తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

తెలుగును విడిచిపెట్టలేకపోయా

  • 1540 Views
  • 18Likes
  • Like
  • Article Share

    శ్రీ సత్య

  • హైదరాబాదు

ఒక తరం మరో తరానికి ఎన్నో సంపదలని కానుకలుగా అందిస్తుంది. పూర్వీకుల నుంచి నేర్చుకొన్న వైజ్ఞానిక విషయాలు కావొచ్చు. ప్రకృతి నుంచి అందిపుచ్చుకొన్న రహస్యాలు కావొచ్చు. కానీ ఆ మహాసంపదలున్న ద్వారం తెరుచుకోవాలంటే దానికి మాతృభాష అనే మహాతాళం తప్పనిసరి అంటున్నారు చల్లా ఉమాగాయత్రి. ఆంత్రోపాలజీలో ఉన్నత విద్య చదివి... ఆమెరికా జీవితాన్ని వదులుకొని పిల్లలకు మాతృభాషపై మమతని పెంచడమే పనిగా పెట్టుకొన్న ఉమాగాయత్రి ‘నా తెలుగు పుస్తకాలు’ సంస్థకు సంపాదకురాలుగా వ్యవహరించడం వెనుక కారణాలు ఆమె మాటల్లోనే..
తెలుగువెలుగు: మీరు ఆంగ్లమాధ్యమ విద్యార్థి అయినా తెలుగుని ఇంతగా ప్రేమించడానికి కారణం? 

ఉమాగాయత్రి: మా అమ్మమ్మ వల్ల. నా చిన్నప్పుడు అమ్మమ్మ ఉదయం పూట వంటింట్లో కాఫీ పెడుతూనో, మడికట్టుకున్నప్పుడో పిల్లలందరికీ పద్యాలనీ, పాటలనీ శ్రావ్యంగా పాడి వినిపించేది. రామాయణ, భారతాలు, పురాణాలూ చెప్పేది. తెలుగు అక్షరాలు కూడా తనే నేర్పించింది. మా అన్నయ్య తెలుగు మాధ్యమంలో చదువుకున్నాడు. వాళ్ల గురువుగారు పింగళి రఘుపతిరావు. ఆయన గొప్ప వాగ్గేయకారులు. పద్యాలు రాసేవారు, సంగీతం సమకూర్చేవారు. నా బడి అయిన తర్వాత అన్నయ్య కోసమని తరగతి బయట ఎదురు చూసేదాన్ని. అక్కడ ఊరికే నిల్చోకుండా మాస్టారు చెప్పిన పాఠాలు వినేదాన్ని. ఓ రకంగా చెప్పాలంటే ఆయనకి ఏకలవ్య శిష్యురాలిని. అప్పట్లో మాకు ప్రసార మాధ్యమమంటే రేడియోనే. వాటిలో సినారె, ఆరుద్ర, వేటూరి పాటలని ఇష్టంగా, శ్రద్ధగా వినేదాన్ని. ఈ మాసపు పాటంటే చాలా ఇష్టం. అలా తెలుగు అంటే మమకారం     ఏర్పడింది. ఆ తర్వాత ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లినా తెలుగుని మాత్రం విడిచిపెట్టలేకపోయా.
తెలుగులో పుస్తక ప్రచురణ ఆలోచన ఎలా వచ్చింది?
మాకో పాప. పేరు చారుమతి. తన వల్లే నాలో అంతర్గతంగా దాగిన తెలుగు భాషాభిమానాన్ని చాటుకొనే అవకాశం వచ్చింది. ఎలా అంటే.. పాపకి ఏడాది నిండేంత వరకూ తనను ఉయ్యాల్లో వేసి... ఏదైనా చెబుతుంటే చక్కగా వినేది. అప్పుడు నాకు తెలిసిన కథలూ, పురాణాలూ, రామాయణ, భారతాలు కథలుగా చెప్పేదాన్ని. ఏడాది దాటేసరికి నాకు తెలిసిన కథలన్నీ అయిపోయాయి. 
      సరే, బజారులో పిల్లల పుస్తకాలు ఉంటాయి కదా అవి చదివి చెబుదామనుకున్నా. అచ్చంగా తెలుగు పుస్తకాల కోసం వెతకడం ప్రారంభించా. పిల్లల కోసం కథల పుస్తకాలయితే తెలుగులో ఉన్నాయి కానీ అవేవీ తెలుగు భాషకి న్యాయం చేసేవిగా అనిపించలేదు. మనవి కాని పరాయి కథలూ, చిన్నారులని ఏమాత్రం ఆకట్టుకోలేని బొమ్మలూ, పట్టుకొంటే చిరిగిపోయే కాగితాలు. 
      తెలుగు, ఇంగ్లిషు పుస్తకాలని ఒక అరలో పక్కపక్కన పెడితే కచ్చితంగా ఇంగ్లిషు పుస్తకాలే చిన్నారులు ఇష్టంగా ఎంచుకొనేలా ఉన్నాయి. అలాగని ఆ ఇంగ్లిషు పుస్తకాలనే చదివిస్తే ఏమవుతుందని మీరనుకోవచ్చు. మాతృభాష రాని పిల్లలు ఏ విషయాన్నీ లోతుగా అర్థం చేసుకోలేరని అధ్యయనాలు చెబుతున్నాయి. దాంతో ఆ పుస్తకాలని రాసే పనేదో నేనే చేద్దామని రాయడం మొదలుపెట్టా. అలా మొదలైన నా ప్రయత్నం రాతతోనే ఆగిపోకుండా ప్రచురణల వరకూ దారి తీసింది.
మీ పుస్తకాల గురించి చెబుతారా?
ఆంగ్లంలోని పిల్లల పుస్తకాలూ, ఆ రైమ్స్‌ అంతగా ఆదరణ పొందడానికి కారణాలేంటో తెలుసుకున్నా. వాటిలో లయ, ప్రాసలకు ప్రాధాన్యం ఉండటం గమనించా. ‘జానీ జానీ ఎస్‌ పాపా’ లాంటి రైమ్స్‌ పిల్లలకు గుర్తుండిపోవడానికి కారణం లయ, ప్రాసలే. అందుకనే పిల్లలకు తెలుగులోనూ చక్కని పదాలు, లయ ప్రాసలను, భాష అందాలను, లోతుల్ని పరిచయం చేయాలి. మన మెదడులో శబ్దాన్ని, లయని గ్రహించే భాగమే భాషా సముపార్జనకి కేంద్రం. కాబట్టి లయ ప్రాసలతో రాసిన కథల ద్వారా భాషని తేలిగ్గా నేర్చుకోగలుగుతారు పిల్లలు. చాలామంది కవిత్వం పెద్దవాళ్లకోసమే అనుకుంటారు. కవిత్వానికి చిన్నతనంలోనే పునాది వేస్తే పిల్లల్లో భాషాపరంగా సృజనాత్మకత వృద్ధి చెందుతుందని భాషా పరిశోధనలు తెలుపుతున్నాయి. చిన్నప్పుడు తెలుగు భాషని తెలుగు పుస్తకాలు చదవడాన్ని పరిచయం చెయ్యకుండా పెద్దయ్యాక మన తెలుగు సాహితీ సంపదను ఆస్వాదించాలని ఆశించలేం.
ఇవన్నీ ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... రచనా ప్రక్రియలో అనుభవం లేకపోయినా రెండేళ్ల కిందట ‘కాకమ్మ దాహం’ అనే కథని రాశా. దాన్ని పిల్లలకు చదివి వినిపిస్తే అందరూ ఆసక్తిగా విని మరో కథ చెప్పమంటూ సంబరపడ్డారు. దాంతో మూడునెలల్లో పది కథలు రాశాను. అన్నీ ఒకే తరహావి కాకుండా వైవిధ్యమైన కథనాంశాలు ఎంచుకొన్నా. వైజ్ఞానిక, జీవశాస్త్ర, పర్యావరణం వంటి అంశాలపై కథలు రాశా. మరికాస్త కొత్తగా ప్రయత్నిద్దామని తెలుగు అంకెలమీద ఓ పుస్తకం రాశాను. మరొకటి తెలుగు అచ్చులపై.. ఆ పుస్తకం పేరు ‘అమల, ఆమనిల సంవాదం’. ఇందులో ప్రతి సంవాదం అచ్చులతోనే ప్రారంభమవుతుంది. 
      మరి ప్రచురణలోకి కథలైతే పూర్తయ్యాయి. మరి వాటికి అందమైన బొమ్మలు కావాలి కదా. పెద్ద చిత్రకారులతో మాట్లాడిన తర్వాత అది డబ్బుతో కూడిన వ్యవహారం అని తేలిపోయింది. అంత స్తోమత నాకు లేకపోయింది. అప్పుడు నేనే పిల్లల పుస్తకాల్లో బొమ్మలు ఎలా ఉండాలో అధ్యయనం చేసి... బొమ్మలు వేయడం నేర్చుకున్నాను. పది కథలకి వందల్లో బొమ్మలు వేశా. ఈ కథలని ప్రచురించమని అడిగితే చాలామంది ప్రచురణకర్తలు చవకబారు కాగితాలతో ప్రచురిస్తామనడం చూశాక అసంతృప్తి అనిపించింది. అందుకే అంత వరకూ నేను దాచుకొన్న సొమ్ముతో ధైర్యం చేసి ఆ ప్రచురణ బాధ్యతలనీ నా తలకెత్తుకున్నా. ‘నా తెలుగు పుస్తకాలు’ పేరుతో ఆ పుస్తకాలని ముద్రించాను. ఇదంతా జరగడానికి సరిగ్గా ఏడాది సమయం పట్టింది. 
మాతృభాష ప్రచారానికి ఇంకేమైనా చేస్తున్నారా?
నా పుస్తకాలకి చిన్నా, పెద్దల నుంచీ క్రమంగా ఆదరణ పెరిగింది. కానీ పుస్తకాలు ప్రచురించడంతోనే నా బాధ్యత పూర్తయిపోయిందని అనుకోలేదు. అమెరికాలో చదువుతున్నప్పుడు ఓ సామెత నన్ను బాగా ఆకట్టుకొంది. ‘‘అమెరికన్లు తమ సంస్కృతిని సలాడ్‌ పాత్రలా ఉంచాలనుకొంటారు, కానీ సూప్‌ పాత్రలా కాదట. అంటే సలాడ్‌లో అన్నీ ఉంటాయి. కానీ వేటికవే వాటి రుచినీ పరిమశాన్నీ పంచుతాయి. కానీ సూపుల్లో అలా కాదు అన్నీ ఉన్నా, వేటికీ ప్రత్యేకమైన ఉనికి ఉండదు. అన్నీ కలిసిపోతాయి.’’
      అలాగే పరాయి భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. కానీ అందుకోసం మన మాతృభాషనీ, సంస్కృతినీ మూల్యంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్నేళ్ల క్రితం ప్రపంచం మొత్తం లాటిన్‌ భాషే గొప్పదనుకొనేవారు. తర్వాత జర్మన్‌ నేర్చుకుంటే చాలనుకున్నారు. అవన్నీ కొట్టుకుపోయి ఇప్పుడు ఆంగ్లం వస్తే చాలనుకుంటున్నారు. రేప్పొద్దున మరో భాష ఆ స్థానాన్ని ఆక్రమించుకోవచ్చు. కానీ సృజనాత్మకతనీ, జ్ఞానాన్ని అందుకోవాలంటే మాతృభాషకి మించిన ‘మాస్టర్‌ కీ’ మరొకటి లేదు. అందుకే పిల్లలకు మాతృభాష పట్ల మమకారాన్ని పెంచాలనుకొన్నా. 
      అచ్చమైన తెలుగు కథలు చెబుతూ చిన్నారుల కోసం ప్రతి ఆదివారం ‘కథా కాలక్షేపం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించా. మొదట్లో ఈ కార్యక్రమాన్ని నా పుస్తకాలు పరిచయం చేయడానికే ప్రారంభించా. కానీ కొంతమంది తల్లిదండ్రులు పుస్తకాలు కొన్నా వాటిని చదవడం తమకి రాదనీ, పిల్లలకు చదివి చెప్పలేకపోతున్నామని అనడంతో సమస్య ఎక్కడుందో అర్థమైంది. అందుకని నా పుస్తకాల్లోని కథలే కాకుండా, ఆసక్తికరమైన ఇతర కథలూ, భాషా విషయాలూ, పాటల వంటివీ ఈ కార్యక్రమంలో చెప్పటం మొదలెట్టా. కథలని వినిపించడం ద్వారా పిల్లల్లో మౌఖిక భాషా ప్రయోగం పెరగడం గమనించా. 
      నెలలో ఒక వారం ‘పద్యం పాడుదాం’, మరో వారం ‘ఆడుదామా అష్టాచమ్మా’ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ఇప్పుడైతే కంప్యూటర్, సెల్‌ఫోన్‌ ఆటలున్నాయి. మా చిన్నప్పుడు అష్టాచమ్మా, వామన గుంటలు వంటివి ఆడేవాళ్లం. అందుకే పిల్లలని ‘‘ఆడుదామా అష్టాచమ్మా, మింగుదామా మామిడిపండు, పండుకుందామా మంచంపైనా’’ అంటూ పెద్దలు ఆటపట్టించేవారు. నిజానికి అష్టాచమ్మా, పులీమేకా, వైకుంఠపాళి, వామనగుంటలు, దాడి వంటి ఆటలు పిల్లల్లో మానసిక, శారీరక వికాసాలు పెంచుతాయి. అందుకే ఆ పాతతరం ఆటలని పిల్లలకు పరిచయం చేస్తున్నా. దీనివల్ల వాళ్లు చదువుల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. 
      మరో వారం ‘తెలుగు పాటలు నేర్చుకొందాం’ కార్యక్రమం. ఇందులో భాగంగా పిల్లలకూ, పెద్దలకు లాలిపాటలు, జోలపాటలూ, మంగళహారతులు, ఉయ్యాల పాటలు నేర్పిస్తున్నా. అలాగే ‘దండకం’. దండకంలో ప్రత్యేకమైన ఛందస్సు ఉంటుంది. అందువల్లే మనకు నోటికి అంత తేలిగ్గా వస్తుంది. సూర్యనారాయణ, వేంకటేశ్వర, ఆంజనేయ దండకాలని పిల్లలతో వల్లె వేయిస్తున్నా. 
మీ కార్యక్రమాలకు ఎంతమంది పిల్లలు వస్తున్నారు?
పిల్లల సంఖ్య చోటుని బట్టి, నిర్వాహకులని బట్టి మారుతూ ఉంటుంది. ఇద్దరే పిల్లలు వచ్చిన రోజులున్నాయి. యాభై మంది వచ్చిన రోజులూ ఉన్నాయి. ఎంతమంది వచ్చినా నా పాత్రలో నేనంతే ఉత్సాహంతో తెలుగుభాషలోని అందాన్ని మాధుర్యాన్ని కథలు, పద్యాలు, పాటల రూపాల్లో వారి ముందుంచడానికి ప్రయత్నిస్తుంటా. నేను చేసే కార్యక్రమాలు కొన్ని వీడియోలు తీసి యూట్యూబ్‌లో కూడా పెట్టాను.
తల్లిదండ్రులు, పిల్లల స్పందన?
కార్యక్రమాలకు పిల్లలనూ, పెద్దలనూ కూడా ఆహ్వానిస్తాం. కథలు చెప్పేటప్పుడు పిల్లలతో సంభాషిస్తూ మధ్య మధ్య చిన్నచిన్న పాటలకి నాతో వంత పాడిస్తుంటాను. దీనివల్ల పిల్లలు ఈ కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. పెద్దలూ నేర్చుకుంటున్నారు. 
      వాళ్ల పిల్లలకి వాళ్లే స్వయంగా తెలుగు నేర్పాలంటే, మాతృభాష పట్ల ఉత్సాహాన్ని పెంచేలా ఎలా చెయ్యవచ్చో తెలుసుకోవాలని, ఆ పద్ధతులని వాళ్లు అలవర్చుకోవాలని, వీలైతే వాళ్లే ఇలాంటి కార్యక్రమాలు వాళ్ల వీధిలో చేపట్టాలనే ఉద్దేశంతో పెద్దల్ని కూడా మా కార్యక్రమాలకి ఆహ్వానిస్తున్నాం.
కొత్త పుస్తకాలేమైనా రాస్తున్నారా?
ప్రస్తుతం పది పుస్తకాలు అచ్చవుతున్నాయి. అందులో ఖగోళశాస్త్రం, రామాయణం (బాలకాండ), పర్యావరణ సంబంధ విషయాలపై పుస్తకాలని ప్రచురిస్తున్నా. 
తెలుగు వాళ్లు పెద్దగా పుస్తకాలు కొనరని ఓ నింద ఉంది?
పుస్తక పఠనం చిన్నప్పటినుంచే అలవడాలి. అందుకు మంచి పుస్తకాలు కావాలి. పిల్లలకు ప్రత్యేకంగా తెలుగు పుస్తకాలు ప్రచురించేందుకు మనం పెద్దగా ఖర్చు పెట్టం. మరి అలా చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. నా ఉద్దేశంలో వనరులు అందుబాటులో ఉంటే పిల్లల్లో చదివే అలవాటుని పెంచడం సాధ్యం.
      నా పుస్తకాల పట్ల పిల్లల, పెద్దల స్పందన, ఆదరణ నేను అనుకున్నదానికన్నా చాలా రెట్లు బాగుంది. బాలసాహిత్య ప్రపంచానికి నేను కొత్తయినా, స్వయంగా పుస్తకాల్ని నేను ప్రచురించినా, నా పుస్తకాలు కొంటున్నవాళ్లు నేను పడ్డ ప్రయాసని అర్థం చేసుకోగలుగుతున్నారు. నా పనితనాన్ని, పుస్తకాల నాణ్యతని గుర్తించగలుగుతున్నారు. 
      ఎక్కడైనా ప్రదర్శనకి పెడితే వాళ్లే వచ్చి పుస్తకాలు తిరగేసి ఇవి కావాలని తమ పెద్దలను అడుగుతున్నారు. తెలుగు రానివాళ్లు కూడా పుస్తకాల పట్ల ఆకర్షితులవుతున్నారు. కొంటున్నారు కూడా. ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. 
దూరాల్లో ఉన్న పిల్లలకు వీటిని చేరువ చేసే ఆలోచన ఉందా?
అంతర్జాలంలో ఈ - పుస్తకాలు పెట్టాను. కానీ తెరమీద కన్నా పిల్లల చేతుల్లో పుస్తకం ఉండటం చాలా అవసరం. అందుకని ముద్రించిన పుస్తకాలు ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు కొనుక్కునేందుకు వీలుగా అంతర్జాలాన్ని ఆశ్రయించాను. ఈమెయిల్, ఫేస్‌బుక్‌ల ద్వారా నాకు చాలామంది పుస్తకాలు పంపమని సందేశాన్ని పంపుతుంటారు. 
      అలాగే naatelugupustakaalu.wordpress.com బ్లాగూ పెట్టాను. వాటిలో ప్రతిరోజూ మాతృభాష ప్రాముఖ్యత, పిల్లల్లో భాషా సముపార్జన ఎలా జరుగుతుంది, తెలుగు భాష ప్రత్యేకత, మన భాషని నిలబెట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, భాషా పరిశోధనలో తెలుస్తున్న విషయాల గురించి ప్రచురిస్తుంటాను. మధ్యమధ్యలో నా పుస్తకాల గురించి కూడా ప్రకటిస్తూ ఉంటాను. పుస్తకాల ధర చెల్లించేందుకు కూడా నేను అంతర్జాలాన్నే వాడుతూ కొరియర్‌ ద్వారా పుస్తకాలని ఇతర నగరాలకు, రాష్ట్రాలకు పంపుతా.
      భూమ్మీద తెలుగువాళ్లు లేని ప్రదేశం లేదు. అందుకనే అన్ని దేశాల్లోనూ నా పుస్తకాలు లభ్యమయ్యేలా ప్రయత్నిస్తున్నా. ఇప్పటికే అమెరికాలో కొన్ని చోట్ల దొరుకు తున్నాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బ్రిటన్, కెనడాల నుంచీ పుస్తకాలు కావాలని అడిగారు. అందించే ప్రయత్నం చేస్తున్నా.


వెనక్కి ...

మీ అభిప్రాయం