తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

తెలుగువాళ్లు కాబట్టే మనకు లోకువ

  • 2733 Views
  • 148Likes
  • Like
  • Article Share

    మహమ్మద్‌ అన్వర్‌

  • హైదరాబాదు
  • 8008709985

‘‘రెండు దేశాల ప్రతినిధులు కూర్చుని మాట్లాడుకుంటే కోపాలు తగ్గిపోతాయి. శాంతి చోటు చేసుకుంటుంది. మాటలు దేశాల మధ్య శత్రుత్వాన్ని చెరిపేశాయంటే... అంతకంటే గొప్ప గుణం ఉంటుందా..?’’ అంటుంటారు త్రివిక్రమ్‌. మాట విలువెంతో తెలిసిన వ్యక్తి ఆయన. అందుకనేనేమో... విలువైన మాటలే రాస్తారు. ప్రతీ మాటలోనూ చమక్‌ ఉంటుంది. ఇంకాస్త లోతుగా వెళ్లి ఆలోచిస్తే జీవిత సత్యం కూడా అందులోనే దాగి ఉంటుంది. చలం, శ్రీశ్రీ, తిలక్, ముళ్లపూడి... వీళ్లందరినీ ఆకళింపు చేసుకొన్నారు. పుస్తకం కనిపిస్తే చదివేంత వరకూ ఒక్క క్షణం కూడా కుదురుగా కూర్చోరట. అందుకే త్రివిక్రమ్‌ని కదిలిస్తే... సాహిత్యానికి సంబంధించిన ఎన్నో కబుర్లు. సినిమా వ్యక్తిగా కాదు... ఓ తెలుగు భాషాభిమానిగా, సాహిత్యమంటే ప్రాణం ఇచ్చే వ్యక్తిగా త్రివిక్రమ్‌ని ప్రశ్నిస్తే...
మీ ఆలోచనా ధోరణిపై ప్రభావం ఎవరిది? మీ అభిప్రాయాలను సమూలంగా మార్చిన రచయిత ఎవరు?
ఒక్కరని చెప్పలేను. అదే నా సమస్య. ‘ఎవరూ మార్చలేదు’ అనేది అబద్ధం. ఒక్కరే మార్చారని చెప్పడం కూడా అంతకంటే పెద్ద అబద్ధం. ముళ్లపూడి వెంకటరమణ గారంటే ఇష్టం. ఆయన రాసిన ప్రతీ అక్షరం చదివాను. శ్రీశ్రీ మహాప్రస్థానం, సిప్రాలి... ఆయన వ్యాసాలు చాలా ఇష్టం. తిలక్, బుచ్చిబాబు, గోపీచంద్‌ రచనలు మరింత ప్రభావం చూపించాయి. అఫ్సర్‌ కవిత్వానికి పెద్ద అభిమానిని. ఈ పదిహేనేళ్లలో పుట్టిన గొప్ప కవుల్లో ఆయన ఒకరు. కానీ ఆయనకు రావాల్సిన పేరు రాలేదనిపిస్తోంది. చెట్టు ఇస్మాయిల్‌ ప్రతీ రచన చదివాను. కొడవటిగంటి కుటుంబరావు కథలు భలే నచ్చుతాయి. ఇక విశ్వనాథ సత్యనారాయణ... ఆయన గురించి ఏం చెప్పగలం...? దేవుడాయన. ఆయన ముట్టుకోని సాహితీ ప్రక్రియ లేదు. ఇలా ఒక్కరు కాదు చాలా మంది మహానుభావులు ఉన్నారు. కాకపోతే వీళ్లంతా తెలుగు వాళ్లవడం మూలాన బాగా లోకువ. ఎందుకంటే వీళ్లంతా విజయవాడ, హైదరాబాద్‌ ఇలా పక్కపక్కన పుట్టారు కదా. అందుకే మనం పెద్దగా విలువ ఇవ్వం. అదే ఇడెన్‌బర్గ్, స్కాట్లాండ్‌లో పుట్టుంటే వీళ్లను అద్భుతంగా చదివుండే వాళ్లం.
సమకాలీన రచయితలెవ్వరూ మిమ్మల్ని కదిలించలేదా?
నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎవరూ లేరు. శ్రీపాద సుబ్రహ్మణ్యం, కొడవటిగంటి కుటుంబరావు, చాసో వీళ్ల నైపుణ్యం ఎవరిలోనూ కనిపించలేదు. నిజానికి కథ రాయడం చాలా కష్టం. కథతో పోలిస్తే నవల రాయడానికి సౌకర్యంగా ఉంటుంది. మూడు, నాలుగు వందల పేజీల్లో ఎక్కడో దగ్గర పట్టు దొరుకుతుంది. కథ అలా కాదు. మూడు పేజీల్లో చెప్పేయాలి. శ్రీపాద, చాసో కథలు చదివి.. ఆ ఆలోచనల్లో మునిగిపోయేవాణ్ని. అంతలా ఎవరూ ప్రభావితం చేయలేదు. 
మీరెపుడైనా కథ రాయడానికి ప్రయత్నించారా?
‘రోడ్‌’ అనే ఓ కథ రాశా. అందులో పెద్ద కథేమీ ఉండదు. చెప్పే విధానం కొత్తగా ఉంటుంది. అది నచ్చే ప్రచురించి ఉంటారు.
మళ్లీ ప్రయత్నించలేదా?
కథ అనేది ఓ ప్రత్యేక వ్యాసంగం. ఆ నేర్పు తెలిసుండాలి. రెండు పేజీలే కనిపించినా గంటల్లో తెలిపోయే వ్యవహారం కాదు. అందుకే కథ రాసే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఆ సమయం అంతా సినిమా కథకే సరిపోతోంది.
మొదటిసారి కలం పట్టుకున్న సందర్భం?
స్కూలు రోజుల్లోనే రాశాను. ఏవో కవితలు రాస్తుండేవాణ్ని. ఆ వయసులో పుట్టే కవితలు ఎలా ఉంటాయి? (నవ్వుతూ) ఆ తరువాత చదివితే సిగ్గుపడేలా ఉంటాయి. ఇంటర్‌లోనూ చాలా రాశాను. కానీ  ఏవీ నచ్చలేదు. డిగ్రీలో ఇక రాయడం మానేశా. అప్పుడు కొంచెం జ్ఞానం వచ్చినట్టుంది. ‘‘రాసినోళ్లు చాలా మంది గొప్పోళ్లు ఉన్నారు. చదువుకోవడమే ఉత్తమం’’ అనిపించింది. తరువాత అలాంటి సాహసం చేయలేదు. పెన్ను పట్టుకోవాలంటే భయం వేసేది. ఆఖరికి డైరీ కూడా రాయలేదు. అప్పటినుంచి చదవడమే అలవాటు.
ఇన్ని పుస్తకాలు చదివారు కదా! ఇంత గొప్పగా నేనూ రాస్తే బాగుండేది కదా..? అని ఎప్పుడైనా అనిపించిందా?
అదేం లేదు. విశ్వనాథ సత్యనారాయణ కంటే గొప్పగా ఎవరు రాస్తారు? కనీసం ఆ మాట అనుకోవడం కూడా సాహసమే. సీతారామశాస్త్రిలాంటి వాళ్లే... విశ్వనాథని అర్థం చేసుకోవడానికి నిఘంటువు కొనుక్కోవలసి వచ్చింది. ఇంతకంటే ఏం చెప్పగలం ఆయన గురించి? ‘రామాయణ కల్పవృక్షం’లో శివధనుస్సు విరిచినప్పుడు ఒక్కో లోకానికి శబ్దం ఎలా వెళ్లిందో వివరించడానికి ఓ 14 పద్యాలు రాశారు. వాటిని అర్థం చేసుకోవడం పక్కన పెడితే, చదవడమే కష్టం, పలకడం ఇంకా కష్టం. మనకేం రాదనీ మొదటి పద్యంలోనే చెప్పేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ. మన అహాన్ని ఒలిచేసే పాండిత్యం ఉన్న వ్యక్తి. ఇక దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి చెప్పాలంటే... ఆయన వ్యాసాలు, రేడియో ప్రసంగాలు కూడా బాగుంటాయి. ‘ఓరియంట్‌ లాంగ్‌మెన్‌’ వాళ్లు అప్పట్లో ప్రచురించారు. ఆయన చేసిన ‘కవి పరంపర’ వ్యాసంగాలు వింటే... ఆ కాలం కంటే వందేళ్లు ముందున్న వ్యక్తి అనిపిస్తుంది. ఆయన భావాలు కొన్ని ఇప్పటికీ అర్థం కావు. మనం చలాన్ని అడ్వాన్స్‌ అనుకొంటాం... కానీ దేవులపల్లి కనిపించని అడ్వాన్స్‌.
చలం రచనలు సినిమాలుగా తీస్తే చూస్తారా?
చలంలాంటి వాళ్లు ఒకానొక సందర్భంలో కొన్ని పరిస్థితుల మీద పోరాటం చేసిన వ్యక్తులు. ఖద్దరు చొక్కా వేసుకుంటేనే దేశభక్తి ఉంటుంది అంటే ఇప్పుడు నమ్ముతారా? 1947లో మాత్రం ఈ కొలతలు ఉండేవి. విలువలు, కట్టుబాట్లు ఎప్పుడూ శాశ్వతం కాదు. అవి పరిస్థితుల నుంచి పుడతాయి. ఎప్పుడైతే వాటిని శాశ్వతం చేయాలనుకుంటామో అప్పుడే సమస్యలు వస్తాయి. ఉదాహరణకి... సతీసహగమనం, కన్యాశుల్కం, వరకట్నం.. నాకు తెలిసి ఇవన్నీ మొదలైనప్పుడు ఏదో ఓ బలమైన కారణం ఉండి ఉండొచ్చు. ఆ సంప్రదాయం పుట్టిన ప్రదేశం, సమయం, పరిస్థితులు ఈ మూడింటి మూలంగానే మూఢాచారాలు పుడుతుంటాయి. మనమందరం కలిసి బతకాలనుకుని ఓ నియమం పెట్టుకుంటే... అదే మతం. అదే సంప్రదాయం, అదే.. కట్టుబాటు. కానీ ఓ వెయ్యి సంవత్సరాల తరువాత కూడా అప్పుడు పెట్టుకొన్న నియమాలే పాటించాలి అంటే అప్పుడే సమస్యలు పుట్టుకొస్తాయి.
అంటే కాలాన్ని బట్టి మనుషులూ సంప్రదాయాలూ మారాలంటారా?
మారాలి. తాలిబన్లను ప్రపంచం అంతా ఎందుకు తిడుతుంది? సంగీతం వినకూడదు. మహిళలు ఇలానే ఉండాలి. పేరు పెట్టి పిలువకూడదు. ఇలాంటి నియమాలు ఎప్పుడో ఎందుకోసమో పెట్టుంటారు. అప్పుడు ఇవన్నీ సరైనవీ కావొచ్చు. ఇప్పుడూ అలానే ఉండాలంటే ఎలా? ఇప్పటికి ఏది సరైనదో అది ఎంచుకొనే హక్కు అందరికీ ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ చలం తన నవలల్లో బాగా రాశారు. అవి చదువుకొని మనం విప్లవం అనుకొన్నాం.
చలంని చదువుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది?
‘మైదానం’ మొదటిపేజీలో మొదటి వాక్యం... ‘నన్నెవరైనా లేచిపోయారంటే భలే కోపం వస్తుంది’ అని ఉంటుంది. 1920లో ఓ పుస్తకానికి మొదటి వాక్యం ఇదంటే.. నమ్మగలరా? చలాన్ని వెలేసేశారంతా.  ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ పుస్తకం దొరకకుండా చూడండన్నారు. కానీ ఇప్పుడు మన దేశంలో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలని ఓ వర్గం మాట్లాడుతోంది. ప్రస్తుతం అక్కడున్నాం. కాబట్టి అప్పుడు చలం చెప్పింది తప్పా? ఇప్పుడు ఓ వర్గం పోరాడుతున్నది తప్పా? ఆ సమయానికి చలం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అంతే! ఇప్పుడుంటే ఏం రాసుండే వారో. ప్రస్తుత పరిస్థితులపై పోరాడేవారేమో...
మీ పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారా?
వాళ్లు బాగా తెలుగు మాట్లాడుతున్నారు. ‘‘ఇంట్లో ఇంగ్లిషులోనే మాట్లాడండి’’ అని టీచర్‌ చెప్పారట. ఇంగ్లిషు భాష అర్థం కావడం ఓ సంవత్సరం ఆలస్యం అయినా ఫర్వాలేదు... ఇంట్లో తెలుగే మాట్లాడదామని చెప్పా. తెలుగు వచ్చినవారితో మరో భాషలో మాట్లాడటం నావల్ల కాదు.
తెలుగు భాష మనుగడకు ప్రమాదం ఉందని మీరు భావిస్తున్నారా?
ఎప్పుడూ ఉండదు. అలా ఆగిపోయే భాషా ఇది...? గంగ ఎండిపోతుంది అంటే? నమ్ముతారా? తెలుగు భాష కూడా అంతే! కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఎలాంటి జాగ్రత్తలు?
తెలుగులో మాట్లాడటం... చదవడానికి ప్రయత్నించడం. మన సాహితీ సంపదను మనం కాపాడుకోవాలి. ఎదుటివాడి వయస్సుకు, విద్వత్తుకు గౌరవం ఇవ్వడం తెలుసుకోవాలి. కేవలం డబ్బుకి, స్థాయికి, అధికారానికి మాత్రమే గౌరవం ఇచ్చే దుస్థితికి వెళ్లిపోతున్నాం. దీని వల్ల చాలామంది గొప్పోళ్లను కోల్పోతాం. ఇప్పటికే మనం చాలా కోల్పోయాం. పూర్తి తెలుగు వర్ణమాల లేదు. కొన్ని అనవసరమని తీసేస్తున్నాం. రంగులో ‘ర’ వాడతాం. ఱంపంలో ‘ఱ’ వాడుతాం. జడలో ‘జ’, జల్లెడలో ‘  ’, చేపలో ‘చే’ చాపలో ‘చా’, ఈ అక్షరాలు పలకడంలోని తేడాను పిల్లలకు వివరిస్తే అందులో ఉన్న అందం అర్థమవుతుంది. పిల్లలు కూడా అలా మాట్లాడటానికి ఇష్టపడతారు. చేపకి చాపకి తేడా లేకుండా పోతోంది. చరిత్ర తెలుసుకోవాలి. దాన్ని ఎక్కడైనా భద్రపరచాలి. భావితరాలకు అందించాలి. ఇవన్నీ చాలా అవసరం. కాకపోతే ఇవన్నీ శాస్త్రబద్ధంగా చేయాలి. లేదంటే తప్పుడు సమాచారం ఇచ్చినవాళ్లం అవుతాం. పాశ్చాత్య దేశాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకొంటారు. షేక్స్‌పియర్‌ ఇల్లు, ఆయన రాసిన బల్ల, పెన్ను కూడా ఉండిపోయాయి. అలానే బెర్నార్డ్‌ షా రచనలు కూడా. కానీ మనం విశ్వనాథని, జాషువా, తిరుపతి వేంకటకవులను ఎందుకు గుర్తించలేదు. వారి విలువైన వస్తువుల్ని ఎందుకు భద్రపరచలేదు? ఎవరైనా ఇంగ్లిష్‌లో మాట్లాడితే వాళ్ల వంక గొప్పగా చూస్తాం. కానీ  చక్కగా తెలుగులో మాట్లాడినవాణ్ని కన్నెత్తి కూడా చూడం.
పిల్లలకు సాహిత్యాన్ని చేరువ చేయడానికి ఏం చేయాలి?
టీవీలో వచ్చే ‘ఛోటాభీమ్‌’లాంటి కార్యక్రమాలు నాకు అస్సలు నచ్చవు. పిల్లలకు మనం ఏం నేర్పుతున్నామో నాకు అర్థం కావడం లేదు. ఖురాన్, బైబిల్, గీతలను ప్రశ్నించడం ఫ్యాషన్‌ అయిపోతే మనం ఏమీ చేయలేం. అవి ఒక్కళ్లు రాసినవి కావు. వాటిని దేవుడు రాసినవి అని ఎందుకు అంటాం అంటే... కొన్ని తరాల నుంచి ప్రకృతి ప్రసాదించిన జ్ఞానాన్ని చాలామంది కలిసి పొందుపరిచారు. ఆ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకే వాటిని దేవుడు రాశాడు అంటారు. వీటిపై ఒకరి పేరును రాయలేం. వేదాలు కూడా అంతే. ఏ ఒక్కరో రాసినవి కావు. ఎంతోమంది వాళ్లకి మంచి అనిపించింది చెప్పారు. అవే పుస్తకాలు. అందుకే వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. పిల్లలకు వీటిలో ఏముందో అర్థమయ్యేలా చెప్పాలి. కథలు, బుల్లితెర కార్యక్రమాల్లో ఖురాన్, బైబిల్, రామాయణం... వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి.
కనీసం సినిమాల రూపంలో అయినా సాహిత్యం బతుకుతుందని సినీ కవులు చెబుతుంటారు. మీరు ఈ మాటతో 
ఏకీభవిస్తారా?
సినిమాలో కూడా మంచి సాహిత్యం వస్తోంది కదా..?  ఆధునికీకరించి చెప్పడానికి కవిత్వాన్ని భ్రష్టు పట్టించాల్సిన అవసరం లేదు. ‘జల్సా’లో శాస్త్రిగారు ‘బొటానికల్‌ భాషలో పెటల్స్‌ పూరేకులు’ అని రాస్తారు. అన్నీ మనకు తెలిసిన పదాలే.. కానీ ఇప్పటి జనాలకు అర్థమయ్యేలా ఉంటాయి. ఆ పాటలో చాలా గొప్ప విషయాలే ఉన్నాయి. ఆలోచన గొప్పగా ఉండాలి. భాష సాధనం... ఓ వాహనం అవుతుంది. కాకపోతే అంబాసిడర్, రోల్స్‌ రాయిస్‌ రెండూ వాహనాలే. నాణ్యమైన తెలుగు నేర్చుకుంటే ఆ వాహనం, రోల్స్‌ రాయిస్‌ అవుతుంది. లేకపోతే అంబాసిడర్‌. రెండిట్లో ప్రయాణం చేయవచ్చు. అయితే రోల్స్‌ రాయిస్‌లో ప్రయాణం చాలా    సౌకర్యంగా, వేగంగా ఉంటుంది.
ప్రస్తుతం చదువుతున్న పుస్తకాలు...
చాలా చదువుతున్నాను. తెలుగులో దాశరథి రంగాచార్య ‘శతాబ్ది’. పానుగంటి లక్ష్మీనరసింహారావు ‘సాక్షి’, ఇంగ్లిషులో నెహ్రూ గ్లింప్సెప్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ హిస్టరీ. ఇలా నిరంతరం ఏదో ఒకటి చదువుతూనే ఉంటా...
సమయం కుదురుతుందా?
చాలా ఉంటుంది. నిజం చెప్పాలంటే మనం చేస్తున్న పెద్ద పనులేవీ లేవండి... 
(నవ్వు...)


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి