తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

అచ్చతెలుగు బతికే ఉందక్కడ!

  • 1569 Views
  • 27Likes
  • Like
  • Article Share

ముందు నాలుగు కాళ్లు
పరిత్తేటప్పుడు రెండు కాళ్లు
వయసై మూడు కాళ్లు
కడైస ఎనిమిది కాళ్లు
ఈ అచ్చతెలుగు పొడుపు కథను విప్పగలరా...

      దీనికి సమాధానం ‘మనిషి’. పాకేటప్పుడు నాలుగు, నడక వచ్చి పరిగెత్తేటప్పుడు (పైన పొడుపు కథలో ‘పరిత్తేటప్పుడు’ అనేది పద ఉచ్చారణ రూపం) రెండు, వార్థక్యంలో చేతికర్రతో కలిపి మూడు, మరణించాక సాయం వచ్చే ‘ఆ నలుగురి’ని కలుపుకుంటే ఎనిమిది... లెక్క సరిపోయిందా! పుట్టినప్పటి నుంచి పుడమిలో కలిసిపోయేదాకా ‘నడిచే’ మనిషి జీవితాన్ని పన్నెండు పదాల్లో ఇమిడ్చిన పొడుపు కథ ఇది. ఇలాంటి వాటితో పాటు కాలప్రవాహంలో కొట్టుకుపోయిన ఎన్నో అచ్చ తెలుగు పదాలు, సామెతలు తమిళనాడు తెలుగు వారి నాలుకలపై నిత్యం నర్తిస్తుంటాయి. వందల శతాబ్దాల కిందట సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ గడ్డకు వలసెళ్లిన తెలుగు వారు... ఎక్కడ ఎలాంటి ఒడుదొడుకులను ఎదుర్కొన్నా మాతృభాషను మాత్రం మరిచిపోలేదు. తరాల తరబడి దానిని కాపాడుకుంటూనే వస్తున్నారు. 
      హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ సగిలి సుధారాణి... తమిళనాడులోని ఇరవై జిల్లాల్లో రెండున్నరేళ్ల పాటు క్షేత్ర పర్యటనలు చేశారు. అక్కడి తెలుగు వారిపై విస్తృత పరిశోధన చేశారు. ఆ రాష్ట్రంలో కొనఊపిరితో ఉన్న తెలుగు జానపద కళారూపాల ఆనుపానులను తెలుసుకున్నారు. ‘అచ్చ తెలుగు ఇంకా అక్కడ బతికే ఉంది. నేడు మన నిత్య వ్యవహారంలో వాడేస్తున్న అనేక అన్యభాషల పదాలకు ప్రత్యామ్నాయాలుగా ఉపయోగపడే ఎన్నో తెలుగు మాటలు అక్కడ వాడుకలో ఉన్నాయ’ని చెప్పే సుధారాణితో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖీ...
తె.వె.: పరిశోధనాంశాన్ని ఎలా ఎంపిక చేసుకున్నారు?
సుధ: నేను పుట్టి పెరిగింది అంతా తిరుపతిలోనే. డిగ్రీ వరకూ అక్కడే చదువుకున్నా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ., చిత్తూరు జిల్లా స్త్రీల శ్రామిక గేయాలపై ఎంఫిల్‌ చేశా. మా వారు సుబ్రహ్మణ్యం గుత్తేదారు. పనుల మీద వివిధ ప్రాంతాలకు వెళుతుంటారు. ఆయనతో కలిసి ఒకసారి తమిళనాడుకు వెళ్లా. అప్పుడే ఆయన... ఇక్కడి తెలుగు వారిపై పరిశోధన చేయవచ్చు కదా అని సూచించారు. మన రాష్ట్రంలో ఎంత మంది తెలుగు వారున్నారో... అంతకు సమానంగా బయటి ప్రాంతాల్లోనూ ఉన్నారు. వారి భాష, జానపద విజ్ఞానాలపై పరిశోధిస్తే తెలుగుకు మేలు జరుగుతుంది అని అనిపించింది. ద్రావిడ విశ్వవిద్యాలయం నుంచి పరిశోధన చేయాలనుకున్నా. అయితే, ప్రతి చోటుకు వెళ్లి, అక్కడి వారిని కలిసి మాట్లాడితే ఉపయుక్తమైన సమాచారం లభిస్తుందని పరిశోధన మార్గదర్శకులు పులికొండ సుబ్బాచారి చెప్పారు. అలా క్షేత్రపర్యటనకు శ్రీకారం చుట్టా.
తెలుగుకు మేలు అన్నారు... ఎలా?
సుధ: తెలుగు జానపద గాథలపై విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. ఇవన్నీ ప్రధానంగా మన రాష్ట్రానికే పరిమితమయ్యాయి. ఇతర ప్రాంతాల్లోని తెలుగు మాట్లాడే వారి కథా సాహిత్యంపై ముఖ్యంగా మౌఖిక కథాసాహిత్యంపై అంతగా పరిశోధన జరగలేదు. చారిత్రక క్రమంలో జానపద విజ్ఞానం ఒక చోటు నుంచి మరో చోటుకు పయనిస్తూనే ఉంటుంది. వలస ప్రజలతో పాటు వారి సంస్కృతికి చెందిన భిన్న విషయాలు కూడా తరలివెళ్లి అక్కడి సమాజ పరిస్థితులకు అనుగుణంగా రూపాంతరం చెందుతాయి. బయట ప్రాంతాలకు వెళ్లిన తెలుగు వారి జానపద విజ్ఞానం ఏమైంది, దాని గురించి ఎవరైనా పట్టించుకున్నారా అంటే సమాధానం రాదు. అందుకే, తమిళనాట తెలుగువారి జానపద కథనాలను పరిశోధనకు భూమికగా తీసుకున్నా. జానపద సాహిత్య పరిశోధనలో మరో కోణాన్ని స్పృశించే శోధన ఇది.
ఎన్ని రోజులు పర్యటించారు? ఖర్చు...
సుధ: దాదాపు 20 జిల్లాల్లో వేల కిలోమీటర్లు ప్రయాణించా. 250కి పైగా గ్రామాలకు వెళ్లా. ముందుగా దారిపటం (రూట్‌మ్యాప్‌) సిద్ధం చేసుకుని పర్యటించలేదు. వాహనంలో వెళ్తూ గ్రామాల్లో ఆగి ఇక్కడ తెలుగు వారు ఎవరైనా ఉన్నారా అని అడిగి, మాట్లాడే దాన్ని. క్షేత్రపర్యటనకే రెండున్నరేళ్లు పట్టింది. సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడానికి మరో ఏడాది. 500 పేజీల సిద్ధాంత గ్రంథం రూపొందింది. దానికి కిందటేడాదిలో పీహెచ్‌డీ పట్టా వచ్చింది. పర్యటనకు దాదాపు రూ.12 లక్షలు ఖర్చయింది. సొంతగా ఖర్చుపెట్టుకున్నా. 
మీరు అక్కడ సేకరించిన సాహిత్యమేంటి? సేకరణలో ఎదుర్కొన్న సాధకబాధకాలు..
సుధ: వేయికి పైగా జానపద కథలను సేకరించా. అలాగే, ఎన్నో అచ్చతెలుగు గేయాలు, సామెతలు, పొడుపుకథలు కూడా.  ఈ సేకరణలో పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొందరు అసలు నాతో మాట్లాడటానికే ఇష్టపడే వారు కాదు. ‘మాకేం పని లేదా’ అనే విసుక్కునే వారు. మరికొందరు తెలుగులో మాట్లాడటానికి సిగ్గుపడే వారు. నా భాషను విని ... ‘మా భాష బాగోదమ్మా’ అనే వారు. బాగోలేకపోవడం అంటే.. అక్కడి తెలుగు వారు ఎన్నో తరాల కిందట మన ప్రాంతం నుంచి వలసెళ్లారు. వారి తెలుగు పూర్తిగా కొన్ని శతాబ్దాల నాటి తెలుగును పోలి ఉంటుంది. నేను మాట్లాడే తెలుగును విని, వారి మాట మోటుగా ఉందని న్యూనతాభావంలోకి వెళ్లేవారు. మీది స్వచ్ఛమైన తెలుగు, మంచి పదాలున్నాయి మీ దగ్గర అని ఉత్సాహపరిచి, విషయాన్ని సేకరించే దాన్ని. అలాగే, ఒక కథ చెప్పు అంటే ఠక్కున చెప్పలేరు. ఒక్కొక్క సారి నేనే వారికి ఏదో ఒక కథ చెప్పేదాన్ని. దాంతో వాళ్లు ఉత్సాహంతో కథ చెప్పడానికి సిద్ధపడే వారు. అయితే, వారు కథ చెబుతున్నప్పుడు రికార్డు చేస్తానంటే కొందరు బిగదీసుకుపోయే వారు. మా గొంతు ఈ పెట్టెలోకి వెళ్లిపోతే అరిష్టం అంటూ మూఢనమ్మకాలతో ఉండే వారు. అలాంటిది ఏమీ ఉండదని వారికి విడమరచి చెప్పి, కథలు చెప్పించే దాన్ని. కొన్నిసార్లు కథలు సంపూర్ణంగా ఉండవు. ఒక్కొక్క ప్రాంతపు ఉచ్చారణ, యాస వేర్వేరుగా ఉండేవి. తమిళ పదాలు కూడా మిళితమయ్యేవి. కొన్ని పదాలకు అర్థాలు తెలిసేవి కాదు. వాటిని రాసుకుని కథ పూర్తయ్యాక అర్థాలు అడిగి తెలుసుకునే దాన్ని.  
వారి భాషలో మంచి పదాలున్నాయి అన్నారు... 
సుధ: ‘పెద్దలమనిషి’, ‘వేంకటి’ అనే పదాలను గర్భిణిని గురించి చెప్పేటప్పుడు వాడతారు. ఆడబిడ్డ పెద్ద మనిషి అయితే, ‘మనిషి అయింద’ని అంటారు. అలాగే, బోషాణం, రూకలు, మాటతోడు, దబ్బర (అబద్దం), బువ్వ, తావు, బడవా, తాలిక (సంపాదన), బాలపండు (అరటి పండు), మురిక్కి (నీలగడం), జామాన్లు (సామాన్లు), దుత్త (కుండ), కాకాయి (కాకి), పత్తి మండలాలు (వంట చెరకులు), తక్కోళం కాయలు (టమాటా), కొక్కు (కొంగ), దత్తులు (గండాలు), వాసి అయ్యె (బాగయ్యింది), పిట్టాకు (పుట్టగొడుగు), కప్పర (చిప్ప), ఆండివాడు (సన్యాసి), చిన్న బాల, కానం (కనిపించలేదు) లాంటి పదాలెన్నో ఉన్నాయి. ఇంకోటి.. మన ‘జోక్‌’ను వాళ్లు ‘నవ్వుల కథ’ అంటారు.
అక్కడి తెలుగు ఉచ్చారణ ఎలా ఉంది?
సుధ: అయిదు వందల ఏళ్లకు పూర్వం వాడుకలో ఉన్న తెలుగులోని ఆచ్చిక పదాలను ఆ కాలపు అనుస్వారోచ్చారణతోనే ఇంకా పలుకుతున్నారు. కొన్నేళ్ల కిందటి వరకూ మన దగ్గర ‘పాఁత’ మొదలైన అర్ధానుస్వర రూపాలు ఉండేవి. ఆధునిక తెలుగులో ఈ అర్ధానుస్వరాన్ని విడిచి వాడుతున్నాం. అయితే, తమిళనాడు తెలుగులో స్పర్శాలకు ముందు పూర్ణబిందువు కూడా ఇప్పటికీ నిలిచి ఉంది. ఉదాహరణకు ‘కోతి’ అనే పదాన్ని ‘కోఁతి’ అని కొందరు రాస్తారు. ‘కోంతి’ అని మరికొందరు ఉచ్చరిస్తున్నారు. పాంబు (పాము), నేండు (నేడు), పాంత (పాత), కాండ (కాడ), దాంటి (దాటి), ఏందో (ఏదో), రోంత (రోత), తోంచె (తోచె), సాండు (సాడు), తోంట (తోట), కూంతురు (కూతురు), ఆండది (ఆడది)... మొదలైన పదాలెన్నో వారి మాటల్లో వినిపిస్తాయి. ఒక భాషీయులు తమ అసలు ప్రాంతాన్ని వీడి, మరొక చోటకు వెళ్లినప్పుడు... వారి భాష సహజసిద్ధ ప్రవాహశీలతను కోల్పోయి స్థిరత్వాన్ని ఎలా పొందుతుందో ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. నిత్య వ్యవహారంలోని భాషలో ఎప్పుడూ మార్పు వస్తూనే ఉంటుంది. వివిధ ప్రభావాల మూలంగా కొత్త ప్రయోగాలు వస్తాయి. కానీ, తమిళనాడు తెలుగులో మాత్రం ఈ మార్పు రాలేదు.
వాక్యనిర్మాణంలో తేడా కనిపించిందా?
సుధ: మనం గ్రాంథిÅక భాషగా భావించే వాక్య నిర్మాణ శైలి తమిళనాడు తెలుగులో చాలా సహజంగా కనిపిస్తుంది. ఉదాహరణకు ‘మా కూంతురినిగొని పోయి అత్తవారింట విడచి వస్తిని’ (కోయంబత్తూరు), ఆకుడి ఎంచిన పనాయెను (మొత్తం మీద అనుకొన్న పని అయింది - తంజావూరు), ఆపాటి చేయనేరవా (ఆ మాత్రం చేయలేవా - కరూరు). అలాగే, అక్కడ మాండలిక భేదాలూ ఉన్నాయి.
ఆ మాండలికాలేంటి?
సుధ: స్థూలంగా నాలుగు ఉన్నాయి. కొంగు మండలం, తొండ మండలం, పాండ్య మండలం, చోళ మండలం. ‘కూర్చోబెట్టుకో’ అనే మాటను ‘కూకోబెట్టుకో’ (కొంగు), ‘కూసోబెట్టుకో’ (తొండ), కూతోబెట్టుకో (పాండ్య), కుందబెట్టుకో (చోళ).. ఇలా వివిధ రకాలుగా మాట్లాడతారు. వీరి భాష... భాషాశాస్త్ర పరిశీలనకు మంచి వస్తువు అవుతుంది. 
అక్కడి భాషలో ఏయే అంశాలను పరిశీలించవచ్చు?
సుధ: తెలుగులో ఆనాటి కావ్యభాషను, ఈనాటి జానపదుల భాషను, అలాగే తమిళనాడులోని తెలుగు జానపదుల భాషను పోల్చి పరిశీలిస్తే... ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు ఎలా మార్పు చెందిందో అవగతమవుతుంది. తమిళనాడు తెలుగు వారి భాషలోని పదాలు, రూప నిర్మాణం, వ్యాకరణకర్తలకు సమ్మతం కాకపోయినా భాష పుట్టుపూర్వోత్తరాలను పరిశీలించాలనుకునే వారికి మాత్రం అవి ఎంతో ఉపయుక్తమైనవి. అలాగే, జానపద కథల్లోని పదాలను తరచి చూస్తే అవి అన్ని ద్రావిడ భాషల్లో సమానంగా ఉన్న ‘మూలద్రావిడ భాషా పదాలు’గా తెలుస్తాయి. ద్రావిడ భాషా కుటుంబ పరిణామక్రమంలో తెలుగుకు గల స్థానం,  సోదరభాషలతో తన సంబంధంలోని సూక్ష్మ విషయాలను గుర్తించవచ్చు. ‘ఒక భాష ప్రాచీన స్వరూపం తెలిపే అంశాలు పామరుల భాషల్లో నిలకడగా ఉన్నట్లు నాగరికుల భాషల్లో ఉండవ’న్న పెద్దల మాటలను దృష్టిలో పెట్టుకుని పరిశోధిస్తే, భాషాశాస్త్రజ్ఞులకు తమిళనాడు తెలుగు అపూర్వ నిధే. మరో విషయం... ఇక్కడి తెలుగు వారి వద్ద ప్రాచీన తెలుగు తాళపత్ర గ్రంథాలెన్నో ఉన్నాయి. వాటిని వారు తమ పూజగదుల్లో పెట్టి పూజిస్తున్నారు. ఆ గ్రంథాల్లో ఏముందో వారికి తెలియదు. పరిశోధకులు కాస్త శ్రద్ధచూపి ఆ గ్రంథాలను సేకరిస్తే మన భాష ‘ప్రాచీనత’కు మరెన్నో ఆధారాలు దొరకవచ్చు. ఎన్నెన్నో కొత్త విషయాలు బయటపడవచ్చు.
అక్కడ మన వారి ఆచార వ్యవహారాల్లో తెలుగుదనం నిలిచి ఉందా?
సుధ: తిరువళ్లూరు నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాల్లో వందల ఏళ్ల నుంచి తెలుగు వారు నివశిస్తున్నారు. ఇక్కడి నుంచి వారితో పాటు తీసుకువెళ్లిన తెలుగు సంస్కృతిని వారు మరచిపోలేదు. పండుగలు, కర్మ కాండలు అన్నీ మన పద్ధతుల్లోనే ఆచరిస్తారు. ఉగాదిని గొప్పగా జరుపుకుంటారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ‘పేరంటాళ్ల’ పండగను ఇప్పటికీ చేసుకుంటున్నారు. అయిదేళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుకకు దేశవిదేశాల్లో స్థిరపడ్డ తమిళనాడు తెలుగు వారందరూ వస్తారు. ఇక్కడ నుంచి వెళ్లి అక్కడ ఏ ప్రాంతంలో స్థిరపడ్డా... స్థానిక సంస్కృతిలో భాగమవుతూనే తమ గుర్తింపును నిలబెట్టుకుంటున్నారు. సామెతలు, పొడుపు కథలు, జానపద గేయాలు, కథల్లో తెలుగు, తమిళ సమ్మేళనం కనిపిస్తుంది. అక్కడ తెలుగు వారున్న కొన్ని గ్రామాలకు ‘తెలుంగు పాళెం’, ‘మన ఊరు’ లాంటి తెలుగు పేర్లే ఉన్నాయి. 
ఆంధ్రప్రదేశ్‌ గురించి ఏం తెలుసుకోవడానికి వారు ఆసక్తి చూపించారు?
సుధ: ఇక్కడి తెలుగు వారంటే వారికి చాలా అభిమానం. వారెలా ఉంటారు, పండగలు మాలాగానే చేసుకుంటారా అని అడిగారు. ఆ నేలను చూడాలనిపిస్తోంది... ఒక్కసారి మమ్ముల్ని అక్కడికి తీసుకెళ్లమ్మా అని చాలామంది అడిగారు. తెలుగు నేలపై తమ మూలాలను తెలుసుకోవడానికి వారు ఆతృత పడుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం... ‘మట్టిపూజ’. కాకతీయుల శకం ముగిశాక, మహ్మదీయ సైన్యాల దాడికి తట్టుకోలేక కొన్ని వందల తెలుగు కుటుంబాలు దక్షిణాది దారిపట్టి అక్కడే స్థిరపడ్డాయి. అలా వారు తెలుగు నేలను వీడి వచ్చేప్పుడు విలువైన వస్తు సామగ్రితో పాటు తాము పుట్టిన గడ్డ మట్టిని మూటగట్టి తమతో తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ దానిని పవిత్రంగా భద్రపరచి గుడి కట్టి పూజిస్తున్నారు. ప్రతి మహా శివరాత్రి నాడు తిరునాళ్లు చేస్తున్నారు. 
వెయ్యి కథలను సేకరించారు కదా.. అక్కడి వారి జీవితాల్లో ఈ కథల స్థానమేంటి?
సుధ:  వీటిని వారు ‘అవ్వకథలు’ అని పిలుస్తారు. ఈ కథలను తమ పిల్లలకు వినిపిస్తారు. ఇవి మౌఖిక రూపంలోనే బతుకుతున్నాయి. మన దగ్గర ఇళ్లల్లో పిల్లలకు కథలు చెప్పే అలవాటు తగ్గిపోతోంది. కానీ, తమిళనాడులో ఈ పరంపర కొనసాగించడం ఆనందదాయకం.
మీ క్షేత్రపర్యటనలో గుర్తుండిపోయిన సంఘటన...
సుధ: మద్రాస్‌ ఐఐటీలో అధికారిగా పని చేస్తున్న బాలగణేశన్‌ గారి కుటుంబాన్ని కలిశాను. వీరి ఇంటి పేరు సోమవారు. భార్య పేరు యేటుకూరి అముద అని చెప్పారు. వీరి కుటుంబసభ్యులకు తెలుగు చదవడం రాయడం రాదు. ఇంట్లో మాట్లాడుకోవడం మాత్రం తెలుగులోనే. వారి మాటల్లో ఎన్నో అచ్చ తెలుగు పదాలు వినిపించాయి. వీరితో మాట్లాడుతున్నప్పుడు వీరి పక్కింట్లో ఉండే ఆరేడేళ్ల పిల్లాడు వచ్చాడు. బాలగణేశన్‌ గారి పిల్లలతో అడుకుంటూ తెలుగులో మాట్లాడాడు. దాంతో ఆ అబ్బాయిని పలుకరించా. పేరేంటని అడిగితే ‘కార్తీక్‌’ అన్నాడు. మీ అమ్మ, నాన్న నీతో తెలుగులో మాట్లాడుతారా అని అడిగా. ‘అవును.. మా అయ్య, అమ్మ, నాతోటి అక్క తెలుంగులోనే మాటాడతా’మని చెప్పాడు. మన పిల్లలేమో ‘మమ్మీ, డాడీ’ అని పిలుస్తోంటే... అక్కడి తెలుగు పిల్లాడు అదీ మద్రాసునగరంలో ఆంగ్ల బడిలో చదివే కుర్రాడు ‘అయ్యా, అమ్మా’ పిలవడంతో ఆనందమనిపించింది. 
తె.వె.: అక్కడి తెలుగు భాష భవిష్యత్తు ఏంటి?
సుధ: ఇక్కడి వారిలో 90 శాతం మందికి తెలుగు చదవడం రాయడం రాదు. కేవలం మౌఖికంగా మాత్రమే భాష మిగిలి ఉంది. నిర్బంధ తమిళ బోధన వల్ల వారికి చాలా నష్టం కలుగుతోంది. కొత్తతరం పిల్లలందరూ తమిళానికే అలవాటు పడిపోతున్నారు. ‘ఈ కథలను మాకు మా పెద్దోళ్లు చెప్పారు. మేం మా పిల్లలకు చెప్పాం. మరి వారు తర్వాతి వారికి చెబుతారో లేదో’నని అక్కడి తెలుగు వారిలో పెద్దవారు ఆందోళన పడుతున్నారు. 
తె.వె.: ఆ కథలను, మౌఖిక సాహిత్యాలను కాపాడుకోవాలంటే...
సుధ: మన రాష్ట్ర ప్రభుత్వం, విశ్వ విద్యాలయాలు ముందుకు వచ్చి కొన్ని చర్యలు తీసుకోవాలి. పరిశోధక విద్యార్థులను పంపి మౌఖిక సాహిత్యాన్ని గ్రంథస్థం చేయించాలి. 
తె.వె.: మీ భవిష్యత్తు ప్రణాళికలు..
సుధ: పరిశోధన రంగంలోనే కొనసాగాలను కుంటున్నా. తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారిపై కూడా పరిశోధించాలనుకుంటున్నా. తమిళనాడులో సేకరించిన వేయి జానపద కథలను ఒక పుస్తకంగా ప్రచురించడానికి ప్రయత్నిస్తున్నా. 

- తెలుగు వెలుగు బృందం 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి