తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

ప్రజాసేవకులారా... పరభాష కోసం పాకులాడకండి!

  • 1253 Views
  • 5Likes
  • Like
  • Article Share

రమణాచారి... ఈ పేరు వినగానే కొందరికి ప్రభావశీలి అయిన అధికారి గుర్తుకువస్తారు.  మరికొందరికి సాహిత్యాభిమాని స్ఫురిస్తారు. కానీ తెలుగు  మాధ్యమంలో చదివినా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చుననీ... సాహిత్యాధ్యయనం ఉద్యోగాన్ని మరింత బాధ్యతాయుతంగా, జీవితాన్ని శోభాయమానంగా చేస్తుందని నిరూపించిన వ్యక్తి రమణాచారి. నీడలా సాహిత్యం నిలిచిన స్ఫూర్తితో, తన 57వ ఏట పద్యకవిత్వం మీద పీహెచ్‌డీని సాధించారాయన. ఆయనతో ‘తెలుగువెలుగు’ ముఖాముఖి...
తె.వె: మీ బాల్యం... విద్యాభ్యాసం?
రమణాచారి:
చిన్నప్పుడే పంచకావ్యాలతో పాటు అమరకోశాన్ని, ఆంధ్రనామసంగ్రహాన్ని, రఘువంశాన్ని, శతకాలని... చదివాను. పెద్దలు చెప్పారు కాబట్టి అవన్నీ చదువుకున్నాను కానీ... వాళ్లు నాకు ఆ సాహిత్యాన్ని పరిచయం చేయడంలో గొప్ప సంస్కారం ఇమిడి ఉందని తరువాత అర్థమైంది. మెదక్‌లోని ప్రభుత్వ పాఠశాలలో, తెలుగు మాధ్యమంలో చదువుకున్నాను. ఇప్పుడు మనం ‘ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు ఉండవు’ అనుకుంటుంటాం. యాభై ఏళ్ల కిందట అసలే లేవు! అలాగే చెట్లకిందనే చదువుకున్నాం. ఐఏఎస్‌ కావాలంటే కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుకోవాలన్న భావన తప్పు! ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకి కూడా ఐఏఎస్‌ అయ్యే అవకాశం ఉంది. చదువుకోవాలనే ఏకాగ్రత, ఏం చదువుకోవాలన్న స్పష్టత, వివేచన, ఆలోచన... ఉంటే చాలు. ఎలాగైనా ఎదగాలనే తపనతో డాక్టరైతే బాగుండనుకుని సైన్స్‌ సబ్జెక్టుని ఎంచుకున్నాను. కానీ ఎమ్బీబీఎస్‌లో చేరేందుకు వయసు సరిపోకపోవడంతో, బీఎస్సీలో చేరాను. తరువాత ఎమ్మెస్సీ (ఆర్గానిక్‌ కెమిస్ట్రీ) చేసి విశ్వవిద్యాలయం లోనే ప్రథముడిగా నిలిచాను.
ఆరోజుల్లో మీ జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన...?
1968లో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి. అందులో ‘మాతృభాషలో విద్యాబోధన అవసరమా’ అన్న అంశం మీద అనుకూలంగా మాట్లాడి, వక్తృత్వంలో ప్రథమ బహుమతిని గెల్చుకున్నాను. నేను ఈ స్థానానికి చేరడానికి, మంచి వక్తగా ఉండగలనన్న ఆత్మవిశ్వాసానికి ఆ గెలుపు దోహదపడింది. ఆ గుర్తింపుతోనే నన్ను కళాశాల విద్యార్థిసంఘం అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. విద్యార్థినాయకునిగా మరుసటేడాది తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రెండు నెలల జైలు జీవితాన్ని గడిపాను. అప్పుడు నా వయసు 16 ఏళ్లు!
విద్యాభ్యాసం తరువాత?
సైఫాబాద్‌ సైన్స్‌ కశాశాలలో అధ్యాపకునిగా పనిచేశాను. తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా అవకాశం వచ్చింది. దానివల్ల పార్ట్‌టైంలో పీహెచ్‌డీ చేసే వెసులుబాటు కలిగింది. అయితే  నేను ఎంచుకున్న అంశమ్మీదే, ఉజ్జయిని విశ్వవిద్యాలయం నుంచి వేరొకరు పీహెచ్‌డీని సాధించారు. నన్ను ఊరడించేందుకు మా ఆచార్యులు, సహచరులంతా ‘పీహెచ్‌డీ ఎప్పుడైనా చేయవచ్చు, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో నియామకాలు జరుగుతున్నాయి... వాటిద్వారా సమాజానికి సేవ చేయవచ్చు కదా!’ అని సూచించారు. అలా 1975లో పరీక్ష రాసి, 1977లో సర్వీసులోకి వచ్చాను.
ఉద్యోగంలోని ఒత్తిడిని, సమస్యలను ఎదుర్కొనేందుకు సాహిత్యం ఉపయోగపడిందా?
కుటుంబాన్ని నడపాలంటేనే ఎంతో ఒత్తిడి, సమస్యలు ఉంటాయి. అలాంటిది పాలనలో ఉండేవాళ్ల విషయం చెప్పక్కర్లేదు. సంగీత సాహిత్యాల మీద అభిరుచి ఉన్నవాళ్లు, దానివల్ల రసానుభూతిని పొందుతారు. సమస్యలలో కూడా పరిష్కారాన్ని వెతుక్కుంటారు. అందుకు కావాల్సిన ఆలోచనా సరళిని పెంచుకుంటారు. సాహిత్యం మీద అభిరుచి ఉన్నవాడికి మేధ ఎంత పదునుగా ఉంటుందో, హృదయం అంత ఆర్ద్రంగా ఉంటుంది. మేధకి మనసుని జోడించి పనిచేసేవాడు అవతలివారికి సాయపడాలని అనుకుంటాడు. సాహిత్యాభిరుచి ఉన్న అధికారులు మిగతావారి కంటే సేవాదృక్పథంలో ఒక అడుగు ముందుంటారు.
భాష గురించి పోరాడే తీరికా, తపనా అధికారులకు ఉంటాయా?
అధికారులకి అలాంటి తపనే ఉంటే, భాషాపరమైన ఎన్నో సమస్యలు తీరిపోయేవి. నేను అధికారిగా పోరాడింది అలాంటి సమస్యల మీదే. కానీ ఇలా ఏకొందరో ఉంటే సరిపోదు. వాళ్లు కూడా ఏదో ఒకసారి తెలుగులో ఉత్తర్వులు జారీచేయడం, వాటికి ప్రశంసలు పొందటం కాకుండా... ఇది మన జీవన విధానం అన్న రీతిలో తెలుగులో పాలనకి కట్టుబడి ఉండాలి! ఇప్పుడు తెలుగుకి రెండు రాష్ట్రాలు ఏర్పడిన తరువాత కూడా ఈ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. కాబట్టి ప్రభుత్వంలోని భాషాభిమానులంతా భాష, దాని అభివృద్ధి, అధికార భాషగా అమలు గురించి సమష్టిగా ప్రయత్నించాలి.
సాంస్కృతికశాఖలో మీ అనుభవాలు?
విద్యార్థి దశనుంచే నాటకాలు వేస్తుండే వాణ్ని. రసరంజని సంస్థ ద్వారా ప్రతినెలా రెండురోజులపాటు నాటకాలని ప్రదర్శించే వాణ్ని. 1991లో, తిరిగి 1995లో సాంస్కృతిక శాఖ సంచాలకునిగా పనిచేసే అవకాశం వచ్చింది. సమాచార పౌరసంబంధాలు, చలనచిత్రం వంటి శాఖలలోనూ పనిచేశాను. అలా వృత్తి, ప్రవృత్తి ఒకటే కావడం నా అదృష్టం. నాకు కళలన్నా, కళాకారులన్నా, వారిని గౌరవించడమన్నా ఇష్టం. అందుకే నాటకానికి నంది, కళాకారులకు హంస పురస్కారాలను ప్రవేశపెట్టడంలో కృషి చేశాను. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా  కళాకారులకు జీవనభృతిని రూ.500 నుంచి 1500లకి చేయించే ప్రయత్నాల్లో సఫలమయ్యాను.
ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూ పీహెచ్‌డీ చేశారు...?
పీహెచ్‌డీని ఎప్పుడైనా చేయవచ్చని మా ఆచార్యులు చెప్పిన మాట గుర్తుండి పోయింది. అందుకని 55వ ఏట తెలుగులో ఎమ్మే చేసి 2009లో తితిదే ఈవోగా ఉన్నప్పుడు పీహెచ్‌డీ సాధించాను. ‘తెలుగులో పద్య కవిత్వం- వస్తు వైవిధ్యం’ అనేది నా పరిశోధనాంశం. మన భాషకు పద్యం తల్లివేరు! పద్యం బాగుంటేనే దాని నుంచి వచనం, గద్యం, కవిత, హైకు, నానీ, టుమ్రీ, చుక్కలు, రెక్కలు, నవల, నాటకం, కథ.... ఇలా సాహిత్యం ఎన్ని పోకడలైనా పోతుంది. ఇవాళ తెలుగు సాహిత్యం సుసంపన్నంగా ఉంది అంటే దానికి కారణం పద్యమే! పద్యం మన కంఠానికి సంబంధించింది... కంఠస్థం చేసుకోవడానికి అనువుగా ఉంటుందది. అందుకనే బాల్యంలో శతకపద్యాలను కంఠతా పెట్టించేవాళ్లు. ఎందుకంటే అవి కలకాలం జ్ఞాపకం ఉండి, వాటిలోని విలువలు జీవితంలో పనికొస్తాయని! అలాంటి నేపథ్యంలో పెరిగిన వాణ్ని కాబట్టి పద్యమంటే ఇష్టం. నాటకాలన్నీ ముందు పద్యనాటకాలే. సామాజిక స్థితులకు అనుగుణంగా సాంఘిక నాటకాలు వచ్చాయి కానీ... ఇప్పటికీ ‘చెల్లియో చెల్లకో’, ‘అదిగో ద్వారక’ వంటి పద్యాలు సామాన్యుల నాలుకల మీద నర్తిస్తుంటాయి. పిల్లవాడికి ఇంటా బయటా తెలుగుపట్ల అభిరుచి ఏర్పడితే పద్యం, నాటకాలు తప్పక పునర్వైభవం పొందుతాయి. తల్లిదండ్రులు, అధ్యాపకులదే ఈ బాధ్యత.
తెలుగు మాధ్యమంలో చదివితే ఉద్యోగాలు రావని ఒక అభిప్రాయం?
తెలుగుతో పాటు మరో రెండు భాషల మీద పట్టు సాధిస్తే, ఉద్యోగాలు సంపాదించడమే కాదు... మరో పదిమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి కూడా చేరుకోగలం. కానీ అమ్మభాషే రాకపోతే అవతలి భాషలని కూడా నేర్చుకోలేరు. మన జీవితం కూడా అరకొరగా ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో మాతృభాష పట్ల అభిమానం ఉన్న విద్యార్థులకే పరభాషల మీద పట్టు దొరుకుతుంది. తన భాషే తెలియని వాడు ఆంగ్లాన్ని నేర్చుకుంటే, అది కేవలం అప్పు తెచ్చుకున్నట్లు ఉంటుంది. అందుకే ఏ మాధ్యమంలో బోధన జరుగుతున్నా, తెలుగుకు తగిన ప్రాధాన్యం కల్పించేందుకు శతధా ప్రయత్నిస్తున్నాం.
వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ ఎంతవరకు సఫలం అవుతోంది?
చదువుకు కావల్సింది పెద్దపెద్ద భవంతులో, ఏసీ గదులో కాదు. నిజానికి అలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని చదివించి.... ‘సమాజం అంటే ఇదే కాబోలు!’ అన్న అపరిపక్వతను కలిగిస్తున్నాం. అలాంటి వ్యక్తి సమాజంలో బాధ్యతాయుతమైన పాత్రలోకి వస్తే... పేదవాళ్లనీ, శ్రామికులనీ, బాధితులని చూసి అసహ్యించుకుంటాడేమో అని భయం వేస్తోంది. అలాంటివాళ్లని కష్టపడి ఈ విద్యాలయాల్లో తయారుచేస్తున్నామా అనే భావం కలుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు కూడా భాష, సంస్కృతులను పిల్లలకి అందించడంలో మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి.
తెలుగులో ఉన్నత విద్యా బోధన కష్టమంటున్నారు?
నేను రసాయనశాస్త్రాన్ని ఆంగ్లంలోనే చదివినా, దాన్ని తెలుగులో సులువుగా బోధించగలిగాను. అందులోని సాంకేతిక పదాలను సైతం తెలుగులోనే చెప్పేవాణ్ని. పాట పాడేవాణ్ని బట్టి పాట గొప్పదనం ఉంటుంది. అలాగే బోధనని బట్టి విద్యార్థుల ఆసక్తి ఉంటుంది! మనకి కావాల్సింది పెద్దపెద్ద డిగ్రీలున్న ఉపాధ్యాయులు కాదు.. అర్థమయ్యే రీతిలో పాఠం చెప్పగలిగే వాళ్లు కావాలి. దాంతోపాటు మన భాష, సంస్కృతులను విద్యార్థులకు అందిస్తూ, వారి వ్యక్తిత్వాన్ని మలిచేవాళ్లు కావాలి. 
తెలుగుభాష వ్యాప్తికి ఏం చేయాలి?
ప్రభుత్వం చట్టాలు మాత్రమే చేస్తుంది. చట్టప్రకారం తెలుగు మన అధికారభాష. కానీ ప్రజల్లో ఆ చైతన్యం రావాలి. వారి మనసులో ఆ భావం నాటుకుని, తెలుగుభాష పరివ్యాప్తికి ప్రయత్నించాలి. ఇందులో తెలుగు అధ్యాపకుల, తెలుగు పండితుల బాధ్యత కూడా ఉంది. వినేవారిలో తెలుగుపట్ల శ్రద్ధాసక్తులు ఏర్పడేలా చెప్పాల్సిన బాధ్యత వాళ్లది. ఒకప్పుడు ‘ఆంధ్ర సారస్వత పరిషత్‌’ నుంచి వేలాదిమంది తెలుగు అధ్యాపకులై వెలిగారు. కానీ ఈ రోజు ప్రాచ్య కళాశాలల్లో ప్రవేశాలు సైతం లేని దుస్థితి వచ్చిందంటే కారణం తెలుగుపట్ల ఉన్న అపోహలే! మా పిల్లలు తెలుగులో మాట్లాడాలి అని తల్లిదండ్రులు అనుకోవాలి. ఇప్పుడు విదేశాల్లోని తల్లిదండ్రుల భావనని చూశారా! తమ సంస్కృతికి దూరమయ్యారు కాబట్టి, తమ పిల్లలు అలా కాకుండా... సంగీతం, నృత్యం, భాష నేర్పాలని తపిస్తున్నారు. రాబోయే రోజుల్లో మన దగ్గర కూడా అటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది.
ఆంగ్లంతో సంబంధం లేని ఉద్యోగాలకి తెలుగులోనే పరీక్షపెట్టొచ్చు కదా?
తెలుగులో చదువుకున్నవారికో, తెలుగులో నిష్ణాతులైనవారికో ఈ వెసులుబాటు ఉంటుందన్న నమ్మకం ప్రజల్లో కలగాలి. అధికారిగా ఉన్నప్పుడు ఆ దిశగా నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ సాధ్యం కాలేదు! ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత, రెండు ప్రభుత్వాలనీ ఆ దిశగా ఒప్పించాల్సిన బాధ్యత మనందరిదీ. తెలుగుభాషను అభిమానించే వాళ్లు ఇందుకోసం గట్టిగా ప్రయత్నించాలి.
పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో తెలుగుకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి?
రాష్ట్రం విడిపోయిన తరువాత, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పడింది. అది ఏ రకంగా పని చేస్తుందో గమనించాలి. కమిషన్‌ నిర్వాహక సభ్యుల్లో భాషాభిమానం ఎలా ఉంటుందో గమనించాలి. ఇంతవరకు జరిగిన నష్టం ఎలాగూ జరిగిపోయింది. రెండు రాష్ట్రాల్లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు దీని మీద దృష్టి పెట్టాలి. తెలుగును అధికార భాషగా అమలు చెయ్యాలని ఎన్నో జీవోలు వచ్చాయి... చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు, వ్యవస్థ వల్ల ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది. ఇప్పటికీ పాలకులకు మనవి చేసేది ఒక్కటే! మాతృభాషను అలవర్చుకునేట్లుగా మన విద్యార్థులని తీర్చదిద్దనట్లయితే... అమ్మని ‘అమ్మా’ అని పిలవలేని వ్యవస్థకు కారణం అవుతాం. ఇవాళ పాశ్చాత్య దేశాల్లో పదిహేనేళ్ల వయసు రాగానే, ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతున్నారు పిల్లలు. మదర్స్‌డే, ఫాదర్స్‌డే, థాంక్స్‌ గివింగ్‌డే పేరుతో తల్లిదండ్రులను కలుసుకుని... తిరిగి ఎవరి జీవితాల్లోకి వాళ్లు వెళ్లిపోతారు! మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అనే సంస్కారం ఉన్న మన దేశంలో ఆ సంస్కృతిని అనుకరించేవాళ్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే... మన మాతృభాషని మనం గౌరవించుకుంటే మన తల్లిదండ్రులను గౌరవించుకున్నట్లే! 
అమ్మభాషలో ప్రభుత్వ పాలన ఎందుకు సాధ్యం కావట్లేదు?
అసలు లోపం ప్రభుత్వంలోనే ఉంది. ఈ విషయంలో నా అశక్తతను ఒప్పుకుంటున్నాను. నాలాగా వేదన పడేవాళ్లు నా సన్నిహితుల్లో మరో 20, 30 మంది ఉన్నారు. మేమంతా కలిసి చాలాసార్లు చర్చించాం కూడా! కానీ ప్రభుత్వాల మెడలు వంచి చేయించగల శక్తి ఒక్క ప్రజలకే ఉంటుంది. మండలస్థాయిలో తెలుగు భాషలో అమలు బాగుంది. ఉత్తరప్రత్యుత్తరాల్లో, సంభాషణల్లో, అధికార పత్రాలలోను తెలుగు కనిపిస్తోంది. కానీ దీపం కిందనే చీకటి ఉన్నట్లు, హైదరాబాదులోని సచివాలయంలో ఆంగ్లమే కనిపిస్తోంది. ఈ విషయాన్ని సచివాలయంలోని పెద్దలకి తరచూ గుర్తుచేస్తూనే ఉండాలి. సచివాలయం నుంచి జిల్లాలకు వెళ్లే ఉత్తర్వులను తెలుగులో పంపమని ఒత్తిడి చేయాలి. ఎన్నికల పరిశీలకునిగా అసోం, మహారాష్ట్ర, కర్ణాటకలకు వెళ్లినప్పుడు.... ఉత్తర్వులన్నీ వాళ్ల మాతృభాషలో ఉండటం చూసి ఆశ్చర్యపోయేవాణ్ని. ఇతర రాష్ట్రాల వాళ్లకి ఉన్న భాషాభిమానం మనలో ఎందుకు కొరవడిందనే బాధ ఎప్పుడూ వేధిస్తుండేది. నాతోటి భాషాభిమానులందరికీ చేసే విన్నపం ఏమిటంటే... మన ప్రయత్నం ముమ్మరం చేద్దాం. ప్రభుత్వంతో కూడా చేయించడానికి ప్రయత్నిద్దాం.
కనుమరుగవుతున్న జానపదాలు నిలబెట్టుకోవాలంటే?
ఎప్పటికప్పుడు కనుమరుగవుతున్నట్లు కనిపిస్తుంది జానపదం. కానీ విదియరోజు కనిపించని చంద్రుడు... పున్నమినాటికి ఎలా పరిపూర్ణుడవుతాడో, జానపద కళలూ అంతే! పాట, మాట, పద్యం, సాహిత్యం పుట్టకముందు మనకి ఉన్నది జానపదమే! ఇప్పుడు టీవీలూ, ఫేస్‌బుక్కులూ, బ్లాగులూ, ట్విట్టర్లూ, వాట్సప్‌లూ, యూట్యూబులూ.... చూసీ చూసీ జానపదం అంటే ఏంటి అని అడిగే పరిస్థితిలో ఉన్నారు. కానీ... జానపదం అనేది మూలం. ఇవాళ్టికీ జానపదం ఉంది. ఇంకెన్నాళ్లకైనా ఉంటుంది. సాంస్కృతిక శాఖలూ, ప్రభుత్వాలూ జానపద కళాకారుల పట్ల తమ బాధ్యతని విస్మరించరాదు. శాస్త్రీయ కళలన్నీ కూడా జానపదం తరువాతే!
ఇప్పుడు తెలుగు ప్రాంతాల్లో కూడా మా భాష గొప్పదంటే మా భాష గొప్పదంటున్నారు...?
మన జీవన ప్రయాణంలో రకరకాల వ్యక్తులను కలుసుకుంటూ ఉంటాం. వాళ్లతో పోల్చి చూసుకుంటే, మనకి జన్మనిచ్చిన అమ్మకి అందం, ధనం, పదవులు, చదువు... లేకపోవచ్చు. కానీ అమ్మ అమ్మే! తను ఒక ప్రాంతానికి చెందటం వల్ల అక్కడి యాస ఇష్టం కావచ్చు. కానీ మరో ప్రాంతానికి చెందిన భాషని ఈసడించుకోవడానికో, అది గొప్పది కాదని తీర్మానించడానికో వారికి ఏమాత్రం అర్హత ఉండదు... ఉండకూడదు! వివిధ మాండలికాల్లోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికే భాషాభిమానులంతా ప్రయత్నం చేయాలి. మనకి నన్నయ్య, తిక్కన, ఎర్రన, పోతన, సోమన, గోన బుద్ధారెడ్డి... అందరూ ముఖ్యమే! ఇలా ఆవేశంతో మాట్లాడే మాటల్ని హృదయాల్లోకి తీసుకోకుండా వాళ్ల, భావోద్వేగాలని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. వాళ్లని నొప్పించకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.
రెండు ప్రభుత్వాలూ కలిసి కృషి చేస్తే, మన భాషకు మరింత గుర్తింపు వస్తుంది కదా?
తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్‌ అయినా... మనది తెలుగుభాషే! మన భాషలో ఉండే సౌందర్యం మరే భాషలోనూ లేదు. తెలుగు భాష ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది అని చెప్పుకునే రోజుల నుంచి, తెలుగు కోసం రెండు రాష్ట్రాలు కృషి చేస్తున్నాయి అనుకునేలా ఎదగాలి. భూమి మొదట్లో చాలా వేడిగా ఉండేది. అది జీవులకి ఆవాసయోగ్యంగా మారడానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉన్నాం. ఈ వేడి తగ్గాక మన ఆశయాన్ని చేరుకుందాం. నిధులు, నీళ్లు, నియామకాలు రాజకీయవేత్తలకి... సంస్కృతి, సంప్రదాయం, భాష ప్రజలకి. కాబట్టి సంస్కృతి పట్ల అభిమానం ఉన్నవారంతా కూడా భాషని పరిపుష్టం చేసుకునేందుకు ప్రయత్నించాలి.
ప్రభుత్వ సలహాదారుగా తెలుగు ఔన్నత్యం కోసం ఇది చేయాలి అన్న లక్ష్యాలేమైనా నిర్దేశించుకున్నారా?
బోలెడు. ప్రభుత్వ సలహాదారుగా ఉండేందుకు ఆ లక్ష్యాలే కారణం. భాష, సంస్కృతి, సంప్రదాయాల కోసం ప్రత్యేకంగా ఓ సలహాదారు ఉండాలని అనుకోవడంలోనే తెలంగాణ ముఖ్యమంత్రిగారి గొప్పదనం ఉంది. తెలంగాణలో పనిచేసే ప్రభుత్వ సేవకులందరికీ నా మనవి ఏంటంటే... మన భాషను విడిచిపెట్టి, పరభాష కోసం పాకులాడాల్సిన అవసరం లేదు. మన ముందుతరాల వారికి దాన్ని అందించడం కోసం ప్రతి ప్రజాసేవకుడూ ప్రయత్నించాలి. ఇది కేవలం నా సలహా మాత్రమే కాదు... నా ఆలోచనా ధోరణి, నా అభిప్రాయం కూడా! ఈ అభిప్రాయం అమలు కోసం పనిచేయడమే నా లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించే దిశలో నాకు అలసట లేదు... రాదు! (రమణాచారి: 98480 98990)


వెనక్కి ...

మీ అభిప్రాయం