తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

తెలుగు నాతల్లి

  • 498 Views
  • 9Likes
  • Like
  • Article Share

ఆయన రాసిన రెండు కథల విలువే దాదాపు రూ.340 కోట్లు. ఆ కథల మీద ఎంత నమ్మకం లేకపోతే, నిర్మాతలు ఆ చిత్రాలు... అవేనండీ ‘బాహుబలి, భజరంగీ భాయిజాన్‌’ల మీద అంత డబ్బును పెట్టుబడి పెట్టి ఉంటారు!! వాళ్ల నమ్మకానికి తగ్గట్టు ఆ చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి. అవును... విజయేంద్రప్రసాద్‌ కథలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఇరవైఏడేళ్ల కిందటి ‘జానకిరాముడు’ నుంచి నేటి ‘బాహుబలి’ వరకూ ఆయన కథలు వెండితెర మీద వెలుగులు పండిస్తూనే ఉన్నాయి. భారీ చిత్రాల కథకుడిగా గుర్తింపు పొందిన ఆయన... తెలుగు భాషా సాహిత్యాలు, తన రచనా వ్యాసంగం గురించి ‘తెలుగు వెలుగు’తో పంచుకున్న అనుభూతులు, ఆలోచనలివి... 
‘‘తెలుగు
భాష గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ‘నా తల్లి’తో సమానం. ఆ భాషే నాకు జీవితాన్నిచ్చింది. ఎంత తియ్యగా ఉంటుంది! ప్రస్తుతం తెలుగు పరిస్థితి వేరుగా ఉంది. తెలుగువాళ్ల దైనందిన జీవితాల్లో తెలుగు మాటల వాడుక తగ్గింది. ఒక వాక్యం మాట్లాడితే అందులో ఎక్కువ శాతం ఆంగ్లమే ఉంటోంది. నేటితరం అలాంటి భాషనే మాట్లాడుతోంది. ఇంట్లో పిల్లలకి    ‘అమ్మానాన్నా’ అని పిలవడం నేర్పించే దగ్గరినుంచే భాషను కాపాడుకునే ప్రయత్నం మొదలుకావాలి. మా ఇంట్లో పిల్లలంతా అలాగే పిలుస్తారు. వాళ్లు ఆంగ్ల మాధ]్యమంలో చదువుకుంటున్నా... తెలుగు చదవడం, మాట్లాడటం మేం నేర్పించాం. అలాగే, తెలుగు స్థితిగతులు బాగుపడాలంటే ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాలి. రాతకోతలన్నీ కచ్చితంగా తెలుగులోనే జరగాలి. అక్కడే కాదు.. చదువుల్లో అయినా మరెక్కడైనా మాతృభాషను తప్పనిసరి చేయాలి. 
      కథలు రాయడం వంటి సృజనాత్మక కార్యకలాపాల దిశగా పిల్లలను ప్రోత్సహించాలంటే ముందు టీవీలు కట్టేయాలి. ఫోన్లు ఆపేయాలి. తల్లో తండ్రో పిల్లల కోసం కొంత సమయం కేటాయించాలి. పుస్తకాలను పరిచయం చేయాలి. ఇప్పుడు చాలా ఇళ్లలో పిల్లలు తల్లిదండ్రులతో కలిసి గడిపే సమయం తక్కువగా ఉంటోంది. రాజమౌళి చిన్నతనంలో ఏనాడూ పుస్తకాలు చదవమని వాణ్ని బలవంతపెట్టలేదు నేను. పుస్తకం చూపించి.. ఓ అయిదు నిమిషాలు దాన్ని చూడమని చెప్పేవాణ్ని. తర్వాత దాని గురించి నాకేమన్నా చెప్పమని అడిగేవాణ్ని. ఈ క్రమంలో తను ఆ పుస్తకాన్ని చూడటం, చదవడం చేసేవాడు. తిరిగి నాకు ఆ పుస్తక రచయిత వివరాలతో పాటు అందులో ఉన్న అంశాలనూ చెప్పేవాడు. అలా వాడు పుస్తకాల పురుగు అయ్యాడు. నాకంటే ఎక్కువగా పుస్తకాలు చదువుతాడు. 
      నన్ను నేను ‘కథల గ్రంథాలయం’గా భావించుకోను. మా అబ్బాయిని ఉద్దేశించి ఆ మాట అంటే మాత్రం ఒప్పుకుంటా. నేను కేవలం సినిమాల కోసమే కథలు రాస్తాను. అది నాకు అన్నిటికన్నా ఇష్టమైన పని. 
ఇక్కడికి వచ్చాకే...
మహాభారతం, కన్యాశుల్కం నాకు నచ్చిన పుస్తకాలు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి (రావి శాస్త్రి), పతంజలిలను అభిమానిస్తా. పతంజలి మనసుకు హత్తుకునేలా రాస్తారు. ఆయన శైలిలోని ఆ విశిష్టత నాకు చాలా ఇష్టం. విశ్వనాథ శాస్త్రి ఏది చెప్పాలన్నా...  నిర్మొహమాటంగా, స్పష్టంగా, సున్నితంగా చెబుతారు. ఆయన భాష బాగుంటుంది. 
      ఇక సినిమా కథలంటే ‘మాయాబజార్‌’ బాగా నచ్చుతుంది. జనాల్ని థియేటర్ల వైపు నడిపించిన కథ అది. అలాగే ‘టైటానిక్‌’ కూడా ఇష్టమే. చిన్న అంశం.. ఓ షిప్పు.. దాంట్లో రెండువేల మంది ప్రయాణిస్తుంటారు. తర్వాత మునిగిపోతుంది. ఈ ఒక్క అంశాన్ని తీసుకుని... శృంగారం, వినోదం, విషాదాలను పండిస్తూ మనసుకు హత్తుకునే సన్నివేశాల్ని జోడించి కథగా మలిచారు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. 
      నా విషయానికొస్తే ఈ కథలు రాయడం సినిమా రంగంలోకి వచ్చాక అలవాటు అయింది తప్ప అంతకు ముందు లేదు. కళాశాల రోజుల్లో మాత్రం అమ్మాయిలకు కథలు చెప్పేవాణ్ని!! పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో పుట్టి పెరిగి.. ఏలూరు సీఆర్‌రెడ్డి కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశా. నాన్న కాంట్రాక్టర్‌గా చేసేవారు. నా చదువు అయ్యాక రాయచూరు వెళ్లి తుంగభద్ర దగ్గర పొలాలు కొని వ్యవసాయం చేశాం. కానీ, కలిసి రాలేదు. నష్టాలు వచ్చాయి. దాంతో మా అన్నయ్య శివశక్తిదత్తాతో కలిసి సినిమాల వైపు అడుగులు వేశా. క్రమంగా రాఘవేంద్రరావుగారితో పరిచయం కావడం... కథలు రాయడం వైపు మొగ్గు చూపడం చకచకా జరిగిపోయాయి. అయితే సత్యానంద్, మిగిలిన కొంతమంది రచయితలతో పోలిస్తే నాకు ఉన్న నైపుణ్యాలు చాలా తక్కువ అని నేను ఒప్పుకొంటా. 
ఓ ప్రయోగం అనుకున్నా...
కథ అనేది నా బుర్రలోనే ఉంటుంది. నాకు వచ్చిన పిచ్చి పిచ్చి ఆలోచనలకు ఓ రూపం ఇస్తుంటా. శ్రీశ్రీ కాదేదీ కవితకనర్హం అన్నట్టు... నేనూ కాదేదీ కథకు అనర్హం అనే నిర్వచనం ఇచ్చుకుంటా. నా కథలకు స్ఫూర్తి ఫలానా అనీ చెప్పలేను. నాకు తారసపడే వ్యక్తులూ, సందర్భాలూ అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటా. ‘ఈగ’ కథ అలా పుట్టుకొచ్చిందే. అది చాలా చిన్నప్రాణి. దాన్ని చూసినప్పుడు, దీన్నే వస్తువుగా తీసుకుని ఎందుకు కథ రాయకూడదు అనిపించింది. నిజానికి అదో ప్రయోగం అనుకున్నా. కానీ ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాల్ని తెచ్చిపెట్టింది. జాతీయస్థాయికి వెళ్లింది. 
      కథ రాయడం కోసం ప్రత్యేకంగా అధ్యయనమేదీ చేయను. దర్శకుడి ఆలోచనలూ కనుక్కొని కథను తయారు చేస్తా. ‘బాహుబలి’ సమయంలో రాజమౌళి నాకు చెప్పిందేంటంటే.. ‘మన కథలో ఆడవాళ్లు ధైర్యశాలులుగా ఉండాలి. మగవాళ్లతో పోటీపడాలి. అలాగే సమయాన్ని బట్టి చలించే ఓ పాత్ర కూడా అవసరం’ అన్నాడు. వెంటనే కట్టప్ప పాత్ర స్ఫురణకు వచ్చింది. అతను రాజ్యంలో మహావీరుడు. పిల్లలకి యుద్ధవిద్యలు నేర్పిస్తాడు. వందల మందితో ఒకేసారి యుద్ధం చేసి విజయం సాధించే పరాక్రమవంతుణ్ని తయారుచేస్తాడు. ఆ వీరుణ్ని తానే చంపేస్తాడు. ఇలా ఆసక్తిని రేకెత్తించేలా కట్టప్ప పాత్రను అనుకుని రాజమౌళికి చెప్పా. తనకీ నచ్చడంతో ముందుకెళ్లా. అలాగే, తల్లి తన బిడ్డ కోసం ఏదైనా చేస్తుంది. ప్రాణం పోయినా బిడ్డ బాగు కోసమే ఆలోచిస్తుందనేది జగమెరిగిన సత్యం. ఆ కోణాన్ని తీసుకుని శివగామి పాత్రను తీర్చిదిద్దా. ఇలా ‘బాహుబలి’లో ఒక్కో పాత్రనూ మా అంచనాలకు తగ్గట్టు సృష్టించుకున్నాం. 
      ‘భజరంగీ భాయిజాన్‌’ కథ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. మంచి విజయం సాధిస్తుందనే ఆలోచనతోనే సల్మాన్‌ఖాన్‌కి కథ చెప్పా. విడుదలయ్యాక అది ప్రపంచం మాట్లాడుకునే సినిమా అయినందుకు చాలా సంతోషంగా అనిపించింది. కోట్లు కుమ్మరించింది. కానీ, తెలుగులో నన్ను ఎవరూ ఆ కథ గురించి అడగనందుకు మనసు చివుక్కుమంది. మంచి దుస్తులు వేసుకున్నప్పుడు ‘అరే బాగున్నాయి.. ఎక్కడ కొన్నారు’ అని ఎవరైనా అడిగినప్పుడు మనలో తెలియని సంతోషం, గర్వం తొణికిసలాడతాయి. నన్ను ఈ కథ గురించి తెలుగు దర్శకులు అడగకపోయేసరికి అలాగే వెలితిగా అనిపించింది. ఈ సినిమా విజయం తర్వాత... పాకిస్థాన్‌లో ఉన్న మన దేశ అమ్మాయి గీత తల్లిదండ్రులకోసం తపిస్తోందనే వార్తలు వచ్చాయి. ఆ సినిమా వచ్చాక వాస్తవాలు బయటికి రావడం బాగా అనిపించింది.
      ఈ కథకు స్ఫూర్తి మాత్రం చిరంజీవి నటించిన ‘పసివాడి ప్రాణం’. మూగ పిల్లాడు తల్లికి దూరమైతే, కథానాయకుడు పక్క వీధిలోని వాళ్లింటికి చేరుస్తాడు. ఇక్కడ పక్క వీధి బదులు కథ పాకిస్థాన్‌కి వెళితే ఇంకా బాగుంటుందని మా సహాయ సిబ్బందిలోని ఒకరు అన్నారు. అలాగే కథానాయకుడు రామభక్తుడు అయితే ఇంకా బాగుంటుందని మరొకరు అన్నారు. అలా సమష్టి ఆలోచనల్లోంచి ఈ కథకు ఓ రూపాన్నిచ్చా. 
అమ్మ కథ రాయాలి
నాది పెద్ద వయసు అనుకోను. డెబ్భై మూడేళ్లు కదా... ముసలివాణ్నని భావించను. అందమైన ఈ రంగుల ప్రపంచంలో కథలు రాయడం, కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడం... ఇలా ఎన్నో విషయాలు నాకు గొప్పగా అనిపిస్తాయి. అద్భుతంగా తోస్తాయి. ఇవన్నీ నాకు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. నిజానికి వయసు పెరిగేది మన శరీరానికి తప్ప ప్రతిభకు కాదు కదా. 
      చాలామంది నన్ను ‘మీరు ఎలాంటి కథలు రాయడానికి ఇష్టపడతారు’ అని అడుగుతుంటారు. మమతలు కురిపించే మాతృమూర్తి కోణంలో రాయడం అంటే నాకు చాలా ఇష్టం. ‘అమ్మా... కంటతడి పెట్టొద్దు’ అని కొడుకు అర్థించే కోణంలో మా అన్నయ్య ఓ పాట రాశాడు. ‘అమ్మా నీ కంటి నీలాలు కారితే సముద్రాలే పొంగిపోతాయి’ అనే భావం వస్తుంది. దీనికి మా కీరవాణి ఇరవై ఏళ్ల కిందటే ట్యూన్‌ కట్టి పాట పాడాడు. ఇప్పటికీ ఈ పాట వింటుంటా. నాకు బాగా నచ్చుతుంది. ఎప్పటికైనా ఆ పాట కోసం కథ రాయాలి అనుకుంటున్నా. ఏదేమైనా కథారచన నాకు ప్రాణపదం. అందుకే సినిమాలకు కథలు రాయడాన్ని వ్యాపార ధోరణిలో చూడను. అలా చూసినప్పుడు కథ పేలవంగా ఉండి నాణ్యత లోపిస్తుంది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం