాలన్నీ చాలా మందికి తెలిసే ఉంటుంది. ‘స్పానిష్‌ సివిల్‌ వార్‌’ నా మీద కూడా కొంత ప్రభావాన్ని కలుగజేసింది. ఆనాటి కవులందరిపై కూడాను కుడిగానీ ఎడమగానీ ఏవిధంగానైనా నన్ను ఆకర్షించిన వాళ్లేమో ఈ లెఫ్టిస్టు కవులు, వారి ప్రభావం. ఆ రోజుల్లో డబ్ల్యూటోల్టెన్, స్టీవెన్‌ స్పెండర్, సిసిల్‌డెర్‌ లూయింట్, ఆయన ఇటీవల ఆస్థానకవియై కూడా చనిపోయారు. వీళ్లు ఇంగ్లండ్‌కు వెళ్లి ఇలా రాస్తున్న సమయంలోనే నేను కూడా మహాప్రస్థానం గీతాలు రాస్తూండేవాణ్ని. సాహిత్య చరిత్రకారులు, విమర్శకులు దీనికి అభ్యుదయ కవిత్వం అని పేరు పెట్టారు.
       అభ్యుదయ కవిత్వానికి మాతృకగా ఆ రోజుల్లో ముల్క్‌రాజ్‌ ఆనంద్, ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌ ఇంగ్లండ్‌లో చదువు కుంటుండేవారు. వాళ్లు ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ అసోసియేషన్‌ అని పెట్టి ఒక మ్యానిఫెస్టో - ఒక అరటావు కంటే ఎక్కువుండదు - తెచ్చారు. అది దొంగతనంగా ఇండియాకు స్మగుల్‌ అయింది. 
      అబ్బూరి రామకృష్ణారావు గారు ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రేరియన్‌. నేను కూడా తరచుగా లైబ్రరీకి వెళ్లేవాడిని. ఒక రకంగా అబ్బూరి రామకృష్ణారావు గారు నాకు గురువు గారన్నమాట. ఆయన దగ్గర క్లాసులో పాఠాలు నేర్చుకోలేదు కానీ, లైబ్రరీలో ఏదైనా ఫ్రెంచ్‌ సాహిత్యం గురించి కొత్త పుస్తకం వస్తే ‘ఇది నువ్వు తప్పకుండా చదవాల’ని చెప్పి నా చేత ఎన్నో పుస్తకాలు చదివించారు. ఆ విధంగా నాకు గురువు.  ఆయన రాయప్రోలు సుబ్బారావు గారితో సమానమైన కవి. ఆయన సాహచర్యం వల్ల హంగ్రీ థర్టీస్‌లో ఏ 35, 36 లోనో ప్రోగ్రెసివ్‌ మానిఫెస్టో చదవగానే ‘పొలాలన్నీ హలాల దున్నీ...’ అని ప్రతిజ్ఞ గేయం రాశాను.
      దీన్ని అబ్బూరి రామకృష్ణారావు గారు చదివారు.. ‘ఏమిటోయ్‌ ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ మానిఫెస్టో అంతా ఈ పోయెంలో దించేశావ్‌’ అనేశారు. అయితే నేను పొంగిపోతానని చెప్పేసి... వీటిని  సింగిల్‌ టోన్నా పద్యాలన్నారాయన. పేజీలో చాలా మార్జిన్‌ ఉంటుంది, మధ్యలో కనిపించీ కనిపించనట్లుగా ఈ పద్యాలుంటాయి. 
      ఇది ప్రోజ్‌పోయెం అంటూ చిన్న ఉదాహరణ ‘ఖాళీపే కేజీపే, ట్టెలు అమ్మబడును’ చెప్పారాయన.  అసలిదేంటంటే ‘ఖాళీ పేకేజీ పెట్టెలు అమ్మబడును’ అని చెప్పి... ‘ఒరేయ్‌ నీ కవిత్వం ఇలా ఉందిరా’ అన్నారు. ఆయన లో అంత సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉంది.  
      ఆ విధంగాను భావ కవిత్వం నుంచి అభ్యుదయం కవిత్వం! భావకవిత్వం ఈ శతావధానాల, అష్టావధానాల, జమీందారీ కవిత్వాల మీద ఒక తిరుగుబాటుగా ఎలా అయితే వచ్చిందో... అదేవిధంగా భావకవిత్వం మీద ఒక తిరుగుబాటుగా అభ్యుదయ కవిత్వం వచ్చింది. అది కొంతకాలం సాగిన తరువాత ఈనాడు లేటెస్ట్‌ ట్రెండ్స్‌ విప్లవ రచయితల సంఘం వారు, చాలా మంది కవులు రాస్తున్నారు. ప్రోజ్‌ పోయెమ్‌ ఏకచ్ఛత్రాధిపత్యం కొంచెం తగ్గి... గద్దర్‌ లాంటివాళ్లు, చెరబండరాజు లాంటివాళ్లు, విశాఖపట్నంలోని వంగపండు ప్రసాద్‌ లాంటివాళ్లు, వాళ్లందరూ కూడాను జానపద గేయాలను తీసుకొని - ఫార్మ్‌ను ఫోక్‌లోర్‌ ఫార్మ్‌ను, కంటెంట్‌యేమో రివల్యూషనరీగా ఉండి - గ్రామగ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. జననాట్యమండలి అని చెప్పి నాట్యాలు వేస్తున్నారు. ఉపన్యాసాలిస్తూ అన్నీ చేస్తున్నారు. 
      కొంతకాలం నేనూ తిరిగాను కానీ ఇప్పుడంత తిరిగే ఓపిక లేకపోతోంది. కానీ నేను కూడా ‘మరో ప్రస్థానం’ అని రాశాను. అందులో చాలా వరకు గేయం, ప్రోజ్‌ పోయెం చాలా తక్కువగా ఉంటాయి. జానపద రూపాల్లో ఉండే, గేయరూపాల్లో ఉండేటువంటివి ఉంటాయి. అంతే కాకుండా భాష కూడా కార్మికుల, పాటక జనాల భాషనే ఉపయోగించాను’’

* * *

సౌజన్యం: మద్దిపాటి కృష్ణారావు, 
వడ్లమూడి బాబూ రాజేంద్రప్రసాద్‌


వెనక్కి ...

మీ అభిప్రాయం