తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

తెలుగువాడా కళ్లు తెరు!

  • 1299 Views
  • 18Likes
  • Like
  • Article Share

వేటూరి చివరి ముఖాముఖి...
తెలుగు
అంతరించి పోవడం అంటే తెలుగుతో ఉన్న అవసరం తగ్గిపోవడం. దీన్ని అరికట్టాలి. నీ ఇంట్లో మాట్లాడే భాషను నీ జీవిత భాషగా చేసుకో... ఉద్యోగ భాష పరిభాష ఏదైనా ఉండనీ... నువ్వు ఏ భాష మాట్లాడే ఇంట్లో పుట్టావో అదే భాషను నీ సొంత భాషగా చేసుకోవాలి. అవసరమైతే అందరూ కలసి భాషా రక్షణకు ఉద్యమం చేపట్టాలి.
      సాంకేతిక విప్లవం... ఈ ఇంటర్నెట్, సెల్‌ఫోన్‌లు... ఇవన్నీ ప్రగతి, విజ్ఞానం అంటూ మనిషి ప్రకృతిని పట్టించుకోవడం లేదు. ఆస్వాదించడం లేదు. మా కాలంలో మేం జీవితంలోని అన్నిదశలనూ అనుభవించాం, ఆస్వాదించాం. ఇప్పుడో... కొద్దిపాటి అక్షర జ్ఞానం, వయసు వచ్చినప్పటి నుంచీ కుర్రవాడు తలుపులు మూసుకుని నెట్‌ ముందు కూర్చుంటున్నాడు. వాడికి రుతువులూ, యౌవ్వనం, చదువు, వినోదం అన్నీ అదే... అందులోనే!! అంటే బింబంతో పని లేదు. ప్రకృతితో పని లేదు. మలయానిలంతో పని లేదు. మహీమండలంతో పని లేదు. సూర్య చంద్రాదులతో పని లేదు. అబాస... అబద్ధం అదే అనుభవం అవుతోంది. ఇవి ప్రతిబింబ జీవితాలు. సహజత్వం లేదు. ఎయిర్‌ కండిషన్‌లో గాలి తప్ప ఏటి గాలి, పైరగాలి ఎరగడు. పట్టణాల్లో సర్వకాలుష్యాలతో కూడిన గాలులతో మనిషి జీవితం మరకలు పడిపోతోంది. పల్లెలూ అలానే తయారయ్యాయి. అందమైన ప్రదేశాలన్నీ పోతున్నాయి. ఆత్మవినాశనానికి దారి తీసే పద్ధతుల్ని ప్రగతి అని మురిసి పోతున్నాం. జనాభాను నియంత్రించుకోవడం చేతకాక ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాం. భూమికి పరిమితి ఉంది. దాటి పోతున్నాం. బంగారు బాతుగుడ్డు కథగా మారిపోతోంది. ఈ సునామీలు, భూకంపాలు ఇవన్నీ ప్రకృతి విధ్వంస ఫలితాలే! 
      ఇక భాష! తెలుగు వాళ్లు తెలుగు మర్చిపోతున్నారు. ఫోన్‌లు వచ్చి ఉత్తరాలు రాసే అలవాటు తప్పింది. అక్కడ రచనకు తొలిదెబ్బ తగిలింది. భాషను సాంకేతికంగా అభివృద్ధి చేసుకోవడం చేతకాక, ఏం చేస్తే ఇంగ్లిషులా నలుగురికీ ఎక్కుతుందో తెలియక భాషను తిడుతూ కూర్చున్నాం. రోడ్డు, రైలు, టైము  వగైరాలు భాషలో కలసిపోయాయి. వీటిని ఇవ్వాళ తొలగిస్తామంటే సెల్‌ఫోన్‌కు తెలుగేంటి? కన్నడిగులు వీటిని కూడా కన్నడంలోనే మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌ సర్వీసును వారు వేగదూత అంటున్నారు. క్రాస్‌రోడ్స్‌ను ‘అడ్డరస్తా’ అని, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ను ‘తాంత్రిక విద్య’ అని పిలుస్తున్నారు. అయితే సాంకేతిక పదాలను యథాతథంగా వాడటం మంచిది. కంప్యూటర్‌ను మరో పేరుతో పిలిస్తే ఎందరికి అర్థం అవుతుంది?
      భాష అంతరించకుండా అనేక రకాలుగా కనబడుతుంది. భాషను బలహీనం చేసుకోవడం వల్ల అనేక దుష్ఫలితాలు తలెత్తుతాయి. దీనికి ముందు భాషపై మక్కువ పెంచుకోవడం. తాత, తండ్రుల నుంచి తెచ్చుకున్న సంస్కృతి... తరతరాలకూ ప్రవహించాలి. భాష పేరుతో దేశంలో తొలిసారిగా ఏర్పడ్డ రాష్ట్రం మనది. అలాంటి తెలుగునాట నేడు భాషను మర్చిపోయారు. భాషంటే మాటలే కాదు. అలవాట్లు, వేషభాషలు అన్నీ. ప్రాంతీయ యాసలు వగైరాలన్నీ కనుమరుగైపోతున్నాయి. రాజకీయ సంస్కరణల వల్ల కొంత భాష దెబ్బతింటోంది. బయటి నుంచి కొత్త పదాలను తెచ్చుకోవచ్చు. కానీ ఉన్నవి తీసేయడం తప్పు. మన వాళ్లు అదే చేస్తున్నారు. సాంకేతిక విప్లవాన్ని ఎవ్వరూ కాదనరు. ఆ పేరుతో పరభాషపై మోజు వద్దు. అది స్వభాషపై మోజుగా మారాలి. ఆహార విహారాలూ భాషను దెబ్బతీశాయి. వేషభాషలు అంటారు. వేషాన్ని బట్టి భాష. పిజ్జాలు, బర్గర్లు తినాలంటే బిళ్లగోచి పెట్టుకుంటే ఎలా? అందుకే ఆ తిండికి తగ్గట్లే ఆడ, మగ ఇవ్వాళ దుస్తులు ధరిస్తున్నారు. భాషనూ మార్చేసుకుంటున్నారు.
      ఈనాటి అవధానాల వల్ల భాషకు ఒరిగేదేమీ లేదు. ఆయా వ్యక్తుల ప్రాచుర్యానికి తప్ప. అవధానాలంటే తిరుపతి వేంకట కవులవి. మహాభారతంలోని పద్యాలను పశువుల కాపర్లు కూడా పాడుకునేలా వాడుక భాషలో నాటకాలు రాశారు వాళ్లు. ‘బావా ఎప్పుడు వచ్చితీవు’ వంటి పద్యాలు నోటికి రాని తెలుగు వాడు పాతిక ముఫ్పైౖ ఏళ్ల క్రితం ఎక్కడా కనిపించే వాడు కాదు. ఇదంతా ఆ మహానుభావుల చలవ. అదీ భాషాసేవంటే. తక్కువ అక్షరాస్యత ఉన్న రోజుల్లోనే వారీ ఖ్యాతి సాధించగలిగారంటే అదీ ప్రతిభ. ఇప్పటికైనా తెలుగు వాడు కళ్లు తెరవాలి, చేవతెచ్చుకోవాలి అప్పుడే భాషా పరిరక్షణ సుసాధ్యం. 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి