తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

ఎదగాలంటే తెలుగులో చదవాల్సిందే

  • 1436 Views
  • 13Likes
  • Like
  • Article Share

    వేములపల్లి వేంకట సుబ్బారావు

  • విజయవాడ.
  • 8008171678

రెండున్నర దశాబ్దాలుగా ‘మాతృభాషా మాధ్యమంలో ప్రాథమిక విద్యాబోధన’ కోసం ఉద్యమిస్తున్నారు ఆ దంపతులు. తమ వాదనలోని శాస్త్రీయతను నిరూపించేందుకు తమ పిల్లలిద్దరిపైనే ప్రయోగం చేశారు. ఆ పిల్లలిప్పుడు వైద్య, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో ఉన్నతస్థానాల్లో ఉన్నారు. తమ ప్రస్థానాన్నే నిదర్శనంగా చూపుతూ ఆ దంపతులు మరింత ఉత్సాహంతో ‘అమ్మభాషలో చదువు’ కోసం ఎలుగెత్తుతున్నారు. వృత్తిరీత్యా వైద్యులైన ఆ జంట... కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన రామకృష్ణ ప్రసాద్, పద్మావతి. వీళ్లిద్దరితోనే కాదు... అమ్మానాన్నల ఆశయాన్ని అందిపుచ్చుకున్న ఆ పిల్లలతోనూ ‘తెలుగువెలుగు’ మాట్లాడింది. నిండైన ఆ ‘తెలుగు కుటుంబం’ పంచుకున్న మూడున్నర దశాబ్దాల అనుభవాలు, ఆలోచనలు ఇవీ... 
తె.వె: మీ ఉద్యమానికి ప్రేరణ? 

ప్రసాద్‌:  విశాలాంధ్ర దినపత్రికలో 1978లో ‘మాతృభాషలో ప్రాథమిక విద్య’పై అట్లూరి పురుషోత్తం గారు వ్యాసాలు రాస్తుండేవారు. అవే నన్ను ప్రభావితం చేశాయి. ‘తెలియని భాషలో తెలియని (సైన్స్, సోషలు, లెక్కలు) సబ్జెక్టులను ఎలా బోధిస్తారు, పిల్లలకు ఎలా అర్థమవుతాయి’ అని ఆయన అప్పట్లోనే ప్రశ్నించేవారు. ‘భాషను భాషగా నేర్పించాలి తప్పితే సబ్జెక్టుల ద్వారా పరభాషను నేర్పించడం అశాస్త్రీయం. అర్థం కాని భాషలో బోధించడం వల్ల పిల్లలకు బట్టీపట్టడం అలవాటవుతోంది. సబ్జెక్టును అర్థం చేసుకోలేక వాళ్లు సృజనాత్మకతను కోల్పోతున్నారు. సృజనాత్మకత లేని బిడ్డలు దేశానికి ఉపయోగపడలేరు’ అని వాదించేవారు. ఈ వ్యాసాలనే తరువాత పుస్తకంగా ప్రచురించారు. చండ్ర రాజేశ్వరరావు గారు ఆ పుస్తకానికి రాసిన ముందుమాటలోని ప్రతి వాక్యమూ ఆలోచనాత్మకమే. ఆచరణీయమే! 
మీ పిల్లలను తెలుగు మాధ్యమంలో చదివించాలనుకున్నప్పుడు కుటుంబసభ్యుల స్పందన?
నా భార్య, నేనూ కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం. బంధువులెవరూ అభ్యంతరపెట్టలేదు. అప్పట్లో మేమిద్దరం ఇంగ్లాండు వెళ్లాం. బోధనా భాష మీద మా మిత్రుల మధ్య చర్చ జరిగింది. ‘ఈ రోజుల్లో తెలుగు మాధ్యమంలో చదివించడం దండగ’ అని వాళ్లు వాదించారు. వాళ్ల మాటలతో నా భార్య అనిశ్చితిలో పడిపోయింది. పిల్లల భవిష్యత్తు పాడవుతుందేమోనని దిగులుపడింది. ఆమెను సమాధానపరచలేకపోయా. ఇంగ్లాండు నుంచి తిరిగి వచ్చాక జనవిజ్ఞాన వేదిక తరఫున అట్లూరి పురుషోత్తం గారితో చల్లపల్లిలో ఓ సమావేశం ఏర్పాటు చేశాం. అది పూర్తయ్యేసరికి నా వాదనను ఆవిడ పూర్తిగా సమర్థించింది. ఉద్యమంలో భాగస్వామి అయింది. మా పిల్లలు.. వాళ్లకు వాళ్లుగా ఎదగడానికి కారణం చిన్నతనంలో అమ్మభాషలో చదువుకోవడమే. 
మాతృభాషలో ప్రాథమిక విద్యపై ఇన్నేళ్లుగా ప్రచారం చేస్తున్నారు కదా. మరచిపోలేని అనుభవాలు?
ఆంగ్ల మాధ్యమ పాఠశాలల ప్రభావం ఎక్కువవుతున్న తరుణంలో ఎందుకో నిరుత్సాహం కలిగింది. సలహా కోసం డా।। జయప్రకాష్‌నారాయణ గారి దగ్గరికి వెళ్లా. ఉద్యమంలో ఓడిపోతామనిపిస్తోందన్నా. ‘అలా అనుకుని, శాస్త్రీయమని మనం నమ్మిన విషయాన్ని ప్రచారం చేయడం మానేస్తామా’ అని ప్రశ్నించారాయన. తల్లిదండ్రులను ఒప్పించడానికి మీ ప్రాంతంలో తెలుగు మాధ్యమంలో చదివి, ఉన్నత స్థానంలో ఉన్నవారిని ఉదాహరణలుగా చూపించండి... అవే అద్భుతాలు చేస్తాయని చెప్పారు. అప్పటి నుంచి మళ్లీ వెనకడుగు వేయలేదు. ‘ఇంగ్లీషే ఉపాధి భాషా?’ అని ఓ దినపత్రికలో వ్యాసం రాశా. దాన్ని చదివి కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు గాంధీ ‘దళితులు-ఇంగ్లీషు’ సమావేశానికి పిలిచారు. ‘ప్రపంచంలో ఎక్కడైనా ఆంగ్లాన్ని లెక్కలు, సైన్సు, సోషల్‌ ద్వారా నేర్పుతున్నారా? అభివృద్ధి చెందిన ఏ దేశమైనా పిల్లలకు పరభాషలో చదువు చెప్పిస్తోందా? లేదు కదా. మరి మనం ఆంగ్ల మాధ్యమంలోనే చదివిస్తేనే ఆంగ్లం వస్తుందని ఎందుకనుకుంటున్నాం’ అని ప్రశ్నించా. ఎవరూ వ్యతిరేకించలేదు. కొంతమంది ఆలోచనలో పడ్డారు. ఆ తరువాత కొన్నాళ్లకు తెలుగు భాషా శాస్త్రవేత్తల రెండో జాతీయ సదస్సు ఆ విశ్వవిద్యాలయంలోనే జరిగింది. ‘పాఠశాల విద్యలో ఇంగ్లిషు మీడియం అవసరమా’ అనే అంశంపై పత్రం చదవమన్నారు గాంధీ. ‘నేను భాషా శాస్త్రవేత్తను కాదు. కనీసం తెలుగు ఉపాధ్యాయుణ్ని కూడా కాదు. ఇంతమంది పెద్దల సమక్షంలో పత్రం సమర్పించడం బాగోద’న్నా. ఆ రంగంలో పని చేస్తున్నారు కాబట్టి మాట్లాడాల్సిందే అన్నారాయన. ఆ సదస్సుకు వచ్చిన వాళ్లందరూ ఆచార్యులు, విశ్రాంత ఆచార్యులు, డాక్టరేట్లు పొందినవాళ్లు, తెలుగులో పీహెచ్‌డీలు చేస్తున్న విద్యార్థులు. నేనొక్కడినే భాషకు సంబంధించి ఏ డిగ్రీ లేనివాణ్ని. 15 నిమిషాలు వాదన వినిపించిన తరువాత అయిదు నిమిషాలు చర్చకు సమయమిచ్చారు. కానీ, దాదాపు 20 నిమిషాల దాకా చర్చ సాగింది. సదస్సు పూర్తయిన తరువాత కొందరు ఆచార్యులు చల్లపల్లిలో మా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. నా పత్రం ఓ దినపత్రికలో ప్రచురితమైంది. దాన్ని చదివి రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది ఫోన్లు చేశారు. అభినందించారు. వరంగల్‌లో అయితే 20 మంది ఆరోజు సాయంత్రమే సమావేశమై... నా పత్రంపై గంటపాటు చర్చించుకున్నారు. రాత్రి తొమ్మిది గంటలప్పుడు నాకు ఫోన్‌ చేసి అరగంటకుపైగా మాట్లాడారు.
విశ్వవిద్యాలయంలో జరిగిన చర్చ ఏంటి?
పత్ర సమర్పణలో భాగంగా చివర్లో కొన్ని సూచనలు చేశాను. ‘పాఠశాల విద్య తెలుగులోనే ఉండాలి’ అనేది అందులో ఒకటి. దీనిమీద ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులు తీవ్రస్వరంతో స్పందించారు. ‘మీ సూచన ఏ వర్గానికి ఉపయోగపడుతుందో మీకు తెలుసా?’ అని అడిగారు. ‘ధనవంతుల బిడ్డలు ప్రైవేటు బడులలో ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటుంటే... శ్రామికవర్గం పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మాధ్యమంలో చదివి నష్టపోతారు కదా’ అన్నది వాళ్ల ఆందోళన. శ్రామికవర్గం పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదవడం వల్ల ఎంత నష్టపోతారో వాళ్లకు సోదాహరణంగా వివరించా. ధనిక, పేద తారతమ్యాల్లేకుండా పిల్లలందరికీ తెలుగు మాధ్యమ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలే ఉండాలని చెప్పా. వాళ్లూ అంగీకరించారు. 
‘మాతృభాషలో ప్రాథమిక విద్య’పై ప్రజల ఆలోచనలు? 
మధ్యతరగతి వాళ్లు ఎక్కువ మంది తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలోనే చదివించాలని ఉవ్విళ్లూరుతున్నారు. దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాల్లో కొందరు తమ అబ్బాయిలను ప్రైవేటు ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చదివిస్తున్నారు. అమ్మాయిలను మాత్రం ప్రభుత్వ తెలుగు బడుల్లో చేరుస్తున్నారు! ‘ఆంగ్లం రాకపోతే మన పిల్లలు ఎందుకూ పనికిరారు. ఆంగ్లం రావాలంటే ఆంగ్ల మాధ్యమంలోనే చదివించాలి. నాణ్యమైన విద్య అంటే అదే’ అని చాలామంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. అది వట్టి అపోహ. 
మీరు నిర్వహించిన సభలకు స్పందన?
మొదటిసారి 1992లో పురుషోత్తం గారితో బహిరంగ సభ పెట్టినప్పుడు 30 మందే వచ్చారు. వారిలో పాతికమంది మా కార్యకర్తలే. ప్రస్తుతం ఎంఎల్‌సీగా ఉన్న బాలసుబ్రహ్మణ్యం గారితో కొన్నేళ్ల కిందట ఓ బహిరంగ సమావేశం ఏర్పాటు చేశాం. 250 మందికి పైగా వచ్చారు. సమావేశం తరువాత కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమం నుంచి తెలుగు మాధ్యమంలోకి మార్చారు. ఇన్నేళ్లలో మేం కాస్త విజయం సాధించినట్లు అనిపించింది. కానీ, కార్పొరేట్‌ స్కూళ్లు వచ్చాక మా పని చాలా కష్టంగా మారింది. కానీ, మా ప్రయత్నాలు మేం చేస్తూనే ఉన్నాం. 
ఆంగ్ల మాధ్యమ చదువుల ఫలితాలు?
నేటితరం సృజనాత్మకతను కోల్పోతోంది. దేశ తక్షణ సమస్యలకు పరిష్కారాలను ఆలోచించే శక్తిని కోల్పోతున్నారు.  తెలుగులో చదవడం, రాయడం రావట్లేదు. పరాయీకరణ చెందుతున్నారు. సంఘానికి ఉపయోగపడకపోగా పరాయీకరణ వల్ల సాంస్కృతిక కాలుష్యం జరుగుతోంది. మన దేశ స్వావలంబనకు కృషి చేయకుండా ఎంతసేపు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాల వైపు చూస్తున్నారు. 
విద్యారంగంలో రావాల్సిన మార్పులేంటి?
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్యను తెలుగు మాధ్యమంలోనే బోధించాలి. మూడో తరగతిలో ఆంగ్లాన్ని ఓ పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. రెండో భాషను బోధించే పద్ధతుల్లో బోధిస్తే పదో తరగతి పూర్తయ్యే నాటికి విద్యార్థులకు ఆంగ్లం మీద పట్టు వస్తుంది.  
వైద్యం - భాషోద్యమం... రెండింటికీ సమయం సరిపోతోందా?
నా దగ్గరికి వచ్చే తల్లిదండ్రులందరిని ‘పిల్లలు ఏం చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు, ఏ మాధ్యమంలో చదువుతున్నారు’ అని అడుగుతా. వాళ్లతో మాట్లాడుతుంటా. మన తరువాత తరం కోసం మనం కొంత సమయం కేటాయించాలి. మన అనుభవాలను పంచాలి. దేశీయుల కష్టార్జితంతో చదువుకుని, సమాజానికి పడిన అప్పును కొంతైనా తీర్చుకోవాలి కదా!
మీ భవిష్యత్‌ కార్యక్రమాలు?
బోధనా మాధ్యమంగా ఏ భాష మంచిదన్న అంశంపై నిరంతరం మాట్లాడుతూనే ఉండాలన్నది చల్లపల్లి జనవిజ్ఞాన వేదిక నిర్ణయం. ఈ అంశంపై రోజూ ఎవరో ఒకరితో చర్చిస్తూనే ఉంటాం. ఏ వేదిక మీద ఎలాంటి అవకాశం వచ్చినా మా అభిప్రాయాలను బలంగా ప్రకటిస్తూనే ఉంటాం.


వెనక్కి ...

మీ అభిప్రాయం