తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

పరోపకారమే జానపదాల లక్ష్యం

  • 952 Views
  • 1Likes
  • Like
  • Article Share

లక్షలాది రూపాయల సొంత డబ్బును ఖర్చుపెట్టి జానపదకళలను ఊరూరా ప్రచారం చేసిన ‘జానపద కళాబంధు’, వృత్తి కళాకారులను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న వ్యక్తి, నాటకరంగ కళాకారుడు, చిత్రకారుడు, ఉపాధ్యాయుడు, పద్య కవి, వచన కవి, కథకుడు, వైజ్ఞానికాంశాల ‘బొమ్మలాట’ల ప్రదర్శకుడు... తాతా రమేశ్‌బాబు! సృజనాత్మకతకు అంతరిక్షమే హద్దు అని భావించే బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. కళా సాంస్కృతిక సాహిత్య రంగాల మీదుగా సాగుతున్న తన జీవిత ప్రయాణంలోని మజిలీలు, మధురానుభూతులు, మర్చిపోలేని అనుభవాలను ‘తెలుగు వెలుగు’తో పంచుకున్నారు రమేశ్‌బాబు. వివరాలు ఆయన మాటల్లోనే...
రంగులు రంగులు రంగులు
రాచిలుక వేసేదా రంగులు
ముక్కుకు ఎరుపు రెక్కకు పచ్చా
చిక్కగా రంగులు పులిమెద నీకు
రంగులు రంగులు రంగులు
ఓ కాకీ పూసేదా రంగులు
అంతా నలుపు కళ్లే తెలుపు
చిక్కగా రంగులు పులిమెద నీకు

అయిదారు తరగతుల్లో ఉన్నప్పుడు అనుకుంటా... ఈ బాలగేయం రాశా. దీన్ని పాడుతూ మా ఇంటి దగ్గర్లోని తోటలో తిరిగేవాణ్ని. అప్పట్లో చాలా గేయాలు ఆశువుగా పాడేవాణ్ని. వాటిని రాసి పెట్టుకోవాలని తోచలేదు. తర్వాత ఎప్పటికో ఆ పని చేశా. ఆ సమయంలోనే ‘బాలజ్యోతి’లో నా గేయాలు కొన్ని అచ్చయ్యాయి. ఆ వయసులోనే బొమ్మలంటే ఎందుకో చాలా ఇష్టం పెరిగిపోయింది. వేద్దామంటే ఇంట్లో కుంచెల్లాంటివి ఏమీ ఉండేవి కావు. ఓ కర్రతో బొమ్మలు గీసేవాణ్ని. అలా చిత్రకళపై పట్టు పెంచుకున్నా. ఇప్పటి వరకూ ఆధునిక పదచిత్రాలు, సూక్ష్మచిత్రాలు, ‘అభినందన సందేశాల’ చిత్రాలు.... అన్నీ కలిపి లక్షల్లో గీశా. రాత్రి పదింటి నుంచి ఉదయం నాలుగింటి దాకా వేసేవాణ్ని. వీటిలో చాలా చిత్రాలను కొందరు పెద్ద మొత్తాలకు అమ్ముకున్నారు. నాకు రూపాయి దక్కలేదు. దానికి నేనెప్పుడూ బాధపడలేదు. చిత్రకళ అంటే నాకిష్టం. బొమ్మలేస్తూనే ఉంటా.
అన్నట్టు గుంటూరు జిల్లా భట్టిప్రోలు తెలుసు కదా. తెలుగునాట ఓ వెలుగు వెలిగిన బౌద్ధానికంటూ మిగిలిన కొన్ని ఆనవాళ్లలో ప్రధానమైనవి ఆ ఊళ్లోనే దొరికాయి. ఇక మన తెలుగు లిపి తొలినాళ్ల రూపం కూడా భట్టిప్రోలు బౌద్ధ స్తూపం మీదే కనపడింది కదా. అంతటి ప్రత్యేకమైన ఆ ఊళ్లోనే 1960 జనవరిలో పుట్టానట నేను! అమ్మ లక్ష్మీనరసమ్మ. నాన్న బసవలింగం. ఆయన పాఠశాలల తనిఖీ అధికారి. కృష్ణా జిల్లాలో ఉద్యోగం. దాంతో నా చిన్నతనమంతా ఉయ్యూరు, కైకలూరు, మొవ్వ, అవనిగడ్డల్లో గడిచింది. పదో తరగతి నుంచి డిగ్రీ రెండో సంవత్సరం వరకూ మచిలీపట్నంలో చదువుకున్నా. సినిమాల్లో సహాయ కళాదర్శకుడిగా మద్రాసు వెళ్లడంతో డిగ్రీ పట్టా చేతికి రాలేదు! అక్కడ ఢక్కామొక్కీలు తిన్నాక తిరిగొచ్చా. అప్పుడు చేతిలోని చిత్రకళే బతుకుతెరువు చూపించింది. 1985లో గుడివాడలోని అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య పురపాలక ఉన్నత పాఠశాలలో చిత్రకళా ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. 
గురువులదే బాధ్యత
డ్రాయింగ్‌ మాస్టారంటే పని లేనివాడని, ఏదో బొమ్మేసి వెళ్లిపోతాడని అనుకుంటారు చాలామంది. ఉద్యోగం వచ్చిన కొత్తలో సాటి ఉపాధ్యాయులూ అలాగే అనేవాళ్లు. పట్టించు కునే వాణ్ని కాదు. నేను చేరింది నిరుపేద పిల్లలున్న పాఠశాలలో! వాళ్లకేం చెయ్యగలనా అని ఆలోచించా. ఏం నేర్పితే వాళ్లు కాస్త నాలుగు డబ్బులు సంపాదించుకోగలరా అని ఆలోచించా. చిత్రలేఖనంతో పాటు కాగితాలతో పువ్వులు తయారు చేయడం, పనికిరాని వస్తువులతో అలంకరణ సామగ్రి తయారీ వంటివి 400 రకాలు నేర్పించా. అప్పట్లో వాటిని నేర్చుకున్న విద్యార్థులిప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. వాళ్లకు అప్పుడు నేర్పిన తయారీ విధానాల ఆధారంగానే ‘ఇవి తయారు చేద్దాం’ పుస్తకం రాశా.  వివేకానందుడన్నట్లు రేపటి సమాజాన్ని చూడాలంటే నేటి గురువుల్ని చూడాలి. కానీ, రాన్రానూ ఉపాధ్యాయుల్లో అంకితభావం తగ్గిపోతోంది.
       ‘తాతా పప్పెట్‌ థియేటర్‌’ను 1990లో ప్రారంభించా. గ్రో పప్పెట్స్, రాక్‌ పప్పెట్స్‌ తయారు చేసేవాణ్ని. ఆంగ్లం, సాంఘికశాస్త్రం, గణితాల బోధనకు ఉపయోగపడేలా పప్పెట్లను తయారు చేశా. హైదరాబాదు ఎన్టీఆర్‌ మైదానంలో వేలాది మంది ప్రేక్షకుల మధ్య పర్యావరణం మీద పప్పెట్‌షో ప్రదర్శించా. అది చూసి కొంతమంది అసూయపడ్డారు. అయినా నేనవన్నీ పట్టించుకోలేదు. సమాజం నుంచి తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయాలన్న సిద్ధాంతం నాది. కానీ, కొందరు ఏవో అభియోగాలు మోపి నన్ను సస్పెండ్‌ చేయించారు. నాకు అండగా నిలిచేవాళ్లు లేకపోవడంతో చేసేదేమీ లేకపోయింది. తర్వాత ఆ అభియోగాలు తప్పని తేలిపోయాయి. బొమ్మలాటల మీద ‘దిద్దుబాటు, నాన్నో పులి, అసలు నిజం, బొమ్మలాట’ పుస్తకాలు రాశా. 
అమ్మ నేర్పిన తెలుగు
అమ్మ ఏమీ చదువుకోలేదు. కానీ చక్కని విషయాలు, తెలుగు సంస్కృతి సంప్రదాయాల గురించి విడమరిచి చెప్పేది. ‘మనం మాట్లాడే ప్రతి అక్షరం, ప్రతి పదం, ప్రతి వాక్యం ఎదుటివారికి అర్థమవ్వాలి రా’ అంటూ ఉచ్చారణ గురించి చెప్పేది. తెలుగు మాటల్లోని తీయదనాన్ని వివరించేది. అలా అమ్మ వల్లే భాష మీద ప్రేమ పెరిగింది. ఛందస్సు నేర్చుకుని పద్యాలు రాసేవాణ్ని. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు మా తెలుగు మాస్టారు వాటిని చూసి ప్రోత్సహించారు. ఆ ఉత్సాహంతో  చాలా కందాలు రాశా. తర్వాత వచన కవిత్వం వైపు వచ్చా. ‘అణువు పగిలింది, విప్లవరుతువు’ లాంటి కవితా సంపుటులు, ‘పిడికిలి, నాదేశం’ తదితర దీర్ఘకవితలూ ప్రచురించా. 
      పద్యమా, వచనమా అని కాదు కానీ... కవిత్వంలో అంతర్లయ ఉండాలి. మంచి కవిత్వమంటే చైతన్యాన్ని అందించాలి. ‘తాను పుండై, ఒకరికి పండై’ అంటూ ఒకప్పుడు అలిశెట్టి ప్రభాకర్‌ మంచి వచన కవితలు రాశారు. ఇంకా చాలామంది రాశారు. కానీ, ఇప్పుడు ఒక వాక్యాన్ని పది ముక్కలు చేసి, నిలువుగా అడ్డ్డంగా రాస్తూ, చిత్ర విచిత్రమైన పేర్లు పెడుతున్నారు! 
      కవిత్వంతో పాటు కథాసాహిత్యమన్నా ఇష్టమే. ‘తాతా రమేశ్‌బాబు కథలు’ పుస్తకమూ అచ్చయ్యింది. ఓసారి తానా కథల పోటీకీ ‘ఒసే’ అనే కథ రాశా. రెండో బహుమతి వచ్చింది. కథలో... భార్యను భర్త ‘ఒసే’ అని పిలుస్తాడు. అందుకామె కోపగించుకుని ‘నాకూ ఓ పేరుంది. పేరు పెట్టి పిలవండి’ అంటుంది. స్త్రీ పురుష భేదభావాలు ఉండకూడదనేది ఈ కథ ఇతివృత్తం. స్త్రీలు విసుగూ విరామం లేకుండా పనిచేస్తారు. మనసు విప్పి మాట్లాడుకోవడానికి వాళ్లకి అవకాశం ఉండదు. దాంతో భావాలను అణచిపెట్టుకుంటూ ఉంటారు. ఆ అణచివేత భరించరాని స్థాయికి చేరినప్పుడు ఒక్కసారిగా హిస్టీరిక్‌గా అయిపోతారు. అలాంటి వాళ్లకు కౌన్సిలింగ్‌ కావాలి. ఇప్పుడు కౌన్సిలింగ్‌ కేంద్రాలు చేసే పనిని అప్పట్లో ఎరుక చెప్పేవాళ్లు చేసేవాళ్లు. సోది చెప్పే ఆవిడ ‘నీ కుటుంబం బాగుంటుంది’ అని చెప్తూనే... ఆ అమ్మాయిలో ఉన్న భావోద్వేగాలను కక్కించేస్తుంది. ఆ అమ్మాయి చెప్తుంటే ఈవిడ ఏడుస్తుంది, ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, చివరికి ఆ అమ్మాయిని ప్రశాంతతకు ప్రతిరూపంలా మారుస్తుంది. అంత గొప్ప కౌన్సిలింగ్‌ కేంద్రం ఇంకెక్కడా లేదు. మన జానపద కళలన్నీ ఇలా సమాజం కోసం పుట్టినవే. 
నాటకాల్లోంచి జానపదాల్లోకి...
చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఇష్టం. ఆంజనేయుడి వేషమంటే మరీ ఇష్టం. బడిలో మూతిని బిగబట్టి తోక పెట్టుకుని సరదాగా వేషం వేసేవాణ్ని. ఆ ఉత్సాహం కొద్దీ నటన నేర్చుకున్నా. ఫలించని వంచన, ఏక్‌దిన్‌కా సుల్తాన్, మనుషులొస్తున్నారు జాగ్రత్త, క్రాంతి, తాకట్టు, కీర్తిశేషులు... ఇలా స్టేజి మీద చాలా నాటకాలు వేశా. రేడియో నాటకాల్లోనూ నటించా. వాటిలో ‘రాంబాబు కాపురం’ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇతర రాష్ట్రాల్లో టిక్కెట్టు కొని నాటకాలు చూసే పరిస్థితులున్నాయి. ఇక్కడ ఉచితంగా వేస్తున్నామన్నా జనానికి తీరిక లేదు! ప్రజలు, ప్రభుత్వం పట్టించుకుంటేనే నాటక కళ బతుకుతుంది. ప్రస్తుతం నటన మీద ఇష్టంతో టీవీ ధారావాహికలు, చలనచిత్రాల్లో నటిస్తున్నా. 
      నాటకాలతో అనుబంధం వల్లే జానపద కళల మీద ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ‘పగటివేషాలు’ అంటే చాలా ఇష్టం. ఇవి సమాజం నుంచీ, సామాజిక అవసరాల నుంచి, మనుషుల వేదనలు, సంతోషాల నుంచి పుట్టినవే. పగటివేషమంటే పగలు ధరించే మారురూపం. అర్జునుడు బృహన్నలగా, వేంకటేశ్వరుడు ఎరకలసానిగా మారురూపాలు ధరించి తమ కార్యాలను చాకచక్యంగా నిర్వహించుకున్నారు. చదువురాని ‘గొల్లబోయ’... ‘వితంతువు’ తదితర వేషాలు సామాజిక చైతన్యాన్ని రగిల్చాయి. మరోవైపు... సమాజానికి చెందాల్సిన దాన్ని ఏ కొద్దిమందో దాచుకుంటే ప్రజలు హర్షించరు. ఇంత చక్కటి సందేశం గంగిరెద్దు వేషాల్లో కనిపిస్తుంది. గజాసురుడు తన ఉదరంలో శివుణ్ని దాచుకుంటాడు. సమాజానికి చెందాల్సిన దేవుణ్ని తిరిగి సమాజానికి అందించేందుకు దేవతలు, దేవగణాలు గంగిరెద్దుల ఆట ఆడి గజాసురుణ్ని మెప్పిస్తారు. తర్వాత అతని పొట్ట చీల్చి శివుణ్ని బయటకు తెస్తారు. జానపద కళల నుంచి నేర్చుకోవాల్సింది పరోపకారాన్నే... మూఢభక్తిని కాదు. పగటివేషాల్లో ఉండేదంతా ఇదే. పగటివేషాల్లోని సామాజిక ప్రయోజనాలపై ఆకాశవాణిలో ధారావాహిక ప్రసంగాలూ ఇచ్చా. 
      ఆ కాలంలో వచ్చిన సినిమాల్లో పగటివేషాలకు చక్కని ప్రాధాన్యత ఉండేది. ఉదాహరణకు ‘కాశీకి పోయాను రామా హరి! గంగ తీర్థంబు తెచ్చాను రామా హరి’ అనే పాట! అది కాటికాపరి వేసే పగటివేషం. ఈ వేషాల చరిత్ర గురించి ఓ పుస్తకం రాస్తే బాగుంటుందనుకున్నా.. అలా 16 పగటివేషాల వివరాలతో ‘పగటివేషాలు’ రాశా. ప్రచురణకు వచ్చేసరికి డబ్బులు లేవు. నా కష్టాన్ని చూసి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి తితిదే ధర్మప్రచార పరిషత్తు ద్వారా ఆర్థిక సాయం చేశారు. వెయ్యి ప్రతులు అచ్చు వేయించా. అయితే చాలా వరకూ ఉచితంగానే ఇచ్చా.
నాకు నేనుగా...
మన భాష, మన సంస్కృతిని, మనలో ఉన్న అనుబంధాలను నిలబెట్టిన ఈ జానపద కళలు కనుమరుగవుతున్నాయి. ఆ దుస్థితిని చూస్తూ ఉండలేక... తెలుగు కోసం, తెలుగు జాతి ఔన్నత్యం కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే చాలామంది పెద్దలను కలిసి మాట్లాడా. ఎవరూ పట్టించుకోలేదు. అయినా సరే, ఒక్కణ్నే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ‘తెలుగు జానపద కళా చైతన్య యాత్ర’ నిర్వహించా. 
      ‘కళాభారతి’ సంస్థను బయట ఉండి నడిపిస్తున్నా. ఇందులో 15 వేల మంది దాకా జానపద, పగటివేషాల కళాకారులు ఉన్నారు. ఈ సంస్థకు ప్రస్తుతం గౌరవాధ్యక్షుణ్ని. ‘కళాభారతి’ తరఫున ఇంద్రజాలం, దేవరపెట్టె తదితర కళలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం.  
      కళలు ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. బొమ్మలు వేసే విద్యార్థి, ఇతర కళల్లో కొంచెం ఆసక్తి ఉన్న విద్యార్థి ఐక్యూకు... కేవలం చదువు మీదే దృష్టి పెట్టే పిల్లాడి ఐక్యూకు చాలా అంతరం ఉంటుంది. అమ్మభాష వెలుగులీనాలన్నా... నవతరానికి విజ్ఞానం అందాలన్నా... కళలను గౌరవించాలి. కళాకారులను ప్రోత్సహించాలి. ముఖ్యంగా మన మట్టివాసనలను నింపుకున్న జానపద కళలను కాపాడాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం